Skip to main content

National Entrance Screening Test: NEST 2024తో ప్రయోజనాలు, పరీక్ష విధానం.. ఈ టెస్ట్‌లో బెస్ట్‌ స్కోర్‌కు మార్గాలు..

సైన్స్‌ సబ్జెక్ట్‌లతో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేశారా! సైన్స్‌ రంగంలో కెరీర్‌ కోరుకుంటున్నారా!! అందుకు చక్కటి మార్గం.. నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌(నెస్ట్‌). దేశంలో సైన్స్‌ విద్య, పరిశోధనలో ప్రత్యేక గుర్తింపు పొందిన నైసర్‌తోపాటు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలో నెస్ట్‌ స్కోర్‌తో ప్రవేశం పొందొచ్చు. ఆ తర్వాత పీహెచ్‌డీ దిశగా అడుగులు వేయొచ్చు! తాజాగా.. నెస్ట్‌–2024కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. నెస్ట్‌–2024తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, ఈ టెస్ట్‌లో బెస్ట్‌ స్కోర్‌కు మార్గాలపై ప్రత్యేక కథనం..
Preparation books for NEST-2024   Online NEST-2024 Mock Test  NEST 2024 benefits and Exam Pattern and Ways to Score Best  NEST-2024
  • నైసర్, సీఈబీఎస్‌లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ
  • నెస్ట్‌ స్కోర్‌ ఆధారంగా ప్రవేశం ఖరారు
  • ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే దరఖాస్తుకు అవకాశం

సాధారణంగా ఎమ్మెస్సీలో చేరాలంటే.. బీఎస్సీ పూర్తి చేయాలి. నెస్ట్‌ ద్వారా ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలో చేరే అవకాశం ఉంది. అది కూడా దేశంలో సైన్స్‌ ఎడ్యుకేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (భువనేశ్వర్‌), అదే విధంగా భారత అణుశక్తి విభాగం నేతృత్వంలో ముంబై యూనివర్సిటీలో ప్రత్యేకంగా నెలకొల్పిన సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌(సీఈబీఎస్‌)లలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలో అడుగు పెట్టొచ్చు.

మొత్తం 257 సీట్లు
నైసర్‌–భువనేశ్వర్‌లో 200 సీట్లు; సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ (యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై)లో 57 సీట్లు ఉన్నాయి. నైసర్‌లో ఒక మేజర్‌ సబ్జెక్ట్‌తోపాటు బయలాజికల్‌ సైన్సెస్, కెమికల్‌ సైన్సెస్, మ్యాథమెటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్‌ సబ్జెక్ట్‌లలో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సును అందిస్తున్నారు. విద్యార్థులు వీటిలో తమకు ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌తోపాటు బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్, మ్యాథమెటిక్స్, లేదా ఫిజిక్స్‌లను మైనర్‌ సబ్జెక్ట్‌గా ఎంచుకునే అవకాశం ఉంది. అణుశక్తి శాఖ నేతృత్వంలోని సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌లో.. బయలాజికల్‌ సైన్సెస్, కెమికల్‌ సైన్సెస్, మ్యాథమెటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్‌ సబ్జెక్ట్‌లలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సు అందుబాటులో ఉంది.

చదవండి: AP/TS ICET 2024 Notification: ఎంబీఏ, ఎంసీఏకు మార్గం.. ఐసెట్‌

అర్హతలు
సైన్స్‌ గ్రూప్‌లతో 2022, 2023లో 60 శాతం మార్కులతో 10+2/ఇంటర్మీడియెట్‌ ఉతీర్ణత ఉండాలి. 2024లో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసుకోనున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు 60 ఇంటర్‌లో శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది.

ప్రవేశ ప్రక్రియ
నెస్ట్‌ స్కోర్‌ ఆధారంగా విద్యార్థులు రెండు ఇన్‌స్టిట్యూట్‌లకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులు, అభ్యర్థులు పొందిన నెస్ట్‌ ర్యాంకు, రిజర్వేషన్‌ నిబంధనలను పరిగణనలోకి తీసుకొని అడ్మిషన్‌ ఖరారు చేస్తారు. కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత నైసర్‌లో సీటు పొందిన విద్యార్థులకు హోమిబాబా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్, సీఈబీఎస్‌లో చేరిన విద్యార్థులకు యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై నుంచి సర్టిఫికెట్లు అందిస్తారు.

స్కాలర్‌షిప్‌ సదుపాయం
నెస్ట్‌ స్కోర్‌ ఆధారంగా నైసర్, సీఈబీఎస్‌లలో ప్రవేశం ఖరారు చేసుకున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ పేరిట ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ అమలు చేస్తున్న దిశ ప్రోగామ్‌ ద్వారా.. ఏటా రూ.60 వేల స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. దీంతోపాటు సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ చేసేందుకు వీలుగా ప్రతి ఏటా రూ.20 వేల గ్రాంట్‌ కూడా అందిస్తారు.

రీసెర్చ్‌కు కేరాఫ్‌
ఈ ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సు వ్యవధి ఐదేళ్లు. పది సెమిస్టర్లుగా ఉంటుంది. విద్యార్థులు చివరి ఆరు సెమిస్టర్లలో సదరు క్యాంపస్‌ ఫ్యాకల్టీ సభ్యులు చేస్తున్న రీసెర్చ్‌లో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. దీని ఆధారంగానూ అభ్యర్థులకు మార్కులు, క్రెడిట్స్‌ కేటాయిస్తారు. ఫలితంగా విద్యార్థులకు పీజీ స్థాయిలోనే పరిశోధనలపై ఆసక్తి, అవగాహన కలుగుతాయి.

చదవండి: MAT Notification 2024: మేనేజ్‌మెంట్‌ పీజీకి.. మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌)

బార్క్‌లో పీహెచ్‌డీ
నెస్ట్‌ స్కోర్‌తో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలో చేరిన విద్యార్థులు భవిష్యత్‌లో ప్రతిష్టాత్మక పరిశోధన కేంద్రం బాబా అటామిక్‌ రీసెర్చ్‌(బార్క్‌) సెంటర్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లో నేరుగా పీహెచ్‌డీలో చేరే అవకాశం ఉంది. ఇందుకోసం అభ్యర్థులు ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలో నిర్దిష్ట మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ మార్కులను ప్రతి ఏటా బార్క్‌ నిర్దేశిస్తుంది. వీరికి ఇంటర్వ్యూ ద్వారా పీహెచ్‌డీలో అడ్మిషన్‌ కల్పిస్తారు.

పరీక్ష ఇలా
నెస్ట్‌ను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా నిర్వహిస్తారు. రెండు సెషన్లుగా పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఏదో ఒక సెషన్‌కు హాజరు కావచ్చు. పరీక్షను నాలుగు సెక్షన్లుగా 260 మార్కులకు నిర్వహిస్తున్నారు. బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగం/సబ్జెక్ట్‌ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు చొప్పున ప్రతి సెక్షన్‌ 60 మార్కులకు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. మొత్తం నాలుగు సెక్షన్లలో కలిపి 240 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెస్ట్‌లో ప్రతి సెక్షన్‌లోనూ అభ్యర్థులు కనీస అర్హత మార్కులు పొందాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎక్కువ మార్కులు పొందిన మూడు సెక్షన్లనే పరిగణనలోకి తీసుకుని 180 మార్కుల ప్రాతిపదికగా మూల్యాంకన చేస్తారు.

ఫైనల్‌ కటాఫ్‌ నిబంధన
నెస్ట్‌లో సెక్షన్‌ వారీ కటాఫ్‌తోపాటు.. మినిమమ్‌ అడ్మిషబుల్‌ పర్సంటైల్‌ పేరుతో ఓవరాల్‌ కటాఫ్‌ను కూడా నిర్దేశిస్తున్నారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 95 పర్సంటైల్, ఓబీసీ అభ్యర్థులు 90 పర్సంటైల్, ఎస్‌సీ, ఎస్టీ, దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులు 75 పర్సంటైల్‌ సాధించాల్సి ఉంటుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, మే 31
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: 2024, జూన్‌ 15
  • నెస్ట్‌ తేదీ: 20024, జూన్‌ 30
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.nestexam.in/

బెస్ట్‌ స్కోర్‌ సాధించాలంటే
నైసర్, సీఈబీఎస్‌లలో వ్రవేశానికి వీలుగా నెస్ట్‌లో విజయం సాధించాలంటే.. విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ స్థాయిలో తాము చదివిన అకడమిక్స్‌పై పట్టు సాధించాలి. ప్రధానంగా బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ విభాగాలకు సంబంధించి అడిగే ప్రశ్నలు.. విద్యార్థుల్లోని విశ్లేషణాత్మక దృక్పథం, సంగ్రహణ సామర్థ్యం, తులనాత్మక విశ్లేషణను గుర్తించేలా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి కాన్సెప్ట్‌లపై అవగాహనతోపాటు వాటిని వాస్తవ పరిస్థితుల్లో అన్వయించగలిగే నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఇందుకోసం చదువుతున్న అంశాలను ప్రాక్టీస్‌ చేయడం ఎంతో లాభిస్తుంది.

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతో మేలు
నెస్ట్‌ ఎంట్రన్స్‌.. విభాగాల వారీగా సిలబస్‌కు సంబంధించి గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే.. ప్రశ్నలు సీబీఎస్‌ఈ సిలబస్‌ ఆధారంగా అడుగుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి అభ్యర్థులు పది, పదకొండు, పన్నెండు తరగతుల సీబీఎస్‌ఈ పుస్తకాలను ఔపోసన పట్టడం మంచిది. ముఖ్యంగా కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి. 
ఇలా అకడమిక్‌ సబ్జెక్ట్‌ల కాన్సెప్ట్‌లతోపాటు అప్లికేషన్‌ దృక్పథంతో ప్రిపరేషన్‌ సాగిస్తే నెస్ట్‌లో విజయావకాశాలు మెరుగుపరచ్చుకోవచ్చు. జేఈఈ–మెయిన్, జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు.. అదే సన్నద్ధతతో నెస్ట్‌కు కూడా హాజరై ప్రతిభ చూపే అవకాశం ఉంది. గత ప్రశ్న పత్రాలను సాధన చేయడం ద్వారా పరీక్షలో అడుగుతున్న ప్రశ్నల తీరుపైనా అవగాహన లభిస్తుంది. 
 

Published date : 10 Apr 2024 01:14PM

Photo Stories