Govt Dental Students: కలలు కన్నారు.. సాకారం చేసుకున్నారు
కడప అర్బన్ : కడప రిమ్స్ ఆవరణంలో 2008–09 విద్యా సంవత్సరంలో 100 సీట్లతో ‘ప్రభుత్వ దంతవైద్య కళాశాల’ను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించారు. 2009 జనవరిలో ఈ కళాశాల భవన సముదాయాన్ని వైఎస్సార్ ప్రారంభించగా 2008–09 బ్యాచ్‌లో 100 మంది విద్యార్థులకు అవకాశం లభించింది. భారతీయ దంతవైద్య విద్యామండలి (డీసీఐ) వారు 2013లో గుర్తింపు ఇచ్చారు. 2008–09 విద్యాసంవత్సరం నుంచి ఇప్పటివరకు 16 బ్యాచ్‌ల్లో 1563 మంది దంతవైద్య విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. తరువాత పీజీ దంతవైద్య విద్యార్థుల కోసం 2016–17 విద్యా సంవత్సరంలో గుర్తింపు లభించింది. 2016–17 నుంచి ఇప్పటివరకు 8 బ్యాచ్‌ల్లో 112 మంది పీజీ దంతవైద్య విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసుకున్నారు. వైద్య రంగంలో అడుగుపెట్టాలని కలలుగన్న వందలాది మంది విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకుని దంత వైద్యులుగా సేవలందిస్తుండగా.. ఇంకొందరు తాజాగా వైద్యులుగా రాణించేందుకు పట్టాలు అందుకోనున్నారు.
నేడు 2018 బ్యాచ్ దంత వైద్య విద్యార్థుల స్నాతకోత్సవం
- ప్రభుత్వ దంత వైద్య కళాశాల 2018 బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవం ఈనెల 10వ తేదీ బుధవారం ఉదయం 10.30 గంటలకు కడప నగర శివార్లలోని విష్ణుప్రియ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జ్యోత్న్స తెలిపారు.
- ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీకి మూడు పీజీ సీట్లు, ఓరల్ మాక్సిల్లోఫేసియల్ సర్జరీ విభాగానికి మూడు సీట్లు, పెరియోడాంటిక్స్ విభాగానికి మూడు పీజీ సీట్లు, ప్రాస్తోడాంటిక్స్ విభాగానికి రెండు పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఈ 11 పీజీ సీట్లకు గాను భారతీయ వైద్య విద్యామండలి 2019 –20 సంవత్సరంలో గుర్తింపు ఇచ్చింది.
- డీసీఐ నిబంధనల ప్రకారం పెరిగిన పీజీ సీట్లకు అనుగుణంగా 2020–21 విద్యా సంవత్సరంలో అదనంగా 24 మంది బోధనా సిబ్బందిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేయించారు.
- 2022–23 విద్యాసంవత్సరంలో భారతీయ విద్యామండలి ఓరల్ పెథాలజీ అండ్ మైక్రోబయాలజీ విభాగానికి మూడు పీజీ సీట్లు, కాన్సిక్స్‌నేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడాంటిక్స్ విభాగానికి మూడు సీట్లు, పీలోడాంటిక్స్ విభాగానికి మూడు సీట్లు, ఆర్థోడాంటిక్స్ విభాగానికి మూడు పీజీసీట్లు కొత్తగా మంజూరు చేసింది.
- దంతవైద్య సేవలతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు దంతవైద్య సమస్యలపై అవగాహన కలిగించడం, పాఠశాలల్లో విద్యార్థులకు దంతసమస్యల నివారణ కోసం దంతవైద్య శిబిరాలను నిర్వహించడం లాంటి కార్యక్రమాలను వైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ వైద్య శిబిరాలు పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ ద్వారా జరుగుతాయి.
కళాశాలలో అభివృద్ధి ఇలా..
- డీసీఐ తమ పరిశీలనలో సూచించిన వైద్య పరికరాలను నిబంధనల మేరకు డీఎంఈ అనుమతితో సమకూర్చారు.
- ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సంస్థ( ఏపీఎంఎస్‌ఐడీసీ) ద్వారా మరికొన్ని పరికరాల కొనుగోలుకు సంబంధిత కంపెనీలకు సరఫరా కోసం ఉత్తర్వులు పంపించారు.
- అదేవిధంగా ప్రభుత్వ బడ్జెట్‌లో దంత సమస్యలకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశారు.
- ప్రభుత్వం నుంచి వచ్చిన కోటి 11 లక్షల రూపాయలతో అవసరమైన చోట్ల భవనాలకు, చిన్నచిన్న మరమ్మతులు (నీటి, పారిశుధ్య, విద్యుత్) చేయించారు.
- దంతవైద్య కళాశాలలో సరిపడా 45 సీసీ టీవీ కెమెరాలను తరగతి గదులలో, విద్యార్థుల వసతి గృహాలలో ఏర్పాటు చేశారు.
- బోధనకు అవసరమైన ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌లను సమకూర్చారు.
- విద్యార్థులు స్వయంగా నిర్వహించుకునే విధంగా బాలుర వసతి గృహంలో మెస్‌ను ఏర్పాటు చేశారు.
- కళాశాల భవనంలో అందుబాటులో ఉన్న లిఫ్ట్‌లకు మరమ్మతులు చేయించి వాడుకలోకి తీసుకువచ్చారు.
- ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్ నుంచి ప్రభుత్వ దంతవైద్య కళాశాలలోని ఓపీ, బాలుర, బాలికల హాస్టల్స్ వరకు మంచినీటి పైపులైన్‌ను ఏర్పాటు చేసుకునేందుకు కడప నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్, డీఎంఈ నుంచి అనుమతులను ఇటీవల పొందారు.
- ర్యాగింగ్ చట్ట వ్యతిరేకమని, ఆ నేరానికి విధించే శిక్షలపై అవగాహన కల్పించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.
వైద్య సేవలు ఇలా..
ప్రభుత్వ దంత వైద్య కళాశాల ద్వారా ప్రతి రోజూ 100 నుంచి 150 మంది ఓపీ వైద్య పరీక్షల కోసం వస్తుంటారు.
2021 సంవత్సరంలో 26,525 మంది, 2022లో 29,235 మంది, 2023లో నవంబర్ వరకు 32,663 మంది దంత వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ దంతవైద్య కళాశాలకు వచ్చారు.
కరోనా సమయంలో ‘బ్లాక్ ఫంగస్’తో బాధపడుతూ వచ్చిన వారికి దవడ ఎముకలు, ఇతరత్రా ఆపరేషన్‌లను నిర్వహించారు. కృత్రిమంగా ఆర్బిట్స్‌ను అమర్చారు.
అందరి సహకారంతో అభివృద్ధి దిశగా అడుగులు
డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జిల్లా ప్రజలకు వైద్య రంగంలో అందించిన వరం కడప రిమ్స్ ఆవరణంలో స్థాపించిన ప్రభుత్వ దంతవైద్య కళాశాల. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేక సహకారంతోనే పీజీ సీట్లు మరిన్ని పెరిగాయి. ఇక్కడికి దంతవైద్యం కోసం వచ్చే వారందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నాం. డీఎంఈతో పాటు, జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లా అధికారులు, రిమ్స్, ప్రభుత్వ దంతవైద్య కళాశాలలోని వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది సహకారంతో కళాశాల దినదినాభివృద్ధి చెందుతోంది. – డాక్టర్ ఎం. జ్యోత్స్న, ప్రిన్సిపల్, ప్రభుత్వ దంతవైద్య కళాశాల, కడప.