Sportsmanship: విద్యార్థులకు క్రీడా స్ఫూర్తి అవసరం
రాయగడ: విద్యార్థి దశ నుంచే క్రీడా స్ఫూర్తిని అలవర్చుకుని ముందుకు వెళితే ఆయా రంగంలో రాణించగలరని రాయగడ జిల్లా విద్యాశాఖ అధికారి పూర్ణ చంద్ర భొరియా అన్నారు. స్థానిక గొవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపిక పొటీలు శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భొరియా మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి తమకు ఆసక్తిఉన్న రంగంలో ప్రతిభ కనబరచాలన్నారు. క్రీడా రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందన్నారు. అందువల్ల క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచేందుకు ఇటువంటి పొటీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల ఏడు నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో జరగనున్న వివిధ క్రీడల్ల్లో పాల్గొనేందుకు క్రీడాకారుల ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నామని వివరించారు. బ్యాడ్మింటన్, హ్యాండ్‌బాల్, బాక్సింగ్, వాలీబాల్, హాకీ వంటి అంశాల్లో రాయగడ జిల్లా నుంచి క్రీడాకారులను ఎంపిక చేసి వారిని రాష్ట్ర స్థాయిలో జరగనున్న పోటీలకు పంపించనున్నట్టు వివరించారు. 14 నుంచి 17 ఏళ్లలోపు బాలబాలికల మధ్య పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని 11 సమితుల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు వివిధ అంశాల్లొ పాల్గొనేందుకు ఈ పోటీలకు హాజరయ్యారన్నారు. ఇందులో 130 మంది క్రీడాకారులను ఎంపిక చేసి జిల్లా నుంచి పంపిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లాక్రీడా అధికారి షేక్ ఆలీనూర్, గొవింద చంద్ర దేవ్, ఉన్నత పాఠశాల పీపీటీ సుశాంత్, ఉపాధ్యాయుడు శశిభూషన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: NCC: క్రమశిక్షణకు మారు పేరు ఎన్‌సీసీ
తక్కువ సమయంలో ఆదేశాలు రావడంతో..
రాష్ట్రస్థాయి పోటీల్ల్లో పాల్గొనేందుకు క్రీడాకారులను ఎంపిక చేసి పంపించాలని రాష్ట్ర క్రీడా శాఖ రెండు రోజుల క్రితం తమకు ఆదేశాలు జారీ చేయడంతో తక్కువ సమయంలో ఎంపిక ప్రక్రియ ఒకేరోజులో పూర్తి చేయాల్సి వచ్చిందని డీఈవో భొరియా వివరించారు. దీని వల్ల జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనే అవకాశం లేకపొయిందన్నారు.