Skip to main content

ITI : ఐటీఐ చ‌దువు.. వీరి సంపాదన మాత్రం నెలకు రూ.90 వేలకుపైనే.. ఎలా అంటే..?

కర్నూలులోని మద్దూర్‌ నగర్‌కు చెందిన షఫీ 1997లో ఐటీఐ పూర్తి చేసి ఆ తర్వాత ఎలక్ట్రీషియన్‌గా స్థిరపడ్డాడు.

అపార్ట్‌మెంట్లు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, పెద్ద ఆస్పత్రులకు ఎలక్ట్రికల్‌ వర్క్‌ కాంట్రాక్టుకు తీసుకుని బాగానే సంపాదిస్తున్నాడు. తనవద్ద ఎలక్ట్రికల్‌ పని నేర్చుకున్న ఎంతోమంది కూడా సొంతంగా జీవనం సాగిస్తున్నారు. కానీ రెండు, మూడేళ్లుగా అతనికి ఎలక్ట్రీషియన్లు దొరకడం లేదు. ఉత్తరప్రదేశ్‌ నుంచి మూడు బ్యాచ్‌లుగా పిలిపించుకుని వారితో పనిచేయిస్తున్నాడు. కారణం పనిచేసేవారు మన వద్ద క్రమంగా తగ్గిపోతుండటమే.

Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

పట్టణీకరణ భారీగా పెరుగుతోంది. ఆస్పత్రులు, బ్యాంకులు, అపార్ట్‌మెంట్లు, రియల్‌ ఎస్టేట్‌తో పాటు నిర్మాణరంగంలో అభివృద్ధి జరుగుతోంది. కానీ వర్కర్ల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీంతో భవన నిర్మాణ కార్మికులతో పాటు ఎలక్ట్రీషియన్లు, శానిటేషన్‌ వర్కర్లను(ఫిట్టర్లు) కూడా బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్‌ నుంచి తెప్పించుకుని పనులు చేస్తున్నారు.

ITI Students

పై రెండు ఉదాహరణలు పరిశీలిస్తే ‘స్కిల్డ్‌ వర్కర్ల’ కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎక్కువ శాతం మంది విద్యార్థులు సూపర్‌ విజన్‌ జాబ్‌ల దిశగా అడుగులేస్తూ పని నేర్చుకునే ఐటీఐని పక్కన పడేస్తుండటం ఆందోళనకరం. గమనించిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. నియోజకవర్గానికో స్కిల్‌హబ్‌ ఏర్పాటు చేసి, వృత్తివిద్య పూర్తిచేసిన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా తీసుకుంది.

After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

చాలామంది ఇలాంటి చదువులపై..

ITI student news


టెక్నాలజీ విప్లవం వచ్చిన తర్వాత అధిక శాతం మంది స్మార్ట్‌ లైఫ్‌కు అలవాటుపడ్డారు. శారరీక శ్రమ లేని ఉద్యోగాలే లక్ష్యంగా విద్యార్థులు కూడా కోర్సులు ఎంపిక చేసుకుంటున్నారు. ‘మేం కష్టపడ్డాం. మా పిల్లలు అలా కాకూడదు. సుఖంగా బతకాలి’ అనే ధోరణితో తల్లిదండ్రులు వారి పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది డిగ్రీలు, పీజీలు, బీటెక్‌లు, ఎంబీఏ, ఎంసీఏ లాంటి చదువులపై దృష్టి సారిస్తున్నారు.

ఈ విభాగాల్లో ఉద్యోగాలు సాధించి స్థిరపడనివారు కొందరైతే, మంచి చదువులు అభ్యసించి ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నవారి సంఖ్య ఎక్కువే. దీనికి కారణం బీటెక్, ఎంబీఏ, ఎంసీఏలు ‘సూపర్‌వైజింగ్‌’ ఉద్యోగాలు. దేశంలో ప్రభుత్వరంగం కంటే ప్రైవేటురంగంలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ప్రైవేటు కంపెనీలు ‘స్కిల్డ్‌ వర్కర్ల’నే రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. ఐటీఐ, డిప్లొమో చదివిన వారివైపు మక్కువ చూపుతున్నాయి. దీనికి కారణం ఈ విభాగాల్లోని వారు శారీరక శ్రమతో పనిచేయాలి.

Central Government Jobs: పదితోనే కేంద్ర కొలువు.. పూర్తి వివ‌రాలు ఇలా..

ఇంజినీరింగ్‌ లాంటి చదువులు చదివితే..

Students

ఎలక్ట్రికల్, ఫిట్టర్, మెకానికల్‌ రంగాల్లో ఎక్కువగా ఐటీఐ చదివిన విద్యార్థులు ఉంటారు. కొంతకాలంగా ఐటీఐ చదివే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. దీనికి కారణం ఈ చదువులు చదివితే వర్కర్లుగా పనిచేయాలి. ఇంజినీరింగ్‌ లాంటి చదువులు చదివితే కంప్యూటర్‌ ముందు కూర్చుని ఉద్యోగం చేయొచ్చనే దృక్పథం విద్యార్థుల్లో ఉండటమే. గత ఐదేళ్ల ఐటీఐ అడ్మిషన్లు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 2018లో అందుబాటులో ఉన్న సీట్ల కంటే 23 శాతం తక్కువగా అడ్మిషన్లు నమోదైతే, 2019లో 28 శాతం, 2020లో 40.76 శాతం, 2021లో 39.76 శాతం తక్కువగా నమోదయ్యాయి.

చదవండి: After 10th : పదో తరగతి అర్హతతో డ్రోన్‌ పైలట్‌.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..

ప్రస్తుతం 2022లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏకంగా 71.08 శాతం తక్కువగా నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలోని 17 ఐటీఐ కాలేజీల్లో 2012 సీట్లు ఉంటే కేవలం 713 మాత్రమే భర్తీ అయ్యాయి. నంద్యాల జిల్లాలో 21 కాలేజీల్లో 2,924 సీట్లు ఉంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 714 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే నంద్యాల జిల్లాలో 75.58 శాతం తక్కువ అడ్మిషన్లు నమోదయ్యాయి. దీన్నిబట్టే ఐటీఐ చదువులపై విద్యార్థులు మక్కువ చూపడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

భవిష్యత్తు వీరిదే.. 

ITI Education news

ఐటీఐ, డిప్లొమో చదువులు పూర్తి చేసిన స్కిల్డ్‌ వర్కర్లకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆస్పత్రులు, బ్యాంకులు, రియల్‌ ఎస్టేట్‌తో పాటు నిర్మాణరంగంలో స్కిల్డ్‌ వర్కర్ల అవసరం భారీగా ఉండబోతోంది. ఎన్‌ఎస్‌డీసీ(నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోనే వచ్చే నాలుగేళ్లలో 41.41 లక్షల మంది స్కిల్డ్‌ వర్కర్ల అవసరం ఉండబోతోంది. అయితే ఏడాదికి 2.85 లక్షల మందే అందుబాటులో ఉంటున్నారు. దేశవ్యాప్తంగా కియా, హుండాయి, మారుతి, హరీ మోటార్స్‌ లాంటి ఆటోమొబైల్‌తో పాటు అన్ని   రంగాల్లో కూడా ఫిట్టర్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో నిపుణులైన వారికి ఉద్యోగ అవకాశాలున్నాయి.

కారు, బైక్‌ మెకానిక్, నిర్మాణరంగంలో ఫిట్టింగ్, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో పనిచేసే వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. ఇటీవల ఈ రంగాల్లో పని నేర్చుకునే ఆసక్తి తగ్గుతోంది. మెకానిక్‌ నుంచి ఎలక్ట్రికల్, ఫిట్టర్ల వరకూ అసిస్టెంట్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒక ఎలక్ట్రిషియన్‌ ఒక ఇంటికి కరెంట్‌ పని చేస్తే 2–4 రోజుల్లో పూర్తవుతుంది. దీనికి రూ.15 వేల నుంచి రూ. 20 వేలు తీసుకుంటున్నారు. నెలలకు కనీసం 5 కొత్త ఇళ్లకు ఎలక్రికల్‌ పని చేస్తే రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు వస్తుంది. బైక్‌ మెకానిక్, ఫిట్టర్లు కూడా రోజూ కనీసం రూ.3వేలు తక్కువ లేకుండా సంపాదిస్తారు. అంటే వీరి సంపాదన కూడా నెలకు రూ.90 వేలకుపైనే.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై..
విద్యార్థుల్లో వృతినైపుణ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. జిల్లాలో స్కిల్‌డెవలప్‌మెంట్‌ కాలేజీ నిర్మిస్తోంది. రెండు జిల్లాల్లో 14 నియోజకవర్గాల్లో స్కిల్‌హబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 5 హబ్‌లు ఏర్పాటు చేశారు. పది, ఇంటర్, డిగ్రీ చదివిన నిరుద్యోగులకు 45 రోజుల నుంచి 60 రోజులు పలు విభాగాల్లో శిక్షణ ఇచ్చి కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో చదువు మధ్యలోనే ఆపేసినవారు, నిరుద్యోగులు ఇక్కడ ‘స్కిల్‌’ మెరుగుపరుచుకుని ఉద్యోగం సంపాదించొచ్చు.

Government Jobs: పది, ఇంటర్ అర్హ‌తతోనే సర్కారీ కొలువులెన్నో..!

నియోజకవర్గానికి ఒక..
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్‌హబ్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కర్నూలు, ఎమ్మిగనూరులో రెండు సెంటర్లలో శిక్షణ ఇస్తున్నాం. డిగ్రీ, ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు వేర్వేరుగా శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ తర్వాత వీరికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. 24/7, వెబ్‌బ్లెండర్స్‌ లాంటి కంపెనీలతో సంప్రదింపులు జరిపాం. శిక్షణ పూర్తికాగానే ప్లేస్‌మెంట్లు ఇస్తాం.
                                                                                 – శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా మేనేజర్, స్కిల్‌డెవలప్‌మెంట్‌

Published date : 21 Sep 2022 07:35PM

Photo Stories