Skip to main content

అసఫ్ జాహీల నిర్మాణాలు

అసఫ్ జాహీల నిర్మాణంలో ముఖ్యమైన, అద్భుతమైన నిర్మాణం ఫలక్‌నుమా ప్యాలెస్. దీన్ని హైదరాబాద్ ప్రధానమంత్రి, ఆరో నిజాం బావమరిది వికార్-ఉల్-ఉమ్రా పాయెగా నిర్మించాడు. ఫలక్‌నుమా అంటే ఉర్దూలో ‘ఆకాశంలోని అద్దం’ అని అర్థం. 1884లో ఈ భవన నిర్మాణం ప్రారంభమైంది. సముద్ర మట్టం నుంచి 2000 అడుగుల ఎత్తులో 32 ఎకరాల విస్తీర్ణంలో తేలు ఆకారంలో ఫలక్‌నుమా ప్యాలెస్‌ను నిర్మించారు. ఈ ప్యాలెస్‌లో ఇటాలియన్, ట్యూడర్ వాస్తు కళలను చూడవచ్చు. ఈ ప్యాలెస్ ముఖ్య భాగంలో గోల్ బంగ్లా, జనానామహల్, అంతఃపుర రాణివాసాన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి రూ.40 లక్షల వ్యయమైంది. వికార్-ఉల్-ఉమ్రా ఈ ప్యాలెస్‌ను మీర్ మహబూబ్ అలీఖాన్‌కు బహుమతిగా ఇచ్చాడు. మహబూబ్ అలీఖాన్ చనిపోయే వరకూ ఈ ప్యాలెస్‌లోనే నివసించారు.
మాన్యుమెంట్స్ ఆఫ్ అసఫ్ జాహీ పీరియడ్
అసఫ్ జాహీలు 17వ శతాబ్దంలో మధ్యాసియా ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చి మొగల్ సామ్రాజ్యంలో ఉన్నత పదవులు అలంకరించారు. కుతుబ్‌షాహీల పతనం తర్వాత 1687-1724 వరకు హైదరాబాద్ నగరం మొగలుల ఆధీనంలో ఉంది. మొగల్ గవర్నర్ ఔరంగబాద్ నుంచి పరిపాలన చేపట్టాడు. చార్మినార్ వద్ద కుతుబ్‌షాహీలు నిర్మించిన అనేక కట్టడాలను మొగల్ సైన్యం నాశనం చేసింది. మరాఠాల దాడుల నుంచి హైదరాబాద్‌ను రక్షించేందుకు మొగలులు 1724లో నగరం చుట్టూ గోడల నిర్మాణాన్ని ప్రారంభించారు.
మొగల్ గవర్నరైన మీర్ ఖమ్రుద్దీన్ నిజాం ఉల్ ముల్క్ 1724లో హైదరాబాద్‌లో ‘అసఫ్‌జా’ వంశాన్ని స్థాపించాడు. అసఫ్‌జాల నిర్మాణాలు హైదరాబాద్ నగర రక్షణ గోడలతోనే ప్రారంభమయ్యాయి. మీర్ ఖమ్రుద్దీన్ నిజాం-ఉల్-ముల్క్ ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించాడు. 1740 నాటికి హైదరాబాద్ చుట్టూ రక్షణ గోడల నిర్మాణం పూర్తైంది. 1908లో మూసీ నదికి వచ్చిన వరదల వల్ల మొదటిసారిగా రక్షణ గోడలు  దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కొన్ని ద్వారాలు మాత్రమే ఉండగా, అవి కూడా అవసాన దశలో  ఉన్నాయి.
డాబిర్‌పుర ద్వారం
హైదరాబాద్ చుట్టూ 17 ద్వారాలను నిర్మించారు. అందులో ముఖ్యమైన డాబిర్‌పుర ద్వారాన్ని 1724-40 మధ్య కాలంలో నిర్మించారు. హైదరాబాద్ రాజ్యంలోని పండితుల్లో ఒకరైన అబుస్ సమద్ డాబిర్-ఉల్-ముల్క్ పేరును ఈ ద్వారానికి పెట్టారు. 1750 నాటికి హైదరాబాద్ నగరం 2.25 లక్షల జనాభాతో దేశంలోనే ఎక్కువ జనాభా ఉన్న నగరంగా ఆవిర్భవించింది.
1763 తర్వాత అసఫ్ జాహీల కట్టడాల నిర్మాణం ఊపందుకుంది. అసఫ్ జాహీల కాలంలో నిర్మించిన కట్టడాల్లో పాయెగా సమాధులు, సైదానిమా సమాధి, చౌమోహల్లా ప్యాలెస్, పురానా హవేలి, బేగం బజార్, రేమండ్ సమాధి, గన్‌ఫౌండ్రి, బ్రిటిష్ రాజప్రతినిధి కోట, హైకోర్టు భవనం, ఆర్‌‌ట్స కాలేజీ భవనం, దివాన్ దేవిడీ, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి భవనం ముఖ్యమైనవి.
1748లో మీర్ ఖమ్రుద్దీన్ అసఫ్‌జా లాడ్ బజార్‌లో షాహీ జీలుఖానా ద్వారాన్ని నిర్మించాడు. ఈ నిర్మాణంలో రాజస్థానీ శైలిని వాడి పందిళ్లు, కిటికీలను నిర్మించారు. మలి మొగలుల శైలిలో తోరణాలు, ముఖద్వారాన్ని నిర్మించారు. 1724-40 మధ్య కాలంలో నిర్మించిన హైదరాబాద్ నగర కోటల్లో భాగంగా అలియాబాద్ సరాయిని మొదటి అసఫ్‌జా నిర్మించాడు. పాత నగర రక్షణ కోట భాగాలను ఇప్పటికీ అలియాబాద్ పరిసర ప్రాంతాల్లో చూడవచ్చు. 
రెండో అసఫ్‌జా కాలంలోని నిర్మాణాలు
1795లో మన్సీ రేమండ్ సహాయంతో ఫిరంగుల తయారీ పరిశ్రమను గన్‌ఫౌండ్రి పేరుతో అబిడ్స్‌ వద్ద నిజాం అలీఖాన్ నిర్మించాడు. గన్‌ఫౌండ్రి నిర్మాణంలో ఇటుకలు, మోర్టార్‌ను వాడారు.
మన్సీ రేమండ్ సమాధి
రెండో నిజాం రాజు నిజాం అలీఖాన్ సైన్యంలో ముఖ్యమైన ఫ్రెంచ్ అధికారి మన్సీ రేమండ్. ప్రజలు ఇతణ్ని ముసారాముడని పిలిచేవారు. ఇతడి పేరు మీద ముసారాంబాగ్ నిర్మాణం జరిగింది. 1798లో మన్సీ రేమండ్ మరణించాడు. ఇతడి సమాధిని యురోపియన్ శైలిలో 28 పిల్లర్లతో ముసారాంబాగ్ వద్ద నిర్మించారు. ఈ నిర్మాణంలో ఊదారంగు గ్రానైట్ రాయిని వాడారు.
పాయెగా (పాయిగా) సమాధులు
వీటి నిర్మాణాన్ని 1786లో ప్రారంభించారు. పాయిగా సమాధులను షమ్స్-ఉల్-ఉమ్రా సమాధులని కూడా అంటారు. హైదరాబాద్ రాజ్యంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు పాయెగాలు. నిజాం అలీఖాన్ కాలంలో 1760 నుంచి 1803 వరకు షమ్స్-ఉల్-ఉమ్రా సర్వసైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు. పాయెగా సమాధుల నిర్మాణంలో మొగల్, మూరిష్ శైలులను వాడారు. ఈ సమాధుల నిర్మాణంలో సున్నం, మోర్టార్‌ను ఉపయోగించారు. ఈ సమాధుల్లో రేఖాగణిత చిత్రాలు, పూలమొక్కల డిజైన్లు, పందిరి నిర్మాణాలు చూడవచ్చు.
పురానా హవేలి
రెండో నిజాం కాలంలో పురానా హవేలి నిర్మాణం ప్రారంభమైంది. పురానా హవేలి ప్రాంతాన్ని రుకును-ఉద్-దౌలా నుంచి నిజాం అలీ తీసుకొని తన కుమారుడైన సికిందర్ జా కోసం హవేలి (అంతఃపురం)ని నిర్మించాడు. ఈ హవేలిలోని ప్రధాన భవనాన్ని 18వ శతాబ్దం నాటి యురోపియన్ శైలిలో నిర్మించారు. పురానా హవేలి U ఆకారంలో ఉంటుంది. ప్రధాన భవనానికి రెండు వైపులా దీర్ఘచతురస్రాకారంలో ఒకదానికొకటి సమాంతరంగా ఈ భవనాలను నిర్మించారు. ఈ హవేలిలో ప్రపంచంలోనే అతిపెద్ద దుస్తుల అల్మారాను ఏర్పాటు చేశారు. సికిందర్ జా కొన్ని రోజులు ఇక్కడ నివసించి తర్వాత కిల్వత్  మహల్‌కు మారాడు. సికందర్ జా ఈ హవేలిని వదిలి పెట్టడం వల్ల పురానా హవేలి అని పేరొచ్చింది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ పురానా హవేలిలో మ్యూజియంను ఏర్పాటు చేశాడు. పురానా హవేలిలోని అద్దాల భవనం చీని ఖానా (చైనా నుంచి తెచ్చిన అద్దాలతో నిర్మించిన భవనం) చెప్పుకోదగింది.
 
సికిందర్ జా (1803-1829) కాలంలోని నిర్మాణాలు
నిజాం రాజు సైన్య సహకార సంధిపై సంతకం చేసిన తర్వాత బ్రిటిషర్లు హైదరాబాద్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. బ్రిటిష్ రాజప్రతినిధి అధికార నివాసాన్ని సుల్తాన్ బజార్‌లో నిర్మించారు. 1803లో జాన్ శామూల్స్ రస్సెల్ రెసిడెన్సీ భవన డిజైన్ (ప్రణాళిక)ను రూపొందించాడు. 1803-04లో రెసిడెన్సీ భవన నిర్మాణం పూర్తైంది. ఆ సమయంలో హైదరాబాద్‌లో బ్రిటిష్ రాజప్రతినిధిగా జేమ్స్ అకిలీస్ కిర్క్ పాట్రిక్ ఉన్నాడు. ఈ నిర్మాణంలో యురోపియన్ శైలి కన్పిస్తుంది. ఈ భవనంలోని ప్రధాన కేంద్ర బ్లాక్‌ను జార్జియన్ శైలిలో నిర్మించారు. ఈ శైలిని అమెరికా అధ్యక్ష భవనమైన శ్వేతభవనంలో చూడవచ్చు. బ్రిటిష్ రాజప్రతినిధి నివసించే కోట ప్రాంతం వల్ల దానికి కోఠి అనే పేరొచ్చింది. ప్రస్తుతం ఈ భవనంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉమెన్‌‌స కాలేజీని నిర్వహిస్తున్నారు.
 1803-29 మధ్య కాలంలో సికిందర్ జా  వద్ద మిలటరీ అధికారిగా పనిచేసిన జామ్ సింగ్ కార్వాన్‌లో రాజస్థానీ శైలిలో ఒక దేవాలయాన్ని నిర్మించాడు.
 
నాసిరుద్దౌలా (1829-57) కాలంలో నిర్మాణాలు
1839లో చాదర్‌ఘాట్ వద్ద మూసీనదిపై వంతెన నిర్మించారు. 1840-50 మధ్య కాలంలో సికింద్రాబాద్‌లో సెయింట్ మేరీ క్యాథడల్‌ను డేనియల్ మర్ఫి నిర్మించాడు. 1845లో హైదరాబాద్ రాజ్య పేష్కర్ రాజా చందులాల్ ఆల్వాల్ ప్రాంతంలో ఒక దేవాలయాన్ని నిర్మించాడు.
 భగవాన్ దాస్ గార్డెన్
భగవాన్ దాస్ గుజరాత్‌కు చెందిన వైశ్యుడు. ఇతడు కార్వాన్ వద్ద భగవాన్ దాస్ గార్డెన్ పెవిలియన్ నిర్మించాడు. రెండు అంతస్తుల ఈ భవనంలో ఆర్కేడ్ వరండాలు, బాల్కనీలను టిప్పు ప్యాలెస్ తరహాలో నిర్మించారు. ఈ గార్డెన్‌లో మొగల్, గుజరాతీ శైలిలో మేలు రకం టేకుతో చెక్క స్తంభాలు, పందిళ్లు, కిటీకీలను నిర్మించారు.
 
అఫ్జల్-ఉద్-దౌలా కాలంలో నిర్మాణాలు (1857-69)
 1857-61 మధ్య నయాపూల్ వద్ద మూసీనదిపై వంతెన నిర్మించారు.
చౌమోహల్లా ప్యాలెస్
 పర్షియా భాషలో చౌ అంటే నాలుగు అని అర్థం. అరబిక్ భాషలో మోహల్లా అంటే మహల్. చౌమోహల్లా అంటే నాలుగు మహల్‌లు ఉన్న ప్రాంతమని అర్థం. 1750లో సలాబత్‌జంగ్ చౌమోహల్లా ప్యాలెస్‌కు పునాది వేశాడు. 1869లో అఫ్జల్‌ద్దౌలా బహదూర్ చౌమోహల్లా నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని షా మహల్ తరహాలో చౌమోహల్లా ప్యాలెస్‌ను నిర్మించారు. ఈ ప్యాలెస్‌లో రెండు ప్రాంగణాలు ఉన్నాయి. ఉత్తర, దక్షిణ ప్రాంగణాల్లో సొగసైన రాజభవనాలు, గొప్ప రాజదర్బారు హాలు, ఫౌంటెన్లు, తోటలు ఉన్నాయి. ఉత్తర ప్రాంగణంలో బారా ఇమామ్ ఉంది. ఇందులో తూర్పువైపు పొడవైన కారిడార్, దాని పక్కనే విశాలమైన గదులు ఉన్నాయి. గతంలో పరిపాలన కోసం ఈ గదులను ఉపయోగించారు.
 దక్షిణ ప్రాంగణంలో నాలుగు మహల్‌లు ఉన్నాయి. అవి అఫ్జల్ మహల్, మహతబ్ మహల్, తన్యిత్ మహల్, అఫ్తాబ్ మహల్. వీటిలో అఫ్తాబ్ మహల్ అందమైంది. ఈ మహల్ ఉన్న గడియారాన్ని కిల్వత్ గడియారం అంటారు. చౌమెహల్లాలోని దర్బారు హాల్లో అతి ముఖ్యమైన అధికారులను నిజాం రాజులు కలుసుకునేవారు. ఈ దర్బారులో పురాతన రాత ప్రతులు, పుస్తకాలను ఉంచారు. ఆరో నిజాం గౌరవార్థం రోషన్ మహల్‌ను ఉత్తర ప్రాంగణంలో నిర్మించారు. కిల్వత్ మహల్‌లోని అతిగొప్ప నిర్మాణం గ్రాండ్ దర్బారు హాలు. ఇందులో మొగల్ శైలిలో గుమ్మటాలు (డోమ్‌లు), తోరణాలు నిర్మించారు. గోడలను పర్షియన్ శైలిలో అలంకరించారు. గ్రాండ్ దర్బారులో నిజాం రాజు సింహాసనం తక్త్-ఇ-నిషాన్‌ను ఉంచారు. దర్బారు హాలు ఫ్లోర్ అంతటినీ స్వచ్ఛమైన పాలరాయితో నిర్మించారు. 19 బెల్జియన్ క్రిస్టల్ షాండ్లియర్‌లను గ్రాండ్ దర్బారులో ఏర్పాటు చేశారు. నిజాం రాజులు తమ రాజకీయ, మత సమావేశాలు, పండుగలను గ్రాండ్ దర్బారులో నిర్వహించేవారు. 1906లో వేల్స్ రాకుమారుడు భారత్ వచ్చినప్పుడు అతడి గౌరవార్థం గ్రాండ్ దర్బారులో విందు ఏర్పాటు చేశారు.
 
మీర్ మహబూబ్ అలీఖాన్ (1869-1911) కాలంలో నిర్మాణాలు
 1874లో తొలి రైల్వేలైన్‌ను హైదరాబాద్ నుంచి వాడి వరకు బ్రాడ్‌గేజ్ నిర్మించారు. 1886లో బ్రిటిషర్లు చార్మినార్‌ను రక్షించాల్సిన కట్టడాల జాబితాలో చేర్చారు.
హజ్రత్ సైదానిమా సాహెబా సమాధి
 మీర్ మహబూబ్ అలీఖాన్ ప్రభుత్వంలో ఉన్నతాధికారి అబ్దుల్ హక్ దిలేర్ జంగ్ తన తల్లి సైదానిమా సాహెబా మరణానంతరం హుస్సేన్‌సాగర్ వద్ద ఆమె సమాధి నిర్మించారు. ఈ సమాధిని రెండు అంతస్తులుగా నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని తోరణాలు, అలంకరణలు మొగల్ శైలిలో ఉన్నాయి. మొదటి అంతస్తు, గుమ్మటాన్ని కుతుబ్ షాహీల వాస్తుకళ లేదా శైలిలో నిర్మించారు.
 ఛాత్తాబజార్‌లో సాలార్‌జంగ్-1 పేరు మీద దివాన్ దేవిడిని నిర్మించారు. ఇందులో మొగల్ శైలిలో రెండు ముఖద్వారాలు, అర్ధచంద్రాకార తోరణాలను నిర్మించారు.
 అసెంబ్లీ భవనం
 మీర్ మహబూబ్ అలీఖాన్ 40వ జన్మదినాన్ని పురస్కరించుకొని 1905లో టౌన్‌హాల్ నిర్మాణాన్ని ప్రారంభించి 1923లో పూర్తి చేశారు. దీన్ని పర్షియన్, రాజస్థానీ శైలిలో నిర్మించారు. తర్వాతి కాలంలో నిజాం ప్రభుత్వం ఈ హాలును శాసనసభగా మార్చింది.
 
మీర్ ఉస్మాన్ అలీఖాన్ (1911-1948) కాలంలో నిర్మాణాలు
 1866లో రాజ కుటుంబీకులు, భూస్వాముల కోసం అఫ్జల్‌గంజ్‌లో 30 పడకల ఆసుపత్రిని నిర్మించారు. 1908లో మూసీనదికి వచ్చిన వరదల వల్ల ఈ ఆసుపత్రి ధ్వంసమైంది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రూ. 20 లక్షల వ్యయంతో నూతన ఆసుపత్రి భవనాన్ని అఫ్జల్‌గంజ్‌లో  నిర్మించాడు. ఆయన పేరుమీద ఈ ఆస్పత్రికి ఉస్మానియా జనరల్ ఆసుపత్రిగా నామకరణం చేశారు. ఉస్మానియా ఆసుపత్రిని ఇండో-సార్సనిక్ శైలిలో నిర్మించారు. ఈ భవన నిర్మాణానికి విన్సెంట్ జెరొమ్ ఏస్చ్ చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ఇతడు నగర ఉన్నత పాఠశాల, హైదరాబాద్ రైల్వేస్టేషన్, హైకోర్టు భవనాలను కూడా రూపొందించాడు.
కింగ్ కోఠి ప్యాలెస్
1911లో కమల్ ఖాన్ తన సొంత అవసరాల కోసం సుల్తాన్‌బజార్ ప్రాంతంలో నూతన ప్యాలెస్‌ను నిర్మించాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు ఈ ప్యాలెస్ నచ్చింది. దాంతో కమాల్ ఖాన్ వద్ద నుంచి ప్యాలెస్‌ను పొందాడు. ఉస్మాన్ అలీఖాన్ ఒక ఫర్మానా ద్వారా ఆ ప్రాంతానికి కింగ్ కోఠి అని నామకరణం చేశాడు. ఈ ప్యాలెస్‌లో మూడు ప్రధాన భవనాలు ఉన్నాయి. పశ్చిమ భాగంలో ఉన్న భవనాన్ని నజరిబాగ్ అని పిలుస్తారు. ప్రస్తుతం ప్యాలెస్ తూర్పు భాగంలో ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు.
బషీర్‌బాగ్ ప్యాలెస్
పాయెగా వంశానికి చెందిన ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా ఫతేమైదాన్ వద్ద బషీర్‌బాగ్ ప్యాలెస్‌ను నిర్మించాడు.
సిటీ కాలేజీ
1895లో మీర్ మహబూబ్ అలీఖాన్, మదరసా దార్-ఉల్-ఉలూమ్ అనే మొదటి సిటీ స్కూల్‌ను ప్రారంభించాడు. తర్వాతి కాలంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ దాన్ని విస్తరించాడు. ప్రస్తుతం ఉన్న సిటీ కాలేజీ భవనానికి ఈ స్కూల్‌ను 1921లో మార్చారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ 16 ఎకరాల స్థలంలో ఇండో-సార్సనిక్ శైలిలో సిటీ కాలేజీని రెండు అంతస్తులుగా నిర్మించాడు.
మొజంజాహీ మార్కెట్
 1935లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన రెండో కుమారుడైన మొజంజా పేరు మీద మొజంజాహీ మార్కెట్‌ను నిర్మించాడు. దీన్ని పూర్తిగా రాళ్లతో నిర్మించారు. దీనికి ఒక మూలన మినార్‌ను నిర్మించి, అందులో ఒక గడియారాన్ని పొందుపర్చారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
 1923లో హెచ్. వేక్‌ఫిల్డ్ చొరవతో జాగిర్దారీ కాలేజీని బేగంపేటలో ఏర్పాటు చేశారు. జాగిర్దారులు, ప్రభువుల పిల్లల కోసం ఈ కాలేజీని ప్రైవేట్‌గా ఏర్పాటు చేసి రెసిడెన్షియల్ విధానంలో నడిపారు. 1950లో భారత ప్రభుత్వం జాగిర్దారీ విధానాన్ని రద్దు చేసింది. 1957లో జాగిర్దారీ కాలేజీని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌గా పేరు మార్చారు. 1952లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 160 ఎకరాల్లో నిర్మించారు. ఇందులోని జాగిర్దారీ బ్లాక్, షహిన్ బ్లాక్‌లను ఇండో-పర్షియన్ శైలిలో నిర్మించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం
హైదరాబాద్ నగరానికి తూర్పున, సముద్రమట్టానికి 1725 అడుగుల ఎత్తులో 1500 ఎకరాల విస్తీర్ణంలో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో హైదరాబాద్‌ను సందర్శించిన సర్ ప్యాటిక్ గెడ్డెస్ యూనివర్శిటీ ఏర్పాటుకు అడిక్‌మెట్ అనువైన ప్రాంతమని సూచించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయ నిర్మాణం కోసం హైదరాబాద్ ప్రభుత్వం నవాబ్ జైన్ యార్ జంగ్ బహదూర్‌ను నియమించింది. ఆర్ట్స్ కాలేజీకి సంబంధించిన ప్రణాళికను మన్సియోర్ జెస్పర్ రూపొందించాడు. ఈ భవన తోరణాలను ఇండో-సార్సనిక్ సంప్రదాయంలో నిర్మించారు. అజంతా, ఎల్లోరాలో అలంకరించిన స్తంభాకారాలను పోలిన అష్టభుజ స్తంభాలను మొదటి అంతస్తులో నిర్మించారు. కాలేజీ ద్వారాన్ని అర్ధచంద్రాకారంలో నిర్మించారు. ఈ దర్వాజా పక్కన ఇరువైపులా రెండు భారీ స్తంభాలు నిర్మించారు. షాబాద్ నుంచి తీసుకువచ్చిన రాళ్లతో ఆర్ట్స్ కాలేజీ ఫ్లోర్‌ను నిర్మించారు. నవాబ్ జైన్ యార్ జంగ్ బహదూర్‌కు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
జూబ్లీహాల్
1913లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ జూబ్లీహాల్‌ను ఇండో-పర్షియన్ శైలిలో బాగ్-ఇ-ఆమ్ (పబ్లిక్ గార్డెన్‌‌స)లో నిర్మించారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ్యానికి వచ్చి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలను ఈ భవనంలో నిర్వహించారు. నాటి నుంచి ఈ భవనాన్ని జూబ్లీహాల్‌గా పిలుస్తున్నారు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఉస్మాన్ అలీఖాన్ రాజచిహ్నంతో బంగారు పూత పూసిన సింహాసనం రూపొందించారు. ప్రస్తుతం ఈ సింహాసనాన్ని పురానా హవేలిలోని నిజాం మ్యూజియంలో ఉంచారు.
Published date : 15 Nov 2015 07:04PM

Photo Stories