Skip to main content

వాతావరణ పీడనం- పీడన మేఖలలు

మన చుట్టూ ఉన్న గాలిలో చాలా వాయు పరమాణువులు ఉంటాయి. ఆ పరమాణువులు ఒకదానిపై ఒకటి ఒత్తిడిని కలిగిస్తాయి. లేదా వాటి దారిలోకి వచ్చిన వాటిపై ఒత్తిడి కలిగిస్తాయి.
ఏ వస్తువు పై అయినా చూపే ఒత్తిడి ప్రభావాన్ని ‘వాయు పీడనం’ అంటారు. గాలి పై నుంచే కాకుండా అన్ని వైపుల నుంచి పీడనాన్ని కలిగిస్తుంది. గాలికి బరువు ఉంటుంది అని కనుగొన్న మొదటి శాస్త్రవేత్త గెలీలియో.
  • వాయు పరమాణువులు వేడెక్కినప్పుడు వాటికి ఎక్కువ శక్తి లభించి వేగంగా కదులుతాయి. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కువ పరమాణువులు వాతావరణంలోని పైపొరలోకి వెళ్లినప్పుడు భూమికి దగ్గరగా వాటి సంఖ్య తగ్గుతుంది. అదేవిధంగా పీడనం తగ్గుతుంది.
  • గాలి వేడెక్కినప్పుడు పీడనం తగ్గి, గాలి చల్లబడినప్పుడు పీడనం పెరుగుతుంది. గాలి, పీడనం విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి.
  • వేడెక్కిన గాలి పైకి వెళుతున్న కొద్దీ భూమి ఉపరితలం నుంచి పొందిన శక్తిని వేడిమి రూపంలో కోల్పోవడం మొదలు పెడుతుంది. శక్తి తగ్గినప్పుడు పరమాణువుల వేగం తగ్గి, మందకొడిగా తయారై దగ్గర దగ్గరవుతాయి. గాలి చల్లబడి గట్టిగా అవుతుంది. ఇలా చిక్కబడిన గాలి భూమ్యాకర్షణ శక్తి వల్ల ఉపరితలం దగ్గరకు వస్తుంది. చల్లటి గాలి కిందికి దిగిన చోట వాయుపీడనం పెరుగుతుంది.
  • భూమిలో ఒక భాగం వేడెక్కి పీడనం తగ్గిందంటే.. అక్కడ తక్కువ పరమాణువులు, ఎక్కువ ఖాళీ ఉందని అర్థం. అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుంచి గాలి ఈ ఖాళీ ప్రదేశాల వైపు కదులుతుంది. అందువల్లే గాలి ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రాంతాలకు వీస్తుంది.
వాతావరణ పీడనం
ఏదైనా ఒక ప్రదేశంపై ఉన్న వాయువుల పొర బరువును ఆ ప్రదేశానికి సంబంధించిన ‘వాతావరణ పీడనం’ అంటారు. వాతావరణ పీడనాన్ని కొలిచే సాధనం భారమితి. కాబట్టి దీన్ని భారమితి పీడనం అంటారు. భారమితిలో పాదరస మట్టం అకస్మాత్తుగా తగ్గడం తుపాను రాకను తెలుపుతుంది. అదేవిధంగా భారమితిలో పాదరస మట్టం పెరగడం ప్రశాంత వాతావరణాన్ని తెలుపుతుంది.
సముద్రమట్టం వద్ద సామాన్య (లేదా) ప్రామాణిక వాతావరణ పీడనం ఉన్నప్పుడు పాదరస మట్టం ఎత్తు 760 మి.మీ. లేదా 29 అంగుళాలుగా ఉంటుంది. భారమితిలో పాదరస మట్టం 760 మి.మీ. ఉన్నప్పుడు వాతావరణ పీడనం 1013.2 మిల్లీబార్లుగా ఉంటుంది. పాదరస మట్టం ఎత్తు 3 మి.మీ. అయితే అది 4 మిల్లీబార్ల వాతావరణ పీడనానికి సమానం.

వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు:
ఎత్తు

భూమి ఆకర్షణ శక్తి వల్ల వాతావరణం కింది పొరలు దట్టంగా ఉండి అధిక పీడనం కలిగిస్తాయి. కాబట్టి భూ ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ పీడనం తగ్గుతుంది. ప్రతి 10 మీటర్ల ఎత్తుకు ఒక మిల్లీబారు చొప్పున (లేదా) 300 మీటర్లకు 34 మిల్లీబార్ల పీడనం తగ్గుతుంది.
ఉష్ణోగ్రత
వేడెక్కిన గాలి వ్యాకోచించి తేలికగా ఉంటుంది. చల్లటి గాలి సంకోచించి ఎక్కువ బరువుగా ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగితే పీడనం తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గితే పీడనం పెరుగుతుంది. ఉష్ణోగ్రత, పీడనం విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి.
నీటి ఆవిరి
పొడి గాలి కంటే నీటి ఆవిరి తేలికగా ఉంటుంది. కాబట్టి వాతావరణంలో నీటి ఆవిరి పరిమాణం ఎక్కువైతే పీడనం తగ్గుతుంది.

పీడన మేఖలలు
క్షితిజ సమాంతరంగా భూమి ఉపరితలంపై వివిధ పీడన మేఖలలు ఏర్పడ్డాయి. అధిక, అల్పపీడన మేఖలలు ఒకదాని తర్వాత ఒకటిగా ఏర్పడ్డాయి. భూగోళంపై మొత్తం 7 పీడన మేఖలలు ఉన్నాయి.

భూమధ్యరేఖ అల్పపీడన మేఖల
ఇది 10° ఉత్తర అక్షాంశం నుంచి 10° దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఇది అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏర్పడింది. దీన్ని నిర్వాత మండలం, డోల్‌డ్రమ్, ప్రశాంత మండలం అని కూడా అంటారు. ఈ మేఖలలో సూర్యకిరణాలు నిట్టనిలువుగా ప్రసరించడం వల్ల రోజూ సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ఈ విధమైన వర్షపాతాన్ని ‘సంవహన వర్షపాతం’ అంటారు.

ఉప ఆయనరేఖ అధిక పీడన మేఖల
ఇది 23½° ఉత్తరార్ధగోళం నుంచి 35° దక్షిణార్ధ గోళంలో విస్తరించి ఉంది. భూమధ్యరేఖ నుంచి పైకి తేలి వచ్చే వాయువులు సంకోచించి ఇది ఏర్పడుతుంది. ఈ మండలాన్ని ‘నిమజ్జిత మండలం’ అంటారు.
ఉప ధ్రువ అల్ప పీడన మేఖల (లేదా) సమశీతోష్ణ అల్పపీడన మేఖల
ఈ మేఖలలు 45° - 66½° అక్షాంశాల మధ్య, పశ్చిమ పవనాలు, ధ్రువ పవనాలు మధ్య భాగంలో ఏర్పడతాయి. ఉప ఆయనరేఖ అధిక పీడన మేఖల నుంచి వచ్చే వేడి గాలులు ధ్రువ అధిక పీడన మేఖల నుంచి వీచే చల్ల గాలులు అవిసరణం చెందడం వల్ల అల్పపీడన మేఖల ఏర్పడుతుంది.

ధ్రువ అధిక పీడన మేఖల
ఇది 75° నుంచి 90° అక్షాంశాల మధ్య, అతిశీతల ప్రాంతం, అధిక గురుత్వాకర్షణ బలాలు పనిచేయడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో అధిక పీడన మేఖలలు ఏర్పడతాయి. ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు ఏటవాలుగా ప్రసరించడం వల్ల అధిక పీడనాలు ఏర్పడతాయి.

పీడన ప్రవణత
ఒక ప్రమాణ వైశాల్యం ఉన్న భూభాగంపై పీడనంలో కలిగే మార్పు రేటును ‘పీడన ప్రవణత’ అంటారు.

ముఖ్యాంశాలు
  • సూర్య గమనాన్ని బట్టి అల్ప, అధిక పీడన మేఖలలు ఉత్తరం వైపు, దక్షిణం వైపు జరుగుతూ ఉంటాయి.
  • భూగోళంపై ఇప్పటి వరకు నమోదైన అధిక వాతావరణ పీడనం 1083.3 మిల్లీ బార్లు. 1963 డిసెంబర్ 31న సైబీరియాలోని అగాటా వద్ద దీన్ని గుర్తించారు.
  • 1979 అక్టోబర్ 12న మెరియానా ద్వీపాల్లో ‘టిప్’ అనే చక్రవాతంలో గుర్తించిన అత్యల్ప వాతావరణ పీడనం 870 మిల్లీబార్లు.
  • ప్రపంచపటంలో సమానమైన పీడనం ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను ‘సమభార రేఖలు’ అంటారు. ఇవి వేసవిలో భూభాగంపై ఉత్తర దిశకు, సముద్రంపై దక్షిణం వైపు వంగి ఉంటాయి.
  • శీతాకాలంలో సమభార రేఖలు భూమి మీద దక్షిణం వైపు సముద్రం మీద ఉత్తరం వైపు వంగి ఉంటాయి.
Published date : 03 Nov 2015 05:39PM

Photo Stories