Sri Krishnadevaraya University: ఎస్కేయూ ‘ఇంజినీరింగ్’కు హుందాయ్ దన్ను
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలకు హుందాయ్ కంపెనీ దన్నుగా నిలిచింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద రూ.33 లక్షలు విలువ చేసే 16 ఇంటరాక్టివ్ ప్యానళ్లు, 10 కంప్యూటర్లను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్కేయూ వీసీ డాక్టర్ కె.హుస్సేన్‌రెడ్డిని హుందాయ్ మోబీస్ కంపెనీ ప్రతినిధులు ఎం.డి.యాంగ్ యెన్గ్ డియుక్, హెచ్‌ఆర్‌జీఏ కో–ఆర్డినేటర్ హుమిన్‌హో, పీఎన్ శ్రీనివాస్ తదితరులు కలిసి మాట్లాడారు. కళాశాల, కంపెనీకి మధ్య అంతరం తగ్గేలా నూతన సిలబస్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఎస్కేయూ వీసీ తెలిపారు. కంపెనీ అవసరాలకు దోహదపడేలా విద్యార్థులకు ఇంటర్నిషిప్ కల్పించేందుకు సమ్మతించిన హుందాయ్ కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఎండీ యాంగ్ యెన్గ్ డియుక్ మాట్లాడుతూ.. ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల ఓ ఉత్తమమైన కళాశాలగా తాము గుర్తించామని, ఈ నేపథ్యంలో స్పాన్సర్‌షిప్ ఇచ్చేందుకు ముందుకు వచ్చామన్నారు. భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కళాశాల విద్యాభివృద్ధికి దోహదపడేలా పరికరాలను అందజేసిన హుందాయ్ కంపెనీ ప్రతినిధులకు ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర ధన్యవాదాలు తెలిపారు.