Manav Seva Award: సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌కు మానవసేవా పురస్కారం
విజయనగరం అర్బన్: గుంటూరుకు చెందిన పబ్బరాజు వెంకటేశ్వరరావు రాజ్యలక్ష్మి స్మారక మానవ సేవా పురస్కారం–2023వ సంవత్సరానికిగాను విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గంట జనార్దననాయుడు అందుకున్నారు. ఈ మేరకు గుంటూరులో మంగళవారం జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు పురస్కారాన్ని జనార్దననాయుడు దంపతులకు అందజేసి సత్కరించారు. అంధులు, దివ్యాంగులు, అనాథల సేవలో నిమగ్నమైన వ్యక్తులకు గానీ, సంస్థలకు గానీ దివ్యాంగులై ఉండి విద్యావంతులై ఉన్నత ఉద్యోగం పొంది ఉత్తమ పని తీరు ప్రదర్శించిన ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం బహూకరించాలనే పబ్బరాజు వెంకటేశ్వరరావు రాజ్యలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ సంకల్పం మేరకు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌ను పురస్కారానికి ఎంపిక చేశారు. డాక్టర్ జనార్దన నాయుడు పుట్టుకతో అంధుడైనప్పటికీ జీవితంలో ఎదగడానికి అంగవైకల్యం అవరోధం కాదని నిరూపించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా సుధీర్ఘకాలం పనిచేసి పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసి ఇటీవల బదిలీపై మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలకు ప్రిన్సిపాల్‌గా వచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహరాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది జనార్దననాయుడిని అభినందించారు.
చదవండి: Govt Junior College: విద్యార్థులు కష్టపడి చదివితే ఉత్తమ భవిష్యత్