Skip to main content

కుతుబ్‌షాహీ యుగం

పదిహేనో శతాబ్దం చివరి నాటికి క్షీణ దశకు చేరిన బహమనీ సామ్రాజ్యం అయిదు రాజ్యాలుగా చీలిపోయింది. అందులో గోల్కొండ కుతుబ్‌షాహీ రాజ్యం ఒకటి. ఈ రాజ్యస్థాపకుడు సుల్తాన్ కులీకుతుబ్‌షా. ఇతడు 1496 నుంచి 1518 వరకు సుబేదార్‌గా తెలంగాణ ప్రాంతాన్ని పాలించాడు. 1518లో స్వతంత్రం ప్రకటించుకున్నాడు. కుతుబ్‌షాహీలు తొలుత తెలంగాణను పాలించారు. 1565లో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఇతర తెలుగు ప్రాంతాలు కూడా వీరి ఆధీనంలోకి వచ్చాయి. తెలంగాణ అనే పదం వీరి కాలం నుంచే ప్రాచుర్యం పొందింది. కుతుబ్‌షాహీలు సుమారు రెండు శతాబ్దాల(1496-1687) పాటు తెలంగాణను పాలించారు. వీరు తెలుగు భాషా సాహిత్య సంస్కృతులను ఆదరించి తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.
కులీకుతుబ్‌షా తన బంధువులతో కలసి మధ్య ఆసియా నుంచి దక్కన్‌కు వలస వచ్చాడు. ఇతడు బహమనీ సుల్తాన్ మహమూద్ షా (1482-1518) కొలువులో చేరి సేనాపతి అయ్యాడు. ఆ సమయంలో ఇతడు తెలంగాణ ప్రాంతంలో దోపిడీ దొంగలను అణచివేశాడు. ఎదురు తిరిగిన సామంతులను దారిలోకి తెచ్చాడు. 1487లో బహమనీ రాజ్యంలో దక్కనీ, అఫాకీ(స్థానికేతర)ల మధ్య ఘర్షణలు తలెత్తాయి. కులీ వీటి నుంచి సుల్తాన్‌ను రక్షించాడు. గోవా పాలకుడైన బహదూర్ జిలానీ (1493) సుల్తాన్‌పై తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటును అణచివేసే ప్రయత్నంలో నాటి తెలంగాణ పాలకుడైన కుతుబ్ ఉల్‌ముల్క్ డకానీ మరణించాడు. దీంతో మహమూద్ షా ఆ బాధ్యతను కులీకుతుబ్‌షాకు అప్పగించాడు. తిరుగుబాటును కులీ పూర్తిగా అణచి వేశాడు. దీంతో మహమూద్‌షా అతడికి కుతుబ్ ఉల్‌ముల్క్ బిరుదునిచ్చి 1496లో గోల్కొండ జాగీర్‌దార్‌గా నియమించాడు. కులీకుతుబ్‌షా 1518లో స్వతంత్రం ప్రకటించుకొని తెలంగాణ ప్రాంతాన్ని పాలించాడు. గోల్కొండను కాకతీయుల కాలంలో నిర్మించారు. దీన్ని గతంలో మంగళారం అని పిలిచేవారు. కులీ స్వతంత్రంగా పాలన చేపట్టిన తొలినాళ్లలో మెదక్ జిల్లా కోహిర్ నుంచి ఓరుగల్లు వరకు మాత్రమే ఇతడి పాలనలో ఉండేది. ఓరుగల్లు నుంచి తూర్పు తీరం వరకు ఉన్న ప్రాంతాన్ని షితాబ్‌ఖాన్ (సీతాపతిరాజు) పాలించేవాడు. ఇతడు గజపతుల సామంతుడు. షితాబ్‌ఖాన్ 1504లో ఓరుగల్లు కోటను కైవసం చేసుకున్నాడు. ఇతడు స్వతంత్రంగా ఓరుగల్లు రాజ్యపాలన చేపట్టాడు. ఇతడి మంత్రి ఎనుములపల్లి పెద్దనామాత్యుడు. చరిగొండ ధర్మన్న అనే కవి పెద్దనామాత్యుడి వద్ద ఆశ్రయం పొందాడు. ధర్మన్న రచించిన చిత్రభారతంలో షితాబ్‌ఖాన్ ప్రశంస కనిపిస్తుంది. వరంగల్, ఖమ్మం మెట్టు, నల్లగొండ ప్రాంతాలు షితాబ్‌ఖాన్ రాజ్యంలో భాగంగా ఉండేవి. కులీకుతుబ్‌షా ఓరుగల్లుపై దాడి చేసి ఇతణ్ని సంహరించాడు.

రాజ్య విస్తరణ
రాచకొండ, పానుగల్లు, ఘనపురం (మహబూబ్‌నగర్), దేవరకొండ, నల్లగొండ, ఉర్లుగొండ, ఉండ్రుగొండ, అనంతగిరి దుర్గాధిపతులు స్వతంత్రంగా పరిపాలించేవారు. కృష్ణదేవరాయల మరణానంతరం (1529) కులీకుతుబ్‌షా ఈ దుర్గాలను జయించి రాజ్యాన్ని విస్తరించాడు. తర్వాత కరీంనగర్ జిల్లాలో కివాం ఉల్‌ముల్క్‌ను ఓడించాడు. ములంగూర్, ఎల్గందుల, రామగిరి కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ఆదిల్‌షాతో యుద్ధం చేసి కోవిలకొండను ఆక్రమించాడు. హరిచంద్ తిరుగుబాటును అణచి నల్లగొండను వశం చేసుకున్నాడు. తర్వాత కృష్ణానదీ తీరం వరకు రాజ్యాన్ని విస్తరించాడు. కొండపల్లి, ఇంద్రకొండ, ఏతగిరి, దుర్గాధీశులను ఓడించాడు. దీంతో కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న తీరాంధ్ర కూడా ఇతడి పాలనలోకి వచ్చింది. కులీకుతుబ్‌షా కవి పండితులను ఆదరించాడు. ఇతడికి ఆరుగురు కుమారులు. చివరి వాడైన ఇబ్రహీం కుతుబ్‌షాను దేవరకొండ పాలకుడిగా నియమించాడు.
యువరాజు, పెద్ద కుమారుడైన హైదర్ ముందే మరణించాడు. రెండో కుమారుడైన కుతుబుద్దీన్ యువరాజు అయ్యాడు. కానీ రాజకీయాల పట్ల శ్రద్ధ పెట్టలేదు. మిగతా ముగ్గురు తండ్రి బతికుండగానే సింహాసనాన్ని ఆకాంక్షించారు. నాలుగో కుమారుడైన అబ్దుల్ కరీం తిరుగుబాటు చేశాడు. ఇతడు బీజాపూర్ వెళ్లి సుల్తాన్‌తో సంప్రదింపులు జరిపాడు. గోల్కొండను ముట్టడించాలని భావించాడు. ఆ ప్రయత్నాల్లోనే మరణించాడు. కులీకుతుబ్‌షా మూడో కుమారుడైన జంషీద్, అయిదో కుమారుడైన దౌలత్ వారసత్వం కోసం కలహించుకున్నారు. దీంతో కులీకుతుబ్‌షా జంషీద్‌ను గోల్కొండలో, దౌలత్‌ను భువనగిరిలో బంధించాడు. జైలు నుంచి తప్పించుకున్న జంషీద్ తండ్రిని హత్య చేశాడు. సోదరుడైన కుతుబుద్దీన్‌ను చిత్రహింసలకు గురి చేసి జైళ్లో ఉంచాడు. అనంతరం సింహాసనాన్ని ఆక్రమించాడు. ఇతడు రాజ్యాన్ని విస్తరించలేదు. కానీ తన రాజ్య భాగాలను కోల్పోలేదు.

మల్కిభరాముడు
కులీ ఆరో కుమారుడు ఇబ్రహీం కుతుబ్‌షా (1550-80). ఇతడు విజయనగర రాజుల సాయంతో సింహాసనాన్ని ఆక్రమించాడు. కవి పండితులను ఆదరించి మల్కిభరాముడిగా పేరొందాడు. ఇతడు విజయనగరంలో ఏడేళ్లపాటు శరణార్థిగా ఉన్నాడు. వారి సహాయంతోనే సింహాసనాన్ని ఆక్రమించాడు. కానీ వారి పతనానికే కారణమయ్యాడు. బీజాపూర్, అహ్మద్‌నగర్, గోల్కొండ, విజయనగర రాజులు దక్కన్‌పై ఆధిపత్యం కోసం ప్రయత్నించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇబ్రహీం తళ్లికోట యుద్ధంలో విజయనగర రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చింది. ఈ యుద్ధంలో ఓటమి వల్ల విజయనగర సామ్రాజ్యం పతనావస్థకు చేరింది. దీంతో ఇబ్రహీం కుతుబ్‌షా తీరాంధ్రను జయించడానికి మార్గం సుగమమైంది. ఇతడు 1571లో రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాలను జయించాడు. 1579లో కొండవీటిని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత వినుకొండ, ఖమ్మం దుర్గాలను, కసింకోటను వశం చేసుకున్నాడు.
ఇబ్రహీం కుతుబ్‌షా తన పాలనా కాలంలో హుస్సేన్‌సాగర్, ఇబ్రహీం పట్నం చెరువులను తవ్వించాడు. ఇబ్రహీంబాగ్, పూల్‌బాగ్, లంగర్ (భిక్షా గృహాలు)ను ఏర్పాటు చేశాడు. మూసీనదిపై పురానాపూల్ వంతెనను నిర్మించాడు.
ఇబ్రహీం మరణానంతరం మహమ్మద్ కులీ కుతుబ్‌షా (1580-1612) అధికారం చేపట్టాడు. ఇతడు 14వ ఏట రాజ్యానికొచ్చాడు. ఇతడు ఇబ్రహీం, భాగీరథిల సంతానం. దక్కన్ ముస్లింల సహకారంతో అశ్వారావు చేసిన కృషి వల్ల మహమ్మద్ కులీ అధికారంలోకి వచ్చాడు. ఇతడు కవి అయినప్పటికీ రాజ్య విస్తరణలో అలక్ష్యం ప్రదర్శించలేదు. దక్షిణాన పెనుగొండ, గండికోటలను జయించాడు. తూర్పున శ్రీకాకుళం వరకు రాజ్యాన్ని విస్తరించాడు. అనేక తిరుగుబాట్లను అణచివేశాడు. 1592లో రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్‌కు మార్చాడు. ఇదే సమయంలో మొగలులు విజృంభించి 1590 నాటికి ఉత్తర భారతాన్నంతా ఆక్రమించారు.
అనంతరం వారు దక్కన్‌పై దృష్టి సారించి అహ్మద్‌నగర్‌ను వశపర్చుకున్నారు. ఈ ప్రభావం మహమ్మద్ కులీపై కూడా పడింది. ఎన్నో రకాల ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఇవేవీ కులీ కళాపోషణను ప్రభావితం చేయలేదు. తన ప్రియురాలైన భాగమతి పేరు మీద భాగ్యనగరాన్ని నిర్మించాడు. కులీ ఆమెకు హైదర్ మహెబ్ అనే పేరు పెట్టాడు. దీంతో భాగ్యనగరం హైదరాబాద్‌గా వ్యవహారంలోకి వచ్చింది.
ఇతడు చార్మినార్ (1591), చార్‌కమాన్ (1592), జామామసీద్ (1597-1598)లను నిర్మించాడు. దారుల్ షిఫా, దాద్ మహల్, ఖుదాదాద్ మహల్, నద్ది మహల్‌లను నిర్మించాడు. భాగెమహమ్మది, బన్నత్ ఘాట్, కోహినూర్ తదితర నిర్మాణాలు చేపట్టాడు. ఇవన్నీ ఇతడి కళాభిరుచికి నిదర్శనం.
కులీ మరణం తర్వాత అతడి అల్లుడయిన సుల్తాన్ మహమ్మద్ కుతుబ్‌షా(1612-26) సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు మొగలులతో సఖ్యతగా వ్యవహరించాడు. ఇతడి కాలంలోనే డచ్చివారు, బ్రిటిషర్లు తీరాంధ్ర వెంట వర్తక స్థావరాల్ని నెలకొల్పారు. మహమ్మద్ కుతుబ్‌షా ఖైరతాబాద్ మసీద్‌ను నిర్మించాడు. మక్కా మసీదు నిర్మాణానికి పునాది వేశాడు. 1624లో ఈద్‌గాను నిర్మించాడు. అమ్మాన్ భవనం, నబీబాగ్ కూడా ఇతడి కాలం నాటివే.

పతనం ఆరంభం..
మహమ్మద్ తర్వాత అతడి పెద్ద కుమారుడైన అబ్దుల్లా కుతుబ్‌షా(1626-72) రాజ్యానికి వచ్చాడు. ఇతడు మొగలుల నుంచి స్వతంత్రతను నిలబెట్టుకోలేకపోయాడు. దక్కన్‌లో మొగలులను ఎదిరించిన మలికంబర్ 1626లో, బీజాపూర్ సుల్తాన్ ఇబ్రహీం ఆదిల్ షా 1627లో మరణించారు. వీరి మరణంతోపాటు కొన్ని ఇతర కారణాల వల్ల దక్కన్‌పై మొగలుల దండయాత్రకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
మొగల్ చక్రవర్తి షాజహాన్ 1636లో గోల్కొండపై దండెత్తాడు. అబ్దుల్లా కుతుబ్‌షా అతడితో సంధి చేసుకుని మొగలుల ఆధిపత్యాన్ని అంగీకరించాడు. నాటి నుంచి కుతుబ్‌షాహి రాజ్య క్షీణదశ ప్రారంభమైంది. అబ్దుల్లా ఒకవైపు సామంతుడిగా ఉంటూనే కర్ణాటక రాజ్యంపై ఆధిపత్యం కోసం ప్రయత్నించాడు. తన సేనాని మహ్మద్ సయీద్ మీర్‌జుంలాను 1645లో కర్ణాటకపై దండయాత్రకు పంపాడు. ఫలితంగా కర్ణాటక రాజ్య తూర్పు భాగాలు అబ్దుల్లా రాజ్యంలో భాగమయ్యాయి. 1653లో విశాఖపట్టణం సుల్తాన్ వశమైంది. తీరాంధ్ర గోల్కొండ సామ్రాజ్యంలో విలీనమైంది. ఈ విజయాలతో విదేశీ వర్తకుల వ్యాపార స్థావరాలు గోల్కొండ రాజ్య పరిధిలోకి వచ్చాయి. దీంతో వారికి గోల్కొండ రాజ్యంతో సంబంధాలు ఏర్పడ్డాయి.
కర్ణాటక విజయాలతో అబ్దుల్లా సేనాని మహమ్మద్ సయీద్‌లో అత్యాశ మొదలైంది. ఇతడు తిరుగుబాటు చేసి స్వతంత్రం ప్రకటించుకున్నాడు. దక్కన్ సుబేదార్, షాజహాన్ కుమారుడైన ఔరంగజేబుకు చాడీలు చెప్పాడు. అతడి మాటలు నమ్మిన ఔరంగజేబు 1656లో గోల్కొండపై దండెత్తాడు. అబ్దుల్లా కుతుబ్‌షా అతి కష్టం మీద ఔరంగజేబుతో సంధి చేసుకున్నాడు. కుతుబ్‌షా తన రెండో కుమార్తెను ఔరంగజేబు కుమారుడైన మహమ్మద్ సుల్తాన్‌కు ఇవ్వడానికి అంగీకరించాడు. మహమ్మద్‌ను తన వారసుడిగా ప్రకటించడానికి, కోటి హొన్నులు కప్పం కట్టడానికి అబ్దుల్లా ఒప్పుకున్నాడు. దీంతో గోల్కొండలో మొగల్ అధికారుల ఆధిపత్యం పెరిగింది. ఫలితంగా గోల్కొండ రాజ్యం తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఈ సంక్షోభాన్ని అదనుగా భావించిన ఐరోపా కంపెనీలు కుతుబ్‌షాహీల పట్ల అవిధేయంగా ప్రవర్తించాయి. సంక్షోభానంతరం అబ్దుల్లా వారిని దారిలోకి తెచ్చుకున్నాడు.

తానీషా పాలన
1672లో అబ్దుల్లా మరణించడంతో వారసత్వ వివాదం ఏర్పడింది. అనూహ్య పరిస్థితుల్లో అబుల్‌హసన్ తానీషా (1672-87) కుతుబ్‌షాహీ రాజ్య వారసుడయ్యాడు. తానీషా సుల్తాన్ పదవిని చేపట్టగానే ఔరంగజేబుకు అనేక కానుకలు పంపాడు. మొగలులకు సామంతుడిగా ఉండేందుకు అంగీకరించాడు. ఇందుకు ఔరంగజేబు ఒప్పుకున్నాడు. కానీ తానీషా శివాజీకి సహాయపడకూడదని, పేష్కను సమయానికి చెల్లించాలని షరతులు విధించాడు. మొగలులతో ఎప్పటికైనా ప్రమాదమేనని తానీషా భావించాడు. అందుకే రాజ్యాన్ని పటిష్టం చేసే పనిలో నిమగ్నమయ్యాడు. తాను అధికారంలోకి రావడానికి తోడ్పడిన ముజఫర్‌ను మీర్ జుమ్లా (ప్రధానమంత్రి)గా నియమించాడు. కానీ అతడు అన్ని వ్యవహారాల్లో తలదూర్చేవాడు. అది సహించని తానీషా ముజఫర్‌ను తొలగించాడు. హనుమకొండకు చెందిన మాదన్నను ప్రధానిగా, అక్కన్నను సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించాడు. మాదన్న రాజ్య వ్యవహారాలను చక్కదిద్దాడు. కర్ణాటక ప్రాంతంలో పాశ్చాత్య వర్తకులు సృషించిన అలజడులను అణచివేశాడు. తిరుగుబాటుదారులపై కఠిన చర్యలు తీసుకున్నాడు. ఉన్నత పదవుల నుంచి స్థానికేతరులను తొలగించి స్థానికులను నియమించాడు. నీటి వనరుల నిర్మాణాలు చేపట్టి వ్యవసాయభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాడు. దళారీలను తొలగించి రైతులపై జరిగే దౌర్జన్యాలను అరికట్టాడు. గనులను పునరుద్ధరించి రాజ్య సంపదను పెంచాడు.

ఔరంగజేబు దండయాత్ర
ఇదే సమయంలో ఔరంగజేబు దక్కన్ రాజ్యాలన్నింటినీ నిర్మూలించడానికి ఉద్యుక్తుడయ్యాడు. మొగలుల నుంచి రాజ్యాన్ని రక్షించుకోవడానికి తానీషా 1677లో శివాజీతో సంధి చేసుకున్నాడు. ఈ సంధి కుదరడంలో అక్కన్న మాదన్నలు ముఖ్య పాత్ర పోషించారు. ఇది ఔరంగజేబు ఆగ్రహానికి కారణమైంది. కొంత కాలానికి శివాజీ మరణించాడు. దీంతో ఔరంగజేబు అదను చూసుకొని 1685లో గోల్కొండపై దండెత్తాడు. మొగలు సైన్యానికి ఔరంగజేబు కుమారుడైన షా ఆలం నాయకత్వం వహించాడు.
మొదట గోల్కొండకే విజయం లభించింది. కానీ సేనానుల నమ్మక ద్రోహంతో గోల్కొండ ఓడిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో తానీషా మొగలులతో సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారం పాత బకాయిల కింద మొగలులకు కోటి హొన్నులు చెల్లించాలి. ఏటా రెండు లక్షల హొన్నుల కప్పం చెల్లించాలి. మల్ఖేడు, సేడం ప్రాంతాలను మొగలులకు అప్పగించాలి. అక్కన్న మాదన్నలను పదవుల నుంచి తొలగించాలి. మొదటి మూడు షరతులను తానీషా అమలు చేశాడు.
కానీ అక్కన్న మాదన్నలను తొలగించడంలో ఆలస్యం చేశాడు. ఇది సహించని ముస్లిం సర్దార్లు 1686 మార్చి 24 రాత్రి అక్కన్న మాదన్నలను హత్య చేశారు. వారి తలలను ఔరంగజేబుకు కానుకగా పంపారు. అయినా ఔరంగజేబు సంతృప్తి చెందలేదు. బీజాపూర్ ఆక్రమణ అనంతరం 1687 ఫిబ్రవరి 7న మళ్లీ గోల్కొండపై దండెత్తాడు. ఎనిమిది నెలల హోరాహోరీ యుద్ధం తర్వాత ఒక సేనాని ద్రోహంతో గోల్కొండ మొగలుల వశమైంది. అబుల్ హసన్ తానీషాను బంధించి దౌలతాబాద్ కోటకు తరలించారు. దీంతో కుతుబ్‌షాహీల పాలన అంతరించింది. గోల్కొండ రాజ్యం మొగల్ సామ్రాజ్యంలో భాగమైంది.

కుతుబ్‌షాహీ యుగ విశేషాలు
పాలనా విధానం
రాజు(సుల్తాన్) సర్వాధికారి. కుతుబ్‌షాహీలు తాము దేవుడి ప్రతినిధులమని(జుల్ అల్లా) చెప్పుకున్నారు. రాజుకు సలహాలు ఇవ్వడానికి మంత్రి పరిషత్ ఉండేది. ప్రధాన మంత్రిని పీష్వా అని పిలిచేవారు. పీష్వా తర్వాతి స్థానం మీర్ జుంలా(ఆర్థిక మంత్రి)ది. వీరే కాకుండా ఐనుల్ ముల్క్(యుద్ధ మంత్రి/సర్వ సైన్యాధ్యక్షుడు), మజుందార్(ఆడిటర్ జనరల్), కొత్వాల్ (పోలీస్ అధికారి) మొదలైన అధికారులుండేవారు.
అబుల్‌హసన్ తానీషా కాలంలో గోల్కొండ రాజ్యంలో ఆరు సుబా(రాష్ర్టం)లను ఏర్పాటు చేశారు. సుబాలను 36 సర్కార్లు(జిల్లాలు)గా విభజించారు. సర్కార్లను 517 పరగణా(తాలూకా)లుగా విభజించారు.

కుతుబ్‌షాహీ రాజ్యంలోని సుబాలు
ఒకటో సుబా - మహ్మద్‌నగర్, మెదక్, కౌలాస్, ముల్కనూరు.
రెండో సుబా - ఎల్గందల, వరంగల్, ఖమ్మం, దేవరకొండ.
మూడో సుబా - పానగల్, ముస్తఫానగర్(కొండపల్లి), భువనగిరి, అకర్‌కర్.
నాలుగో సుబా - కోయిల్ కొండ, ఘన్‌పూర్, ముర్తజానగర్(గుంటూరు), మచిలీపట్టణం.
అయిదో సుబా - నిజాం పట్టణం, ఏలూరు, రాజమండ్రి, సికాకోల్.
ఆరో సుబా - కర్ణాటక ప్రాంతం. ఇందులో 16 సర్కార్లు ఉండేవి.
రాష్ర్ట పాలకుడిని తరఫ్‌దార్‌గా, జిల్లా పాలకుడిని ఫౌజుదార్‌గా వ్యవహరించేవారు. పరగణా పాలకుడిని తహసీల్దార్ అని పిలిచేవారు.
గ్రామాల్లో పన్నెండు మంది ఆయగార్లు ఉండేవారని నాటి ఫర్మానాలను బట్టి తెలుస్తోంది. వారు..
పటేల్, కులకర్ణి (కరణం), చౌద్రి (వర్తకుల పెద్ద), పోతేదార్ (నాణేల మారకందారు), దేశ్‌పాండే (గణకుడు), నహని (మంగలి), పారిత్ (చాకలి), పూజారి, సుతార్ (వడ్రంగి), కుంభార్ (కుమ్మరి), జోషి (జోతిష్కుడు), వేశహార(మస్కూరి).
సారంగు తమ్మయ ‘వైజయంతీ విలాసం’అనే గ్రంథాన్ని రచించాడు. ఇందులోని వర్ణనను బట్టి దొంగలను పట్టుకుని, దొంగ సొత్తును కొనుగోలు చేసే కంసాలులను విచారించే అధికారే తలారి(తలవరి) అని తెలుస్తోంది.
కుతుబ్‌షాహీలు హిందూధర్మ సూత్రాల్లో జోక్యం చేసుకోలేదు. గోల్కొండ రాజ్యంలో 84 స్థల, గిరి, వన, జల దుర్గాలు ఉండేవి. వీటిలో ఎక్కువ భాగం తెలంగాణలో ఉండేవి. కేంద్ర సైన్యం, జాగీర్దారీ సైన్యం అని రెండు రకాల సైన్యం ఉండేది.

ఆర్థిక పరిస్థితులు
గోల్కొండ రాజ్యంలో సారవంతమైన తీర భూములు ఉండేవి. ప్రజల ప్రధాన సాంస్కృతిక ధోరణులను సమన్వయ పరచడానికి, సాంఘిక అసమానతలను అదుపు చేయడానికి సూఫీ ఉద్యమం తోడ్పడింది.
నాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. గోల్కొండ సుల్తాన్లు, వారి అధికారులు హుస్సేన్‌సాగర్, ఇబ్రహీంపట్నం, బద్వేల్ లాంటి చెరువులను తవ్వించారు. ఇవే కాకుండా అనేక కాలువలు, బావులను తవ్వించి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. నీటి వనరులకు మరమ్మతు చేయడానికి, ఆయకట్టు భూములకు నీరు అందించడానికి వడ్డెరలను నియమించి, వారికి మేరలు ఏర్పాటు చేశారు.
గోల్కొండ సుల్తాన్ల కృషి వల్ల భూములు విస్తృతంగా సాగులోకి వచ్చాయి. రైతులు వరి, జొన్న, రాగి, పెసర, వేరుశెనగ, కందులతోపాటు పత్తి, పొగాకు, ఆముదం తదితర పంటలను పండించేవారు. అప్పటికే పోర్చుగీసువారు మన దేశంలో పొగాకును ప్రవేశపెట్టారు. పత్తి, పొగాకు పంటల వల్ల ప్రభుత్వ ఖజానాకు అధిక ఆదాయం లభించేది. సంత్రాలు, అంజూర, జామ, నారింజ, మామిడి, అరటి, నిమ్మ, దానిమ్మ లాంటి పండ్ల తోటలను పెంచేవారు.
పదిహేడో శతాబ్దంలో గోల్కొండ రాజ్యంలో మేలిరకం ఇనుము, ఉక్కు ఉత్పత్తి అయ్యేవి. వీటితో కత్తులు, బాకులు మొదలైన యుద్ధ పరికరాలను తయారుచేసేవారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన డమాస్కస్ కత్తుల తయారీలో గోల్కొండ ఉక్కును ఉపయోగించారు. నిర్మల్, ఇందూరు పట్టణాలు ఆయుధ పరిశ్రమకు కేంద్రంగా ఉండేవి. గోల్కొండ రాజ్యం వజ్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. గోల్కొండ వజ్రాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. అబ్దుల్లా కుతుబ్‌షా కాలంలో నూతన వజ్రాల గనులు కనుగొన్నారు. వస్త్ర పరిశ్రమకు ఓరుగల్లు పేరొందింది. ఖమ్మం జిల్లాలోని నాగులపంచలో లభించే నీలిరంగును విదేశాలకు ఎగుమతి చేసేవారు. 17వ శతాబ్దం తొలినాళ్లలో ‘మిరప’ గురించి తెలంగాణ ప్రజలకు తెలిసింది.

సాంఘిక పరిస్థితులు
కుతుబ్‌షాహీల సంస్కృతి తెలంగాణ సంస్కృతిగా రూపుదిద్దుకుంది. ఇతర తెలుగు ప్రాంతాల కంటే మరింత భిన్నమైన సంస్కృతి తెలంగాణలో రూపొందింది. కులీ కుతుబ్‌షా తెలంగాణ ప్రజల వస్త్రాలంకరణను అనుసరించి, వారి అభిమానం చూరగొన్నాడు.
హైదరాబాద్ నగరంలో సుమారు పది లక్షల మంది నివసించేవారు. మొగలులు, ఇరానీలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచున్నారు. హైదరాబాద్‌లో వేశ్యావృత్తి ఉండేది. నాట్యకత్తెలకు ఆదరణ పెరిగింది. అబ్దుల్లా కుతుబ్‌షాతో సహజీవనం చేసిన తారామతి, ప్రేమావతి గొప్ప నాట్యకత్తెలుగా పేరొందారు. కుల వ్యవస్థ కొనసాగింది. కుల కట్టుబాట్లు అధికమయ్యాయి. అనేక ఉపకులాలు స్థిరపడ్డాయి. బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. సతీసహగమన దురాచారాన్ని రూపుమాపడానికి కుతుబ్‌షాహీలు ప్రయత్నించారు.

మత పరిస్థితులు
ఈ కాలంలో తెలుగు ప్రజలు స్మార్త, శైవ, వైష్ణవ మతాలను అనుసరించేవారు. ఈ మతాల మధ్య విభేదాలు తీవ్రంగా ఉండేవి. కుతుబ్‌షాహీలు ప్రజల మత విశ్వసాలను, ఆచార వ్యవహారాలను గౌరవించేవారు. దేవాలయాలకు భూములు దానం చేసేవారు. ప్రతిభను బట్టి తెలుగువారికి అనేక ఉన్నత పదవులిచ్చేవారు. అనేక మంది తెలుగు వారు మీరాసిదార్లుగా, జాగీరుదార్లుగా, దేశ్‌ముఖ్‌లుగా, దేశ్‌పాండేలుగా ఉండటమే అందుకు నిదర్శనం. ఈ ఆదరణ వల్ల తెలుగువారు, ముస్లింలు కలిసిపోయి ఒక సహజీవన సంస్కృతి రూపొందింది. తెలుగు- ముస్లిం మిశ్రమ సంస్కృతి ఏర్పడింది. ఒకరి ఆచారాలు, సంప్రదాయాలను మరొకరు అనుసరించారు. మొహర్రం(పీర్ల) పండుగను తెలుగువారు తాదాత్మ్యతతో జరుపుకొనేవారు. దర్గాలకు వెళ్లేవారు. కందూరు చేసుకునేవారు. అదే విధంగా తెలుగు పండుగలు, ఆచార వ్యవహారాలను ముస్లింలు ఆదరించేవారు.
షబ్-ఏ రాత్ పండుగలో దీపాలు అలంకరించడం దీపావళి నుంచి వచ్చింది. వసంతోత్సవాల్లో రాజులు, ముస్లిం ప్రజలు పాల్గొనేవారు. తిరుపతికి వెళ్లేవారు. అక్కడి బీబీనాంచారమ్మ అలా వెలిసిందే. ముస్లింలలో మంగ్‌నా(నిశ్చితార్థం), వధూవరులను తలుపు దగ్గర ఆపి పరిహాసాలాడటం, వధూవరుల మధ్య అడ్డంగా తెరకట్టడం, తలంబ్రాలు పోసుకోవడం ఇవన్నీ తెలుగువారి ఆచారాల నుంచి వచ్చినవే. వాస్తు శిల్పాల్లోనూ ఈ మిశ్రమ విధానం కనిపిస్తుంది.
కుతుబ్‌షాహీలు పర్షియా నుంచి వచ్చారు. వీరు షియా తెగకు చెందినవారు. తమ మత సంప్రదాయం ప్రకారం పరమత సహనం పాటించారు. సున్నీలను, తెలుగువారిని చిన్నచూపు చూడలేదు. మతయుద్ధాలు చేయలేదు. కులీకుతుబ్‌షా మొహర్రం పండుగను ప్రవేశపెట్టాడు. ఇతడే పీర్ల చావడులను, హుస్సేనీ ఆలంను నిర్మించాడు. షియాలు, సున్నీల మధ్య వైషమ్యాలు కొంత కాలం కొనసాగాయి. బహమనీల కాలంలో ముస్లింలు, ఉర్దూభాష తెలంగాణకే పరిమితం కాగా, కుతుబ్‌షాహీల కాలంలో ఇతర తెలుగు ప్రాంతాలకు కూడా విస్తరించడం నూతన పరిణామం.

కుతుబ్‌షాహీల చిత్రకళ
కులీకుతుబ్‌షా, ఇతర నవాబులు ఢిల్లీ నుంచి చిత్రకారులను రప్పించి పోషించారు. మొగల్ చిత్రకారుల సాన్నిహిత్యంతో కొత్త శైలి రూపుదిద్దుకుంది. దాన్నే దక్కన్ కలం అంటారు. దక్కనీ శైలి సృష్టికర్త మీర్ హసీం. అబ్దుల్లా, తానీషాల కాలంలో ఈ శైలి మరింత వృద్ధి చెందింది.

భాషా సాహిత్యాలు
ఈ కాలంలో ఉర్దూ ‘దక్కనీ ఉర్దూ’గా పేరొందింది. దాని ప్రాభవం ఉచ్ఛస్థితికి చేరింది. హైదరాబాద్‌లో 38 వేల పుస్తకాలున్న గ్రంథాలయం ఉండేది.
కుతుబ్‌షాహీలు తెలుగులో శాసనాలు వేయించారు. తెలుగు భాషను, కవులను, సంస్కృతిని ఆదరించారు. ఉర్దూలో కవిత్వం రాశారు. జమ్షీద్ కుతుబ్‌షా (1543-50) స్వయంగా కవి. గజల్‌లు, గేయాలు రాశాడు. ఇబ్రహీం కుతుబ్‌షా(1550-80) విజయనగర రాజుల దగ్గర ఏడేళ్లపాటు ఆశ్రయం పొందాడు. ఆ సమయంలోనే తెలుగు నేర్చుకున్నాడు. తెలుగు సాహిత్యంలో మల్కిభరాముడిగా ప్రసిద్ధి చెందాడు. ఇతడి దర్బారులో ఉమర్ షా మహ్మద్ అంజూ, అమీర్ ఇమాదుద్దీన్, మహమూద్ షిరాజి, జావీ నవీసుల్, జమాఖాసిం బేగ్ షిరాజి, హుస్సేన్ కులీమీర్జా మొదలైన పండితులుండేవారు. అద్దంకి గంగాధరుడు, మరింగంటి సింగరాచార్యులు, కుందుకూరి రుద్రకవి తదితర తెలుగు కవులను ఇబ్రహీం కుతుబ్‌షా పోషించాడు . తెలుగు వనిత అయిన భాగీరథిని ఇతడు వివాహమాడాడు. తారిఖ్ కుతుబ్‌షాహి గ్రంథ రచయిత కుర్షాబిన్ కబ్బాదుల్ హుసేన్ ఇతడి కాలానికి చెందినవాడే.
ఈ యుగంలో కనిపించే తొలి కవి చరిగొండ ధర్మన. ఇతడు పెద్దన, సూరన, నందిఘంట కవుల కంటే ముందే రుతువర్ణన, నాయికా వర్ణన, వేటవర్ణన లాంటి అష్టాదశ వర్ణనలు చేశాడు. దీన్ని బట్టి ధర్మనను ప్రబంధ కవిత్వ మార్గదర్శకుడిగా చెప్పవచ్చు. కల్పిత కథ ఆధారంగా ఇతడు చిత్రభారతాన్ని రచించాడు. గయోపాఖ్యానం, కృష్ణార్జున యుద్ధం లాంటి యక్షగానాలు రావడానికి చిత్ర భారతమే మూలం. మహబూబ్‌నగర్ (చరిగొండ సీమ)కు చెందిన ధర్మన్న కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి వెళ్లి, ఎనుముల పెద్దన దగ్గర ఆశ్రయం పొందాడు. చిత్రభారతాన్ని అతడికే అంకితమిచ్చాడు. ఇందులో నాటి చారిత్రకాంశాలు కనిపిస్తాయి. చరిగొండ ధర్మన్న సోదరుడు చరిగొండ నరసింహకవి. ఇతడు కూడా కవే. పింగళి సూరన కంటే ముందే సూరన అనే మరో కవి కల్పిత కావ్యం (ధనాభిరామం) రాశాడు.
పోశెట్టి లింగ కవి నవచోళ చరిత్ర, మల్హణ చరిత్ర, శంకర దాసమయ్య చరిత్ర, వీర సంగమయ్య దేవ చరిత్ర, శిష్య ప్రబోధం అనే ద్విపద కావ్యాలను రాశాడు. పోశెట్టి అనే పేరు ఇప్పటికీ తెలంగాణలో వాడుకలో ఉంది. ఈ కావ్యంలోని కైకిలి(దినసరి కూలి), కొండెంగ, మోటు, ఉరువడి, పుటిక, తునక తదితర పదాలు తెలంగాణాలోనే వాడుకలో ఉన్నాయి. అందువల్ల ఇతడు తెలంగాణకు చెందినవాడే కావచ్చు.
ఆసూరి మరింగంటి సింగరాచార్యులు దశరథ రాజనందన చరితను రచించాడు. ఇది తెలుగు సాహిత్యంలో తొలి నిరోష్ఠ్య రచన. ఇతడే తొలిసారిగా అచ్చ తెలుగులో సీతాకల్యాణం అనే నిరోష్ఠ్య రచన చేశాడు. తొలి త్య్రర్ధి, చతురర్ది (నలరాఘవయాదవపాండవీయం) రచన కూడా ఇతడిదే. తిరునామరచనకు కూడా సింగరాచార్యులే ఆద్యుడు. ఇతడు ఇబ్రహీం కుతుబ్‌షా నుంచి అగ్రహారాన్ని పొందాడు.
మల్కిభరాముడి(ఇబ్రహీం కుతుబ్‌షా) మరో ఆస్థాన కవి అద్దంకి గంగాధరుడు (1525-80). ఇతడిని రామరాజభూషణుడితో పోల్చవచ్చు. ఇతడు ‘తపతీ సంవరణోపాఖ్యానం’ను రచించి, ఇబ్రహీం కుతుబ్‌షాకు అంకితమిచ్చాడు. ఈ కావ్యంలో మల్కిభరాముడి ప్రేమ కథను వర్ణించాడు. ఈ శృంగార కావ్యంలో సమకాలీన సాంఘిక విశేషాలెన్నో కనిపిస్తాయి.
సిద్ధరామకవి, గంగాధరుడి సమకాలికుడు. ఇతడు ప్రభుదేవర వాక్యం అనే వేదాంత వచన గ్రంథాన్ని రచించాడు. స్తుతి వచన ప్రక్రియకు ఆద్యుడు కృష్ణమాచార్యుడు. శివస్తుతి వచనాలకు ఆద్యుడు గంగాధరయ్య. వీరిద్దరూ తెలంగాణ వారే. మరింగంటి జగన్నాథాచార్యులు(శ్రీరంగనాథవిలాసం), అప్పలాచార్యులు కూడా మల్కిభరాముడి వద్ద ఆశ్రయం పొందారు.
కందుకూరి రుద్రకవి ఈ యుగంలోని అగ్రశ్రేణి కవుల్లో ఒకడు. ఇబ్రహీం కుతుబ్‌షా దేవరకొండ దుర్గపాలకుడిగా ఉన్నప్పుడే ఇతడికి కుతుబ్‌షాతో పరిచయం ఉంది. కుతుబ్‌షా రాజైన తర్వాత అతడి నుంచి రెంటచింతల (ద్వితింత్రిణి)ను అగ్రహారంగా పొందాడు. ఇతడు నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని కందుకూరుకు చెందినవాడని తెలుస్తోంది. ఇతడు ‘సుగ్రీవ విజయం’ను రచించాడు. దీన్ని తొలియక్షగానంగా భావిస్తారు. నిరంకుశోపాఖ్యానం, జనార్ధనాష్టకం, బలవదరీ శతకం, జనార్ధనాష్టక స్తోత్రం, గువ్వలచెన్నని శతకం తదితర గ్రంథాలను రుద్రకవి రచించాడు. ఇతడి రచనల్లో నిరంకుశోపాఖ్యానం ముఖ్యమైంది. ఇది శృంగార ప్రధాన సాంఘిక కావ్యం. ఇందులో నాటి సాంఘిక జీవనాన్ని చిత్రీకరించారు.
మల్కిభరాముడి అనుచరుడైన అమీన్‌ఖాన్ తొలి అచ్చతెలుగు కావ్యకర్త పొన్నిగంటి తెలగనను ఆదరించాడు. అప్పటి వరకు కవులు అచ్చ తెలుగులో పద్యాలు మాత్రమే రాశారు. కావ్యాలను రాయలేదు. తెలగన అచ్చ తెలుగు కావ్యం రాసి, పాల్కుర్కి దేశిమార్గాన్ని సుసంపన్నం చేశాడు.
మహమ్మద్ కులీ కుతుబ్‌షా
ఇబ్రహీం కుతుబ్‌షా తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్‌షా గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడి తల్లి భగీరథి. మహమ్మద్ కులీ తన ప్రేయసి అయిన భాగమతి పేరుమీద భాగ్యనగరాన్ని నిర్మించాడు. చార్మినార్ లాంటి అనేక కట్టడాలను నిర్మించాడు. ఇతడు మీర్జా మహమ్మద్ అమీన్, ముల్లా మూమిన్, మిసాక్ సుబాజ్ వలి అనే పార్సీ కవులను ఆదరించాడు. వజాహి, గవాస్సీ అనే ప్రముఖ ఉర్దూ కవులకు ఆశ్రయమిచ్చాడు. మహమ్మద్ కులీ స్వయంగా కవి, గ్రంథకర్త. ఫారసీ కవితా సంకలన కర్తయిన అలామ మీర్ మోమిన్ ఇతడి కాలంలో పీష్వా పదవిని అలంకరించాడు. పటమట సోమయాజిని ఆస్థాన కవిగా నియమించాడు. సారంగు తమ్మయ్య, కామారెడ్డిలను కులీ సన్మానించాడు. ఇతడి ఆస్థానంలో గణేశ పండితుడు కూడా ఉండేవాడు.
ఉర్దూ కవుల్లో కులీ ప్రథముడు కాకపోయినా ఆ భాషలోని రచనలు ఒక సంపుటంగా పుస్తక రూపంలో వెలువడటం ఈయనతోనే మొదలైంది. మహమ్మద్ కులీ తొలి ఉర్దూ రాజ కవి. ఇతడు పార్సీ, తెలుగు భాషల్లోనూ కవిత్వం రాశాడని భావిస్తారు. కానీ అవి అలభ్యం. మహమ్మద్ కులీ కవితల సంకలనాన్ని అతడి అల్లుడైన సుల్తాన్ మహమ్మద్ కుతుబ్‌షా ‘దివాన్’ పేరుతో వెలువరించాడు. ఇతడి కవిత్వం పర్షియన్, భారతీయ సంస్కృతుల సమ్మేళనం. కులీ కవితల్లో తెలుగు పదాలు, ఆచార వ్యవహారాలు, హోళీ, బతుకమ్మ పండుగల ప్రస్తావన ఉంది. అప్పటి వరకూ మత సంబంధంగా ఉన్న ఉర్దూ కవిత్వంలో లౌకిక భావనను ప్రవేశపెట్టిన కవుల్లో కులీ ప్రథముడు. నాటి తెలుగు, ఉర్దూ కవిత్వాల తరహాలోనే ఇతడిది ప్రధానంగా శృంగార కవిత్వం.
సారంగు తమ్మయ్య
తమ్మయ కులీ కుతుబ్‌షాకు ఆప్తుడు. గోల్కొండకు కరణీకం చేసేవాడు. అనేక కావ్యాలను రచించాడు. హరిభక్తి సుధోదయం అనే గ్రంథానికి తమ్మయ్య రాసిన వ్యాఖ్యానంలో భగీరథ పట్టణ ప్రస్తావన ఉంది. ఈ పట్టణమే భాగ్యనగరం(హైదరాబాద్). తమ్మయ్య ముఖ్య రచన ‘వైజయంతీ విలాసం’. తెలుగులో వెలువడిన గొప్ప శృంగార కావ్యాల్లో ఇదొకటి. ఇందులో భక్తిని, శృంగారాన్ని మేళవించారు.
నేబతి కృష్ణమంత్రి మహమ్మద్ కులీ ఆస్థానకవి. కులీకి మంచి స్నేహితుడైన ఇతడు మంత్రిగానూ వ్యవహరించాడు. ఇతడు రాజనీతి రత్నాకరం అనే గ్రంథాన్ని రాశాడు. నాటి రాజకీయ పరిస్థితులు, సాహిత్యం తదితర విషయాల గురించి ఈ గ్రంథం తెలియజేస్తోంది.
దోమకొండ సంస్థానం
దోమకొండ (బిక్కనవోలు, నిజామాబాద్ జిల్లా) సంస్థానాన్ని తెలంగాణలో తొలి సంస్థానంగా భావించవచ్చు. ఈ సంస్థాన మూల పురుషుడు కాచారెడ్డి (1415-35). ఇతడి మునిమనవడైన ఒకటో ఎల్లారెడ్డి (1500-25) కాలం నుంచి ఈ సంస్థానం సాహిత్యాన్ని పోషించింది. బాలభారతం, కిరాతార్జునీయం అనే గ్రంథాలను ఎల్లారెడ్డి అంకితం తీసుకున్నాడు. అనేక మంది కవిపండితుల్ని పోషించాడు. ప్రస్తుతం వారి కావ్యాలేవి లభించడం లేదు. జంగమరెడ్డి, రెండో కామిరెడ్డి, రెండో ఎల్లారెడ్డి, రెండో మల్లారెడ్డి అనే నలుగురు ఇతడి మనవళ్లు. చివరి ముగ్గురు కృతిభర్తలు, కృతికర్తలు. ఈ ముగ్గురూ 16 శతాబ్దం ఉత్తరార్ధానికి చెందినవారు.
కామిరెడ్డి(1530-1600) తన సహాధ్యాయి అయిన పటమట సోమనాథ సోమయాజిని ఆస్థాన కవిగా నియమించాడు. సోమయాజి ‘సూత సంహిత’ను అనువదించి కామిరెడ్డికి అంకితమిచ్చాడు. బ్రహ్మోత్తర ఖండాన్ని కామిరెడ్డి సోదరుడైన రెండో ఎల్లారెడ్డికి అంకితమిచ్చాడు. సోమయాజి గ్రంథాల ద్వారా దోమకొండ సంస్థాన విషయాలు తెలుస్తున్నాయి. రెండో ఎల్లారెడ్డి కృతికర్త కూడా. ఆయన వాసిష్ఠం, లింగపురాణం రచించాడు. కానీ అవి అలభ్యం. కామిరెడ్డి చివరి తమ్ముడైన రెండో మల్లారెడ్డి రాజకవి మల్లారెడ్డిగా ప్రసిద్ధి చెందాడు. ఇతడు ఎన్నో గ్రంథాలు రచించాడు. కానీ ఆయన రాసిన షట్చక్రవర్తి చరిత్ర, శివధర్మోత్తరం, పద్మపురాణం అనే గ్రంథాలు మాత్రమే లభిస్తున్నాయి.
ఉర్దూ భాషకు స్వర్ణయుగం..
పైడిమర్రి వెంకటపతి (1570-1640) అనే కవి కులీకుతుబ్‌షా కాలానికి చెందినవాడు. ఇతడు హైదరాబాద్, బీదర్ పరిసర ప్రాంతాల్లో నివసించాడు. బ్రౌన్, బహజనపల్లి లాంటి వాళ్లు ఈ కవిని ప్రామాణికుడిగా భావించారు. స్కంధపురాణంలోని 11 శ్లోకాల కథను తనదైన శైలిలో వర్ణించాడు. దీన్ని ‘చంద్రాంగద చరిత్ర’ అనే రసవత్ప్రబంధంగా మలిచాడు. తన పూర్వీకుల మాదిరిగానే మహమ్మద్ కులీ కుతుబ్‌షా కూడా కవి పండితులను పోషించాడు. ఇతడి ఆస్థాన కవి మీర్ మోమెన్. సయ్యద్ మీర్ కుతుబుద్దీన్, సయ్యద్ కమాలుద్దీన్, మాజ్ సదరానీ తదితర పండితులు ఇతడి ఆస్థానంలో ఉండేవారు.
మహమ్మద్ కులీ కుతుబ్‌షా తర్వాత సుల్తాన్ అబ్దుల్లా కులీ కుతుబ్‌షా రాజయ్యాడు. ఇతడు సంస్కృత ‘శుకసప్తతి’ని తోతినామా పేరుతో పార్సీ భాషలోకి అనువాదం చేయించాడు. దాన్నే ‘స‌బ్‌ర‌న్‌’ (కామరూప కళాకథలు) పేరుతో ఉర్దూలోకి అనువదింపజేశాడు. ఇతడు ఉర్దూ భాషకు చాలా సేవ చేశాడు. ఇతడి పాలనా కాలం ఉర్దూ భాషకు స్వర్ణయుగం. ఇతడు కవిపండిత పోషకుడే కాకుండా స్వయంగా కవి. అబ్దుల్లా పేరుతో కవితలు వెలువరించాడు. ఇతడి ఆస్థానంలో అలామీ మీర్ మజీదుద్దీన్, మౌలానా రౌనఖీ మొదలైన ఎనిమిది మంది కవి పండితులుండేవారు. గవాసీ ఇబిన్ నిషాత్ లాంటి గొప్పకవులను ఇతడు ఆదరించాడు. గవాసి ‘తోతినామా’ అనే కథలు రాశాడు. తబీయ అనే కవి బహురావగుల్ అనే మనోరంజకమైన కథను రాశాడు. అబ్దుల్లా కులీ కుతుబ్‌షా ఆస్థానంలో తులసీమూర్తి లాంటి తెలుగు కవులు కూడా ఉండేవారు. క్షేత్రయ్య ఈ రాజును దర్శించాడు. అబ్దుల్లా పార్సీ, తెలుగు, మరాఠీ భాషల్లో కవిత్వం చెప్పేవాడు.
హరివాసర మహాత్మ్యం రాసిన మరింగంటి వెంకట (ప్రథమ) నరసింహాచార్యులు, శశిబిందు చరిత్రం రచయిత చరిగొండ నరసింహకవి, కూర్మపురాణాన్ని రచించిన రాజలింగ కవి ఈ కాలానికి చెందినవారే. బమ్మెర కేసకవి - మల్లకవి, వజ్రాభ్యుదయాన్ని రాసిన కోననారాయణ, రాజేశ్వర విలాసం రచయిత పిల్లలమర్రి వెంకటపతి, చెన్నబసవ పురాణాన్ని రచించిన గోపతి లింగకవి తదితరులు కూడా ఈ కాలానికి చెందినవారే. ఓరుగల్లుకు చెందిన కాసెసర్వప్ప (1600) ఏకామ్రనాథుడి ‘ప్రతాపరుద్ర చరిత్ర’ను అనుసరించి ద్విపదలో ‘సిద్దేశ్వర చరిత్ర’ రాశాడు. ఈ గ్రంథాన్ని వ్యవహారిక భాషలో రచించాడు.
ఎలకూచి బాలసరస్వతి
తెలంగాణ కుతుబ్‌షాహీల పాలనలో ఉన్నప్పటికీ సరిహద్దు ప్రాంతాలు ఇతర రాజుల చేతులు మారుతూ వచ్చాయి. సురభి మాధవరాయలు విజయనగర అళియరాయల నుంచి జటప్రోలును(కొల్లాపూర్) కానుకగా పొందాడు. తర్వాత అతడి కుమారులు అబ్దుల్లా కుతుబ్‌షా నుంచి సనదు రూపంలో జటప్రోలు సంస్థానాన్ని పొందారు. రేచర్ల పద్మనాయకులైన వీరికి సురభి వంశనామమైంది. ఈ వంశానికి చెందిన సురభి మాధవరాయలు(1620-70) చంద్రికా పరిణయమనే ప్రౌఢ కావ్యాన్ని రచించాడు. సురభి మాధవరాయల ఆస్థానకవి ఎలకూచి బాలసరస్వతి (1570-1650). ఆంధ్రశబ్ద చింతామణి ద్వారా ఇతడి పేరు చర్చనీయాంశమైంది. సంస్కృతంలో రాసిన ఈ తొలి తెలుగు వ్యాకరణ గ్రంథం నన్నయ రచనా? కాదా? బాలసరస్వతే రాసి నన్నయ పేరు పెట్టాడా? అనే విషయాలు చర్చనీయమయ్యాయి. మాధవరాయలతోపాటు ఇతడు కూడా ‘చంద్రికా పరిణయం’ రాశాడు. కానీ ఈ రెండింటిలో వేర్వేరు కథలున్నాయి. ఇతడు భర్తృహరి సంస్కృతంలో రాసిన శృంగార, నీతి, వైరాగ్య శతకాలను సుభాషిత రత్నావళి పేరుతో అనువదించాడు. మాధవరాయల తండ్రయిన మల్లభూపాలుడికి సుభాషిత రత్నావళిని అంకితం చేశాడు. ఇది తొలి అనువాదం. ‘యాదవ రాఘవ పాండవీయం’ అనే త్య్రర్థి కావ్యంతో పాటు మొత్తం పది గ్రంథాలను ఇతడు రచించాడు. ఇతడి గ్రంథాల వల్ల జటప్రోలు, పర్తియాల (జూపల్లి వారు) సంస్థానాల విశేషాలు తెలుస్తున్నాయి.
బాలసరస్వతి ఆంధ్రశబ్ద చింతామణికి వ్యాఖ్య రాసిన కొద్ది కాలానికే కాకునూరి అప్పకవి అదే గ్రంథానికి భాష్యం లాంటి ప్రసిద్ధమైన అప్పకవీయం రాశాడు. అప్పకవి తెలంగాణ వాడేనని బూర్గుల రామకృష్ణారావు నిరూపించారు. అప్పకవీయం లక్షణ గ్రంథమైనా, సందర్భాన్ని బట్టి ‘నిజదేశంబుల వేషభాషలపయిన్ని త్యాభిమానస్థులై ప్రజమెచ్చన్’ అని ప్రాంతాభిమానాన్ని చాటాడు. సాధ్వీజనధర్మం (ద్విపదకావ్యం), అనంత వ్రతకల్పం(కావ్యం), శ్రీశైలమల్లికార్జునుడి మీద శతకం, అంబికావాదం (యక్షగానం), కవి కల్పకం (లక్షణ గ్రంథం) మొదలైన ఇతర గ్రంథాలు కూడా అప్పకవి రచించాడు. కానీ ఇవి లభ్యం కావడం లేదు.
దేవరకొండ పాలకుడైన పొనుగోటి జగన్నాథరాయలు ‘కుముదవల్లీ విలాసం’ రచించాడు. ఇందులోని ఇతివృత్తం భక్తరామదాసు జీవితానికి దగ్గరగా ఉంటుంది.
కుతుబ్‌షాహి వంశంలో చివరి రాజులైన అబ్దుల్లా కుతుబ్‌షా (1626-72), అబ్దుల్ హసన్ తానీషా (1672-87) వద్ద అక్కన్న, మాదన్న అధికారులుగా పనిచేశారు. వారి మేనల్లుడైన కంచర్ల గోపన్న (భక్తరామదాసు) భద్రాచలం తహశీల్దార్ అయ్యాడు. తొలి సంకీర్తనాచార్యుల్లో ఒకడిగా రామదాసు ప్రసిద్ధి చెందాడు. ఇతడి జీవితం గురించి యక్షగానం వచ్చింది. దీన్ని బట్టి రామదాసు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. ఇతడి కీర్తనల్లో పాండిత్య ప్రకర్ష ఉండదు. అవి ఆర్తితో, సహజభక్తి భావావేశంతో అప్రయత్నంగా వచ్చాయి. దేశీయ గేయ రీతులను పుణికి పుచ్చుకున్నాయి. ఇతడు రాసిన ‘దాశరథి శతకం’ కూడా ప్రసిద్ధి చెందింది. భక్తరామదాసు పేరు వినగానే అబుల్ హసన్ తానీషా పేరు స్ఫురిస్తుంది. రామదాసును జైల్లో పెట్టిన నిర్దయుడిగానే ఇతడి గురించి తెలుసు. కానీ ఇతడు రసహృదయం ఉన్న కవి. ఇతడు పార్సీ, తెలుగు, మరాఠీ భాషల్లో కవిత్వం చెప్పేవాడు. తానీషా ఆస్థానంలో లతీఫ్, షాహినూరి, మీర్జాగులాం అలీ లాంటి ప్రసిద్ధ కవులుండేవారు. ఇతడి కాలంలో వజ్జి, గవాసీ తదితర ఉర్దూ కవులు తమ కవిత్వం ద్వారా ఉర్దూ భాషాభివృద్ధికి తోడ్పడ్డారు. ఉర్దూ రాజభాషగా పరిణతి చెందింది. అక్కన్న, మాదన్న, లింగన్నలకు ముఖ్య పదవులిచ్చాడు. పరమత సహనం చూపి ఉదార స్వభావిగా పేరొందాడు.
అష్టదిగ్గజ్జాల్లో ఒకడైన తెనాలి రామలింగడు (కృష్ణుడు) కాకుండా మరో తెనాలి రామలింగకవి (1666-86) ఉన్నాడు. విశ్వ బ్రాహ్మణుడైన ఇతడు అక్కన్న, మాదన్నల వద్ద ఆశ్రయం పొందాడు. ఇతడు ధీరజనమనో విరాజితం (పరిమళ చోళచరిత్ర) అనే కావ్యాన్ని రాశాడు. విశ్వ బ్రాహ్మణులకు జరిగిన అన్యాయాలే ఈ ప్రబంధంలోని కథావస్తువు.
ఇతర కవులు..
పెన్గలూరి వెంకటాద్రి రామోదాహరణం, భువన మోహినీ విలాసం అనే గ్రంథాలను రచించాడు. పదిహేడో శతాబ్దికి చెందిన విశ్వనాథయ్య సిద్దేశ్వర పురాణం అనే ద్విపద రాశాడు. అన్నంభట్టు తర్క సంగ్రహాన్ని, కర్పూరం కృష్ణమాచార్యులు భగవద్గీత ద్విపదను రచించారు. అత్తాను రామానుజాచార్యుడు శ్రీ రుక్మిణీకురవంజి అనే గ్రంథాన్ని రాయగా, పూడూరి కృష్ణయామాత్యుడు భగవద్గీత యథాశ్లోకానువాదం చేశాడు. శ్రీనాథుని వెంకటరామయ్య అశ్వరాయ చరిత్ర రాశాడు. అన్నమయ్య తర్వాత ఎక్కువ కీర్తనలు (3476) రాసిన ముష్టిపల్లి వేంకటభూపాలుడు ఈ కాలానికి చెందినవాడే. లక్ష్మీ శకవి, కాండ్రవేటి రామానుజాచార్యులు, ఎడపాటి ఎర్రన, సింహాద్రి వెంకటాచార్యులు, మరింగంటి వేంకట (ద్వితీయ) నరసింహాచార్యులు (1650-1720), సురభి నర్సింగరావు, బోరవెల్లి కృష్ణప్ప కూడా ఈ కాలానికి చెందిన కవులే. వీరే కాకుండా కుతుబ్‌షాహీల కాలానికి చెందిన ఎంతో మంది కవులు తెలుగు సాహిత్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు.

రచయితలు

 రచనలు

సారంగు తమ్మయ్య

 వైజయంతీ విలాసం

నేబతి కృష్ణమంత్రి

 రాజనీతి రత్నాకరం

మరింగంటి వెంకట (ప్రథమ) నరసింహాచార్యులు

 హరివాసర మహాత్మ్యం

కాసెసర్వప్ప

 సిద్దేశ్వర చరిత్ర

సురభి మాధవరాయలు

 చంద్రికా పరిణయం (కావ్యం)

ఎలకూచి బాలసరస్వతి

 యాదవ రాఘవ పాండవీయం

పొనుగోటి జగన్నాథరాయలు

 కుముదవల్లీ విలాసం

గవాసి

 తోతినామా (అనువాద కథలు)

Published date : 02 Dec 2015 04:58PM

Photo Stories