Skip to main content

Telugu Academy : ఇంటర్‌ పాఠ్యపుస్తకాల‌ ఆవిష్కర‌ణ‌..త్వ‌ర‌లోనే పోటీ పరీక్షలవి కూడా..

సాక్షి, విజయవాడ: తెలుగు, సంస్కృత అకాడమి, ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో ముద్రించిన ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం సెప్టెంబ‌ర్ 28వ తేదీన‌ విజయవాడలో జరిగింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ పుస్తకాలను ఆవిష్కరించారు.

మొదటి సారిగా..
ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. ‘‘ఏపీ విభజన తర్వాత తెలుగు అకాడమీ హైదరాబాద్‌లో ఉండిపోయింది. తెలుగు, సంస్కృతి అకాడమీగా మార్పు చేసి భాషాభివృద్దికి కృషి చేస్తున్నాం. అకాడమీ ఏర్పాటు తర్వాత మొదటి సారిగా ఇంటర్ పాఠ్యపుస్తకాలని రూపొందించి ముద్రించడం అకాడమీ ఘనవిజయం’’ అన్నారు.

పోటీ పరీక్షలకి అనుగుణంగా..
‘‘తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలలో ఇపుడు ముద్రణ జరిగింది. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరానికి సంబంధించి 54 పుస్తకాలని ముద్రించాం. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విద్యార్ధులకి తెలుగు అకాడమీ పుస్తకాలు ఉపయోగపడతాయి. డీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకి అనుగుణంగా పుస్తకాలు ముద్రించాం. డిగ్రీ, అనువాద పుస్తకాలు, ప్రాచీన, ఆధునిక పుస్తకాల ముద్రణకి తెలుగు, సంస్కృత అకాడమీ చర్యలు తీసుకోవాలి. తెలంగాణా నుంచి ఏపీకి రావాల్సిన తెలుగు అకాడమీ నిధులు, ఉద్యోగుల విషయమై సుప్రీం తీర్పుకి అనుగుణంగా ముందుకు వెళ్తాం. తిరుపతి కేంద్రంగా తెలుగు, సంస్కృతి అకాడమీ నడుస్తోంది. అన్ని సమస్యలు పరిష్కరించి తెలుగు, సంస్కృత అకాడమీని‌ బలోపేతం చేస్తాం’’ అన్నారు.

పోటీ పరీక్షలు, డిగ్రీ, పీజీ పుస్తకాల‌ ముద్రణ కూడా..
తెలుగు అకాడమీ విభజనపై ఏపీకి అనుకూలమైన తీర్పు వచ్చిందన్నారు తెలుగు, సంస్కృతి అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘వచ్చే నెల మొదటి వారంలోపు తెలుగు అకాడమీ విభజన పూర్తి అవుతుందని భావిస్తున్నాం. తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలపై విద్యార్ధులలో మక్కువ ఎక్కువ. పుస్తకాలలో‌ నాణ్యత ఉంటుందని భావిస్తారు. పోటీ పరీక్షలు, డిగ్రీ, పీజీ పుస్తకాల‌ ముద్రణ కూడా తయారవుతోంది. సీఎం వైఎస్ జగన్ సూచనలకి అనుగుణంగా తెలుగు, సంస్కృతి అకాడమీని తీర్చుదిద్దుతున్నాం’’.
   ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర, సంచాలకులు వి. రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.

Published date : 28 Sep 2021 06:50PM

Photo Stories