Skip to main content

Byju Raveendran: బైజూస్ స‌క్సెస్ ఫార్ములా ఇదే...

అతనికి ఫిజక్స్‌లో ఫార్ములాలు అంటే ఇష్టం లెక్కలతో కుస్తీ పట్టడం సరదా. ఇష్టంగా మారిన ఆ సరదానే ఇప్పుడు ఇండియాలో దాదాపు ప్రతీ ఒక్కరికి అతనెవరో తెలిసేలా చేసింది.
Raveendran Byju
బైజూస్‌ రవీంద్రన్‌

బంగారు భవిష్యత్తు కావాలనుకునే విద్యర్థులు ఓసారి అతన్ని ఫాలో అవాలనిపించేలా మార్చేసింది. అతని పేరంటే తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడింది. వెరసి నలుగు పదుల వయసు సమీపించగానే లక్షా ఇరవై కోట్ల కోట్ల సంపదను సృష్టించే స్థితికి చేరుకున్నాడు. అతనే రవీంద్రన్‌.. ఇలా చెబితే పెద్దగా ఎవరూ గుర్తు పట్టరు... పూర్తి పేరు బైజూస్‌ రవీంద్రన్‌. పుట్టింది కేరళా.. ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరిస్తున్నాడు. 

కుటుంబ నేప‌థ్యం : 

byju raveendran family


బైజూస్‌ రవీంద్రన్‌ది కేరళలోని అళికోడ్‌ అనే చిన్న పట్టణం. అక్కడున్న ఓ ప్రైవేటు స్కూల్‌లో తల్లి లెక్కల టీచరుగా పని చేస్తే.. తండ్రి ఫిజిక్స్‌ పాఠాలు చెప్పేవాడు. చిన్నప్పటి నుంచి రవీంద్రన్‌ హైపర్‌ యాక్టివ్‌. స్కూళ్లో చెప్పిన పాఠాలు ఇట్టే చదివేసి ఇళ్లంతా చిందరవందర చేసేవాడు. అతని ఎనర్జీని బర్న్‌ చేసేందుకు ఆటలవైపు మళ్లించారు తల్లిదండ్రులు. అటా చదువుతో పాటు క్రికెట్‌, టేబుల్‌ టెన్నీస్‌ ఆటల్లో మంచి ఛాంపియన్‌ అయ్యాడు రవీంద్రన్‌. ఇదే ఊపులో బిటెక్‌ కూడా పూర్తి చేసి ఓ ఇంటర్నేషనల్‌ షిప్పింగ్‌ కంపెనీలో ఇంజనీరుగా చేరాడు.

ఆ రిక్వెస్టే...
పాతికేళ్లు నిండకుండానే విదేశాలు తిరిగే ఉద్యోగం. జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో అతని క్లాస్‌మేట్స్‌ చేసిన చిన్న రిక్వెస్ట్‌ అతని జీవితాన్ని ఇంకో మలుపు తీసుకునేలా చేసింది. రవీంద్రన్‌తో పాటు బీటెక్‌ చదువుకున్న అతని ఫ్రెండ్స్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) పరీక్షలకు ప్రిపేర్‌ అవుతూ.. రవీంద్రన్‌ని లెక్కలు, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో సాయం చేయమన్నారు. సరేనన్నాడు రవీంద్రన్‌.

రెండోసారి పరీక్ష రాస్తే..
ఓ వైపు ఉద్యోగం చేస్తూ.. మరో వైపు ఎంట్రన్స్‌ పరీక్షలో స్నేహితులకు హెల్ప్‌ చేస్తుంటే ఓ చిలిపి ఆలోచన మెదిలింది రవీంద్ర మెదడులో. దాంతో సరదాగా 2007లో ఐఐఎం ఎంట్రన్స్‌ పరీక్షలకి అటెండ్‌ అయ్యడు. ఆ పరీక్షా ఫలితాల్లో తన స్నేహితులకు ఎవరికీ సాధ్యం కాని విధంగా హండ్రెడ్‌ పర్సంటైల్‌ సాధించాడు. ఏదో లక్కీగా అలా జరిగి ఉంటుందని రెండోసారి పరీక్ష రాస్తే మళ్లీ హండ్రెడ​ పర్సంటైల్‌ వచ్చింది. ఎంతో మంది కలగనే ఆ మార్కులు సరదాగా పరీక్ష రాస్తేనే రవీంద్రన్‌కి వచ్చాయి. దీంతో ఒక్కసారిగా అతని సర్కిల్‌లో రవీంద్రన్‌ పేరు మార్మోగిపోయింది.

ఉద్యోగానికి రాజీనామా చేసి...Job
స్నేహితుల సూచనలు, తన మీద తనకు ఉన్న ఆత్మవిశ్వాసంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పది మంది విద్యార్థులతో ఐఐఎం కోచింగ్‌ సెంటర్‌ కోచిలో ప్రారంభించాడు. వారం తిరక్కుండానే పది మంది కాస్త వంద మంది అయ్యారు. ఏడాది గడిచే సరికి ఆ సంఖ్య వేయిని దాటి పోయింది. రవీంద్రన్‌ లెక్కలు, ఫిజిక్స్‌ పాఠాలు చెప్పే తీరు భిన్నంగా ఉండటం ఆ పాఠాలు విన్న విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తుండటంతో రవీంద్రన్‌ ప్రతిభ కొచ్చి దాటి ప్రకాశించింది. ఫ్రెండ్‌ ఇంట్లో చిన్న గదిలో మొదలైన కోచింగ్‌ ఆ తర్వాత టెర్రస్‌ మీదకి అక్కడి నుంచి ఆడిటోరియం అటుపై ఇండోర్‌ స్టేడియం వరకు జెట్‌ స్పీడ్‌తో సాగింది. 

ఒకేసారి 20 వేల మందికి...
రవీంద్రన్‌ కోచింగ్‌ కావాలంటూ విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్‌తో బెంగళూరు మీదుగా ముంబై, పూనే, చెన్నైలకు విస్తరించింది. కోచింగ్‌ ప్రారంభించిన నాలుగేళ్లలోనే ప్లైట్స్‌లో తిరిగి పాఠాలు చేప్పే దశకు 2009లో రవీంద్రన్‌ చేరుకున్నాడు. ఒకేసారి 45 సిటీల్లో ఉన్న 20 వేల మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పేంత బిజీ అయ్యాడు రవీంద్రన్‌.

అంతా కలిసి మరో అడుగు ముందుకు..
మరోవైపు రవీంద్రన్‌ దగ్గర కోచింగ్‌ తీసుకుని ఐఐఎంలో చేరి బిజినెస్‌ పట్టా చేత పట్టుకున్న అతని ఫ్రెండ్స్‌ మళ్లీ వచ్చారు. ఒక్క ఐఐఎం, జీఆర్‌ఈలకే కాదు స్కూల్‌ విద్యార్థుల నుంచి కోచింగ్‌ మొదలు పెడదామంటూ జట్టు కట్టారు. అంతా కలిసి మరో అడుగు ముందుకు వేసి థింక్‌ అండ్‌ లెర్న్‌ పేరుతో స్కూల్‌ నుంచి పీజీ వరకు ఆన్‌లైన్‌ క్లాసులు అందివ్వాలని 2013లో నిర్ణయించుకున్నారు.

పగలు రాత్రి తేడా లేకుండా...
అప్పటికే ఇండియాలో ఇంటర్నెట్‌ వినియోగం సామాన్యులకు చేరువయ్యింది. తర్వాత స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరిగిపోతుండటం గమనించి బైజూస్‌ పేరుతో 2015 ఆగస్టులో మొబైల్‌యాప్‌ని అందుబాటులోకి తెచ్చారు. పగలు రాత్రి తేడా లేకుండా పాఠాలు రూపొందించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటూ సమర్థంగా యాప్‌ను నిర్వహించారు. ఒక్క థియరీతోనే సరిపెట్టకుండా ప్రతీ సబ్జెక్టు సులభంగా అర్థం అ‍య్యలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో అనతి కాలంలోనే 50 లక్షల మంది యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే అందులో 2.50 లక్షల మంది పెయిడ్‌ కస్టమర్లు ఉన్నారు.

ఆలిబాబా గ్రూపు అయితే..
రవీంద్రన్‌ స్థాపించిన బైజూస్‌ ఎడ్‌టెక్‌ యాప్‌లో అందిస్తున్న కంటెంట్‌కి ఉన్న ఎఫెక్ట్‌, స్టూడెంట్స్‌ ఫీడ్‌బ్యాక్‌తో పాటు బిజినెస్‌ మోడల్‌ గమనించిన ఆలిబాబా గ్రూపు టెన్‌సెంట్‌ మొదటిసారి బైజూస్‌లో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఆ వెంటనే మార్క్‌ జుకర్‌బర్గ్‌తో పాటు వెంచర్‌ క్యాపిటలిస్టు కంపెనీలు ఈ జాబితాలో చేరిపోయాయి. అంతే బైజూస్‌ నెక్ట్‌ లెవల్‌కి వెళ్లేందుకు సమయం వచ్చినట్టయ్యింది. 

మార్కెట్‌కి కావాల్సింది కూడా అదే...

byju raveendran success


పెట్టుబడుల ప్రవాహం రావడంతో బైజూస్‌ యాప్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా షారూక్‌ఖాన్‌, మహేశ్‌బాబు వంటి స్టార్లు జతయ్యారు. ఇండియన్‌ క్రికెటర్ల జెర్సీలపై బైజూస్‌ తళుక్కుమంది. అంతే బైజూస్‌ యాప్‌ను మిలియన్ల కొద్ది స్టూడెంట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. తల్లిదండ్రులకు బైజూస్‌ కంటెంట్‌ పట్ల నమ్మకం ఏర్పడింది. మార్కెట్‌కి కావాల్సింది కూడా అదే. దీంతో 2015లో స్థాపించిన బైజూస్‌ కంపెనీ మార్కెట్‌ విలువ 2021 డిసెంబరు నాటికి 16.50 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. యూనికార్న్‌ హోదాను ఉఫ్‌మనిపించి డెకాకార్న్‌ జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్‌ విలువ ఇండియన్‌ కరెన్సీలో ఒక లక్షా ఇరవై వేల కోట్లకు పైమాటగానే ఉంది.

నవ్విస్తూ.. నేర్పిస్తూ..పాఠాలు..
బైజైస్‌ రవీంద్రన్‌ పట్టిందల్లా బంగారం అయ్యిందంటే అతని దగ్గర ఏ మంత్రదండం లేదు. ఉన్నదల్లా పాఠాలను భిన్నంగా చెప్పే నేర్పు. క్లాసు రూములో టీచర్లు సీరియస్‌గా చెప్పే పాఠాలను రవీంద్రన్‌ నవ్విస్తూ నేర్పిస్తాడు (లాఫ్‌ అండ్‌ లెర్న్‌). మార్కుల కోసమో, ర్యాంకుల కోసమో ఎవర్నో మెప్పించేందుకో కాకుండా.. ప్రతీ సబ్జెక్టుకు సంబంధించిన మూల విషయాలు విద్యార్థులకు అర్థమయ్యేలా సులభమైన పద్దతిలో నవ్వించే వివరణలతో ఆ పాఠాలు హాయిగా సాగిపోతాయి. ఈ చెవితో విన్నది ఆ చెవి గుండా బయటకు పోవడం కాకుండా బుర్రలో నిక్షిప్తమవుతాయి. అవే ఆ తర్వాత పరీక్షల్లో ఫలితాలుగా కనిపిస్తాయి. 

దివ్యమంత్రం ఇదే..
జీఆర్‌ఈ ఎంట్రన్స్‌ కోచింగ్‌ కోసం దివ్య గోకుల్‌నాథ్‌ అనే విద్యార్థి రవీంద్రన్‌ దగ్గర టీచర్‌గా జాయిన్‌ అయ్యింది. మిగిలిన విద్యార్థులకంటే భిన్నంగా ప్రశ్నలు అడగడంతో రవీంద్రన్‌కి ఆమెపై అభిమానం ఏర్పడింది. అదే కోచింగ్‌ సెంటర్‌లో కింది తరగతులకి లెక్కల క్లాస్‌ తీసుకోమ్మని ప్రోత్సహించాడు. అంతేకాకుండా ఇద్దరీ ఫేవరేట్‌ సబ్జెక్ట్‌ మ్యాథ్స్‌ కావడంతో.. ఓ రకంగా వాళ్లు గణితంలోనే మాట్లాడుకోవడం మొదలైంది. అలా లెక్కల చిక్కులతో వారు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. బైజూస్‌లో రూపొందించే ఆన్‌లైన్‌ పాఠాల రూపకల్పనలో దివ్యది కీలక పాత్ర. బైజూస్‌కి ఆమె కోఫౌండర్‌గా ఉండటంతో పాటు ప్రస్తుతం డైరెక్టరుగా కూడా వ్యవహరిస్తున్నారు. 

ఎప్పుడు తమ లక్ష్యం ఇదే.. 
లక్ష కోట్ల రూపాయలకు చేరుకున్న బైజూస్‌ మార్కెట్‌ విలువపై రవీంద్రన్‌ స్పందిస్తూ.. ‘మార్కెట్‌ వ్యాల్యూ ఎంత ఉంది అనే దాని కంటే మేం చెప్పే పాఠాలు ఎంత సమర్థంగా ఉన్నాయి...  అది వినేవాళ్లకు ఎంత బాగా అర్థం అవుతుంది.. అనే దానిపైనే తన దృష్టి ఉంటుంది. మిగిలినవన్నీ దాని తర్వాతే అన్నారు. ఇక మార్కులు, ర్యాంకులు సాధించడం తమ టార్గెట్‌ కాదని పాఠం పూర్తిగా అర్థం అవడమే తమ లక్ష్యమని ఎప్పుడు చెబుతుంటారు.

చదువును కూడా ఆటలా మార్చేసి...

Education


‘బైజూ’స్ లెర్నింగ్ యాప్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ కూడా... చదువుతో ప్రేమలోనే పడ్డాడు. అదే ప్రేమతో ‘క్యాట్’ పరీక్ష రెండుసార్లు రాసి... రెండుసార్లూ 100 పర్సంటైల్ సాధించాడు. కానీ, ఐఐఎంలో చేరలేదు. అంతేకాదు!! మలయాళీ మీడియంలో చదువుతూ... క్రికెట్ కామెంటరీ విని ఇంగ్లిష్ నేర్చుకున్నాడంటే దాన్నెలా ప్రేమించాడో అర్థం చేసుకోవచ్చు. ఫుట్‌బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్... ఇలా ఆటలాడుతూ చదువును కూడా ఆటలా మార్చేసాడు.

ప్రశ్న. ఓ చిన్న పల్లె నుంచి... అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎడ్‌టెక్ స్టార్టప్ సీఈఓగా... ఈ ప్రయాణం ఎలా ఉంది? అసలు బైజూస్ ఆలోచన ఎలా వచ్చింది?
జవాబు: నేను పుట్టి, పెరిగింది.. కేరళలోని అజికోడ్‌లో! ఇంటర్ వరకు చదివిందీ అక్కడే. అమ్మానాన్న టీచర్లు. మలయాళం మీడియంలోనే హైస్కూల్ చదువు పూర్తయింది. తర్వాత కన్నూర్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ చేశా. ఆ పట్టాతో యూకేకు చెందిన మల్టీ నేషనల్ షిప్పింగ్ కంపెనీలో సర్వీస్ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. రెండేళ్లు చేశా. అప్పుడోసారి సెలవుల్లో బెంగళూరులోని స్నేహితుల వద్దకు వెళ్లాను. వాళ్లు ‘క్యాట్’కు సిద్ధమవుతున్నారు. మ్యాథ్స్‌లో సందేహాలొస్తే నన్ను అడిగారు. షార్ట్‌కట్ మెథడ్‌లో వాటిని సాల్వ్ చేసి.. ఎలా చేయాలో చూపించాను. వాళ్లు క్యాట్‌లో ర్యాంకు కొట్టి ఐఐఎంలో సీటు సాధించారు. నన్ను కూడా ‘క్యాట్’ రాయమని ప్రోత్సహించి వాళ్లే నా దరఖాస్తు కూడా పంపించారు. సరదాగా పరీక్షకు హాజరయ్యా. హాజరయ్యాక ఖాళీగా ఉండలేం కదా..! ప్రశ్నలన్నిటికీ సమాధానాలు గుర్తించా. 2007 క్యాట్‌లో వంద పర్సంటైల్ లభించింది. దీంతో అన్ని ఐఐఎంలలో సీటు లభించే అవకాశముంది. కానీ ఏ ఐఐఎంకూ దరఖాస్తు చేసుకోలేదు. ఎందుకంటే.. స్నేహితులకు క్యాట్ ప్రిపరేషన్‌కు సలహాలిచ్చేటపుడు నాకు ఓ ఆలోచన వచ్చింది. దాన్ని అమల్లోపెట్టి... సొంతగా పరీక్షలకు ప్రిపేరవుతున్న వారికి తోడ్పాటు అందించేలా టీచింగ్‌పై దృష్టిపెట్టాను. తొలినాళ్లలో ఆఫ్‌లైన్ విధానంలో బోధించా. తర్వాత 2009లో వీ-శాట్ ఆధారంగా క్యాట్ ఆన్‌లైన్ శిక్షణనివ్వడం ప్రారంభించాను.

ప్రశ్న. మరి క్యాట్ టీచర్‌గా ఆరంభించి బైజూస్ లెర్నింగ్ యాప్ వరకూ ఎలా వెళ్లారు? బైజూస్ ప్రత్యేకతేంటి?

byju


. దాదాపు మూడేళ్లపాటు క్యాట్ కోచింగ్‌కే పరిమితయ్యాను. అప్పుడే... ఇక్కడితో ఆగిపోకుండా మరింత మందికి చేరువవ్వాలనే ఆలోచన మొదలైంది. దాంతో 2011లో... నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని.. ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ అందుబాటులోకి తెచ్చాం. ఈ స్థాయిలో చాలామంది పిల్లలు యాంత్రికంగా చదువుతుంటారు. అలా చదవడం వల్ల మార్కులు వస్తాయేమో కానీ.. సబ్జెక్ట్‌పై, నేర్చుకోవటంపై వారికి ఆసక్తి పెరగదు. దీంతో భవిష్యత్‌లో ఉన్నత చదువుల పరంగా ఇబ్బందిపడతారు. దీన్ని గుర్తించి లెర్నింగ్ పట్ల విద్యార్థుల్లో ఇష్టం పెరిగేలా టూల్స్‌ను రూపొందించి.. ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చాం. ఇది ఎంతో విజయవంతమైంది.

ప్రశ్న. బైజూస్ ఇంత త్వరగా ఎలా విజయవంతమయింది?
. 2015...మాకు టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అది మరిచిపోలేని సంవత్సరం. అప్పుడే దేశంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరుగుతోంది. దీన్ని గుర్తించి ఆ సంవత్సరంలో బైజూస్ లెర్నింగ్ యాప్‌ను తెచ్చాం. ఈ యాప్ ద్వారా అరచేతిలోనే అన్ని కోర్సులు, సబ్జెక్ట్‌లకు సంబంధించి లెర్నింగ్ సాధనాలు లభించేలా ప్రోగ్రామ్ రూపొందించాం. ఈ యాప్‌లో మరో విశిష్టత ఏంటంటే... ప్రతి ఒక్కరికీ వారి ఆసక్తులు, అభిరుచులకు తగ్గట్టు బోధనను అందించడమే. నిజానికిపుడు విద్యార్థులు చదువుతున్న దానికి, కాన్సెప్ట్‌లను అర్థం చేసుకుంటున్న విధానానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షలు-మార్కుల కోణంలో అధిక శాతం మెమరీ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప.. నిజమైన ఆసక్తి చూపడం లేదు. ఈ ఆసక్తి పెంచేలా లెర్నింగ్ టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చాం.

ప్రశ్న. ఖాళీ సమయాల్లో మీరేం చేస్తుంటారు? మిమ్మల్ని ‘పుస్తకాల పురుగు’ అనుకోవచ్చా?
. అలాంటిదేమీ లేదు. నిజానికి నా చిన్నతనం పాఠశాల స్థాయి చదువంతా ఆటలతోనే గడిచింది. తరగతి గదిలో కంటే ప్లే గ్రౌండ్‌లోనే ఎక్కువ సమయం గడిపేవాణ్ణి. ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, బ్యాడ్మింటన్ ఇలా.. స్కూల్‌లో అన్నిరకాల ఆటల్లో ముందుండే వాణ్ని. మరోవైపు చదువులో వెనుకబడకూడదనే తాపత్రయం. దీంతో సొంతంగా చదువుకునే వాడిని. ఫలితంగా ఒక పాఠాన్ని, అంశాన్ని ‘విశ్లేషించుకుని’ కాన్సెప్ట్‌లు అర్థం చేసుకునే లక్షణం అలవడింది. అంతేకాకుండా ప్రశ్నించే తత్వం, సమస్యకు సొంతంగా పరిష్కారం కనుగొనే నైపుణ్యాలు లభించాయి. ఇవే నన్ను ఈ రోజు ఈ స్థాయికి చేర్చాయని చెప్పొచ్చు. ఆటలు.. టీమ్ వర్క్‌ను, ఒత్తిడి వాతావరణంలో పని చేయడం, దుందుడుకు స్వభావాన్ని నియంత్రించుకోవడం, నాయకత్వ లక్షణాలు వంటివెన్నో నేర్పిస్తాయనేది నా నమ్మకం.

ప్రశ్న.ఇప్పటి విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మీకు నచ్చని అంశాలేమైనా ఉన్నాయా?
. అలా చెప్పలేం కానీ... తల్లిదండ్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు తమ పిల్లల చదువులకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇక్కడ సమస్య ఏమంటే.. తమ పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలనే ఒకే ఒక్క ఆలోచనతో ఉంటున్నారు. దీంతో పిల్లలు కూడా స్పూన్ ఫీడింగ్ విధానంలోనే చదువుతున్నారు తప్ప.. తమ సొంత ఆలోచనలకు పదును పెట్టడం లేదు. ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. కానీ సమస్యలను గుర్తించడం, ప్రశ్నలు అడిగే దృక్పథం వంటి లక్షణాలు అలవడటంలేదు.

ప్రశ్న. స్టూడెంట్లు కానీ... ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుకానీ... యువతకు మీరిచ్చే సలహా...
. యువ ఔత్సాహి పారిశ్రామికవేత్తలకు నేను చెప్పేదొకటే. మీరు చేసే పని సమాజంలో సమస్యలకు పరిష్కారం చూపించేదైతే... ఫలితం లభించాక కలిగే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. నా ఉద్దేశంలో డబ్బు మీద ఆసక్తితో వ్యాపారాన్ని నిర్వహించలేం. సమాజంలో మార్పు తేవాలనే ఆసక్తితో మొదలుపెట్టాలి. వాస్తవానికి నా విషయాన్నే తీసుకుంటే.. వృత్తి రీత్యా ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించాను. తర్వాత అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగాను. ఆసక్తితో టీచర్‌గా మారాను. అసలు ఈ వ్యాపారం(బైజూస్) ప్రారంభించాలని నేను ఏనాడూ అనుకోలేదు. నాలో ఆసక్తిని అన్వేషించాను. నా బలాల్ని సమీకరించుకోవడంతో అదే వ్యాపారంగా మారింది.

  యువత ఆలోచనల పరిధి విస్తరించాలి. పెద్దగా ఆలోచించాలి. ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. వాటిని సాధించడానికి సరైన ప్రణాళికతో శరవేగంగా కదలాలి. మీ ఆలోచన పట్ల మీకు ఆసక్తి ఉంటే.. దానికి రూపమిచ్చేలా మొదటి నుంచీ కష్టపడితే విజయం మిమ్మల్ని తప్పకుండా అను సరిస్తుంది. యువత తమ లక్ష్యంపై స్పష్టత తో... ప్రేమతో ముందుకు కదలాలి. మెజరబుల్ గోల్స్ సూత్రాన్ని నమ్ముకోవాలి. ఫలితంగా మీ ఆశయ సాధన క్రమంలో ఏ స్థాయికి చేరారనేది నిరంతరం సమీక్షించుకునే వీలుంటుంది. బైజూస్‌ను ప్రారంభించేటప్పుడు దేశంలో అతిపెద్ద ఎడ్యుకేషన్ టెక్నాలజీ బ్రాండ్‌గా నిలవాలనే లక్ష్యం నిర్దేశించుకున్నాం. అది నెరవవేరడమే కాకుండా.. ప్రపంచంలోనే అతి పెద్ద బ్రాండ్‌గా పేరొందే దిశగా ప్రస్తుతం పయనిస్తున్నాం!!

Published date : 22 Jan 2022 01:46PM

Photo Stories