Skip to main content

శాతవాహనుల తొలి రాజధాని

శాతవాహనుల తొలి రాజధాని ఏది? అనే అంశంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని పైఠాన్ (ప్రతిష్ఠానపురం) అని కొందరు, అమరావతి (ధాన్యకటకం) అని మరికొందరు వాదిస్తున్నారు. అయితే చాలా మంది నేటి కరీంనగర్‌లోని కోటిలింగాల శాతవాహనుల తొలి రాజధాని అని వాదిస్తున్నారు. ఈ ప్రాంతంలో లభించిన కొన్ని పురావస్తు, చారిత్రక ఆధారాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. క్రీస్తు పూర్వమే ఇక్కడ నాగరికత వెలసినట్లు అక్కడ తవ్వకాల్లో లభించిన వివిధ వస్తువులను పరిశీలించడం ద్వారా తెలుస్తోంది.
‘కోటిలింగాల’ కరీంనగర్ జిల్లాలోని వెల్గటూర్ మండలంలో ఉంది. ఇది హైదరాబాద్ నుంచి 220 కి.మీ., జిల్లా కేంద్రం నుంచి 50 కి.మీ. దూరంలో ఉంది. కరీంనగర్ నుంచి లక్సెట్టిపేట వెళ్లే మార్గంలో వెల్గటూర్ నుంచి తూర్పు దిశగా 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే కోటిలింగాల చేరుకోవచ్చు. పడమర నుంచి తూర్పునకు ప్రవహించే గోదావరి ఈ ప్రాంతంలో కొద్దిగా మలుపు తిరుగుతుంది. ఈ వంక దాటగానే దక్షిణం నుంచి పెద్దవాగు (మునుల వాగు) వచ్చి కలుస్తుంది. ఇలా ఏర్పడ్డ త్రిభుజాకార స్థలంలో చారిత్రక తొలి యుగపు దిబ్బ 110 ఎకరాల విస్తీర్ణంలో భూమి నుంచి ఆరు మీటర్ల ఎత్తున ఉంది. ఇక్కడ కోట శిథిలాలు కూడా బయల్పడ్డాయి. కోట నిర్మాణానికి 50 నుంచి 55 సెం.మీ. పొడవు ఉన్న ఇటుకలను వాడారు. దక్షిణంగా మునేరు పక్కన కోట గోడలో కొంత భాగం నిలిచి ఉండటం నేటికీ చూడొచ్చు. ఆగ్నేయ బురుజుపై ప్రస్తుతం కోటేశ్వరాలయం ఉంది. గోదావరి తీరంలో వెలసిన ఈ గ్రామం అతి పురాతనమైందని, క్రీ.పూ.5వ శతాబ్దం నాటికే విలసిల్లిందని చరిత్రకారుల వాదన.

చరిత్ర ఏం చెబుతోంది?
ప్రాచీన షోడశ మహాజనపదాల్లో ఒకటైన అస్సక జనపదం రాజధాని నగరమే నేటి కోటిలింగాల ప్రాంతమని పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇక్కడ ఉన్న ప్రాచీన శైవాలయం దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలను అందిస్తోంది. ఈ ప్రాంతంలో కోటలోని లింగాలను ‘క్రోట లింగాలు’గా పిలిచేవారని, ఇదే క్రమంగా ‘క్రోటలింగాల’ ఆ తర్వాత ‘కోటి లింగాల’గా స్థిరపడిందని చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాతవాహనుల్లో ప్రసిద్ధ రాజు, స్వయంగా కవి అయిన హాలుడు ‘గాథాసప్తశతి’లో క్రోటేర్మధ్యే అని పేర్కొన్నాడు. అందువల్ల ఇది మొదట ‘క్రోటి’గా ఉండి ఆ తర్వాత లింగాల అనే పేరు కలిసిందని చరిత్రకారులు భావిస్తున్నారు.
శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించిన శ్రీముఖుడితో పాటు అతడి పూర్వీకుడైన శాతవాహనుడు, తదనంతర పాలకుడైన శాతకర్ణి నాణేలు కోటిలింగాలలో మాత్రమే లభ్యమయ్యాయి. మలిదశ పాలకులైన గౌతమీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి నాణేలు ఈ ప్రాంతంలో లభించలేదు. అదేవిధంగా తొలి శాతవాహనుల నాణేలు మహారాష్ట్రలోని పైఠాన్‌లో, అమరావతిలో లభించలేదు. ఈ రెండు ప్రాంతాల్లో మలిదశ శాతవాహనుల నాణేలు మాత్రమే దొరికాయి. వీటి ఆధారంగా శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల, రెండో రాజధాని పైఠాన్, చివరి రాజధాని అమరావతి అని స్పష్టమవుతోంది.

అతి ప్రాచీన బౌద్ధ స్తూపం
కోటిలింగాల ప్రాంతంలోని పెద్దవాగు గోదావరిలో సంగమించే ప్రదేశంలో (ఆగ్నేయ భాగం) ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే అతి ప్రాచీన బౌద్ధ స్తూపం బయటపడింది. ఈ స్తూపం తూర్పు నుంచి పడమరకు 1,055 మీటర్లు, ఉత్తరం నుంచి దక్షిణానికి 333 మీటర్లు, ఎత్తు 9 మీటర్లు ఉంది. ఇది గుండ్రని ఇటుకలతో ప్రదక్షిణాపథాన్ని కలిగి ఉందని తవ్వకాలపై అధ్యయనం చేసిన చరిత్రకారులు పేర్కొన్నారు. స్తూపానికి 20 సెం.మీ. మందం ఉన్న రాతి పలకలు అతికించి ఉన్నాయి. ఇవి 59 దాకా లభించాయి. వీటిపై లఘు శాసనాలు ఉన్నాయి. ఇవి బౌద్ధ ధర్మాల్ని బోధిస్తున్నాయి. శాసనాల్లోని భాష పూర్వ బ్రాహ్మీలిపిలోని ప్రాకృతం. ఇది అశోకుడికి పూర్వం నాటిది. దీన్ని అధ్యయనం చేసిన చరిత్రకారులు హీనయాన శాఖకు చెందిన ఈ స్తూపం క్రీ.పూ 4వ శతాబ్దానికి చెందిందని పేర్కొంటున్నారు.
కోటిలింగాల, ధూళికట్టలోని బౌద్ధ స్తూపాలు అమరావతి స్తూపం కంటే పూర్వ కాలానికి చెందినవని, ఇవి రెండూ క్రీ.పూ. 4వ శతాబ్దం నాటివని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ వి.వి.కృష్ణమూర్తి చెప్పారు. ప్రసిద్ధ అమరావతి స్తూపం కంటే కూడా ఇవి పాత తరానికి చెందినవని చరిత్రకారుల అభిప్రాయం.

తవ్వకాల్లో లభించిన ఆధారాలు..
పురావస్తుశాఖ నేతృత్వంలో 1979 నుంచి 1984 వరకు ఇక్కడ తవ్వకాలు నిర్వహించారు. ఆరు పొరల దాకా చేపట్టిన తవ్వకాల్లో అనేక ఇటుక కట్టడాలు; వివిధ రాజవంశాలకు చెందిన వందలాది సీసం, రాగి నాణేలు; వస్తువులు బయటపడ్డాయి. కింది మూడు పొరల్లో మట్టి ప్రాకారం, రబ్బుల్ నిర్మాణాలు, పై మూడు పొరల్లో కోట గోడలు, బురుజులు వెలుగు చూశాయి. కింది ఐదో పొర నుంచి పైన మొదటి పొర వరకు శాతవాహనుడు, మొదటి శాతకర్ణి నాణేలు లభించాయి. మూడో పొర నుంచి మొదటి పొర వరకు సిముకుడి (శ్రీముఖుడు) నాణేలు లభించాయి. ఆరో పొరలో ఆంధ్ర గోపుల నాణేలు దొరికాయి. దీంతో ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఒక్కసారిగా మలుపు తిరిగింది. శాతవాహనుల కంటే పూర్వమే కోటిలింగాల ఆంధ్రుల రాజధానిగా వర్థిల్లిందనే కొత్త విషయం ప్రపంచానికి తెలిసింది.
చివరి పొరల్లో లభ్యమైన అనేక రాగి, సీసపు నాణేలపై క్రీ.పూ. 2వ శతాబ్ద లక్షణాలతో కూడిన ప్రాకృత బ్రాహ్మీలిపిలో ర్రాణోగోభద (గోభద అనే రాజు), ర్రాణో సిరి కంపాయ, ర్రాణో సమగోప అనే నలుగురు పాలకుల పేర్లు చెక్కి ఉన్నాయి. వీళ్లంతా శాతవాహనులకు పూర్వీకులైన ఆంధ్ర రాజులు. వీరి అనంతర పాలకులైన శాతవాహనుల నాణేలు కూడా సమగోపుడి నాణేలను పోలి ఉన్నాయి. నాణేలతోపాటు నల్లని, ఎర్రటి పెంకులు, మట్టిపాత్రలు కూడా లభించాయి. వీటి ఆధారంగా ఈ ప్రాంతం క్రీ.పూ. 5వ శతాబ్దం నాటి ఆంధ్రుల తొలి ప్రాచీన స్థావరం అని పరిశోధకులు పేర్కొంటున్నారు.
సగం తయారైన నాణేలు లభించడం వల్ల ఇక్కడ నాణేల ముద్రణాలయం ఉండేదని తెలుస్తోంది. భూమి నుంచి కేవలం 2.5 మీ. లోతులో జనావాసాలు, బావులు, పారిశుద్ధ్య నిర్మాణాలు, నీటితొట్టెలు, సౌందర్య సాధనాల (ఆభరణాలు, పూసలు)తో పాటు అనేక ఇనుప పనిముట్లు లభించాయి. రోమన్ నాణేలు, వారి శిల్పకళతో కూడిన కుండలు కూడా లభించడం వల్ల కోటిలింగాల ఒకప్పుడు అంతర్జాతీయ వ్యాపార, వర్తక కేంద్రంగా ఉందనే విషయం స్పష్టమవుతోంది.

ముఖ్యమైన చారిత్రక నగరాలు

బోధన్
వ్యాసుడు మహాభారతంలో ‘ఆంధ్రదేశం’గా పేర్కొన్న ప్రాంతమే నేటి తెలంగాణ అని, సహదేవుడి దిగ్విజయ యాత్రలు తెలంగాణ నుంచే ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. క్రీ.పూ. ఆరో శతాబ్దంలో ఏర్పడిన షోడశ మహాజనపదాల్లో దక్షిణ భారతదేశంలో ఏర్పడిన ఏకైక రాజ్యం ‘అస్మక’. దీని రాజధాని బోధన్. చుళ్వవగ్గ జాతక కథలో అస్మకను పెద్ద రాజ్యంగా చెప్పారు. గ్రీకు చరిత్రకారుడు ప్లీని ‘నేచురల్ హిస్టరీ’ అనే గ్రంథంలో అస్మగి (అస్మక) రాజ్యం గురించి ప్రస్తావించాడు.

అసిఫాబాద్
ఇది ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యరాతి యుగంనాటి పట్టణం. ఇక్కడ పనిముట్లు, చిన్న తరహా చేతి గొడ్డళు్ల గండ్రగొడ్డళ్లు లభించాయి. ఆదిలాబాద్ జిల్లాలో గోండ్ తెగకు చెందిన గిరిజన జాతులవారు ఎక్కువగా నివసిస్తున్నారు.

ఏలేశ్వరం
ఇది నల్లగొండ జిల్లాలో ఉన్న లోహయుగ కాలంనాటి స్థావరం. ఈ ప్రాంతంలో 12 రకాల సమాధులు, ఏనుగు ఆకారంలో నాలుగు రకాల శవపేటికలు లభించాయి. ఇందులో ఒక శవపేటికకు ఒకవైపు రంధ్రం, ఒక పలక ఉంది. కొన్ని సమాధుల్లో నల్లని కూజా, ముక్కాలిపీట, ఎరుపు, నలుపు కుండలు, పెద్ద బాన, త్రిశూలం కూడా లభించాయి. భారత్‌లో నేటికీ మిగిలి ఉన్న సింధూ నాగరికత కాలానికి సమకాలీన ఏకైక నగరం ఇదే.

ఇంద్రపాల నగరం
విష్ణుకుండినుల తొలి రాజధాని ఇంద్రపాల నగరం. ఇది నేటి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట మండలంలో ఉన్న ‘తుమ్మలగూడెం’. ఈ గ్రామంలో ఒక శాసనం బయల్పడింది. దీన్ని తెలంగాణలోని తొలి సంస్కృత శాసనంగా పేర్కొంటున్నారు.

హైదరాబాద్
కుతుబ్‌షాహీ వంశంలో మహమ్మద్ కులీకుతుబ్ షా గొప్పవాడు. ఇతడు ఈ నగరాన్ని 1591లో నిర్మించాడు. ఇరాన్ దేశానికి చెందిన మీర్ మొమిన్ అస్త్రాబాది దీనికి ఇంజనీర్ గా పనిచేశాడు. ఈ నగర నిర్మాణ సమయంలో మహమ్మద్ కులీకుతుబ్ షా ‘ఓ భగవంతుడా! చెరువుల్లో చేపలు ఉండే విధంగా నా నగరంలో ప్రజలు నిండుగా ఉండేట్లు దీవించు’ అని ప్రార్థించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది భిన్న సంస్కృతులకు నిలయంగా, విశ్వనగరంగా విరాజిల్లుతోంది. దేశంలో ముంబై, కలకత్తా, ఢిల్లీ నగరాల తర్వాత నాలుగో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ప్రసిద్ధి పొందింది. దేశంలోనే నివాసయోగ్య పట్టణాల్లో మొదటిస్థానంలో నిలిచింది.

ఓరుగల్లు
ఓరుగల్లు 1953 అక్టోబర్ 1న వరంగల్ జిల్లాగా ఆవిర్భవించింది. ఈ పట్టణాన్ని కాకతి రుద్రదేవుడు నిర్మించాడు. గణపతిదేవుడు తన రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు. నిజాం పాలనలో ఇది ఉత్తర తెలంగాణకు ప్రధాన సుభాగా ఉంది. 1323లో మహమ్మద్ బిన్ తుగ్లక్ లేదా జునాఖాన్ ఓరుగల్లుపై దాడిచేసి చివరి కాకతీయ రాజు రెండో ప్రతాపరుద్రుడిని ఓడించాడు. ఈ నగరానికి సుల్తాన్‌పూర్‌గా నామకరణం చేశాడు. కాకతీయుల ఆనవాళ్లు తెలిపే చిహ్నమైన ‘కళా తోరణం’, శిథిలమైన వరంగల్ కోట నాటి పాలకుల వైభవాన్ని తెలుపుతున్నాయి. వరంగల్, హన్మకొండ, ఖాజీపేట అనే మూడు పట్టణాల సంగమమే నేటి వరంగల్. వరంగల్ కోట శతృ దుర్భేద్యమైందిగా, అందంగా తీర్చిదిద్దిన కమాన్‌లతో, రాచఠీవితో వాస్తుకళకు నిదర్శనంగా ఉంది. ఏడు బలమైన ప్రాకారాలతో కూడిన ఈ కోటపై 45 బురుజులు ఉన్నాయి. కోట మధ్యభాగంలో స్వయం భూదేవి ఆలయం ఉంది. కాకతీయ సామ్రాజ్యానికి ప్రతీకగా కోట సింహద్వారం ఏకశిలతో నెలకొని ఉంది.

త్రిళింగ లేదా తెలంగాణ

టాలమీ (క్రీ.శ. 130) తన రచనల్లో త్రిలింగాన్, త్రిలిప్తాన్ అనే పదాలు ఉపయోగించాడు. ‘త్రిళింగ’ అంటే మూడు శైవ కేంద్రాల మధ్య ప్రాంతం అని అర్థం. ఆ మూడు శైవ కేంద్రాలు..
1. కాళేశ్వరం (తెలంగాణ)
2. శ్రీశైలం (రాయలసీమ)
3. ద్రాక్షారామం (కోస్తాంధ్ర)
గాంగవంశానికి చెందిన ఇంద్రవర్మ వేయించిన పుర్లి శాసనంలో ఉన్న ‘తిరిలింగ’, టాలమీ గ్రంథంలోని ‘త్రిళింగాన్’ పదాల మధ్య దగ్గరి సంబంధం ఉంది. తమిళ వ్యాకరణ గ్రంథం ‘అంగుత్తియం’లోనూ త్రిళింగ పదాన్ని ప్రస్తావించారు. యాదవ రాజు ఆస్థానంలోని హేమాద్రి ‘వ్రత ఖండం’లో త్రిళింగ, తైలింగ పదాలను ఉపయోగించాడు. అల్లావుద్దీన్ ఆస్థానంలోని చరిత్రకారుడైన అమీర్‌ఖుస్రూ ‘ఖజాయిస్-ఉస్-పుతుహ’ గ్రంథంలో తిలింగ పదాన్ని ప్రస్తావించాడు. అబుల్ ఫజల్ (అక్బర్ ఆస్థానంలోని కవి, చరిత్రకారుడు) ‘అక్బర్ నామా’, ‘ఐనీ-ఇ-అక్బర్’ గ్రంథాల్లో తెలంగాణ పదాన్ని వినియోగించాడు. ఈ విధంగా త్రిళింగ దేశంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం ‘తెలంగాణ’గా మారి భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది.
Published date : 28 Oct 2015 05:28PM

Photo Stories