Government School: సెమిస్టర్–2 పుస్తకాలు వచ్చేశాయి!
నంద్యాల(న్యూటౌన్): ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా జగన్ సర్కారు విప్లవాత్మక మార్పులు చేపడుతోంది. అందులో భాగంగా పాఠశాలలు పునఃప్రారంభమైన రోజే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు (పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు, బ్యాగ్, షూస్, టై, బెల్ట్) అందజేసింది. విద్యార్థులకు బ్యాగ్ భారం తగ్గించేందుకు గత ఏడాది 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మూడు సెమిస్టర్లు అమలు చేసి, ఆ మేరకు విడతల వారీగా పుస్తకాలను పంపిణీ చేసింది. కాగా ఈ ఏడాది నుంచి రెండు సెమిస్టర్లకు కుదించి పాఠ్యపుస్తకాల సరఫరాకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే సెమిస్టర్–2కు సంబంధించిన పాఠ్యపుస్తకాలను దాదాపు 3 నెలల ముందే పాఠశాలలకు చేరుతున్నాయి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 9 తరగతి విద్యార్థులకు 12,05,227 పుస్తకాలు అవసరం కాగా రెండు రోజుల క్రితం నంద్యాలలోని ఎస్పీజీ పాఠశాల గోడౌన్‌కు పాఠ్యపుస్తకాలు చేరాయి. ఇక్కడి నుంచి అమెజాన్, ఆర్టీసీ కార్గో ద్వారా మండల కేంద్రాలకు శుక్రవారం తరలించారు. 29 మండలాల పరిధిలో ఎంపిక చేసిన 1409 స్కూళ్లకు పుస్తకాలను తరలించేందుకు జిల్లా అధికారులు రూట్ మ్యాప్ రూపొందించారు. ఇందు కోసం రెవెన్యూ అధికారులు ఎండీయూ వాహనాలను ఏర్పాటు చేశారు. పాఠ్యపుస్తకాలను స్కూల్ పాయింట్‌కు చేరగానే హెచ్‌ఎంల ద్వారా విద్యార్థులకు అందజేయనున్నారు.
Digital Classes: డిజిటల్ బడులు.. దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో
సమన్వయంతో పంపిణీ చేయండి
సెమిస్టర్–2 పాఠ్యపుస్తకాలు నంద్యాలలోని గోడౌన్ నుంచి అన్ని మండలాలకు తరలించాం. అక్కడి నుంచి పాఠశాలలకు ఎండీయూ వాహనాల ద్వారా స్కూల్ పాయింట్లకు చేరవేస్తారు. ఎంఈఓలు, హెచ్‌ఎంలు సమన్వయం చేసుకొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయాలి. విద్యార్థులు పుస్తకాలను జాగ్రత్తగా భద్రపరుచుకుని సద్వినియోగం చేసుకోవాలి.
– సుధాకర్‌రెడ్డి, డీఈఓ, నంద్యాల