School Leadership: ‘స్కూల్ లీడర్‌షిప్’లో నార్వాయిపేటకు చోటు
నెన్నెల(బెల్లంపల్లి): మండలంలోని నార్వాయిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు స్కూల్ లీడర్‌షిప్ అకాడమీ పుస్తకంలో చోటు దక్కిందని పాఠశాల ఉపాధ్యాయుడు జలంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎస్‌సీఈఆర్‌టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్) స్కూల్ లీడర్‌షిప్ అకాడమీ తెలంగాణ, నేషనల్ సెంటర్ ఫర్ స్కూల్ లీడర్‌షిప్ అకాడమీ ఎన్‌ఐఈపీఏ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్) న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఇంపాక్ట్, ఇన్ఫ్లూయెన్స్, ఇన్స్పిరేషన్–2023 పుస్తకంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైన 36 ప్రభుత్వ పాఠశాలల కథనాలు ప్రచురితమయ్యాయి. ఇందులో జిల్లాలోని మూడు పాఠశాలలకు చోటు దక్కింది. విద్యారంగంలో వినూత్న ప్రయోగాలు , విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధనాభ్యాసన ప్రక్రియలు, క్షేత్ర పర్యటనలు, ప్రయోగాలు, ప్రత్యక్ష అనుభవం ద్వారా పాఠాల బోధన, టీషర్ట్‌లపై అంతర్గత అవయవాల బొమ్మలు, ‘అష్టాచెమ్మాతో అవనిని చుట్టేద్దామా’ అనే వివిధ ప్రయోగాత్మక అభ్యాస ప్రక్రియలపై పాఠశాల ఉపాధ్యాయుడు జలంపల్లి శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి బోధించడంతో ఆ పాఠశాల లీడర్‌షిప్ స్కూల్ అకాడమీ పుస్తకంలో చోటు సంపాదించుకుంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోడూరి శ్రీనివాస్, తోటి ఉపాధ్యాయులు సదయ్య, స్నేహలత మండల ఉపాధ్యాయుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నామన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తేనే ఉపాధ్యాయుడు సమాజ హితునిగా వెలుగొందుతాడన్నారు.