CUET: ఆ ఐదు యూనివర్సిటీలు హాట్ ఫేవరెట్... సీయూఈటీకి పెరుగుతున్న క్రేజ్
దేశవ్యాప్తంగా ఒకే పరీక్షతో ప్రవేశాలు కల్పించాలన్న లక్ష్యంతో గతేడాది అంటే 2022లో మొదటిసారిగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ-యూజీ)ను నిర్వహించారు. గతేడాది 10 లక్షలమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే.. ఈ ఏడాదికి ఆ సంఖ్య 16.85 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎంట్రన్స్ టెస్ట్ ఏర్పాటుచేసిన మొదటి ఏడాది 59 దేశాలకు చెందిన విద్యార్థులు ఈ పరీక్ష దరఖాస్తు చేసుకుంటే.. ఈ ఏడాది 74 దేశాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ ఎం జగదీశ్ కుమార్ తెలిపారు.
చదవండి: ముందుగా ఆసీనులయ్యేది సీఎం కేసీఆర్... 30న టీఎస్ సచివాలయం ప్రారంభం
90 నుంచి 242కు పెరిగిన సంఖ్య!
సీయూఈటీ ద్వారా గతేడాది కేవలం 90 యూనివర్సిటీల్లోనే ప్రవేశాలు కల్పించారు. అయితే అది ఈ ఏడాదికి 242కు పెరిగింది. ఢిల్లీ విశ్వ విద్యాలయం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అలహాబాద్ విశ్వవిద్యాలయం, బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీల్లో ప్రవేశాలకు విపరీతమైన పోటీ నెలకొంది. ప్రవేశ పరీక్షలో టాప్ ర్యాంకు సాధించిన విద్యార్థులు ఈ ఐదు యూనివర్సిటీల్లోనే సీటును కోరుకుంటున్నారు.
చదవండి: 2023-24 సంక్షేమ పథకాల క్యాలెండర్ ఇదే.. ఏఏ పథకం ఏ నెలలో అంటే..?
ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులు
మే 21 నుంచి 31వ తేదీ వరకు సీయూఈటీ యూజీ పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్టు 1వ తేదీ నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. బీఏ, బీకాం, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ బీబీఏ ఎల్ఎల్బీ, బీవోసీ, బీ డెస్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇంటిగ్రేటెడ్ B.Sc.-M.Sc లేదా ఇంటిగ్రేటెడ్ బీఏ-ఎంఏ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీ-యూజీ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటారు. డిప్లమా పూర్తి చేసిన వారు బీటెక్ లో చేరేందుకు కూడా సీయూఈటీ స్కోరునే విశ్వవిద్యాలయాలు పరిగణలోకి తీసుకుంటున్నాయి.
చదవండి: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించిన కమిషన్ ఏదీ?
జమ్ముకశ్మీర్ నుంచి పెరుగుతున్న అభ్యర్థులు!
సీయూఈటీ-యూజీ 2023కు అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే మొదటి మూడు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బిహార్ ఉన్నాయి. అలాగే కల్లోలితప్రాంతమైన జమ్ముకశ్మీర్ నుంచి అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2022లో ఈ ప్రాంతం నుంచి 13,021 మంది పరీక్ష రాయగా, 2023లో ఈ సంఖ్య 82,655కు పెరిగింది.
కేరళ టాప్....!
దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడుల్లో కేరళ నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. 2022లో కేరళ నుంచి 37,303 మంది విద్యార్థులు సీయూఈటీ-యూజీకి దరఖాస్తు చేసుకోగా, 2023లో ఈ సంఖ్య 56,111కు చేరింది.