Adjustment of Teachers: ఆగస్టు వివరాల ఆధారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు
ఒంగోలు: మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించి జూన్ నెల విద్యార్థుల నమోదు ఆధారంగా కాకుండా ఆగస్టు నెల విద్యార్థుల నమోదు అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని డీఈవోను జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఆదేశించారు. స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన స్థాయీ సంఘాల సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఇటీవలే బదిలీలు కూడా జరిగినందున విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నాగులుప్పలపాడు జెడ్పీటీసీ డాక్టర్ యాదాల రత్నభారతి మాట్లాడుతూ నాగులుప్పలపాడు మండలంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. ఈదుమూడి పాఠశాలలో కిచెన్ ఏర్పాటు, ఉప్పుగుండూరు జెడ్పీ హైస్కూల్లో ఆటస్థలం అభివృద్ధి, మద్దిరాలపాడు జెడ్పీ హైస్కూల్లో మెట్ల రెయిలింగ్ వంటి సమస్యలను ప్రస్తావించారు. త్వరితగతిన పనులు పూర్తిచేస్తామని డీఈవో హామీ ఇచ్చారు. సాంఘిక సంక్షేమశాఖ అధికారులు కనీసం ప్రొటోకాల్ కూడా పాటించడం లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ వివరణ ఇస్తూ.. మరోమారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు. ఇళ్లకు రాయితీ మంజూరులో పొరపాట్లు జరిగాయని, ఒకరికి బదులు మరొకరికి వచ్చాయని, వాటిని సరిచేయాలని త్రిపురాంతకం జెడ్పీటీసీ తెలిపారు. కనిగిరి జెడ్పీటీసీ మాట్లాడుతూ సొంత స్థలం ఉన్న వారు ఇళ్లు కట్టుకునేందుకు రాయితీ మంజూరు చేయాలని కోరగా, ప్రస్తుతం ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ పరిధిలో కనిగిరి లేదని, ముందు జగనన్న ఇళ్లు కట్టుకునే వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. చీమకుర్తి జెడ్పీటీసీ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని కోరారు. రైతులకు గ్రూప్‌గా ఇస్తున్న ట్రాక్టర్ల వినియోగంలో నిర్వహణ సరిగా ఉండటం లేదని, వాటిని పట్టించుకోవాలని పలువురు జెడ్పీటీసీలు కోరారు. అదే విధంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాలలో దొంగ మస్టర్ల గురించి ఫిర్యాదుచేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ శీనారెడ్డి తెలిపారు. తిమ్మసముద్రం, నాగులుప్పలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈసీజీ కొరత ఉందని, గుండెపోటు మరణాలు తగ్గించాలంటే గోల్డెన్ అవర్‌లో అందించాల్సిన చికిత్సను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా అందించేందుకు ప్రకాశం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా నాగులుప్పలపాడు, తిమ్మసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎంపికను పరిశీలించాలని కోరారు. దీనిపై జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామన్నారు. స్థాయీ సంఘాల సమావేశాలను జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, 3వ స్థాయీ సంఘ అధ్యక్షురాలు యన్నాబత్తిన అరుణ, 5వ స్థాయీ సంఘ కమిటీ అధ్యక్షురాలు మారెడ్డి అరుణ, 6వ కమిటీ అధ్యక్షురాలు చుండి సుజ్ఞానమ్మతో పాటు జెడ్పీ సీఈవో జాలిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయండి జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
చదవండి: DSC Notification 2023: 6,612 పోస్టుల భర్తీ.. భర్తీ చేసే పోస్టులు ఇవీ..