ISO certification: ఎస్వీయూకి ఐఎస్‌ఓ గుర్తింపు
తిరుపతి సిటీ: తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది. ఈ మేరకు వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కే.రాజారెడ్డి ఐఎస్‌ఓ గుర్తింపు పత్రాన్ని గురువారం అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన హెచ్‌ఓఎం ఇంటర్నేషనల్ సంస్థ రెండు రోజులపాటు ఎస్వీయూను పరిశీలించి విద్యావనరులు, సదుపాయాలు, విద్యాభివృద్ధిపై సంతృప్తి వ్యక్తంచేస్తూ ఐఎస్‌ఓ గుర్తింపు ఇచ్చినట్టు వెల్లడించారు. 69 సంవత్సరాలుగా అత్యున్నత ప్రమాణాలతో విద్యనందిస్తున్న ఎస్వీయూకి ఐఎస్‌ఓ గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. సంస్థ ప్రతినిధి శివయ్య మాట్లాడుతూ ఎస్వీయూలో మెరుగైన విద్య ప్రమాణాలు ఉన్నాయని, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీనరీ, సౌకర్యాలు వంటివి ఆదర్శంగా ఉన్నాయని కొనియాడారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ ఎన్విరాన్మెంట్ గ్రీనరీలో ఐఎస్‌ఓ 14001 సర్టిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిటీ మేనేజ్మెంట్‌లో ఐఎస్‌ఓ 210001 సర్టిఫికేషన్, ఎనర్జీ సేవింగ్‌లో ఐఎస్‌ఓ 50001 గుర్తింపు లభించడం సంతోషంగా ఉందన్నారు. డీన్ ప్రొఫెసర్ అప్పారావు, డాక్టర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.