Govt Schools: విద్యార్థులు 461.. టీచర్లు ఐదుగురే..
నిజామాబాద్ అర్బన్: నగరంలోని వెంగల్‌రావునగర్ కాలనీలో ఉన్న ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియంలో విద్యాబోధనకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థు ల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ఈ పాఠశాలలో ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కానీ దీనికి అనుగుణంగా సౌకర్యాల ఏర్పాటు ఉండడం లేదు. దీంతో విద్యాబోధనకు అనేక ఇబ్బందులు తలెత్తతున్నాయి. ఈ పాఠశాలను 2021లో ఆప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం పదో తరగతి వరకు కొనసాగుతుంది. ఇందులో 461 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ ఐదుగురు టీచర్లు మాత్రమే విద్యాబోధన చేస్తున్నారు. కేవలం ఐదుగురు టీచర్లు మాత్రమే విద్యార్థులకు పాఠాలు బోధించడం ఇబ్బందికరంగా మారింది. ఎక్కువ మొత్తంలో విద్యార్థులు ఉండడంతో టీచర్లపై ఒత్తిడి కొనసాగుతోంది. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం ఇక్కడి టీచర్లు ప్రత్యేక నిర్వహణతో పాటు పరీక్షల నిర్వహణ చేపడుతున్నారు. మిగతా తరగతులకు సైతం పూర్తి స్థాయి విద్య అందించడంలో అవంతరాలు తలెత్తుతున్నాయి. టీచర్లు తలాకొంత డబ్బు జమ చేసి ఇద్దరు విద్యావలంటీర్లును సమకూర్చుకున్నారు. వీరిని ప్రాథమిక విద్యాబోధనకు కేటాయించి ఉన్నత విద్యకు వీరు బోధన చేపడుతున్నారు. అయినా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
చదవండి: 10th & 12Th Class: సీబీఎస్‌ఈ పరీక్షల తేదీలు ఖరారు
అప్‌గ్రేడ్ అయినా..
2021లో పాఠశాల ప్రాథమిక పాఠశాలగా నుంచి ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ అయింది. దీంతో సంబంధిత పాఠశాలకు 18 మంది టీచర్లను కేటాయించాల్సి ఉంది. కానీ ఈ నిబంధన అమలు కాలేదు. ఇటీవల టీచర్లకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జరిగింది. ప్రక్రియలో సంబంధిత పాఠశాలకు బదిలీలు, పదోన్నతుల జాబితాలో చూపించలేదు. అప్‌గ్రేడ్ అయినా అధికారికంగా జాబితాలో నమోదు కాలేదు. ఇకనైన జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలకు అవసరమైన టీచర్లను కేటాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
టీచర్లను కేటాయించాలి
పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. విద్యార్థులకు అనుగుణంగా టీచర్లను కేటాయించాలి. ఇప్పటి కే ఉన్న టీచర్లపై అధిక మొ త్తంలో ఒత్తిడి పెరుగుతోంది. అయినా ఉపాధ్యాయులందరం విద్యార్థులకు మంచి విద్యాబోధన అందిస్తున్నాం. ప్రభుత్వం స్పందించి అదనపు టీచర్లను కేటాయించాలి.
– భూమయ్య, ఇన్‌చార్జి హెచ్‌ఎం