Skip to main content

కాకతీయానంతర యుగం - 2

పద్మనాయకులు ఒక శతాబ్దం పాటు తెలంగాణను దాటకుండా బహమనీలకు అడ్డుగా నిలిచారు. వీరి పతనం తర్వాతే మిగతా తెలుగు ప్రాంతం కూడా బహమనీల వశమైంది. దక్షిణ భారతదేశంలోని చాలా భూ భాగాలకు ముస్లిం రాజుల ప్రవేశానికి మార్గం సుగమమైంది. పద్మనాయకుల చివరి దశలోనూ, అనంతరం కొంతకాలం తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు గజపతుల ఆధిపత్యంలో ఉన్నట్లు ఆధారాలున్నాయి. బహమనీ చివరి పాలకుడైన మహమూద్‌షా 1518లో మరణించాడు. దీంతో బహమనీల రాజ్య భాగాల్లో ఒకటైన గోలకొండ పాలకుడు కులీ కుతుబ్ ఉల్‌ముల్క్ స్వాతంత్య్రం ప్రకటించుకొని కుతుబ్‌షాహీ వంశాన్ని స్థాపించాడు.
పద్మనాయకులు
పద్మనాయక పాలకుల్లో గొప్ప పరాక్రమవంతుడైన లింగమనీడు విజయనగర రాజ్య భాగాలైన కర్నూలు, నెల్లూరు సహా పరిసర దుర్గాలను ఆక్రమించాడు. చివరగా 1437లో కంచిని ఆక్రమించాడు. దీనికి సింగమనాయకుడు తోడ్పడ్డాడు. లింగమనీడు ఈ యుద్ధాల్లో మునిగి ఉన్న సమయంలో అతడి రాజ్య ఉత్తర భాగాన్ని బహమనీయులు ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో బహమనీల మధ్య అంతఃకలహాలు మొదలయ్యాయి. అహ్మద్‌షా అనంతరం ‘రెండో అహ్మద్‌షా’గా పిలిచే అల్లావుద్దీన్ (1436-1458) బహమనీ రాజయ్యాడు. ఇతడి సోదరుడైన మహమ్మద్‌ఖాన్ తిరుగుబాటు చేసి రాయచూర్, షోరాపూర్, బీజాపూర్ దుర్గాలను ఆక్రమించి స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. నిజామాబాద్ జిల్లాలోని బాలకొండ సామంతుడైన సికిందర్‌ఖాన్ కూడా స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. ఇతడు మహమ్మద్‌ఖాన్‌తో కలిసి సబ్బి రాష్ర్టం (కరీంనగర్), భువనగిరి ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు.
సింగమనాయకుడు 1444లో కపిలేశ్వర గజపతి సహాయంతో రాచకొండ రాజ్యాన్ని తిరిగి ఆక్రమించడానికి ప్రయత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. రెండో అహ్మద్‌షా అనంతరం హుమాయూన్ రాజ్యానికి వచ్చిన సందర్భంలో (1457) సికిందర్‌ఖాన్ చేసిన తిరుగుబాటును ఆసరాగా చేసుకొని తెలంగాణ ప్రాంతాన్ని తిరిగి జయించడానికి పద్మనాయకులు ప్రయత్నించారు. హుమాయూన్ సికిందర్‌ఖాన్‌ను సంహరించి, దేవరకొండపైకి నిజాం-ఉల్- ముల్క్, ఖ్వాజీ జహాన్ అనే సేనానులను పంపించి, తాను ఓరుగల్లుపై దండెత్తాడు. కపిలేశ్వర గజపతి కూమారుడైన హంవీరుడి సహాయంతో సింగమనాయకుడు వారిని ఓడించాడు. ఇతడు ఖమ్మం, భువనగిరి, ఓరుగల్లును జయించాడు. ఆ తర్వాత సింగమనాయకుడి తమ్ముడు ధర్మానాయకుడు ఓరుగల్లు పాలకుడైనట్లు 1462-64 నాటి శాయంపేట శాసనం ఆధారంగా తెలుస్తోంది. నిజాంషా (1461-63) కాలంలోనూ బహమనీలు తెలంగాణను జయించడానికి మళ్లీ ప్రయత్నించారు. గజపతుల సహాయంతో పద్మనాయకులు వారిని ఓడించారు.
1468లో కపిలేశ్వర గజపతి మరణించిన తర్వాత అతడి కుమారులు హంవీరుడు, పురుషోత్తమ గజపతి మధ్య వారసత్వ పోరు మొదలైంది. దీనివల్ల పద్మనాయకులకు మళ్లీ కష్టాలు వచ్చాయి. తనకు సహాయం చేస్తే తెలంగాణను జయించి స్వాధీనం చేస్తానని హంవీరుడు మూడో మహమ్మద్‌షా (1463 -1482)కు కబురు పంపాడు. ఇదే అదనుగా సుల్తాన్ తెలంగాణను ఆక్రమించడానికి నిజాం-ఉల్-ముల్క్ బహ్రీని పంపాడు. ఈ సమయంలో పద్మనాయకులు అటు గజపతులతో, ఇటు బహమనీలతో పోరాడాల్సి వచ్చింది. 1475 నాటికి తెలంగాణ ప్రాంతమంతా బహమనీల వశమైంది. పద్మనాయకుల రాజ్యం అంతరించింది. పద్మనాయకులు విజయనగర రాజుల కొలువులో చేరారు. ఈ కాలంలో విజయనగర పాలకులు, గజపతులు, బహమనీల సామ్రాజ్య దాహంతో తెలంగాణ తల్లడిల్లింది. 1481 నాటికి నిజాం-ఉల్-ముల్క్ బహ్రీ, ఆజంఖాన్ తెలంగాణలో బహమనీల రాజప్రతినిధులయ్యారు. సింగమనాయకుడు, లింగమనీడు అనంతరం లింగమనీడు కుమారుడు దేవరకొండకు నామమాత్ర పాలకుడిగా మిగిలాడు. ఆ తర్వాత వీరి వంశం దేవరకొండను 16వ శతాబ్దం చివరి వరకు పాలించినట్లు తెలుస్తోంది.
లింగమనీడు కళింగ, విజయనగర రాజ్యాలపై దండయాత్రలు చేసిన సందర్భంలో అతడి వెంట వెళ్లిన కొంతమంది పద్మనాయకులు ఆ తర్వాతి కాలంలో బొబ్బిలి, పిఠాపురం, వెంకటగిరి, పాల్వంచ సంస్థాలను స్థాపించినట్లుగా తెలుస్తోంది. విజయనగర రాజ్య ప్రాంతాలకు వెళ్లినవారు తిరిగి తెలంగాణకు వచ్చి మహబూబ్‌నగర్ జిల్లాలో జటప్రోలు (కొల్లాపురం) సంస్థానాన్ని స్థాపించినట్లు భావిస్తున్నారు.

కళింగ గాంగులు
ఈ వంశ పాలకులు నేటి ఒడిశాలోని బరంపురం తదితర ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా ప్రాంతాలను సుమారు క్రీ.శ. 5వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు పాలించారు. కాకతీయుల కాలంలో వీరితో యుద్ధాలు జరిగాయి. కాకతి గణపతి దేవుడు వీరి పాలనలో ఉన్న కొన్ని ప్రాంతాలను ఆక్రమించాడు. రుద్రమదేవి కూడా గోదావరి నది వరకు జయించారు.
కళింగ గాంగ రాజైన నాలుగో వీరనరసింహ దేవుడి కాలంలో (1378-1424) రేచర్ల పద్మనాయక అనపోతనాయకుడు కళింగను ముట్టడించాడు. వీర నరసింహదేవుడు ఓటమి పాలై తన కూతురును అనపోత నాయకుడి మనవడైన కుమార అనపోత నాయకుడికి ఇచ్చి సంధి చేసుకున్నాడు. నాలుగో భానుదేవుడి (1424-1434)తో ఈ వంశం అంతరించింది.

విజయనగర రాజ్యం
కాకతీయుల అనంతరం ముసునూరు, పద్మనాయక, రెడ్డి రాజ్యాలతోపాటు స్థాపించిన మరో రాజ్యం విజయనగర సామ్రాజ్యం. ఈ రాజ్య స్థాపకులైన హరిహరరాయలు, బుక్కరాయలు ఓరుగల్లుకు చెందినవారు. ధర్మపురికి చెందిన విద్యారణ్య స్వామి వీరికి ప్రేరకుడు. కంపరాయల భార్య గంగాదేవి కూడా తెలంగాణ ఆడబిడ్డే. పిల్లలమర్రి పినవీరభద్రుడు కొన్నేళ్లు విజయనగర రాజుల ఆశ్రయం పొందాడు. అలంపురం లాంటి ప్రాంతాలు స్వల్పకాలం వీరి ఆధిపత్యంలో ఉన్నాయి. వీరి రాజ్యమంతా కృష్ణానది దక్షిణానికే పరిమితం.

సంగమ వంశం (1333-1485)
హరిహరరాయులు (1336-1356), బుక్కరాయలు (1356-1377) సంగమ వంశానికి చెందినవారు. వీరు కాకతి ప్రతాపరుద్రుడి భాండాగారికులుగా ఉన్నట్లు కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు. కాకతీయుల పతనానంతరం వీరు ఆనెగొంది ప్రభువైన జంబుకేశ్వరుడి వద్ద మంత్రులుగా చేరారు. ఢిల్లీ సైన్యం 1334లో ఆనెగొందిని ముట్టడించి వీరిద్దరినీ బంధీలుగా తీసుకెళ్లి ముస్లింలుగా మార్చి కొంతకాలం తర్వాత మళ్లీ ఆనెగొందికి పాలకులుగా పంపించారని, విద్యారణ్యుడి ప్రేరణతో వీరు స్వమతంలోకి మారి 1336 ప్రాంతంలో విజయనగర రాజ్యాన్ని స్థాపించారని తెలుస్తోంది.
హరిహరరాయల కాలంలో తెలంగాణలో కొంత భాగాన్ని ముసునూరి వంశం పాలించింది. బుక్కరాయల కాలంలో రేచర్ల పద్మనాయకులు తెలంగాణకు అధిపతులయ్యారు. తర్వాత రెండో హరిహరరాయలు 1377 నుంచి 1404 వరకు పాలించాడు. ఇతడి ఆజ్ఞతో యువరాజైన రెండో బుక్కరాయలు రెండుసార్లు పద్మనాయకులపై దండెత్తాడు. కానీ విజయం సాధించలేదు. తండ్రి మరణానంతరం రాజైన రెండో బుక్కరాయలను తొలగించి విరూపాక్షుడు అధికారాన్ని చేపట్టాడు. రెండో బుక్కరాయలు తిరిగి అతడిని తొలగించి 1404 నుంచి 1406 వరకు పాలించాడు. ఇతడిని తొలగించి మొదటి దేవరాయలు (1406-1424), తర్వాత ప్రౌఢ దేవరాయలుగా పిలిచే రెండో దేవరాయలు (1406-1446) రాజులయ్యారు. ప్రౌఢ దేవరాయల కాలంలో రెడ్డి రాజ్యం సింహాచలం వరకు అతడికి సామంత రాజ్యంగా ఉంది. ఆ తర్వాత మల్లికార్జున రాయలు (1446-1465), రెండో విరూపాక్ష రాయలు (1465-1485) పాలించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపురం తదితర ప్రాంతాలు మల్లికార్జున రాయల ఆధీనంలో ఉండేవి. ఈ వంశ పాలకుల అసమర్థత వల్ల సామంత రాజైన సాళువ నరసింహరాయలు సింహాసనాన్ని ఆక్రమించాడు.

సాళువ వంశం (1486-1506)
సాళువ నరసింహరాయలు (1485-1490) తీరాంధ్రను కృష్ణానది వరకు జయించాడు. తెలంగాణపై దాడిచేసి బాలకొండ వద్ద ముస్లిం సైన్యాన్ని ఓడించాడు. ఇతడి మరణానంతరం ఇతడి కుమారులు చిన్నవాళ్లు కావడంతో సేనాధిపతి తుళువ నరసానాయకుడు తన పెద్ద కుమారుడైన తిమ్మరాజును, అతడు మరణించాక రెండో కుమారుడైన రెండో నరసింహరాయలను రాజులను చేసి రాజ్యాధికారం నెరిపాడు. రెండో నరసింహరాయలను హతమార్చి తుళువ వంశాన్ని ప్రారంభించారు.

తుళువ వంశం (1505-1570)
వీర నరసింహుడు (రెండో నరసనాయకుడు) 1505 నుంచి 1509 వరకు పాలించాడు. ఇతడు మరణించిన తర్వాత సోదరుడు శ్రీకృష్ణ దేవరాయలు (1509-1529) రాజయ్యాడు. ఇతడు తూర్పు దండయాత్రలో చితాబ్‌ఖాన్ పాలనలో ఉన్న తెలంగాణలోని అనంతగిరి, ఉండ్రకొండ, జల్లిపల్లి, కందికొండ, దేవరకొండ, నల్లగొండ, కనకగిరి, శంకరగిరి, ఖమ్మం ప్రాంతాలను ఆక్రమించాడు. సింహాచలం దాకా గజపతుల ఆక్రమణలో ఉన్న తీరాంధ్ర కూడా ఇతడి వశమైంది. ప్రతాపరుద్ర గజపతి తన కుమార్తెను ఇతడికి ఇచ్చి ఇరు రాజ్యాల మధ్య కృష్ణానది సరిహద్దుగా ఉండే విధంగా సంధి చేసుకున్నాడు. శ్రీకృష్ణ దేవరాయలు తెలంగాణతో పాటు కృష్ణానది ఉత్తర భాగాలను గజపతికే ఇచ్చేశాడు.
కృష్ణదేవరాయల తర్వాత అతడి సోదరుడు అచ్యుత దేవరాయలు (1530-42) అధికారంలోకి వచ్చాడు. అచ్యుత దేవరాయల తర్వాత రాజైన అతడి కుమారుడు వెంకటరాయలను హత్య చేసి సలికం తిరుమలరాయలు రాజయ్యాడు. ఇతడిని తుదముట్టించి అళియ రామరాయలు (కృష్ణదేవరాయల అల్లుడు) అచ్యుత రాయల అన్న కొడుకైన సదాశివరాయలను (1543-76) రాజుగా చేసి అధికారం చెలాయించాడు. ఇతడి కాలంలో ముస్లిం పాలకులు ఏకమై విజయనగరంపై దండెత్తారు. దీన్నే రక్కస తంగడి (తళ్లికోట) యుద్ధంగా పేర్కొంటారు. రామరాయల తర్వాత అతడి సోదరుడు తిరుమలరాయలు ఆరవీటి వంశ (1569-1578) పాలన ప్రారంభించాడు. విజయనగరం తన ప్రాభవాన్ని తిరిగి పొందలేదు. మూడో శ్రీరంగరాయల (1665-1680) మరణంతో ఆరవీటి వంశం, విజయనగర సామ్రాజ్యం అంతమయ్యాయి. ఈ సామ్రాజ్యంలోని కొంత భాగాన్ని గోల్కొండ సుల్తాన్‌లు ఆక్రమించగా, మరికొంత భాగం మధుర, తంజావూర్, మైసూర్ నాయక రాజుల వశమైంది.
విజయనగర రాజులకు బహమనీ సుల్తాన్‌లతో, కుతుబ్‌షాహీలతో కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ప్రదేశంలో నిరంతరం యుద్ధాలు జరిగేవి. అందువల్ల అలంపురం తదితర ప్రాంతాలు నిరంతరం చేతులు మారాయి. మల్లికార్జున రాయలు, కృష్ణదేవరాయలు, అచ్యుత దేవరాయల హయాంలో కొంతకాలంపాటు ‘అలంపురం’ విజయనగర పాలకుల ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది.

కళింగ గజపతులు
గాంగ వంశ రాజైన నాలుగో భానుదేవుడి పై అతడి మంత్రి కపిలేశ్వర గజపతి 1434లో తిరుగుబాటు చేసి గజపతి వంశాన్ని స్థాపించాడు. ఈ వంశ పాలకులు 1434 నుంచి 1538 వరకు ఒడిశా తదితర ప్రాంతాలతో పాటు తెలుగు ప్రాంతాలను కూడా పాలించారు. వీరికి విజయనగర రాజులు, కొండవీటి రెడ్డి రాజులు, పద్మనాయకులు, తెలంగాణను ఆక్రమించిన బహమనీ సుల్తాన్‌లతో యుద్ధాలు జరుగుతుండేవి.
బహమనీ పాలకుడైన హుమాయూన్ 1458లో తెలంగాణను ఆక్రమించి మాలిక్‌షాను సుబేదారుగా నియమించాడు. సికిందర్‌ఖాన్ పద్మ నాయకులతో కలిసి సుల్తాన్లపై తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటును అణచివేసి సుల్తాన్‌లు పద్మనాయక రాజధానుల్లో ఒకటైన దేవరకొండను ముట్టడించారు. ఈ సమయంలో పద్మనాయక లింగమనీడి అభ్యర్థన మేరకు కపిలేశ్వర గజపతి ఆదేశంతో ‘హంవీరుడు’ లింగమనీడికి బాసటగా నిలిచి సుల్తాన్లను తరిమేశాడు.
కపిలేశ్వర గజపతి అనంతరం అతడి కుమారులైన పురుషోత్తమ గజపతి (1468-97), హంవీరుడి మధ్య వారసత్వ తగాదా తలెత్తింది. హంవీరుడు బహమనీ సుల్తాన్లను ఆశ్రయించి తనకు రాజ్యం ఇప్పిస్తే తీరాంధ్ర, తెలంగాణను ఇస్తానని చెప్పాడు. సుల్తాన్‌లు అతడికి సహాయపడి తీరాంధ్ర, అతడి ఆధీనంలోని తెలంగాణను వశపరుచుకున్నారు. పురుషోత్తమ గజపతి తర్వాత సింహాసనాన్ని అధిష్టించిన అతడి కుమారుడు ప్రతాపరుద్ర గజపతి (1497-1538) బహమనీలు ఆక్రమించిన తెలంగాణ భూభాగాలను తిరిగి కైవసం చేసుకున్నాడు. ఇతడికి సహకరించిన చిత్తాఫ్‌ఖాన్ (చితాబ్‌ఖాన్)ను ఖమ్మం, ఓరుగల్లు ప్రాంతాలకు సామంతుడిగా నియమించాడు. ప్రతాపరుద్ర గజపతి కొండపల్లి, ఉర్లుగొండ, చిట్యాల, అనంతగిరి, అరువపల్లి, నల్లగొండ, సిరికొండ దుర్గాలను పాలించడానికి సేనానులను నియమించాడు. 1512లో దిగ్విజయ యాత్ర ప్రారంభించిన విజయనగర పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు కళింగ గజపతులతో ఉన్న పూర్వ వైరాన్ని దృష్టిలో ఉంచుకొని 1515లో ప్రతాపరుద్ర గజపతి ఆధీనంలో ఉన్న కొండవీడు, కొండపల్లి, అనంతగిరి, చిట్యాల, నల్లగొండ, ఉర్లుగొండ, అరువపల్లి మొదలైన దుర్గాలను జయించాడు. చితాబ్‌ఖాన్‌ను ఓడించి ఖమ్మం, ఓరుగల్లు ప్రాంతాలను జయించాడు. తర్వాత 1516లో గజపతుల కటకం దాకా పురోగమించాడు. ప్రతాపరుద్ర గజపతి తన కూతురు తుక్కాదేవిని కృష్ణదేవరాయలకు ఇచ్చి సంధి చేసుకొని తిరిగి ఈ ప్రాంతాలను పొందాడు. ఉభయ రాజ్యాలకు కృష్ణానది సరిహద్దుగా ఉండే విధంగా ఒప్పందం కుదిరింది.
శ్రీకృష్ణ దేవరాయలు తన రాజ్య విస్తరణలో భాగంగా ప్రతాపరుద్ర గజపతి రాజ్య భాగాలపై 1524లో దండెత్తడం, 1530లో కొండపల్లి దుర్గాన్ని వశపరచుకోవడాన్ని బట్టి తెలంగాణ మొత్తం అతడి ఆధీనంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు ప్రతాపరుద్ర గజపతి మరణించడంతో ఆ వంశం అంతరించింది.

బహమనీ సుల్తాన్లు
కాకతీయ రాజ్య పతనం తర్వాత దక్షిణాపథమంతా ఢిల్లీ సుల్తాన్ మహ్మద్ బిన్ తుగ్లక్ ఆధీనంలోకి వచ్చింది. తర్వాత కొద్ది కాలానికే ఆంధ్ర దేశంలో స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి. తుగ్లక్ మీద తిరుగుబాటు చేసిన అనేక మంది సర్దారుల్లో హసన్ గంగూ అబ్దుల్ ముజఫర్ ఒకడు. తెలంగాణకు పశ్చిమోత్తర ప్రాంతంలో బహమనీ షా వంశీయుడైన హసన్‌గంగూ ఢిల్లీ చక్రవర్తి మహమ్మద్ బిన్ తుగ్లక్‌పై తిరుగుబాటు చేశాడు. 1341లో దౌలతాబాద్ రాజధానిగా బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. ఆ సమయంలో ఉత్తర తెలంగాణను ముసునూరి వంశానికి చెందిన కాపయ నాయకుడు పాలిస్తున్నాడు. తిరుగుబాటు సమయంలో కాపయ హసన్ గంగూకు సహాయపడ్డాడు. తర్వాతి కాలంలో ఇది నష్టానికి దారి తీసింది. బహమనీ రాజ్యం సుదీర్ఘ కాలంపాటు తెలంగాణకు పక్కలో బల్లెంలా తయారైంది.
బహమనీలు అనేకసార్లు తెలంగాణపై దండయాత్ర చేశారు. 1350లో హసన్ గంగూ కౌలాస్(నిజామాబాద్ జిల్లా) దుర్గాన్ని ఆక్రమించాడు. పానగల్లు కోటను స్వాధీనం చేసుకొని, అమరావతి దాకా తన రాజ్యాన్ని విస్తరించాడు. నీలగిరి కోటను కూడా ఆక్రమించాడు. అప్పటి నుంచే నీలగిరి నల్లగొండగా మారింది. ఇరు రాజ్యాలకు గోల్కొండ సరిహద్దుగా ఉండేలా కాపయ సంధి చేసుకున్నాడు. హసన్ గంగూ తుంగభద్ర వరకు పురోగమించి విజయనగర రాజ్యభాగాలను, పశ్చిమాన కొంకణ్ రాజ్యాన్ని ఆక్రమించాడు. 1356లో రెండోసారి దండెత్తి భువనగిరి దుర్గాన్ని ఆక్రమించాడు. హసన్ గంగూ తన రాజధానిని దౌలతాబాద్ నుంచి గుల్బర్గాకు మార్చాడు. రాజ్యాన్ని గుల్బర్గా, దౌలతాబాద్, బీదర్, బీరార్ అనే నాలుగు రాష్ట్రాలుగా విభజించాడు. ఇతడి రాజ్యానికి ఉత్తరాన మాండు, దక్షిణాన రాయచూర్, పశ్చిమాన గోవా, తూర్పున భువనగిరి (కొంతకాలం) సరిహద్దులుగా ఉండేవి.

బహమనీ పాలకులు..
హసన్ గంగూ తర్వాత ఒకటో మహమ్మద్‌షా (1358-75), ముజాహిద్‌షా (1375-78), రెండో మహమ్మద్ షా (1378-97), ఫిరోజ్‌షా (1397-1422), అహ్మద్‌షా (1422-36), రెండో అల్లావుద్దీన్ అహ్మద్‌షా (1436-58), హుమాయూన్ (1458-61), నిజాంషా (1461-63), మూడో మహమ్మద్‌షా (1463-82), మహమూద్‌షా (1482-1518) బహమనీ రాజ్యాన్ని పాలించారు.
హసన్ గంగూ తర్వాత కూడా బహమనీలు అనేక సార్లు తెలంగాణ సహ ఇతర తెలుగు ప్రాంతాలపై దండెత్తారు. ఒకటో మహమ్మద్‌షా 1364-65లో గోల్కొండ దుర్గం సహా పరిసర ప్రాంతాలను ఆక్రమించాడు. ఇతడు భారతదేశంలోనే మొదటిసారిగా యుద్ధ రంగంలో గన్‌పౌడర్ ఉపయోగించాడు.

పద్మనాయకులతో మైత్రి
1366లో పద్మనాయక వంశానికి చెందిన రేచర్ల అనపోత నాయకుడి చేతిలో కాపయ మరణించాడు. తెలంగాణ పద్మనాయకుల వశమైంది. వీరికాలంలో బహమనీ సుల్తాన్లు కొంతకాలం మిత్రులుగా మరి కొంతకాలం శత్రువులుగా మెలిగారు. రెండో హరిహరరాయలు పద్మనాయక రాజ్యంపై రెండో బుక్కరాయలను దండయాత్రకు పంపాడు. ఈ సమయంలో బహమనీలు పద్మనాయకులకు అండగా నిలిచారు. విజయనగర రాజుల ఆధీనంలోని కొత్తకొండ (మహబూబ్‌నగర్ జిల్లా)ను పద్మనాయకులు స్వాధీనం చేసుకోవడానికి తోడ్పడ్డారు. బుక్కరాయలు మరోసారి ఓరుగల్లు, మెదక్, పానుగల్లును ముట్టడించాడు. ఈ సమయంలోనూ బహమనీలు పద్మనాయకులకు తోడుగా నిలిచారు.

సామంతులుగా పద్మనాయకులు
ఫిరోజ్‌షా 1417-19లో పానగల్లును ముట్టడించాడు. విజయనగర రాజుల సహాయంతో పద్మనాయకులు అతణ్ని ఓడించారు. దీంతో విజయనగర, పద్మనాయక రాజ్యాలు సన్నిహితమయ్యాయి. ఇదే సమయంలో బహమనీలతో పద్మనాయకుల వైరం తీవ్రమైంది. ఫలితంగా తర్వాతి కాలంలో పద్మనాయకుల రాజ్యానికి నష్టం వాటిల్లింది. అహ్మద్‌షా రెండో దేవరాయలతో యుద్ధం చేశాడు. ఈ సమయంలో రేచర్ల మాదానాయుడు విజయనగర పక్షం వహించాడు. ఇది బహమనీ సుల్తాన్ల ఆగ్రహానికి కారణమైంది. 1425లో బహమనీలు ఓరుగల్లు సహా అనేక దుర్గాలను ఆక్రమించారు. దీంతో పద్మనాయక రాజ్యం విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. అహ్మద్‌షా 1432లో తెలంగాణ మీద దండయాత్ర చేసి రాయగిరి, భువనగిరి దుర్గాలను ఆక్రమించాడు. తెలంగాణలో అధిక భాగం బహమనీ రాజ్యంలో కలిసిపోయింది. పద్మనాయకులు కొంతకాలం సామంతులుగా రాజ్యాన్ని పాలించారు. అహ్మద్‌షా తన రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్‌కు మార్చాడు.
అహ్మద్‌షా గుజరాత్, మాళవ ప్రాంతాలపై దండయాత్ర చేశాడు. ఇదే అదనుగా పద్మనాయకులు కోల్పోయిన తమ ప్రాంతాలను తిరిగి ఆక్రమించారు. కానీ ఆ యుద్ధాలు ముగిశాక అహ్మద్‌షా తెలంగాణపై దండెత్తాడు. ఓరుగల్లు, రామగిరి (కరీంనగర్) మొదలైన దుర్గాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు. 1435 నాటికి (దేవరకొండ మినహా) రాచకొండ సహా తెలంగాణలో అధిక భాగం తిరిగి బహమనీల వశమైంది. బహమనీ రాకుమారుడైన దాసూర్‌ఖాన్ రాచకొండ రాజప్రతినిధి అయ్యాడు.
1444లో సింగమనాయుడు, కపిలేశ్వర గజపతి సాయంతో తన రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. సుల్తాన్ తమ్ముడైన మహమూద్ ఖాన్ రాచకొండలో సామంత రాజయ్యాడు.
హుమాయూన్ రాజైన తర్వాత బహమనీ రాజ్యంలో తిరుగుబాట్లు జరిగాయి. వీటిని ఆసరా చేసుకొని తెలంగాణను తిరిగి జయించడానికి పద్మనాయకులు ప్రయత్నించారు. జలాల్‌ఖాన్, సికిందర్ బాలకొండలో స్వతంత్రం ప్రకటించుకున్నారు. వీరు పద్మనాయకులతో స్నేహం చేశారు. హుమాయూన్ తిరుగుబాట్లను అణచివేసి, దేవరకొండను ముట్టడించాడు. పద్మనాయకులు 1461లో బహమనీ సైన్యాలను పారదోలి రాచకొండ, భువనగిరి, ఓరుగల్లు మొదలైన దుర్గాలను తిరిగి పొందగలిగారు. పద్మనాయకులకు కపిలేశ్వర గజపతి కుమారుడైన హంవీరుడు సహాయం చేశాడు. తెలంగాణలో బహమనీలకు స్థానం లేకుండా చేశారు. హుమాయూన్‌షా తర్వాత నిజాంషా కాలంలో బహమనీలు తెలంగాణను తిరిగి ఆక్రమించే ప్రయత్నం చేశారు. కపిలేశ్వరుని సాయంతో పద్మనాయకులు వారిని ప్రతిఘటించారు.
కొంత కాలానికి గజపతుల్లో అంతఃకలహాలు తలెత్తాయి. ఇదే అదనుగా తెలంగాణను జయించడానికి మూడో మహమ్మద్‌షా తన సేనాని అయిన నిజాం ఉల్‌ముల్క్ ఇబ్రహీంను పంపాడు. 1475 నాటికి తెలంగాణ మొత్తం బహమనీల వశమైంది. పద్మనాయక రాజ్యం అంతరించింది. అనంతరం బహమనీలు తెలుగు దేశాన్నంతా జయించి రెండు భాగాలుగా విభజించారు. తెలంగాణకు ఓరుగల్లు రాజధాని కాగా, రెండో భాగానికి రాజధాని రాజమహేంద్రవరం. మూడో మహమ్మద్‌షా 1481లో కంచి మీద దాడి చేసే నాటికి రాజమహేంద్రవరం, తెలంగాణ తరఫ్‌లను బహ్రీ నిజాం ఉల్‌ముల్క్, ఆజంఖాన్‌ల ఆధీనంలో ఉంచాడు.

బహమనీ రాజ్య విచ్ఛిన్నం
మూడో మహమ్మద్‌షా 1482లో మరణించడంతో బహమనీ రాజ్యం విచ్ఛిన్నం కావడం మొదలైంది. ఇతడి తర్వాత రాజైన మహమూద్ షా కాలంలో ఓరుగల్లు పాలకుడైన ఆదిల్‌ఖాన్ మరణించాడు. రాజమహేంద్ర పాలకుడైన కివాన్ ఉల్‌ముల్క్ తన రాజ్యాన్ని కోల్పోయి ఓరుగల్లును ఆక్రమించాడు. సుల్తాన్ అతణ్ని పారదోలాడు. సుల్తాన్ నలుగురు కుమారుల్లో చివరి వాడైన కలీముల్లా 1537లో మరణించాడు. దీంతో బహమనీ వంశం అంతరించింది. 1500 ప్రాంతంలో బహమనీ సామ్రాజ్యం నుంచి అయిదు స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి.
రాజ్యాలు - స్థాపకులు
అహ్మద్‌నగర్ - నిజాం ఉల్ ముల్క్
బీజాపూర్ - ఆదిల్ షా
గోల్కొండ - కుతుబ్ ఉల్ ముల్క్
బీరారు - ఇమాదుల్ ముల్క్
బీదర్ - బరీద్ ఇమమాలిక్
వీటిలో గోల్కొండ రాజ్యం తెలంగాణ భూభాగంలో ఏర్పడింది. 
 
పద్మనాయకుల పాలనా విశేషాలు
పాలనా విధానం
పద్మనాయకులు పాలనలో కాకతీయులను అనుసరించారు.పాలనా వ్యవహారాల్లో ప్రధానులు, సేనానులు, పురోహితులు రాజుకు సలహా ఇచ్చేవారు. పద్మనాయక రాజ్యంలో రాచకొండ, దేవరకొండ, అనుముల, పొడిచేడు, ఆమనగల్లు, అనంతగిరి, ఉర్లుకొండ, ఉండ్రుగొండ, స్తంభగిరి, ఓరుగల్లు, భువనగిరి, జల్లపల్లి, పానగల్లు మొదలైన దుర్గాలు ఉండేవి.  వీటికి దుర్గాధ్యక్షులు ఉండేవారు. వీరు సైన్యాన్ని పోషించి పద్మనాయకులకు యుద్ధాల్లో తోడ్పడేవారు. రాజ్య విభాగాల్లో ముఖ్యమైంది ‘సీమ’. గ్రామం రాజ్యానికి పునాది. గ్రామాల్లో పన్నెండు రకాల వృత్తి పనివాళ్లు ఉండేవారు.
పన్నులు: రాజ్యానికి భూమి మీద వచ్చే పన్నులే ప్రధాన ఆదాయం. పంటలో 1/6వ వంతు శిస్తు రూపంలో వసూలు చేసేవారు. పద్మనాయకులు పొరుగు రాజ్యాలైన విజయనగర, రెడ్డి, గజపతులు, బహమనీ సుల్తాన్లతో నిరంతరం యుద్ధాలు చేయడం వల్ల ప్రజల మీద పన్నుల భారం ఎక్కువగా పడింది. 
 
ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయం
పద్మనాయకులు కాకతీయుల వ్యవసాయ విధానాన్నే అనుసరించారు. అనపోత సముద్రం, రాయసముద్రం, నాగ సముద్రం, పర్వతరావు తటాకం, వేదగిరి తటాకం మొదలైన తటాకాలను తవ్వించారు. ఏతాము, రాట్నాల ద్వారా కూడా పొలాలకు నీటి వసతి కల్పించేవారు.
 ‘కాలమెడసేసిన / ఏతములెత్తి కాల్వలున్ పాయలు, కోళ్లు, నూతులను / బావులు రాట్నములున్ బలార్థమై’ అన్న కొరవి గోపరాజు పద్యం తరీ (పొలం) సేద్యంలో వచ్చిన కొత్త మార్పును తెలుపుతుంది. గ్రావిటీ పద్ధతిలో నీరందించే చెరువులతోపాటు నూతన నీటి పారుదల పద్ధతులు వచ్చినట్టు తెలుస్తోంది. కరవు సమయాల్లో గ్రావిటీ పద్ధతిలో నీరందని పొలాలకు కూడా నీరందించే కొత్త పద్ధతులు, సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. అవి.. ఏతాము, పర్రెకాల్వలు, కోల్ (కోళ్లు) బావులు (వాగుల నుంచి వచ్చే నీళ్లను గుంతలకు మళ్లించి వాటి నుంచి మోట ద్వారా తరలించే పద్ధతి), నూతులు, రాట్నాలు, మోటలు. నాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. పోతన  కూడా వ్యవసాయం చేయడమే దీనికి నిదర్శనం. వరి, జొన్న, సజ్జ, చెరకు, నువ్వులు, పత్తి మొదలైనవి నాటి ముఖ్య పంటలు, అరటి, ద్రాక్ష తోటలు కూడా ఉండేవి.
 
పరిశ్రమలు
నాటి పరిశ్రమల్లో నేత పరిశ్రమదే అగ్రస్థానం. వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా రంగుల పరిశ్రమ ఉండేది. ‘సింహాసన ద్వాత్రింశిక’ అనే గ్రంథంలో పలు రకాల పట్టువస్త్రాల ప్రస్తావన కనిపిస్తుంది. ఓరుగల్లు, దేవరకొండ, గోల్కొండ ప్రాంతాలు వస్త్ర పరిశ్రమ కేంద్రాలుగా ఉండేవి. నిర్మల్ కత్తులు విదేశాల్లో కూడా ప్రసిద్ధి చెందాయి.
 
వ్యాపారం
ఈ కాలంలో ఉక్కు, గాజు, అద్దాలు, కాగితం వాడుకలోకి వచ్చాయి. వైశ్య, తెలగ, బలిజలు వ్యాపారం చేసేవారు. కృష్ణానది పక్కన ఉన్న వాడపల్లి పద్మనాయకుల వ్యాపార కేంద్రం.
 
సాంఘిక పరిస్థితులు
వర్ణాశ్రమ ధర్మం స్థూలంగా అమల్లో ఉండేది. బ్రాహ్మణుల్లో వైదిక, నియోగి భేదాలు ఏర్పడ్డాయి. వెలమ, రెడ్డి కులాలకు చెందిన కొందరు వ్యవసాయాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. మిగిలిన శూద్ర కులాల వారు వ్యవసాయం, వృత్తి పనులను అవలంభించారు. వైష్ణవ భక్తి ఉద్యమం వల్ల అన్ని కులాల్లో భక్తిభావం పెరిగింది. విద్యాభిలాష మొలకెత్తింది. ప్రజలు అధిక వడ్డీలు చెల్లించాల్సి వచ్చేది. నాటి పురుషులు ధోతి, అంగీ, ఉత్తరీయం, తలపాగ ధరించేవారు. స్త్రీలు రవిక, కాసెకట్టు, రంగుల చీరలు ధరించేవారు. ప్రజలు భజనలు, కోలాటాలు, వీధి నాటకాలు, కోడి పందేలు, ఓమన గుంటలాట, గచ్చకాయలాట, పుంజీతం లాంటి క్రీడలతో వినోదించేవారు. సామాన్య ప్రజలు పేదరికం కారణంగా చదువుకోలేకపోయేవారు.
తెలంగాణలో ఇప్పటికీ ‘సాకబోయడం’ అనే ఆచారం ఉంది. ఇది పూర్వం నుంచే ఉందని సింహాసన ద్వాత్రింశిక ఆధారంగా తెలుస్తోంది. కొరవి గోపరాజు ఏకశిలా నగరాన్ని ఓరుగల్లుకు పర్యాయ పదంగా వాడటాన్ని బట్టి వరంగల్లుకే ఏకశిలానగరమనే మరో పేరు ఉందని తెలుస్తోంది. కొరవి గోపరాజు ‘దివ్వెల పండుగ’ అనే పదప్రయోగం చేశారు. దీన్ని బట్టి తెలంగాణలో దీపావళిని ‘దివిలి పండుగ’ అని కూడా పిలిచే అలవాటు ఆ కాలం నుంచే ఉందని తెలుస్తోంది. 
పార్శీ భాష ప్రభావం మొదలైంది. తెలుగు ప్రజల వేషధారణపై కూడా పార్శీ ప్రభావం పడింది. దూదేకుల(పింజారులు) కులం ఉనికిలోకి వచ్చింది. ముస్లింల దండయాత్రల వల్ల ఉత్తర భారతంలోని సతీసహగమనం తెలంగాణలోనూ అక్కడక్కడా కొన్ని ఉన్నత వర్గాల్లో కనిపించేది. తెలంగాణ సాంఘిక జీవితానికి ప్రతిబింబం సింహాసన ద్వాత్రింశిక. బతుకమ్మ, కోలాటం, హోళీ తదితర పండగలు ప్రాచుర్యం పొందాయి.
Published date : 18 Nov 2015 05:30PM

Photo Stories