Skip to main content

కాకతీయులు

కాకతీయులు రాష్ర్టకూట వంశానికి చెందినవారు. కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చి, ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతమంతటా విస్తరించారు. మొదట రాష్ర్టకూట, కల్యాణీ (పశ్చిమ) చాళుక్య రాజులకు సైన్యాధ్యక్షులు, మాండలికులు, సామంతులుగా ఉండి తర్వాత స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. ప్రత్యర్థులుగా ఉన్న ముదిగొండ చాళుక్యులను, వేములవాడ చాళుక్యులను, కందూరు చోడులను, పొలవాస రాజులను, నగునూరు రాజులను ఓడించి తెలంగాణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తొలి కాకతీయులు (కాకతీయ వంశంలోని ఆదిపురుషులు) రాష్ర్టకూటుల సేనానులుగా తెలంగాణకు వచ్చారని పీవీ పరబ్రహ్మశాస్త్రి నిరూపించారు. వీరు తమ పేరు చివరన రాష్ర్టకూట నామాన్ని (గుండియ రాష్ర్టకూట, ఎర్రయ రాష్ర్టకూట) ధరించేవారు. రాష్ర్టకూటుల రాజ చిహ్నమైన ‘గరుడ’(గరుడబేతయ)ను తమ పతాకాలపై ఉంచుకునేవారు. రాష్ర్టకూటుల ఆస్థాన మతమైన జైనాన్ని అవలంభించడం, వారి వృష్టి వంశాన్నే తమ వంశంగా చెప్పుకోవడం లాంటి కారణాల వల్ల కాకతీయులు రాష్ర్టకూట వంశస్థులేనని స్పష్టమవుతోంది. స్థానిక (తెలంగాణ) బోయ, పుళింద జాతులవారు జైనమతం ద్వారా సాంఘికోన్నతి సాధించి రాష్ర్టకూటుల వద్ద సైనికోద్యోగులుగా చేరి క్రమంగా సామంతులయ్యారనే అభిప్రాయమూ ఉంది. ఈ వంశానికి ఆద్యుడైన వెన్నరాజు (క్రీ.శ.750-768) రాష్ర్టకూట సేనాని, సామంతుడు. ఆదిలాబాద్ పశ్చిమప్రాంతం, బాసర, ముథోల్, కుబేరు(కుబీర్), భైంసా(మహిషా) ప్రాంతాలు ఇతని రాజ్యంలో ఉండేవి. ఇతడి తర్వాత మొదటి గుండరాజు (క్రీ.శ.768-824), రెండో గుండరాజు (క్రీ.శ.824 - 870), మూడో గుండరాజు (క్రీ.శ.870 - 895) రాష్ర్టకూటుల సేనానులుగా, సామంతులుగా పనిచేశారు. వీరి కాలం తదితర విషయాల్లో చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి.

ఎర్రయరాజు (895-940)
ఈ వంశంలో మొదటి నలుగురి తర్వాత ఎర్రయరాజు (క్రీ.శ.895-940) కూడా రాష్ర్టకూటుల సేనానిగా కురవాడి సీమను పాలించాడు. వేంగి చాళుక్యులకు లోబడి ముదిగొండ చాళుక్యులు పాలించిన నేటి ఖమ్మం, వరంగల్ జిల్లాలోని కొరవి ప్రాంతమే కురవాడి సీమ. ముదిగొండ చాళుక్యులను తరిమేసి రాష్ర్టకూటులు ఎర్రయరాజును ఈ ప్రాంతానికి సామంతుడిగా నియమించారు. అయితే క్రీ.శ.934లో ముదిగొండ చాళుక్యులు ఆ ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించారు. ఎర్రయ కొడుకు బేతియకు పెద్ద ప్రాధాన్యం లేదు. తర్వాత బేతియ కొడుకు నాలుగో గుండరాజు(క్రీ.శ.955-990) రాష్ర్టకూటుల సేనానిగా నియమితుడై కొరవిసీమను తిరిగి ఆక్రమించాడు. తూర్పు చాళుక్యులైన రెండో అమ్మరాజు, దానార్ణవుడి మధ్య కుటుంబ కలహాలు తలెత్తాయి. నాలుగో గుండరాజు దానార్ణవుడి పక్షం వహించి కొరవిసీమను పొందాడు.
క్రీ.శ.973లో కల్యాణీ చాళుక్య రెండో తైలపుడు రాష్ర్టకూట రాజ్యాన్ని ఆక్రమించాడు. దీంతో తైలపుణ్ని ఆశ్రయించిన ముదిగొండ చాళుక్య బొట్టు బేతరాజు.. విరియాల ఎర్రసేనాని ద్వారా తిరిగి కొరవిసీమను పొందగలిగాడు. దీంతో కాకతీయులు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. కానీ తన భార్య విరియాల కామసాని వినతి మేరకు ఎర్రసేనాని కల్యాణీ చాళుక్య చక్రవర్తిని ఒప్పించి మొదటి బేతరాజు(క్రీ.శ.992-1052)ను అనుమకొండ విషయపాలకుడిగా నియమించాడు. కామసాని మొదటి బేతరాజు (గరుడ బేతరాజు) మేనత్త, గుండరాజు సోదరి.

మొదటి ప్రోలరాజు
బేతరాజు కల్యాణీ చాళుక్య సామంతుడిగా స్థిరపడ్డాడు. ఇతడి రాజ్యం కొరివిసీమ సరిహద్దు నుంచి కరీంనగర్ మండలంలో ఉన్న శనిగరం వరకు వ్యాపించింది. బేతరాజు తర్వాత అతడి కొడుకు మొదటి ప్రోలరాజు (క్రీ.శ.1052-1076) రాజ్యానికొచ్చాడు. ఇతడు వేములవాడ చాళుక్యరాజు భద్రగుణ్ణి (మూడో బద్దెగుడు) ఓడించి సబ్బిసాయర మండలం(కరీంనగర్ ప్రాంతం)లోని కొన్ని ప్రాంతాలను జయించాడు. అనుమకొండ విషయాన్ని మొదటి బేతరాజు తొలుత పొందినప్పటికీ శాశ్వతమాన్యంగా పొందింది మాత్రం ప్రోలరాజే. ప్రోలుడు చిత్రకూటలో అరాచకత్వాన్ని అణచివేయడం, బద్దెగుణ్ని జయించడం, కొంకణంపై విజయం సాధించడం వల్ల అతడి శౌర్యప్రతాపాలకు గుర్తింపుగా చక్రవర్తి అనుమకొండను శాశ్వతమాన్యంగా ఇచ్చాడు.

రెండో బేతరాజు
ఒకటో సోమేశ్వరుడు క్రీ.శ.1068లో మరణించాడు. తర్వాత చక్రవర్తిగా వచ్చిన రెండో సోమేశ్వరుణ్ని తొలగించి అధికారంలోకి రావాలని ఆరో విక్రమాదిత్యుడు వీలైనంత మంది మాండలికులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రోలుడు, అతడి కుమారుడు రెండో బేతరాజు.. ఆరో విక్రమాదిత్యుడికి అండగా నిలిచారు. అది ప్రోలుడి తర్వాత రాజైన రెండో బేతరాజు (క్రీ.శ.1076-1108)కు ఉపయోగపడింది. పారమార జగద్దేవుడు స్వాతంత్య్రం ప్రకటించుకోవడమూ దీనికి దోహదం చేసింది. జగద్దేవుడి నుంచి సబ్బి సహస్రం మొత్తాన్ని విక్రమాదిత్యుడు బేతరాజుకు ఇచ్చినట్లు పద్మాక్షి ఆలయ శాసనం ద్వారా తెలుస్తోంది. శనిగరం ప్రాంతంతోపాటు సబ్బి సహస్రం కాకతీయ రాజ్యంలో చేరాయి. ముదిగొండ చాళుక్యుల రాజ్యంలోని కొన్ని భాగాలు కూడా ఇతడి రాజ్యంలో చేరాయి. ఇతడు అనుమకొండలో బేతేశ్వరాలయాన్ని, తన తండ్రి పేరుతో ప్రోలేశ్వరాలయాన్ని నిర్మించాడు.

రెండో ప్రోలరాజు
బేతరాజు తర్వాత ఇతడి పెద్ద కొడుకు దుర్గరాజు (క్రీ.శ.1108-క్రీ.శ.1116) రాజయ్యాడు. పదవీచ్యుతుడైన కొలనుపాక రాజు జగద్దేవుని ప్రోత్సాహంతో పొలవాస పాలకుడు మేడరాజు స్వాతంత్య్రం పొందడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో పారమార జగద్దేవుని స్థానంలో కుమార సోమేశ్వరుడు(క్రీ.శ.1108-1125) కొలనుపాక రాజప్రతినిధిగా నియమితుడయ్యాడు. ఈ తిరుగుబాట్లను అణచడానికి కుమార సోమేశ్వరుడికి అండగా నిలిచిన రెండో ప్రోలరాజు(క్రీ.శ.1116-1157) జగద్దేవుడిని పారదోలి సోదరుడు దుర్గరాజును పదవీచ్యుతుణ్ని చేసి సింహాసనం అధిష్టించాడు. చాళుక్య చక్రవర్తుల నుంచి స్వాతంత్య్రం పొందడానికి ప్రయత్నించిన సామంతులందరితో యుద్ధం చేసి ఓడించాడు. ఈ రకంగా తెలంగాణ మొత్తాన్ని జయించి కల్యాణీ చాళుక్య ప్రతాపచక్రవర్తి రెండో జగద్దేకమల్లుడు (క్రీ.శ.1138-1150)కి విధేయుడిగా ఉన్నాడు.

రెండో ప్రోలరాజు విజయాలు
కొలనుపాక రాజప్రతినిధిగా నియమితుడైన కుమార సోమేశ్వరుడు తన తండ్రి విక్రమాదిత్యుడి అనంతరం క్రీ.శ.1126లో మూడో సోమేశ్వరుడిగా రాజ్యానికొచ్చాడు. అంతకుముందు నుంచే కందూరునాడును పాలిస్తున్న యువరాజు కుమార తైలపుడు (క్రీ.శ.1110-1137) తన సోదరుడు మూడో సోమేశ్వరుడికి వ్యతిరేకంగా దక్షిణ తెలంగాణలో స్వాతంత్య్రం పొందడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ ప్రయత్నంలోనే మూడో సోమేశ్వరుడికి అనుకూలుడైన కందూరి చోడ మొదటి గోకర్ణుడిని చంపించి కందూరునాడును శ్రీదేవి తొండయ, గోవింద దండేశులకు పంచి సామంతులుగా చేసుకున్నాడు. దీంతో మొదటి గోకర్ణుడి కుమారుడు రెండో ఉదయచోడుడు మూడో సోమేశ్వరుణ్ని ఆశ్రయించాడు. సోమేశ్వరుడి ఆదేశంతో రెండో ప్రోలుడు శ్రీదేవి తొండయ, గోవింద దండేశులను ఓడించి ఉదయ చోడుడికి(క్రీ.శ.1131-36) పట్టం కట్టాడు. ఈ రకంగా దక్షిణ తెలంగాణ మీద ప్రోలుడు ఆధిక్యం సాధించాడు.
తన అనుయాయుల ఓటమిని జీర్ణించుకోలేని తైలపుడు కాకతీయుల ఉత్తర సరిహద్దులో ఉన్న పొలవాస రాజైన మేడరాజును, అతడి తమ్ముడు గుండరాజును ప్రేరేపించాడు. అప్పటికే వీరు చాళుక్య చక్రవర్తుల పట్ల అవిధేయులుగా ఉన్నారు. రెండో జగద్దేకమల్లుడి(క్రీ.శ.1138-1150) పక్షాన నిలబడి ప్రోలరాజు గుండనను సంహరించాడు. గుండన కుటుంబానికి చెందిన ఏడో రాజును పారదోలాడు.
ఈ విజయంతో ప్రోలరాజు ఉత్తర తెలంగాణ మీద ఆధిక్యత సాధించాడు. చక్రవర్తి పక్షాన కుమార తైలపుడిని ఓడించాడు. ఈ విజయోత్సాహంతో కృష్ణానది దాటి శ్రీశైలంలో విజయస్తంభం నాటించాడు. తెలంగాణపై ఆధిక్యం సాధించాక తీరాంధ్రను జయించే ప్రయత్నంలో మరణించాడు. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ఇతడే ప్రారంభించాడు. నతవాడి దుర్గరాజు సోదరి ముప్పమాంబ ప్రోలరాజు భార్య. వీరి కుమారులు.. రుద్రదేవుడు, మహాదేవుడు, హరిహరుడు, గణపతి, రేపొల్ల దుర్గరాజు. తండ్రి మరణానంతరం పెద్దకుమారుడైన రుద్రదేవుడు(క్రీ.శ.1158-క్రీ.శ.1195) రాజ్యానికొచ్చాడు.

మూడు సామంత రాజ్యాలు
కాకతీయ రాజ్య పరిసరాల్లో మూడు సామంత రాజ్యాలు ఉండేవి. తూర్పున ముదిగొండ చాళుక్యులు, వాయవ్యంగా కరీంనగర్ జిల్లాలో పొలవాస నాయకులు, దక్షిణాన కందూరు చోడులు ఉండేవారు. అనుమకొండ విషయానికి పశ్చిమాన ఉన్న ప్రాంతం రాజు ప్రత్యక్ష ఆధీనంలో ఉండేది. అనుమకొండకు నైరుతి దిశగా కొలనుపాక కేంద్రంగా రాజప్రతినిధులు ఈ ప్రాంతాన్ని పాలించేవారు. ప్రోలరాజు వీరిపై ఆధిక్యత సాధించిన సందర్భంలో రుద్రదేవుడు సింహాసనం అధిష్టించాడు.
రుద్రదేవుడు
తైలపుడు తన సోదరుడు జగదేక మల్లుని పదవీచిత్యుణ్ని చేసి అధికారంలోకి వచ్చాడు. కాబట్టి పరబ్రహ్మ శాస్త్రి పేర్కొన్న తైలపుడు ఈ మూడో తైలపుడు కావడానికే ఎక్కువ అవకాశం ఉంది. పదవీభ్రష్టులైన కల్యాణి చాళుక్య రాజులు తమ పూర్వవైభవాన్ని తిరిగి సంతరించుకోలేరని నిర్ణయించుకున్న రుద్రదేవుడు క్రీ.శ.1162/3లో సార్వభౌమత్వాన్ని ప్రకటించుకున్నాడు. తెలంగాణలో తిరుగులేని ప్రభువుగా మారిన తర్వాత తీరాంధ్రపై దృష్టి పెట్టాడు.
వేయి స్తంభాల గుడి
రుద్రదేవుడు(క్రీ.శ.1158-క్రీ.శ.1195) తన తండ్రిని చంపిన వెలనాటి రాజుపై మొదట విజృంభించాడు. పల్నాటి యుద్ధంలో నలగామరాజుకు సహాయపడ్డాడు. ధాన్యకటకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దుర్జయులను ఓడించి త్రిపురాంతకాన్ని జయించాడు. క్రీ.శ.1186 నాటికి తీరాంధ్రను గెలిచాడు. ఈ రకంగా రుద్రదేవుడు కాకతీయ సామ్రాజ్యానికి గట్టి పునాదులు వేశాడు. ఈ విజయాల్లో సహాయం చేసిన రేచర్ల బేతిరెడ్డికి నల్లగొండ జిల్లాలోని ఆమనగల్లును, చెరకు రెడ్లకు జమ్ములూరును ఇచ్చాడు. ఇతడి రాజ్యం ఉత్తరాన గోదావరి, పశ్చిమాన బీదరు, దక్షిణాన శ్రీశైలం, తూర్పున సముద్రం వరకు విస్తరించిందని వేయి స్తంభాల గుడి శాసనం ద్వారా తెలుస్తోంది. రుద్రదేవుడు ఓరుగల్లు కోట నిర్మాణాన్ని కొంతమేర పూర్తిచేశాడు. రుద్రేశ్వర దేవాలయాన్ని కట్టించాడు. ఇదే వేయి స్తంభాల గుడి.
మహాదేవుడు
రుద్రదేవుడికి కుమారులు లేకపోవడం వల్ల తమ్ముడు మహాదేవుడు(క్రీ.శ.1195-1198) రాజ్యానికి వచ్చాడు. ఇతడు జైతుగి (క్రీ.శ.1192-1200) కాలంలో యాదవరాజ్యం మీద చేసిన యుద్ధంలో మరణించాడు. మహాదేవుని భార్య రాణి బయ్యాంబ. గణపతిదేవుడు, మైలాంబ, కుందమాంబ వీరి సంతానం. యాదవరాజులు గణపతిని బంధించారు. ఇదే అదనుగా ముదిగొండ చాళుక్యులు, వెలనాటి చోళులు, చోళరాజులు కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించారు. కానీ సామంతసేనానైన రేచర్ల రుద్రారెడ్డి(రుద్రసేనాని) మిగతా సేనానులు, సామంతులైన విరియాల, మాల్యాల సహాయంతో వీరిని ఓడించినట్లు పాలంపేట శాసనం ద్వారా తెలుస్తోంది. రుద్రసేనాని గణపతిదేవుడిని విడిపించి క్రీ.శ.1199లో కాకతీయ రాజ్య పట్టాభిషిక్తుడిని చేశాడు.

గణపతిదేవుడు(క్రీ.శ.1199-1262)
దక్షిణ భారతదేశాన్ని ఏలిన గొప్ప చక్రవర్తుల్లో గణపతిదేవుడు ఒకరు. యాదవ రాజుల చెర నుంచి విడుదలైన గణపతిదేవుడు క్రీ.శ.1199 నుంచి రాజ్యపాలన చేశాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆయన రాజ్యానికి వచ్చినప్పుడు ఆంధ్రదేశ పరిస్థితులు రాజ్య విస్తరణకు అనుకూలంగా ఉన్నాయి. తీరాంధ్రలో గోదావరికి దక్షిణంగా ఉన్న ప్రాంతం చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయింది. దీంతో గణపతిదేవుడు తీరాంధ్రపై దండెత్తాడు. రెండో రాజేంద్ర చోళుడి కుమారుడైన పృథ్వీశ్వరుడితో యుద్ధం చేశాడు.
క్రీ.శ.1201లో బెజవాడను ఆక్రమించిన కాకతీయ సైన్యం దివి ద్వీపాన్ని ముట్టడించింది. కానీ గణపతిదేవుడు ఆ ద్వీపాన్ని అయ్యవంశ రాజైన అయ్య పినచోడుకు తిరిగి ఇచ్చివేశాడు. అతడి కుమార్తెలైన నారాంబ, పేరాంబలను వివాహమాడాడు. బావమరిదైన జాయపుడికి తన కొలువులో గజసాహిణి అనే పదవిని ఇచ్చాడు. ఈ యుద్ధంతో గోదావరి నుంచి పెన్నా నది వరకు ఉన్న వెలనాటి చోళుల రాజ్యం కాకతీయుల హస్తగతమైంది. నెల్లూరు తెలుగు చోళులతో కాకతీయులకు స్నేహం ఉండేది. ఇది కాకతీయ రాజ్య విస్తరణకు తోడ్పడింది. పృథ్వీశ్వరుడిపై యుద్ధంలో గణపతిదేవుడికి చోడ తిక్కన సహాయం చేశాడు. దీనికి ప్రతిఫలంగా గణపతిదేవుడు నెల్లూరుపై దండెత్తాడు. తమ్ముసిద్ధిని ఓడించి చోడ తిక్కనకు సింహాసనం కట్టబెట్టాడు. ఈ యుద్ధాల వల్ల నెల్లూరు తెలుగు చోళుల రాజ్యంపై కాకతీయుల ఆధిపత్యం ఏర్పడింది.
కళింగ దండయాత్ర
పృథ్వీశ్వరుడిపై విజయం సాధించిన గణపతిదేవుడు కళింగ దండయాత్రను ప్రారంభించాడు. ఈ దండయాత్ర చేసిన వారిలో రేచర్ల రాజనాయకుడు, ఏరువ తెలుగు చోడ భీముడు ముఖ్యులు. ఉదయగిరి ఆక్రమణ తర్వాత కాకతీయ సైన్యం బస్తర్‌లో ప్రవేశించి చక్రకోటను జయించింది. తర్వాత గోదావరిని దాటి ద్రాక్షారామం చేరింది. కళింగ దండయాత్రతో కాకతీయ సైన్యం ప్రతిష్ట పెరిగింది. కానీ శాశ్వత ప్రయోజనం చేకూరలేదు. కాకతీయుల చేతిలో ఓడిన గాంగ సైన్యం కోల్పోయిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది.
కమ్మనాడును పరిపాలిస్తున్న కొణిదెన చోళులు గణపతిదేవుణ్ని ఎదిరించి స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. తెలుగు చోళరాజు కుమారుడైన ఓబిలిసిద్ధి ‘పొత్తపి’ని పరిపాలించేవాడు. కమ్మనాడును జయించాలని గణపతిదేవుడు ఇతణ్ని ఆజ్ఞాపించాడు. ఓబిలిసిద్ధి కొణిదెన చోళులతోపాటు అద్దంకి చక్రనారాయణ వంశ రాజులనూ ఓడించాడు. దీంతో గణపతిదేవుడు ఓబిలిసిద్ధిని కమ్మనాడుకు పాలకుడిగా నియమించాడు. గోదావరి మండలం కాకతీయుల వశమైంది. గణపతిదేవుడు జీవించి ఉన్నంత కాలం కళింగులు మళ్లీ యుద్ధం మాట ఎత్తలేదు.
క్రీ.శ.1248లో నెల్లూరుని పాలించే చోడ తిక్కన మరణించాడు. ఇతడి కుమారుడైన రెండో మనుమసిద్ధి(వీరగండ గోపాలుడు), అతడి దాయాది విజయగండ గోపాలుడి మధ్య రాజ్యం కోసం తగాదా వచ్చింది. ఈ పరిస్థితుల్లో రెండో మనుమసిద్ధి గణపతిదేవుడి సహాయం కోరాడు. మహాకవి తిక్కన సోమయాజితో రాయబారం పంపాడు.
దీంతో గణపతిదేవుడు సామంతభోజుని నాయకత్వంలో తన సైన్యాన్ని పంపాడు. గణపతి దేవుడు స్వయంగా నెల్లూరు వెళ్లి మనుమసిద్ధిని సింహాసనంపై అధిష్టింపజేశాడు. ఆ తర్వాత కాకతీయ సైన్యం ద్రావిడ మండలంలో ప్రవేశించింది. పళైయూరు(తంజావూరు జిల్లా) యుద్ధంలో విజయగండ గోపాలుడిని, కర్ణాటక సైన్యాన్ని ఓడించింది. ఈ విజయాలతో కాకతీయ సామ్రాజ్యం దక్షిణదేశంలో కాంచీపురం వరకు విస్తరించింది.
క్రీ.శ.1263లో జరిగిన ముత్తుకూరు యుద్ధం మినహా తన జీవిత కాలంలో గణపతిదేవుడు అపజయం పొందలేదు. క్రీ.శ.1199 నుంచి క్రీ.శ.1262 వరకు అఖిలాంధ్ర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యం కిందికి తెచ్చిన గొప్ప రాజనీతిజ్ఞుడు. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసి రాజధానిని ఓరుగల్లుకు మార్చాడు. గణపతిదేవుడికి ఇద్దరు కూతుళ్లు రుద్రమదేవి, గణపాంబ. రుద్రమదేవి గణపతి దేవుడి కూతురని కొలనుపాక, పానగల్లు శాసనాలు తెలుపుతున్నాయి. గణపతి దేవుడు రాజకీయ చతురతతో రుద్రమదేవిని తూర్పు చాళుక్య వంశ రాజు వీరభద్రుడికిచ్చి వివాహం చేశాడు. గణపాంబను కోట వంశ రాజైన బేతనకిచ్చి వివాహం చేశాడు.

రుద్రమదేవి(క్రీ.శ.1262-1289)
గణపతిదేవుడు రుద్రమదేవిని క్రీ.శ.1259లోనే రాజప్రతినిధిగా నియమించినప్పటికీ.. క్రీ.శ.1262లో పూర్తి రాజ్య భారాన్ని అప్పగించాడు. అయితే క్రీ.శ.1269లో గణపతిదేవుడు మరణించిన తర్వాత రుద్రమదేవి కాకతీయ రాజ్య కిరీటాన్ని ధరించింది. గణపతి దేవుడు రుద్రమాంబను రాణిని చేయడం నచ్చని కొంత మంది సామంత రాజులు, రాజబంధువులు ఆమెపై తిరుగుబాటు చేశారు. రుద్రమాంబ సవతి సోదరులైన హరిహర దేవుడు, మురారి దేవుడు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. రుద్రమాంబ వారిని ఓడించి, మరణ శిక్ష విధించినట్లు ‘ప్రతాపరుద్ర చరిత్ర’ ద్వారా తెలుస్తోంది. కాయస్థరాజులైన జన్నిగదేవుడు, త్రిపురారి, వెలమనాయకుడైన ప్రసాదిత్యుడు, మల్యాల గుండియ నాయకుడు తదితరుల మద్దతుతో రుద్రమదేవి సింహాసనం దక్కించుకుంది. కాకతీయ రాజ్యంలో తిరుగుబాటు జరిగిన సమయంలో కళింగరాజు మొదటి నరసింహుడు గోదావరి మండలంపై దండెత్తి చాలా ప్రాంతాన్ని ఆక్రమించాడు. అనంతరం అతడి కుమారుడు గజపతి మొదటి వీరభానుదేవుడు ఒడ్డాది మత్స్యదేవుడితో కలిసి వేంగిపై దండెత్తాడు. పోతినాయకుడు, పోలినాయకుడు అనే సేనానుల నాయకత్వంలో రుద్రమదేవి ఈ దండయాత్రను ఎదుర్కొంది. గోదావరి తీరంలో జరిగిన భీకర యుద్ధంలో కళింగులను ఓడించిన కాకతీయ సేనానులు గజపతి మత్తమాతంగ సింహ, ఒడ్డియ రాయమర్థన బిరుదులు పొందారు.
తర్వాతి కాలంలో యాదవ మహాదేవుడు కాకతీయ రాజ్యంపై దండెత్తాడు. ఓరుగల్లు కోటను 15 రోజులు ముట్టడించాడు. రుద్రమదేవి అతడితో భీకరంగా పోరాడింది. మహాదేవుడికి చెందిన మూడు లక్షల సేవణ కాల్బలాన్ని, ఒక లక్ష అశ్విక దళాన్ని నాశనం చేసింది. మహాదేవుడు ఓడిపోయి పారిపోగా రుద్రమాంబ అతణ్ని దేవగిరి వరకు వెంటాడింది. యాదవ మహాదేవుడు కోటి సువర్ణాలను నష్టపరిహారంగా ఇచ్చి సంధి చేసుకున్నాడు. ఈ సొమ్మును రుద్రమాంబ తన సేనానులకు పంచిపెట్టింది. రుద్రమదేవి దేవగిరి వద్ద విజయస్తంభం నాటిందని ‘ప్రతాపరుద్ర చరిత్ర’ గ్రంథం ద్వారా తెలుస్తోంది. అయితే ‘హేమాద్రి వ్రతఖండం’ మాత్రం రుద్రమదేవిని మహాదేవుడు ఓడించాడని తెలుపుతోంది. కానీ ‘ప్రతాపరుద్రచరిత్ర’ కథనంలో యుద్ధంలో చనిపోయిన సేవణుల సైనిక సంఖ్య మినహా మిగతావన్నీ నిజాలేనని శాసనాలు, నాణేలు బలపరుస్తున్నాయి. నల్గొండ జిల్లా పానుగల్లులోని ఛాయా సోమనాథుడికి భూమిని దానం చేసిన సారంగపాణి దేవుడు రుద్రమదేవి సామంతుడు. ఇతడు యాదవ మహాదేవుని పినతండ్రి. ఇతడు సామంతుడు కావడం మహాదేవుని ఓటమిని సూచిస్తోంది. బీదర్ ప్రాంతాన్ని రుద్రమ కాకతీయ రాజ్యంలో చేర్చుకోవడం కూడా ఆమె విజయాన్నీ, మహాదేవుడి ఓటమినీ సూచిస్తోంది.
కడప మార్జవాడి రాజ్యంలో కాయస్థ జన్నిగదేవుడి తర్వాత అతని పెద్ద కుమారుడు త్రిపురారిదేవుడు, తర్వాత అతడి తమ్ముడు అంబదేవుడు కాకతీయుల సామంతులుగా పాలించారు. క్రీ.శ.1272లో రాజ్యానికొచ్చిన కాయస్థ అంబదేవుడు రుద్రమదేవిని ఎదిరించి స్వతంత్ర కాయస్థ రాజ్య నిర్మాణానికి పూనుకున్నాడు. రుద్రమదేవి మల్లికార్జున సేనాని నాయకత్వంలో సైన్యాన్ని నడిపింది. ఈ యుద్ధంలో రుద్రమ జయించిందనీ, మరణించిందనీ భిన్న కథనాలున్నాయి. రుద్రమదేవి క్రీ.శ.1289లో మరణించినట్లు నకిరేకల్ సమీపంలోని చందుపట్ల శాసనం ద్వారా తెలుస్తోంది. దీన్ని బట్టి ఆ యుద్ధంలో రుద్రమదేవి మరణించిందని చెప్పొచ్చు.

ప్రతాపరుద్రుడు (క్రీ.శ.1289-1323)
రుద్రమదేవికి ముగ్గురు కుమార్తెలు. వారు.. ముమ్మడమ్మ, రుద్రమ్మ, రుయ్యమ్మ. పెద్ద కుమార్తె ముమ్మడమ్మ మహాదేవుడి భార్య. వీరి కుమారుడే ప్రతాపరుద్రుడు. ఇతడి కాలంలో కాకతీయుల అధికారం ఉచ్ఛస్థితికి చేరి, ఓ వెలుగు వెలిగి అస్తమించింది.
రుద్రమదేవి కాలం నుంచే స్వతంత్రించిన అంబదేవుడు, అతడి కొడుకు రెండో త్రిపురారిలు ప్రతాపరుద్రుడి సార్వభౌమాధికారాన్ని అంగీకరించలేదు. దీన్ని సహించని ప్రతాపరుద్రుడు నాయంకర వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి సైన్యాన్ని పటిష్టం చేసి అంబదేవుడిపై దండెత్తడానికి సమాయత్తమయ్యాడు. ఇది ఊహించిన అంబదేవుడు దక్షిణాన పాండ్యరాజులతో, ఉత్తరాన సేపుణుల(దేవగిరి యాదవులు)తో పొత్తు పెట్టుకున్నాడు. ప్రతాపరుద్రుడు క్రీ.శ.1291లో అంబదేవుని రాజధాని త్రిపురాంతకంపై ప్రచండ సైన్యాన్ని పంపాడు. కొలని సోమనమంత్రి కుమారుడు మనుమగన్నయ, ఇందులూరి పెదగన్నయమంత్రి కుమారుడు అన్నయదేవులు ఈ సైన్యానికి నాయకత్వం వహించారు. వీరు అంబదేవుణ్ని ఓడించి ములికినాడు వరకు తరిమికొట్టి కాయస్థ రాజ్యాన్ని కాకతీయ రాజ్యంలో కలిపారు. అంబదేవుణ్ని ఓడించిన తర్వాత ప్రతాపరుద్రుడు నెల్లూరుపై రెండుసార్లు దండెత్తాడు. నెల్లూరురాజు రాజగండగోపాలుడికి మద్దతునిచ్చిన పాండ్యులను ఓడించాడు. రుద్రమదేవి చివరి కాలంలో కాకతీయులు కృష్ణానది దక్షిణాన ప్రాభవాన్ని కోల్పోగా, ప్రతాపరుద్రుడు దాన్ని తిరిగి నిలబెట్టాడు. ప్రతాపరుద్రుడి మూడో దండయాత్ర అంబదేవుడికి మద్దతు నిలిచిన దేవగిరి యాదవరాజులపై జరిగింది. మనమగండగోపాలుడు, వర్ధమానపుర(మహబూబ్‌నగర్ జిల్లా) పాలకుడైన గోన విఠలుల నాయకత్వంలో ఈ యుద్ధం జరిగింది. గోనవిఠలుడు కృష్ణా, తుంగభద్ర ప్రాంతాన్ని దేవగిరి రాజుల నుంచి వశం చేసుకున్నాడు.
Published date : 29 Sep 2015 05:36PM

Photo Stories