Skip to main content

AP Govt: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలపై ఫోకస్‌

Focus on learning abilities

నెల్లూరు(టౌన్‌): ఎవరూ చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసింది. మనబడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించింది. జగనన్న విద్యాకానుక, గోరుముద్ద, సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు, ఇంగ్లిషు మీడియం, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ, పాఠశాలల్లో వర్చువల్‌ బోధన, ప్రతి మండలంలో బాలికలకు ఒక జూనియర్‌ కళాశాల ఏర్పాటు తదితర కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటోంది. అంతేకాకుండా విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు స్టేట్‌ ఎడ్యుకేషన్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (సీస్‌)ను నవంబర్ 3న నిర్వహించనున్నారు. ఆయా పాఠశాలల్లో 3, 6, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీస్‌ సర్వే నిర్వహించనున్నాయి. ఈ సర్వేకు సంబంధించి విద్యార్థులు ఇప్పటికే ప్రాక్టీసును ప్రారంభించారు.

పాఠశాలల్లో సీస్‌ సర్వే
జిల్లాలో సీస్‌ సర్వేకు సంబంధించి 1,403 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లోని 34 వేల మంది విద్యార్థులు సీస్‌ సర్వేకు హాజరుకానున్నారు. ఈ సర్వే ఆధారంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. అదే సమయంలో ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని కూడా అంచనా వేయవచ్చు. తద్వారా విద్యా వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు వీలవుతుంది. అభ్యసనలో బలహీనంగా ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిని మరింత మెరుగుపరిచేలా చర్యలు చేపట్టనున్నారు.

క్షేత్ర పరిశోధనకు డిగ్రీ విద్యార్థుల ఎంపిక
సీస్‌ సర్వేకు ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లు(క్షేత్రస్థాయి పరిశోధకులు)గా డిగ్రీ చదువుతున్న విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ సర్వే మొత్తం 1,647 మంది డిగ్రీ విద్యార్థుల పర్యవేక్షణలో జరగనుంది. ఇందుకు సంబంధించి ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. జిల్లాస్థాయిలో డీఈఓ పర్యవేక్షణలో డీసీఈబీ సెక్రటరీ, సమగ్రశిక్ష ఏఎంఓ, డైట్‌ ప్రిన్సిపల్‌/అధ్యాపకులు, ప్రభుత్వ పరీక్షల విభాగం అసెస్టింట్‌ కమిషనర్‌ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించనున్నారు. అలాగే మండల స్థాయిలో ఎంఈఓ–1, 2, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్లు పర్యవేక్షించనున్నారు. గతంలో నిర్వహించిన సర్వే ఆధారంగా 3, 5, 8 తరగతుల విద్యార్థులకు పరీక్ష నిర్వహించగా, ఈ ఏడాది సీస్‌ సర్వేలో 3, 6, 9 తరగతులకు సర్వే నిర్వహిస్తున్నారు. నిర్వహణకు ముందుగా విద్యార్థులకు ఎస్‌సీఈఆర్టీ ప్రాక్టీస్‌ పేపర్లను సరఫరా చేసింది.

జాతీయ స్థాయిలో ర్యాంకులు
స్టేట్‌ ఎడ్యుకేషన్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (సీస్‌) పరీక్షలో వచ్చిన ఫలితాల ఆధారంగా విద్యార్థులకు జాతీయస్థాయిలో ర్యాంకులను కేటాయించనున్నారు. సీస్‌ పరీక్ష ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ఫోకస్‌ పెట్టనున్నాం. ఫలితాల ఆధారంగా తగిన తర్ఫీదును ఇవ్వనున్నాం. ఎంపికై న విద్యార్థులు సీస్‌ పరీక్షకు తప్పక హాజరుకావాలి. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
– గంగాభవాని, డీఈఓ

ఓఎంఆర్‌ విధానంలో పరీక్ష
సీస్‌ సర్వే పరీక్షను నవంబర్ 3న ఉదయం 10.30కు ప్రారంభించనున్నారు. పరీక్ష ఓఎంఆర్‌ విధానంలో ఉంటుంది. 3, 6 తరగతుల విద్యార్థులకు తెలుగు/ఇంగ్లిషు, గణితం, పరిసరాల విజ్ఞానం, 9వ తరగతి విద్యార్థులకు తెలుగు/ఇంగ్లిషు, గణితం, సోషల్‌, సైన్స్‌ సబ్జెక్టులకు సంబంధించి పరీక్షను నిర్వహించనున్నారు. 3వ తరగతి విద్యార్థులకు గంట, 6వ తరగతి విద్యార్థులకు 75 నిమిషాలు, 9వ తరగతి విద్యార్థులకు 90 నిమిషాల పాటు సీస్‌ సర్వే పరీక్షను నిర్వహించనున్నారు. 3వ తరగతి విద్యార్థులకు 3వ తరగతి సిలబస్‌పై, 6వ తరగతి విద్యార్థులకు 5వ తరగతి సిలబస్‌పై, 9వ తరగతి విద్యార్థులకు 8వ తరగతి సిలబస్‌పై పరీక్ష ఉంటుంది. ఈ సర్వే పరీక్ష ఫలితాల అనంతరం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు మదింపు చేయనున్నారు.

Published date : 01 Nov 2023 03:01PM

Photo Stories