Skip to main content

10th Class & Inter Exams: టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఎన్టీఆర్‌ జిల్లా: జిల్లాలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు తెలిపారు.
Arrangements for 10th Class and Inter Exams

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌, కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌, ఇంటర్మీడియెట్‌ విద్య కమిషనర్‌ సౌరభ్‌ గౌర్‌ తదితరులతో కలిసి గురువారం అమరావతి నుంచి పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు తదితరాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్‌ అధికారులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. పబ్లిక్‌ పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి కలెక్టరేట్‌ వీసీ హాల్‌ నుంచి కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు పలువురు అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మార్చి ఒకటి నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌, మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇంటర్‌కు సంబంధించి మొదటి సంవత్సరం 40,082 మంది, ద్వితీయ సంవత్సరం 35,494 మంది చొప్పున మొత్తం 75,576 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వివరించారు.

చదవండి: AP 10th Class Study Material

పదో తరగతి పరీక్షలకు 33,007 మంది హాజరుకానున్నారని వివరించారు. ప్రశ్నపత్రాల తరలింపు, బందోబస్తు ఏర్పాటు, భద్రతా చర్యలు, సీసీ కెమెరాల నిఘా, సిట్టింగ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, వైద్య శిబిరాల ఏర్పాటు తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు వెల్లడించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుందని, హాల్‌ టికెట్‌తో ఉచితంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లు కలెక్టర్‌ ఢిల్లీరావు తెలి పారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాధికారి (డీఐఈఓ) సి.ఎస్‌.ఎస్‌.ఎన్‌.రెడ్డి, డీఎస్‌ఈఓ యు.వి. సుబ్బారావు, ఏడీ కె.ఎన్‌.వి.కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: AP Inter 1st Year Study Material

Published date : 23 Feb 2024 03:51PM

Photo Stories