Skip to main content

Schools Holidays : మ‌రో వారం రోజులు పాటు స్కూల్స్‌కు సెలవులు.. కార‌ణం ఇదే !

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఉత్తరాదిని రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజస్థాన్ రాష్ట్రాలు చలికి వణికిపోతున్నాయి. ప్రజలకు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.

చలికాలం వచ్చిందట చలి పులి అవతారం ఎత్తుతుంది. ప్రస్తుతం దేశంలో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. పని చేయాలంటేనే వణుకు వచ్చేస్తుంది. ఈ గడ్డకట్టే చలిలో రోడ్డు మీద నడవాలంటేనే భయపడే పరిస్థితి.

➤ 2023లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవే.. ఈ సారి ఉద్యోగుల‌కు మాత్రం..

తెలుగు రాష్ట్రాల్లో కూడా..

Holidays for schools

ఒకవైపు చలి వణికిస్తుంటే.. మరోవైపు పొగమంచు కమ్మేస్తుంది. గడ్డ కట్టేంత చలితో జనం విలవిలలాడిపోతున్నారు. ఉదయాన్నే లేచి స్కూళ్ళకి, ఆఫీసులకి రావడం అంటే వణుకుతున్నారు. దేశంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి వణికిస్తోంది. చలి తీవ్రత పెరిగిపోవడంతో వారం రోజులు సెలవులు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి.

హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్‌తో 25 మంది ప్రాణాలు..
ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు మరీ దారుణంగా ఉన్నాయి. అక్కడి చలి దెబ్బకు ఐదు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. చలి తీవ్రతకు చాలా మంది మృత్యువాత పడ్డారు. కాన్పూర్ లో చలి దెబ్బకు హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి 25 మంది ప్రాణాలను కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఒకవైపు చలి వణికిస్తుంటే.. మరోవైపు పొగమంచు, గాలి కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి నాణ్యత ప్రమాదకరమైన స్థాయిలో ఉండడంతో ఢిల్లీ వాసులు భయపడుతున్నారు. 

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మరో వారం రోజులు సెలవులు..

school holidays latest news in telugu

మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో ఢిల్లీ, ఝార్ఖండ్ ప్రభుత్వాలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మరో వారం రోజుల పాటు సెలవులు ప్రకటించాయి. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్క్యులర్ ని జారీ చేసింది. శీతాకాల విరామం తర్వాత ఢిల్లీలోని ప్రైవేట్ పాఠశాలలు జనవరి 9న తెరవాల్సి ఉంది. అయితే చలి తీవ్రత పెరగడంతో మరో వారం రోజులు సెలవులు ప్రకటించాలని నిర్ణయించింది ఢిల్లీ ప్రభుత్వం. ఈ మేరకు జనవరి 15 వరకూ సెలవులు ఇవ్వాలని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. మామూలుగా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో జనవరి 9 నుంచి 12 వరకూ రెమిడియల్ క్లాసులు నడుస్తున్నాయి.

ఆ సెలవులను పొడిగిస్తూ మరో నోటిఫికేషన్ విడుదల..

ts holidays news telugu

అయితే చలి కారణంగా ఈ తరగతులని కూడా నిపిలివేయాలని సర్క్యులర్ జారీ చేసింది. ఝార్ఖండ్ ప్రభుత్వం సైతం జనవరి 14 వరకూ పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంతకు ముందే జనవరి 3 నుంచి 8 వరకూ.. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి పిల్లలకు సెలవులు ప్రకటించింది. అయితే ఇప్పుడు చలి తీవ్రత మరీ దారుణంగా ఉండడంతో ఆ సెలవులను పొడిగిస్తూ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జనవరి 14 వరకూ సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎలాగూ సంక్రాంతి 3 రోజులు సెలవులు కాబట్టి..  ఈ మధ్య రోజులని కూడా సెలవులుగా ప్రకటించాయి ఢిల్లీ, ఝార్ఖండ్ ప్రభుత్వాలు. 

ఇటు తెలంగాణ‌లో మాత్రం..

ts schools holidays

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగి విద్యార్థులు వణికిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గత నాలుగు రోజులుగా విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. హాజరయ్యే విద్యార్థులు కూడా ఏదో ఒక సీజనల్‌ వ్యాధితో బాధపడుతున్నారని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. కొన్ని బడుల్లో కనీస హాజరు శాతం కూడా ఉండటం లేదని, దీంతో బోధన చేపట్టలేకపోతున్నారని చెప్పాయి. అనేకచోట్ల టీచర్లు కూడా చలి ప్రభావానికి లోనవుతున్నారు. మూడు రోజులుగా దాదాపు 3 వేల మంది టీచర్లు సీజనల్‌ వ్యాధితో సెలవు పెట్టినట్టు తెలుస్తోంది. అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న పాఠశాలల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని, తరగతి గదిలో వెచ్చదనం లేకపోవడంతో విద్యార్థులు గజగజ వణికిపోతున్నట్టు విద్యాశాఖాధికారులు చెప్పారు.

స్కూల్‌కు రాని ప్రతీ విద్యార్థి ఏదో ఒక అనారోగ్య సమస్యతో..
తెలంగాణ‌లోని ప్రభుత్వ పాఠశాల్లో సోమవారం 45 శాతం హాజరు నమోదైనట్టు అధికారులు తెలిపారు. మంగళవారం ఇది 35 శాతానికి తగ్గింది. స్కూల్‌కు రాని ప్రతీ విద్యార్థి ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు అధికారులు గుర్తించారు. విద్యార్థుల్లో జలుబు, దగ్గు, జ్వరం, నీరసం లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని ఓ జిల్లా విద్యాశాఖాధికారి చెప్పారు. ఆదిలాబాద్, కొత్తగూడెం, ములుగు, నల్లమలకు అనుకుని ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా కని్పస్తోంది. ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎండ కూడా రావడం లేదు. దీంతో శరీర ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి, విద్యార్థులు శ్వాస సమస్యలకు లోనవుతున్నట్టు అధికారులు చెప్పారు.

ఇప్ప‌టికే చాల మంది ఇళ్లకు వెళ్లిపోతున్నారు..
ప్రభుత్వ హాస్టళ్లల్లోని విద్యార్థులు చాలా వరకు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. హాస్టళ్లకు కిటీకీలు లేకపోవడం, పడుకునే నేల మంచును తలపించేలా ఉండటంతో సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇదే క్రమంలో చలికి స్నానం చేసే పరిస్థితి ఉండటం లేదని, దీంతో చర్మవ్యాధులూ సోకుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 

ఇలా ఉంటే స్కూల్‌కు పంపకపోవడమే మంచిది..
ఒక్కసారిగా వాతావరణంలో మార్పులొచ్చాయి. దీనికి అనుగుణంగా పిల్లల శరీరం ఇప్పటికిప్పుడు అలవాటు పడే అవకాశం ఉండదు. ఇలాంటి సీజ న్లలో వారిలో వ్యాధి నిరోధక శక్తి అంత చురుకుగా పనిచేయదు. ఫలితంగా చలి తీవ్రతకు జలుబు, జ్వరం వంటి వ్యాధులతో నీరసపడే ప్రమాదం ఉంది. చల్లదనానికి నీళ్లు ఎక్కువగా తీసుకోనందున డీ హైడ్రేషన్‌ సమస్యలూ ఉంటాయి. మరో వారంపాటు ఇదే పరిస్థితి ఉండొచ్చు. ఏమాత్రం అనారోగ్యంగా ఉన్న స్కూల్‌కు పంపకపోవడమే మంచిది. దీనివల్ల ఇతర విద్యార్థులకు వైరస్‌ సోకకుండా నియంత్రించవచ్చు. విద్యార్థుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఆకు కూరలు, ఇంట్లో చేసిన వంటలు ఎక్కువగా ఇవ్వాలి. గోరు వెచ్చని నీరు తాగించాలి.

సెలవులివ్వాలి.. 
పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తగ్గింది. చలికాలం ఇబ్బంది పెడుతోంది. ఢిల్లీ వంటి ప్రాంతాల్లో సెలవులు ఇచ్చారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండే పాఠశాలల్లో ఈ తరహా ఆలోచన చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి. ఈ దిశగా వైద్యరంగం తోడ్పాటు తీసుకోవాలి. సంక్రాంతి సెలవుల తర్వాత కూడా సీజనల్‌ వ్యాధుల బారిన పడే పిల్లల వల్ల వైరస్‌ మరింత వ్యాప్తి జరగకుండా చూడాలి.    
                                                              – జి సదానందంగౌడ్, ఎస్‌టీయూటీఎస్, రాష్ట్ర అధ్యక్షుడు

AP Sankranti Holidays Extended: ఏపీలో సంక్రాంతి సెలవుల పొడ‌గింపు.. కొత్త తేదీలివే..

Published date : 13 Jan 2023 05:13PM

Photo Stories