Admissions in Earth Science Course: ఎర్త్ సైన్స్ కోర్సులో అడ్మిషన్లు
వైవీయూ : యోగి వేమన విశ్వవిద్యాలయం పోస్టు గ్రాడ్యుయేషన్ కళాశాలలో ఎంఎస్సీ ఎర్త్ సైన్స్ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అప్‌లైడ్ జియాలజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య కంకణాల గంగయ్య తెలిపారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. కోర్సు పూర్తిచేసిన వారికి కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోగా అర్హత పత్రాలతో నేరుగా వైవీయూ ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. వివరాలకు 89855 97928 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.
మెరిట్ జాబితా విడుదల
కడప రూరల్ : కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్‌ల నియామకాలకు సంబంధించి అభ్యర్థుల తుది ఫైనల్ మెరిట్ జాబితా పూర్తి చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. స్టాఫ్ నర్స్ నియామకాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 1278 మందితో ఫైనల్ జాబితా సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. వివరాలు కడప.ఎన్‌ఐసీ.ఐఎన్ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు చూసుకోవచ్చునన్నారు. జాబితాను కార్యాలయంలోని నోటీస్ బోర్డులోనూ పొందుపరిచామని పేర్కొన్నారు.
బాధ్యతల స్వీకరణ
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జిల్లా ఏపీఎస్‌బీసీఎల్(ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్) డిపో మేనేజర్‌గా కేపీ.గోపాల్ మంగళవారం డిపో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన శ్రీకాకుళం జిల్లాలో ఎస్‌ఈబీ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న ఈయన కడప జిల్లా డిపో మేనేజర్‌గా నియిమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ డిపో అభివృద్ధికి కృషి చేస్తూ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సిబ్బంది పనితీరును మెరుగుపరుస్తామన్నారు.
పదోన్నతులకు పచ్చజెండా
వైవీయూ : యోగి వేమన విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల పదోన్నతుల ప్రక్రియకు పచ్చ జెండా ఊపారు. కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీం(సీఏఎస్)లో భాగంగా పదోన్నతులు నిర్వహించేందుకు రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకట సుబ్బయ్య మంగళవారం నోటిఫికేషన్ జారీచేశారు. విశ్వ విద్యాలయంలో ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లకు ఫ్రొఫసర్లుగా, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అధ్యాపకులు తదుపరి గ్రేడ్/పదోన్నతి పొందేందుకు అర్హులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వైవీయూ.ఈడీయూ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం ధ్రువీకరణ పత్రాలను నవంబర్ 30వ తేదీలోపు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.