Skip to main content

తెలంగాణలో ముఖ్యమైన సంస్థానాలు

స్వాతంత్య్రం రాక ముందు భారతదేశంలో 562 సంస్థానాలు ఉండేవి. తెలంగాణ ప్రాంతంలోనూ అనేక సంస్థానాలున్నాయి. కాకతీయులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల కాలంలో ఇవి ఆవిర్భవించాయి. వీటిలో ఆత్మకూరు, బోరవెల్లి, సీర్నవెల్లి, దుబ్బాక, దొంతి, దోమకొండ, గద్వాల, జటప్రోలు, పాల్వంచ, పాపన్నపేట, నారాయణపురం సంస్థానాలు ప్రధానమైనవి. సైనిక చర్య అనంతరం నిజాం రాష్ర్టంతో పాటు ఇవి భారత దేశంలో విలీనమయ్యాయి.
తెలంగాణ సంస్కృతి నిర్మాణంలో, సాహిత్య వికాసంలో సంస్థానాల పాత్ర మరువలేనిది. ఆంధ్ర ప్రాంతంలో నాయక రాజులు పోషించిన పాత్రను తెలంగాణలో సంస్థానాలు పోషించాయి.
 
ఆత్మకూరు సంస్థానం
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఆత్మకూరు సంస్థానం వైశాల్యం 190 చ.కి.మీ. దీని తొలి రాజధాని తివుడంపల్లి. వర్ధమానపురం పాలకుడైన గోనబుద్ధారెడ్డి తిరుపతి వెళ్లినప్పుడు చంద్రగిరికి చెందిన గోపాలరెడ్డి అతడికి సకల సౌకర్యాలు కల్పించాడు. గోపాలరెడ్డి ఆతిథ్యానికి ముగ్ధుడైన బుద్ధారెడ్డి అతణ్ని మగతలనాడు గౌడ పదవిలో నియమించాడు. ఇతణ్నే ఈ సంస్థాన స్థాపకుడిగా చెప్పవచ్చు. ఇతడి చిన్న కుమారుడు చినగోపిరెడ్డి యుద్ధాల్లో బహమనీ సుల్తాన్లకు సహకరించాడు. ఇందుకు ప్రతిఫలంగా ముజఫర్ పరగణాలో నాడగౌడ, సర్‌నాడ గౌడ, దేశ్‌ముఖ్, దేశ్‌పాండ్య, దేశాయిగిరి పదవులను పొందాడు.
చినగోపిరెడ్డి మనవడు రెండో గోపిరెడ్డి. ఇతడు అబ్దుల్లా కుతుబ్‌షా సమకాలీనుడు. రెండో గోపిరెడ్డి కుతుబ్‌షా దగ్గర నుంచి అల్లిపురం జాగీర్‌ను పొందాడు. గోపిరెడ్డి సోదరుడు సాహెబ్‌రెడ్డి. కడేచూరు, మగతల సీమలను పాలించేందుకు సాహెబ్‌రెడ్డికి కుతుబ్‌షా అనుమతిచ్చాడు. గోపిరెడ్డి తర్వాత సర్వారెడ్డి ఈ సంస్థానాన్ని పాలించాడు. సర్వారెడ్డి మనవడు రెండో సర్వారెడ్డి. ఇతడు యుద్ధాల్లో ఔరంగజేబుకు సహకరించి దుప్పల్లి జాగీర్‌ను పొందాడు. ఇతడి కుమారుడైన మొదటి తిమ్మారెడ్డి తర్వాతి కాలంలో రాజ్యాన్ని పాలించాడు. తిమ్మారెడ్డి మనవడు రెండో సాహెబ్‌రెడ్డి. ఇతడు కర్ణాటక దండయాత్రల్లో అసఫ్‌జాహీలకు సహకరించి ‘సవైరాజా’ బిరుదును పొందాడు. ఈ వంశంలో రెండో సాహెబ్‌రెడ్డి తర్వాత ఏడో తరానికి చెందినవాడు పెద వెంకటరెడ్డి. ఇతడు నిజాం రాజైన సికిందర్‌జాకు యుద్ధాల్లో సహకరించాడు. ప్రతిఫలంగా అమరచింత, వడ్డెమాను పరగణాల పట్టా పొందాడు. ఇతడు రాజధానిని తివుడంపల్లి నుంచి ఆత్మకూరుకు మార్చాడు. పెద వెంకటరెడ్డి తర్వాత అతడి కుమారుడు బాలకృష్ణారెడ్డి, మనవడు సోమభూపాలరావు సంస్థానాన్ని పరిపాలించారు. సోమభూపాలరావు అమరచింత, వడ్డెమాను పరగణాలను శాశ్వతంగా బిల్‌మఖ్తాగా పొందాడు. సోమభూపాలుడి కుమారుడు రాజా సీతారామభూపాలరావు. ఇతడి కుమారుడైన సవైరాజా రామభూపాలరావు బల్వంత్ బహద్దూర్ సంస్థానాన్ని పరిపాలించాడు. ఇతడు ప్రజలకు ఉపయోగపడే అనేక నిర్మాణాలను చేపట్టాడు. ఇతడి మరణానంతరం భార్య భాగ్యలక్ష్మమ్మ నిజాం నుంచి పరిపాలనా అనుమతి పొందింది. ఈమె కాలంలోనే ఈ సంస్థానం హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమైంది.
 
నారాయణపురం, రాజాపేట
ఇవి నల్లగొండ జిల్లాకు చెందిన చిన్న సంస్థానాలు వీటికి సొంత అధికారాలు ఉండేవి కావు. నిజాం ఉల్‌ముల్క్ కాలంలో నల్లగొండ జిల్లా గట్టుప్పల్ ప్రాంతంలో ఒక గజదొంగ దురాగతాలకు పాల్పడేవాడు. మంచల్‌రెడ్డి అనే వ్యక్తి ఆ దొంగను చంపి, నారాయణపురం ప్రాంతాన్ని ఇనామ్‌గా పొందాడు. ఇతడి సోదరుడు సోమిరెడ్డి నారాయణపురం పటేల్‌గా నియమితుడయ్యాడు. తర్వాత మంచల్‌రెడ్డి కుమారుడైన రాయన్‌రెడ్డి పాలకుడయ్యాడు. నిజాంను ధిక్కరించిన ఒక సామంతరాజును ఇతడు బంధించి తెచ్చాడు. ఈ చర్యకు మెచ్చిన నిజాం ఇతడికి సర్‌మన్నెవార్, సర్దేశ్‌ముఖ్, సర్దేశ్‌పాండే, సర్‌నాడగౌడ బిరుదులు ఇచ్చి గౌరవించాడు. తర్వాత ఇతడిని రాచకొండ, భువనగిరి, అడవిమర్రి, షాద్‌నగర్, నర్సికొండ, ఇందుర్తి,  ఇంద్రియాల, ఇబ్రహీంపట్నం పరగణాల మీద అధికారం కల్పించాడు.
రాయన్‌రెడ్డి 1775లో రాజాపేట కోటను నిర్మించాడు. 1782లో ఇతడి కుమారుడు వెదిరె వెంకట నారాయణరావు పాలకుడయ్యాడు. ఇతడే నారాయణపురం సంస్థానాన్ని స్థాపించాడు. ఇతడి కుమారుడైన రాయన్న మీర్ లాయక్ అలీ, సాలార్జంగ్ లాంటి గొప్ప వారితో కలిసి చదువుకున్నాడు. ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. ఇతడికి ఆరుగురు భార్యలు. చివరి భార్య హుస్సేన్ బేగంకు మాత్రమే ఒక కూతురు జన్మించింది. ఆమె పేరు జహీరున్నీసా బేగం. ఆమే ఈ సంస్థాన చివరి పాలకురాలు. రాజాపేట సంస్థానం పరిధిలో కుర్రారం, నమిలె, మాసాయిపేట, కోరుకొండ, పెదపాడు, సాదువెల్లి, చల్లూరు, వెంకిర్యాల, రాజాపేట గ్రామాలుండేవి.
 
పాపన్నపేట సంస్థానం
పాపన్నపేట అతి ప్రాచీన సంస్థానం. ఇది ఒకప్పుడు అన్ని సంస్థానాల కంటే పెద్దది. మెదక్ జిల్లా మొత్తం ఈ సంస్థాన పరిధిలో ఉండేది. రాణి శంకరమ్మ పాలనా కాలం నుంచి సంస్థాన చరిత్ర తెలుస్తోందని బి.ఎన్.శాస్త్రి తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డి కూడా గోల్కొండ పత్రికలో ఈ సంస్థాన చరిత్రను రాశారు. అందులో రాణి శంకరమ్మ, సదాశివరెడ్డి గురించి మాత్రమే పేర్కొన్నారు. తర్వాతి కాలంలో కొన్ని గ్రంథాల ద్వారా ఈ సంస్థాన చరిత్ర కొంత వెలుగులోకి వచ్చింది.
 చిదిరె వంశీయులు ఈ సంస్థాన రాజపురోహితులు. ఈ వంశానికి చెందిన చిదిరె లక్ష్మణశాస్త్రి 1928-29లో సంస్థాన చరిత్రను రచించాడు. ఇందుకోసం రాణి లింగాయమ్మ రాసిన మా పూర్వ వంశావళి, రాజా వెంకట నరసింహారెడ్డి ఉర్దూలో రాసిన మా వంశ చరిత్ర, వెంకటాద్వరి రచించిన మా సంస్థాన చరిత్ర, లింగాయమ్మ చరిత్ర; తిరుమలాచార్యుల శౌర్యరాజ్య వంశావళి, ముదిగొండ రామకృష్ణ కవి శ్రీమజ్జోగినాథ చరిత్ర అనే గ్రంథాలను ఆధారంగా చేసుకున్నాడు. వీటితోపాటు తమ పూర్వీకులు చెప్పిన విషయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాడు. లక్ష్మణశాస్త్రి సంస్థాన చరిత్ర రాతప్రతిని సురవరం, బిరుదురాజు రామరాజుకు ఇచ్చాడు. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని తిరిగి పొందలేదు. దీంతో తన వద్దనున్న చిత్తుప్రతి ఆధారంగా  1979-80లో మెదక్ రాజుల చరిత్రను ముద్రించాడు. ముడుంగ రంగ కృష్ణమాచార్యులు 2006-07లో ‘ఆందోల్-జోగిపేట’, 2012లో ‘శౌర్యవీర్యరెడ్డి త్రయం’ అనే పుస్తకాలు రాశాడు.
ఆందోల్ రాజుల చరిత్ర, మెదక్ రాజుల చరిత్ర, రంగంపేట చరిత్ర అనే వివిధ పేర్లతో పాపన్నపేట సంస్థాన రాజుల చరిత్ర వ్యవహారంలో ఉంది. కాకతీయుల సేనానుల్లో అనంతరెడ్డి ఒకరు. కాకతీయ రాజ్య పతనం తర్వాత  ఇతడు సంగారెడ్డి సమీపంలోని కల్పగూరు వచ్చి స్థిరపడ్డాడు. ఇతడు నాటి పాలకులకు సాయం చేసి, వారి నుంచి కల్పగూరు పరగణాను పొందాడు. ఇతడే ఈ వంశ స్థాపకుడు. తర్వాత ఇతడి మనవడైన రామినేడు 1398లో పట్టాభిషిక్తుడయ్యాడని ఆందోల్ తహశీల్దార్ రాసిన మెదక్ చరిత్రలో ఉంది. రామినేడు ఆందోల్ కోటను నిర్మించాడు. 1418లో ఆందోల్‌ను రాజధానిగా చేసుకున్నాడు. కొండాపూర్, ఓంకారపురం, పొటన్ చెర్వు (పటాన్ చెరువు), తెలంగాణాపురం, రుద్రారం, మెతుకు, కాపాల, అతినగరం, డాకూరు మొదలైనవి ఇతడి సంస్థానంలో భాగంగా ఉండేవి. తర్వాత భువనగిరి, నిజాంపేట, చందంపేట, దేవరకొండ, నర్సాపూర్, దౌల్తాబాద్ తదితర ప్రాంతాలు కూడా ఇతడి సంస్థానంలో భాగమయ్యాయి.
రామినేడు తర్వాత ముసలారెడ్డి, పెద్దరెడ్డి, అల్లమయ్య చౌదరి, రామిరెడ్డి, మొదటి సదాశివరెడ్డి, పెద్దనరసింహారెడ్డి, లింగాయమ్మ, లింగారెడ్డి తదితరులు ఈ సంస్థానాన్ని పరిపాలించారు. రామదుర్గా వెంకట నరసింహారెడ్డి (1720-60) కాలంలో ఈ సంస్థాన పరిధి తగ్గి చిన్న సంస్థానంగా మారింది. శంకరమ్మ పరాక్రమం చూసిన నరసింహారెడ్డి ఆమెను వివాహమాడాడు. నరసింహారెడ్డి మరణం తర్వాత శంకరమ్మ సంస్థాన పాలన బాధ్యతలను చేపట్టాల్సింది. కానీ ఒక కుట్ర వల్ల రెండో లింగాయమ్మ రాణి అయింది. ఈమె 1760-64 వరకు సంస్థానాన్ని పాలించింది. మహారాష్ర్ట పీష్వాలు నిజాం రాజ్యంపై దండెత్తారు. కానీ శంకరమ్మ తన శక్తియుక్తులతో వారిని ఓడించింది.  దీంతో నిజాం ఆమెకు రాయ్‌భాగన్ (ఆడ సింహం లాంటి రాణి) అనే బిరుదునిచ్చి రాణిగా నియమించాడు. 1764లో అధికారంలోకి వచ్చిన శంకరమ్మ రాజ్యాన్ని పునర్ నిర్మించింది. తన తండ్రి పేరు మీద సంగారెడ్డిని, తల్లి పేరు మీద రాజంపేటను నిర్మించింది. తన పేరు మీద శంకరంపేటను, మీరెల్లి పాపన్న పేరు మీద పాపన్నపేటను  నిర్మించింది. ఈమె గొప్ప పరాక్రమవంతురాలు, పరిపాలనాదక్షురాలు. శంకరమ్మ పేరు మీద అనేక జానపదులు, వీరగాథలు ప్రచారంలో ఉన్నాయి. అందుకే చరిత్రకారులు ఈమెను రుద్రమదేవి, అహల్యాబాయితో పోల్చారు. వ్యవసాయాభివృద్ధికి శంకరమ్మ అనేక చెరువులు నిర్మించింది. ఈమె గొప్ప సంస్కరణశీలి. దళితుడైన నీరుడి పాపన్నను దళపతి చేసింది.
శంకరమ్మకు సంతానం లేదు. అందువల్ల పేద బాలుడైన సదాశివరెడ్డిని దత్తత తీసుకుంది. 1774లో ఈమె మరణించింది. దీంతో సదాశివరెడ్డి రాజ్యానికి వచ్చాడు. గద్వాల సంస్థానాధీశుడైన సోమనాథ భూపాలుడు ఇతడి ధైర్య సాహసాలకు ముగ్ధుడయ్యాడు. అందుకే ఇతడికి తన కుమార్తె అయిన పార్వతీదేవినిచ్చి వివాహం చేశాడు. సదాశివరెడ్డి కూడా మరాఠా పీష్వాలను ఓడించి నిజాం అలీఖాన్ (రెండో అసఫ్‌జా)కు సహాయం చేశాడు.  నిజాం అలీఖాన్ పెద్ద కుమారుడు అక్బర్ అలీ. ఇతడు తండ్రి మీద తిరుగుబాటు చేసి సదాశివరెడ్డి, గాలీబ్‌జంగ్ సహాయం కోరాడు. ఈ సందర్భంగా జరిగిన మూడు యుద్ధాల్లో సదాశివరెడ్డి గెలుపొందాడు. కానీ చివరి యుద్ధంలో ఓటమిపాలై హత్యకు గురయ్యాడు. తర్వాత ఇతడి భార్య పార్వతీదేవి అధికారంలోకి వచ్చింది. రాజా రామచంద్రారెడ్డి బహద్దూర్ ఈ సంస్థాన చివరి పాలకుడు. ఇతడి కాలంలోనే పాపన్నపేట సంస్థానం హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమైంది.
 
వనపర్తి సంస్థానం
తెలంగాణలోని పెద్ద సంస్థానాల్లో మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానం ఒకటి. ఈ సంస్థానం సాహిత్యంలో మేటి. దీని పరిధిలో 124 గ్రామాలుండేవి. నూగూరు రాజధానిగా పాలించారు కాబట్టి వీరిని నూగూరు సంస్థానాధీశులని పిలిచేవారు. వీరి పూర్వీకులు నంద్యాలకు చెందినవారు. ఈ సంస్థాన స్థాపకుడు జనుంపల్లి వీరకృష్ణారెడ్డి. ఈ వంశంలో నాలుగో తరం వాడు వేమడి వెంకటరెడ్డి(1625-53).  నెల్లూరు, ఉదయగిరి దుర్గాలను జయించడంలో అబ్దుల్లా కుతుబ్‌షాకు ఇతడు సహాయపడ్డాడు. ఈ వంశంలో అష్టభాషా గోపాలరావు ప్రసిద్ధుడు. ఇతడు రెండో వెంకటరెడ్డి కుమారుడు. ఈ వంశంలో బహారి బిరుదును పొందిన తొలి వ్యక్తి గోపాలరావు. ఇతడు 8 భాషల్లో ప్రసిద్ధుడు. ఇతడు రామచంద్రోదయం అనే కావ్యాన్ని, బాణం అనే సంస్కృత గ్రంథాన్ని రచించాడు. మిన్‌జానీబ్ సర్కారు తరఫున గోపాలరావు రెండేళ్లపాటు జటప్రోలు సంస్థానాన్ని పాలించాడు. ఇతడి దత్తపుత్రుడు మూడో వెంకటరెడ్డి. ఢిల్లీ సుల్తాన్ ఇతడికి సవై బిరుదును ఇచ్చాడు. వెంకటరెడ్డి తన తండ్రి పేరుమీద గోపాలపేట సంస్థానాన్ని స్థాపించాడు.
నూగూరు సంస్థానంలోని 12 గ్రామాలను అందులో చేర్చి, దానికి తన సోదరుడైన రంగారెడ్డిని పాలకుడిగా నియమించాడు. ఈ కాలంలో మొగలుల పరిస్థితి దిగజారింది. ఇదే అదనుగా వెంకటరెడ్డి పన్ను ఎగ్గొట్టాడు. దీంతో సుల్తాన్ సైన్యం ఇతడిపై దండెత్తింది. ఈ దాడిలో ఓడిపోయిన వెంకటరెడ్డి 1711లో ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాలరావు కాలంలో ముద్రించిన నూగూరు సిక్కాలు (నాణేలు) సంస్థానానికి ఎంతో పేరు తెచ్చాయి. కానీ ‘నూగూరు వెట్టి’ వల్ల ఈ సంస్థానం అప్రతిష్ట పాలైంది. తర్వాతి కాలంలో ఈ వంశంలో చెప్పుకోదగిన వ్యక్తి మొదటి రామకృష్ణారావు (1807-1822). ఇతడు సంస్థానాన్ని వనపర్తికి మార్చాడు. నిజాం ఇతడికి 1817లో రాజబహద్దూర్ బిరుదునిచ్చాడు. ఇతడు మంచి పండితుడు. చాలా మంది ఫకీర్లు ఇతడి స్నేహితులుగా ఉండేవారు.
ఈ సంస్థానంలో అందరిలోకెల్లా ప్రసిద్ధి చెందినవాడు రాజా రామేశ్వరరావు. ఇతడిలో ఆధునిక భావాలు మెండు. ఆంగ్ల విద్య ఆవశ్యకతను గుర్తించిన రామేశ్వరరావు మద్రాస్ వెళ్లి ఆంగ్లం నేర్చుకున్నాడు. 1802లో రెవెన్యూ సెటిల్‌మెంట్ భూమిని కొలిచి సర్వే నంబర్లు వేశాడు. రైతులకు పట్టాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. తెలంగాణలో రైతులకు పట్టాలు ఇచ్చిన తొలి సంస్థానం ఇదే. సాలార్జంగ్ కంటే ముందే ఇక్కడ సంస్కరణలు చేపట్టారు. అందుకే సాయుధ పోరాటం ఇక్కడ ప్రభావం చూపలేదు. రాజా రామేశ్వరరావు కులాంతర ప్రేమ వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. సంస్థానంలో ఆధునిక సిద్ధాంతాలను ప్రవేశపెట్టి నిజాం సర్వసైన్యాధ్యక్ష పదవి పొందాడు. బ్రిటిషర్లు ఇతడికి ‘హిస్ హైనెస్’ అనే బిరుదును ప్రకటించారు. మూడో రామేశ్వరరావు కాలంలో ఈ సంస్థానం హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమైంది.

గద్వాల సంస్థానం
మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణా-తుంగభద్ర నదుల మధ్య ప్రాంతంలో  గద్వాల సంస్థానం విస్తరించింది. దీనికి తూర్పున అలంపూర్ తాలూకా, పశ్చిమాన రాయచూర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. ఈ సంస్థానంలో 360 గ్రామాలుండేవి. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఈ సంస్థానం కర్నూలు నవాబుల నుంచి కూడా కప్పం వసూలు చేసింది.

గద్వాల సంస్థాన మూల పురుషుడు బుడ్డారెడ్డి. ఇతడు కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలో రాయచూర్, అలంపూర్, ఐజ తదితర సీమలపై  పాలనా హక్కులు పొందాడు. ఇతడి తర్వాత పెద సోమ భూపాలుడు అధికారంలోకి వచ్చాడు. ఇతడినే శోభనాద్రి అని పిలిచేవారు. గద్వాల్ కోటను ఇతడే నిర్మించాడు. ఈ సంస్థానాధీశులందరిలోకెల్లా పెద సోమభూపాలుడు ప్రసిద్ధి చెందాడు. ఇతడు గొప్ప కవి. గీతగోవిందాన్ని రచించాడు. అభినవ పెద్దనగా పేరొందిన కాణాదం పెద్దన్న, సోమయాజి లాంటి అనేక మంది కవులకు ఆశ్రయం కల్పించాడు. ఇతడి మనవడైన చిన సోమభూపాలుడు కూడా గొప్ప కవి. ఇతడు రతిశాస్త్రాన్ని అనువదించాడు. అష్టపదులను యక్షగానంగా రూపొందించాడు. కాణాదం పెద్దన,  రామాచార్యులు, గార్గెయపురి సుబ్బాశాస్త్రి, కామసముద్రం అప్పలాచార్యులు తదితర కవులకు ఆశ్రయమిచ్చాడు. ఇతడి కాలంలో సంస్థాన కీర్తి ప్రతిష్టలు ఇనుమడించాయి. సంస్థాన చివరి పాలకురాలు ఆదిలక్ష్మి దేవమ్మ. ఈమె తన పెద్ద కుమార్తెను దోమకొండ సంస్థానాధీశుడికిచ్చి వివాహం చేసింది. గద్వాల సంస్థానం 1949 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ర్టంలో విలీనమైంది.
 
బోరవెల్లి సంస్థానం
ఇది మహబూబ్‌నగర్ జిల్లాలోని చిన్న సంస్థానం. వీరి ఇంటి పేరు ముష్టిపల్లి. కాలక్రమంలో బోరవెల్లి, గద్వాల సంస్థానంలో విలీనమైంది. ప్రసిద్ధ కవి చింతలపల్లి ఛాయాపతికి ఈ సంస్థానాధీశుడైన వెంకటరెడ్డి ఆశ్రయం కల్పించాడు. ఛాయాపతి రచించిన రాఘవాభ్యుదయం అనే ప్రబంధాన్ని సంస్థానాధీశుడి ఇలవేల్పయిన కేశవస్వామికి అంకితమిచ్చాడు.
 
మునగాల సంస్థానం
ఈ సంస్థానం కృష్ణా, నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో ఉంది. దీనికి మరో వైపు ఖమ్మం జిల్లా  సరిహద్దుగా ఉంది. ఈ పరగణాలో 40 గ్రామాలు ఉండేవి. ఈ పరగణాను జమిందారీ అని, సంస్థానమని కూడా వ్యవహరించేవారు. దీని రాజధాని నడిగూడెం. ఈ సంస్థానం 1766కు ముందు తెలంగాణలో భాగంగా ఉండేది. తర్వాత కృష్ణా జిల్లాలో భాగమైంది. 1959లో తిరిగి నల్లగొండ జిల్లాలో కలిసిపోయింది.

మునగాల, లింగగిరి పరగణాల చుట్టూ నైజాం రాజ్యం ఉండేది. బ్రిటిష్ పరిపాలనలోని ఈ రెండు జమీన్లు నిజాం రాజ్యంలో దీవుల్లా ఉండేవి. ఈ పరగణాల వాసులకు నైజాం ప్రాంతంలోని నల్లగొండ జిల్లాతోనే సంబంధ బాంధవ్యాలు ఉండేవి. నాగరికత, వ్యవహార ధోరణి మొత్తం ఈ నైజాం ప్రాంతం తరహాలోనే ఉండేది. ఈ  సంస్థాన పాలకులైన గార్లపాటి(వరంగల్), కీసర(ఖమ్మం), నాయని (వరంగల్) వంశస్థులు తెలంగాణకు చెందినవారు. అందువల్ల ఈ సంస్థానాన్ని తెలంగాణలో అంతర్భాగంగా చెప్పవచ్చు.

మొదటి కుతుబ్‌షా చివరి కాలంలో గార్లపాటి వంశీయులు మునగాల పరగణాకు దేశాయులుగా ఉండేవారు. ఈ వంశ స్థాపకుడి గురించి వివరాలు తెలియదు. కానీ ఈ వంశానికి  చెందిన ఎల్లప్ప, నాగప్ప గురించి తెలుస్తోంది. అయ్యన్న దేశాయి వారి తర్వాతి కాలానికి చెందినవాడు. ఇతడు 1652-93 మధ్యకాలంలో పాలించాడు. అధికారంలోకి వచ్చిన అయ్యన్నకు రుణభారం పెరిగింది. దీంతో 1687లో పరగణాలోని సగభాగాన్ని సిద్దలూరు వెంగన్న, రామప్ప అనే గోల్కొండ వ్యాపారులకు విక్రయించాడు. అయ్యన్న దేశాయి కుమారుడి మరణానంతరం అతడి భార్య సుభద్రాదేవి పరగణా వ్యవహారాలు చూసుకునేది. అదే సమయంలో కీసర వారు మునగాల పరగణాలో వ్యవసాయం చేసేవారు. వీరు గార్లపాటి వారి నుంచి పరగణాను తీసుకొని ఇజారా చెల్లించేవారు. సుభద్రాదేవి సోదరుడు ముకుందప్ప. 1693లో చెలరేగిన ఒక తిరుగుబాటును అణచివేయడంలో ఇతడు ఔరంగజేబుకు సాయం చేసి సనదు పొందాడని పరగణా రికార్డులను బట్టి తెలుస్తోంది. కుతుబ్‌షాహీల కాలంలో మునగాల సంస్థానాన్ని గార్లపాటి వంశీయులు పాలించారు. మొగల్ పాలనా కాలంలో ఈ సంస్థానంలో కీసర వంశ పాలన మొదలైనట్లు తెలుస్తోంది.

కీసర వంశీయుల మొదటి రాజధాని రేపాల. తర్వాత రాజధానిని శిరిపురానికి మార్చారు. ఈ వంశీయులు పాలిస్తున్న క్రమంలోనే గోల్కొండలో అసఫ్‌జాహీలు అధికారంలోకి వచ్చారు. 1756లో సలాబత్ జంగ్ ఉత్తర సర్కారులను ఫ్రెంచి వారికి ఇచ్చాడు. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన రెండో అసఫ్‌జా నిజాం అలీ 1766లో ఈ సర్కారులను బ్రిటిషర్లకు కట్టబెట్టాడు. దీంతో మునగాల, లింగగిరి పరగణాలు బ్రిటిషర్ల ఆధీనంలోకి వెళ్లాయి. 1802లో ఈ సంస్థానంలో జమిందారీ పద్ధతి ప్రవేశపెట్టారు. పేష్‌కుష్‌లు పన్ను వసూలు చేసి బ్రిటిషర్లకు ఇచ్చేవారు. ఈ సంస్థానాన్ని కీసర వెంకట నరసింహారావు, ముకుందప్ప, నరసన్న, కోదండ రామయ్య (1814), వెంకట నర్సింహారావు (1818), గోపమ్మ, లచ్చమ్మలు వరసగా పాలించారు. తర్వాత ఈ సంస్థానంలో నాయని వెంకట రంగారావు (1900) మునగాల రాజా పదవిని పొందాడు. ఇతడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావును దివాన్‌గా నియమించుకున్నాడు. జాతీయోద్యమ ప్రభావం వల్ల మునగాల రాజాలో ఆదర్శ భావాలు ఎక్కువగా ఉండేవి.  రావిచెట్టు రంగారావు, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు 1901లో హైదరాబాద్‌లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని ప్రారంభించారు. 1904లో హన్మకొండలో రాజరాజనరేంద్ర భాషా నిలయం, 1905లో సికింద్రాబాద్‌లో విజ్ఞాన చంద్రికా మండలిని స్థాపించారు.
విద్యా విషయాల్లో సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఆకిలి చెంచు రామయ్యను, కట్టడాల నిర్మాణం కోసం గణేశ్వరరావును, సంస్థానంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి పింగళి వెంకయ్యను మునగాల రాజా నియమించాడు. వెంకయ్య జపాన్, కంబోడియా తదితర దేశాల్లో పర్యటించాడు. ఆయా దేశాల్లోని వ్యవసాయ, పారిశ్రామిక పద్ధతులను ఆకళింపు చేసుకొని సంస్థానంలో నూతన వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టాడు. మునగాల రంగారావు క్రమంగా ఆదర్శభావాలకు దూరమయ్యాడు. ఈలోగా సంస్థానంలో తిరుగుబాట్లు జరిగాయి. 1930లో కరణాల తిరుగుబాటు ప్రారంభమైంది. అది  రైతుల తిరుగుబాటుగా రూపాంతరం చెందింది. మునగాల రాజా వీటిని నిర్దాక్షిణ్యంగా అణచివేశాడు. 1947లో మునగాల సంస్థానం మద్రాసు రాష్ర్టంలో విలీనమైంది. ఆంధ్రప్రదేశ్ అవతరించాక 1959లో నల్లగొండ జిల్లాలో కలిసిపోయింది.

సాహిత్యసేవ
ఈ సంస్థానం సాహిత్య సేవకు ప్రాధాన్యమిచ్చింది. ఈ సంస్థాన ఆస్థాన కవి  కోదాటి నర్సింహరావు. నందికేశ్వర శాస్త్రి ‘శివతత్త్వసుధానిధి’ అనే ప్రబంధాన్ని రాయించాడు. ఇందులో నాయని వారి వంశ చరిత్రను వర్ణించారు.
Published date : 03 Dec 2015 06:01PM

Photo Stories