Quiz Competition: క్విజ్ పోటీల్లో విజేతల వివరాలు వెల్లడి
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థుల వివరాలను అదనపు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎన్.అనూరాధ తెలిపారు. ఏపీ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ వారి ఆదేశాలతోపాటు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జిల్లా విద్యాశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 8, 9 చదువుతున్న బాలబాలికలకు అక్టోబర్ 27వ తేదీన క్విజ్ పోటీలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఆరోజు జరిగిన క్విజ్ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 56 మంది విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి హాజరయ్యారు. ఇందులో ఎన్.కార్తికేయ, బి.పూర్ణచంద్ర (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాశీబుగ్గ) మొదటిస్థానంలో నిలవగా, కె.వరప్రసాద్, ఎన్.సాయిదేవహర్ష (ప్రభుత్వ (బాలురు) ఉన్నత పాఠశాల శ్రీకాకుళం) ద్వితీయ స్థానంలో, కె.కృష్ణచైతన్య, జి.అగస్త్యరామ్ (ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల) తృతీయ స్థానంలో నిలిచా రు. మొదటి మూడుస్థానాల్లో నిలిచినవారికి వరుసగా రూ.5వేలు, 4వేలు, 3వేలు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను నవంబర్ 14వ తేదీన జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ చేతులమీదుగా అందజేయనున్నట్టు ఆమె చెప్పారు.