Skip to main content

APOSS Admission 2023: జూలై 26 నుండి ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం

AP Open School SSC & Intermediate Admissions 2023-24
  • ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి గారు
  • ‘ఏపీఓఎస్ఎస్ - జ్ఞానధార’ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం  ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ జూలై 26 నుండి అక్టోబర్ 5 వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, ఈ విద్యా సంవత్సరం నుండి  అభ్యాసకులకు (విద్యార్థులకు) పాఠ్యపుస్తకాలు, మార్కుల మెమోలు, పాస్ సర్టిఫికేట్లు నేరుగా వారి చిరునామాకే పంపుతామని ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి గారు అన్నారు.  
​​​​​​​
గురువారం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం రాష్ట్ర ప్రధాన కార్యాలయం (గుంటూరు)లో  2023- 24 విద్యా సంవత్సరం ప్రారంభ సందర్భంగా అన్ని జిల్లాల అసిస్టెంట్ కమిషనర్స్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్, రాష్ట్ర కార్యాలయ సిబ్బందితో జరిగిన సమావేశానికి ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి గారు అధ్యక్షత వహించారు. 

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ, ఎన్ రోల్ మెంట్ డ్రైవ్, అధ్యయన కేంద్రాలకు ఉండాల్సిన అర్హతలు, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల ఏర్పాటు తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు.  


బడి బయట పిల్లలపై దృష్టి సారించండి
ఈనెల అడ్మిషన్ డ్రైవ్ లో భాగంగా ప్రధానంగా బడి బయట పిల్లలపై దృష్టి సారించి,  సమగ్ర శిక్షాతో పాటు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని, ప్రిన్సిపాళ్లు, హెచ్ఎంలు, మండల విద్యాశాఖాధికారులు, గ్రామ - వార్డు సచివాలయ సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో వారందరినీ అడ్మిషన్ పొందేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో అడ్మిషన్ అప్లికేషన్ నింపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, అధ్యయన కేంద్రాల్లో రిజిస్టర్ల నిర్వహణ వంటి అంశాలను వివరించారు.  ఎన్రోల్మెంట్ షెడ్యూల్ ప్రణాళిక బద్ధంగా అమలు చేయాలని కోరారు
.
‘ఏపీఓఎస్ఎస్ - జ్ఞానధార’ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ‘ఏపీఓఎస్ఎస్ – జ్ఞానధార’ ప్రత్యేక యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించారు.  ఇందులో పదో తరగతి,  ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉపయోగకరమైన పాఠ్యాంశ వీడియోలను పొందుపరుస్తామని అన్నారు.

Published date : 20 Jul 2023 06:50PM

Photo Stories