Sakshi education logo

Advertisement

ఫీజుల జీవో నిలిపివేత

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో బీఈ, బీటెక్, ఎంటెక్, ఫార్మా-డీ, ఎంబీఏ తదితర కోర్సులకు సంబంధించి 2018-19 విద్యా సంవత్సరానికి నిర్ణయించిన ఫీజులే 2019-20 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగుతాయని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో-38 అమలును హైకోర్టు నిలుపుదల చేసింది.
Edu newsఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి తదితరులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు జూలై 31న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 23న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో-38ని సవాల్ చేస్తూ మదనపల్లి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్, మరికొన్ని కాలేజీలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ గంగారావు విచారణ జరిపారు. ఫీజు నిర్ణయించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదని సీనియర్ న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. ఆయా కాలేజీలు సమర్పించే ఆదాయ, వ్యయాలను పరిశీలించి ఫీజులను నిర్ణయించేందుకు ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ) ఉందని, ఈ కమిటీ నిర్ణయించిన ఫీజులను నోటిఫై చేయడం వరకే ప్రభుత్వ బాధ్యతని, అంతకుమించి ప్రభుత్వానికి ఏ రకమైన అధికారం లేదని వివరించారు. ఎఫ్‌ఆర్‌సీ ఫీజులను నిర్ణయించి ప్రభుత్వానికి పంపిందని, ప్రభుత్వం ఇప్పటివరకు నోటిఫై చేయలేదని తెలిపారు.

గాడిలో పెట్టేందుకే కొత్త చట్టం :
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, రాష్ట్రంలో ఉన్నత విద్యారంగాన్ని గాడిలో పెట్టాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. జీవో-38ని తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే జారీ చేసినట్టు తెలిపారు. ఉన్నత విద్యకు సంబంధించి కొత్త చట్టం తీసుకొచ్చారని, ఎఫ్‌ఆర్‌సీ స్థానంలో మరో కమిటీ ఫీజులను నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ చట్టాన్ని నోటిఫై చేయాల్సి ఉందని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఫీజులు నిర్ణయించే విషయంలో ప్రభుత్వానికి అధికారం లేదన్న సీనియర్ న్యాయవాదుల వాదనతో ఏకీభవిస్తూ, జీవో-38 అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
Published on 8/1/2019 2:51:00 PM

సంబంధిత అంశాలు