Skip to main content

Synthesis School, Elon musk: అద్భుత ప్రతిభతో..ఎలన్‌ మస్క్ స్కూల్‌లో సీటు సాధించిన తెలుగు విద్యార్థి..

పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదే కాబోలు చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభతో సత్తా చాటాడు వరంగల్‌కు చెందిన ఓ విద్యార్థి.
అనిక్‌ పాల్
అనిక్‌ పాల్

ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతూ...కంప్యూటర్ కోడింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, పైథాన్‌ లాంగ్వేజ్‌లో పట్టు సాధించి ఏకంగా ఎలన్‌ మస్క్‌ స్థాపించిన సింథసిస్‌ స్కూల్‌లో అనిక్‌ పాల్‌ అడ్మిషన్‌ సాధించాడు. 

ఈ స్కీల్స్‌తో..

Elon Musk School


అనిక్‌ పాల్ తండ్రి విజయ్‌పాల్ వృత్తిరీత్యా ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఎలన్ మస్క్ స్థాపించిన సింథసిస్ స్కూల్ గురించి తెలుసుకున్న విజయ్‌పాల్... తన కుమారుడిని ఎలాగైనా అందులో చేర్పించాలని నిశ్చయించుకున్నారు. అందుకు సరిపడా​ శిక్షణను అనిక్‌కు అందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అనిక్‌ పాల్ కంప్యూటర్ కోడింగ్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్,మెషీన్ లెర్నింగ్‌లో ప్రావీణ్యం సాధించాడు.

మూడు రౌండ్లలో అలవోకగా..
ఎలన్‌ మస్క్‌ స్థాపించిన సింథసిన్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షలోని మూడు రౌండ్లను అనిక్‌ ‌ పాల్‌ అలవోకగా సాధించాడు. ప్రవేశ పరీక్షలో భాగంగా మొదటి రౌండ్‌లో పిల్లలు ఆడే వీడియో గేమ్స్‌కు సంబంధించిన పలు లాజికల్ ప్రశ్నలను అనిక్‌ పాల్ ఇట్టే  పరిష్కరించాడు. రెండో రౌండ్‌లో సింథసిస్ స్కూల్ బోర్డు ఇచ్చిన ఓ ప్రశ్నకు వివరణాత్మక సమాధానంతో కూడిన వీడియోను రూపొందించి పంపగా అందులో సెలక్ట్‌ అవ్వగా...మూడో రౌండ్‌లో పర్సనల్ ఇంటర్వ్యూ లోనూ సత్తా చాటాడు. దీంతో అనిక్‌ పాల్‌కు సింథసిస్ డిసెంబ‌ర్ 12వ తేదీన ఈ స్కూల్లో సీటు ఖరారైంది. ప్రస్తుతం అనిక్‌ ‌ పాల్‌ ఆన్‌లైన్‌ క్లాసులను వింటున్నట్లు తెలుస్తోంది. 

వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ గిన్నిస్‌ కార్యక్రమంలో..
ఈ కుర్రాడు వీడియోగేమ్స్‌ ఆడి వదిలేయకుండా వీటిని ఎలా రూపొందిస్తారనే అన్వేషణ మొదలుపెట్టాడు. ఈ ప్ర‌య‌త్నంలోనే కోడింగ్‌, పైథాన్‌ లాంగ్వేజ్‌లు నేర్చుకున్నాడు. ఐఐటీ మద్రాస్‌ నిర్వహించిన వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ గిన్నిస్‌ కార్యక్రమంలో అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టు సమర్పించి భళా అనిపించాడు. ఇందులో దేశవ్యాప్తంగా పాల్గొన్నవారిలో అతి పిన్నవయస్కుడు ఇతడే కావడం మరో విశేషం. అనిక్‌ అబాకస్‌, వేదగణితం, రూబిక్‌ క్యూబ్‌, మెమోరీ టెక్నిక్ మొద‌లైన‌వి నిత్యం సాధన చేసేవాడు.

ఈ స్కూల్ ప్రత్యేకతలివే..

Synthesis School Details


ఎలన్ మస్క్, జోష్ డాన్‌తో కలిసి ఆరేళ్ల క్రితం సింథసిస్ స్కూల్‌ను స్థాపించారు. ప్రస్తుతమున్న స్కూళ్లన్నింటి కంటే విభిన్నంగా కరిక్యులమ్, యాక్టివిటీస్ సింథసిస్‌లో ఉంటాయి. ఈ స్కూల్లో క్లాస్ రూమ్ బోధన కంటే ప్రాక్టికల్స్, ప్రయోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కొత్త ఆవిష్కరణల దిశగా ప్రయోగాలు, వ్యూహాత్మక ఆలోచన విధానం, క్రియేటివ్ యాక్టివిటీస్‌ను విద్యార్థులకు నేర్పిస్తారు. గతంలో స్పేస్ఎక్స్‌ కంపెనీలో పనిచేసే వ్యక్తుల కుటుంబాలకు మాత్రమే ఈ స్కూల్లో అడ్మిషన్స్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ మారుమూల విద్యార్థి అయిన తమ టాలెంట్‌తో ఇందులో సీటు సాధించే అవకాశాన్ని కల్పించారు.

ఈ త‌ర్వాత‌నే అమెరికాకు..
కరోనా నిబంధనలు పూర్తిగా ఎత్తివేసిన తరువాత అమెరికాకు పంపిస్తామని తండ్రి విజయ్‌పాల్‌ తెలిపారు. అక్కడ ఇంటర్‌ వరకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది. ఇంతటి అరుదైన అవకాశాన్ని సాధించిన అనిక్‌పాల్‌ను చూసి తల్లిదండ్రులు, వరంగల్ వాసులు మురిసిపోతున్నారు.

శభాష్‌ రమ్య..నీ ప్రాజెక్ట్ సూప‌ర్‌..!

Published date : 20 Dec 2021 03:30PM

Photo Stories