Skip to main content

తెలంగాణ - ప్రతిష్టాత్మక సామాజిక, సంక్షేమ పథకాలు

తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టు (Telangana Drinking Water Supply Project)
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది.
  • ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 42,000 కోట్లు.
  • తొమ్మిది జిల్లాల్లో పథకం అమలు (హైదరాబాద్ మినహా).
  • 25,139 గ్రామీణ ఆవాస ప్రాంతాలు, 67 పురపాలక సంస్థల్లో అమలు.
  • 3.19 కోట్ల జనాభాకు రోజుకు ఒక్కో వ్యక్తికి 100 ఎల్పీసీడీల నీటిని అందిస్తారు.
  • తెలంగాణ తాగునీటి ప్రాజెక్టుకు 67 టీఎంసీ నీరు అవసరం.
  • ప్రాజెక్టు కాలవ్యవధి నాలుగేళ్లు.
  • 1.25 లక్షల కిలోమీటర్ల పైపులైన్లు, 18 ఇన్‌టేక్ బావులు, 63 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు, 17,407 స్టోరేజ్ ట్యాంకులు, 62 ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్‌లు నిర్మిస్తారు.
  • ఈ ప్రాజెక్టుకు 187 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది.
  • స్మార్ట్ టెక్నాలజీతో నీటి వినియోగాన్ని పర్యవేక్షించడం ద్వారా వృథాను తగ్గిస్తారు.
  • ప్రస్తుతం రాష్ట్రంలో అమమలవుతున్న తాగునీటి ప్రాజెక్టులు అన్నింటినీ తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టులో సమీకృతం చేస్తారు.
  • తెలంగాణలో కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి. నాగార్జునసాగర్, పాలేరు, వైరా, దుమ్ముగూడెం, శ్రీశైలం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, సింగూరు, కడెం, కొమరం భీం వంటి ప్రాజెక్టుల్లో రాష్ట్ర త్రాగునీటి అవసరాలకు సరిపోయేట్లు సమృద్ధిగా నీటిని నిల్వ చేసుకోవచ్చు.
  • ఈ మెగాప్రాజెక్టును 26 సెగ్మెంటులుగా విభజించారు.
  • ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు ద్వైపాక్షిక, బహుళపాక్షిక ఏజెన్సీలు, ఆర్థిక సంస్థల నుంచి నిధులను సమీకరించటం జరుగుతుంది.
తెలంగాణ హరితహారం
  • రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో వృక్షాల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
  • తెలంగాణ హరిత హారంలో భాగంగా రానున్న మూడేళ్లలో రాష్ర్ట వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలని ప్రతిపాదించారు.
  • ఇందులో 130 కోట్ల మొక్కలను నోటిఫైడ్ అటవీ ప్రాంతాలకు బయట నాటాలని నిర్ణయం.
  • హెచ్‌ఎండీఏ పరిధిలో 10కోట్ల మొక్కలు నాటనున్నారు.
  • ఈ కార్యక్రమంలో భాగంగా బహుళ రహదారుల వెంట, నదులు, కాల్వలు చెరువు గట్టుల మీద, సంస్థల ప్రాంగణాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, హౌసింగ్ కాలనీలు, కమ్యూనిటీ భూములలో పెద్ద ఎత్తున మొక్కలు పెంచడం ద్వారా సామాజిక అటవీ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తారు.
  • హరితహారం కార్యక్రమంలో అందర్నీ భాగస్వాములను చేస్తారు. ఇందుకు అనగుణంగా అవసరమైన విధి విధానాలు, చట్టాలు, పాలనా పరమైన అంశాల్లో మార్పులు చేస్తారు.
  • అడవులను సంరక్షించటం, లైవ్ రూట్ స్టాక్‌ను ప్రోత్సహించటం ద్వారా నోటిఫైడ్ అడవుల లోపల 100 కోట్ల మొక్కలను నాటనున్నారు.
  • ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమం ద్వారా వచ్చే సూచనల ఆధారంగా తెలంగాణ హరితహారం కార్యక్రమంలో నర్సరీలు, మొక్కలు నాటే ప్రదేశాలను గుర్తిస్తారు.
  • గుర్తించిన 3,888 నర్సరీల్లో 2015 సంవత్సరంలో 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • ఈ కార్యక్రమంలో అటవీ, వ్యవసాయ, గిరిజన, ఉద్యానవన, సంక్షేమ శాఖలను కూడా అంతర్భాగం చేస్తారు.
  • 2016లో మరో 40 కోట్ల మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
భూమి కొనుగోలు పథకం (Land Purchase Scheme)
అత్యంత నిరుపేద ఎస్సీ కుటుంబాల్లోని మహిళలకు భూమి కొనుగోలు చేసి అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
  • ఈ పథకంలో భాగంగా ఎస్సీ లబ్దిదారు మహిళలకు మొదటి దశలో మూడు ఎకరాల భూమిని అందచేస్తారు.
  • అర ఎకరం, ఎకరం, రెండు ఎకరాలు భూమి ఉన్న ప్రతి ఎస్సీ కుటుంబానికి మూడు ఎకరాలు ఉండే విధంగా రెండో దశలో మిగులు భూమిని పంపిణీ చేస్తారు.
  • భూమి కొనుగోలు పథకంలో భాగంగా అందజేసిన భూమి అభివృద్ధికి ప్రభుత్వం తగిన ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
  • ఇందులో భాగంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సాగునీటి వనరులు, విద్యుత్ సౌకర్యం, పంపుసెట్లు మొదలయిన వాటిని కల్పించేందుకు ‘ సమగ్ర ప్యాకేజీ’ని రూపొందించారు.
  • సాగువ్యయం, ఇతర ఖర్చుల మొత్తం వ్యయాన్ని నేరుగా లబ్దిదారుని ఖాతాలో జమచేస్తారు.
  • భూమి కొనుగోలు పథకాన్ని లబ్దిదారుని నుంచి ఎలాంటి వాటా ధనం, బ్యాంక్ లింకేజీలతో సంబంధం లేకుండా 100 శాతం సబ్సిడీతో అమలుచేయడం జరుగుతుంది.
  • ఈ పథకానికి అవసరమయిన భూమిని ఎకరం రెండు నుంచి ఏడు లక్షల వరకు కొనుగోలు చేసేందుకు కలెక్టర్లకు అధికారాలు ఇచ్చారు.
  • 2015, జనవరి 29 నాటికి 1,132 ఎకరాల ప్రైవేటు భూమి, 270 ఎకరాల ప్రభుత్వం భూమితో కలిపి మొత్తం 1,402 ఎకరాలను ఈ పథకం కింద మంజూరు చేశారు.
సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం
  • విద్యార్థులకు మంచి విద్యతో పాటు నాణ్యమైన పౌస్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
  • తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్టల్స్ విద్యార్థులకు, మధ్యాహ్న భోజన లబ్దిదారులకు ఈ పథకంలో భాగంగా సన్నబియ్యంతో భోజన వసతి కల్పిస్తారు.
  • హాస్టల్స్‌లోని విద్యార్థులకు 6,663 మెట్రిక్ టన్నులు, మధ్యాహ్న భోజనానికి 5,837 మెట్రిక్ టన్నులు చొప్పున నెలకు 12,500 టన్నుల బియ్యం అవసరం అవుతాయి.
  • ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి పాత బియ్యాన్ని కి.లో రూ.36 చొప్పున , కొత్త బియ్యంను (2014-15 పంట) రూ. 32.50 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
  • ఈ పథకానికి సంబంధించిన సన్నబియ్యాన్ని బ్లాక్ మార్కెట్ లేదా రీసైక్లింక్ చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు.
కల్యాణలక్ష్మీ పథకం
  • ఎస్సీ, ఎస్టీ అమ్మాయిలకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం‘ కల్యాణలక్ష్మీ’ పథకాన్ని ప్రారంభించింది.
  • తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలు మించని ఎస్టీ, ఎస్టీ కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.
  • 18 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ యువతులకు వివాహ సమయంలో రూ.51,000 ఆర్థిక సహాయం చేస్తారు. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో పెళ్లి కుమార్తె అకౌంట్‌లో జమచేస్తారు.
షాదీముబారక్
  • మైనార్టీ కమ్యూనిటీ యువతుల వివాహ సందర్భంగా ఆయా కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
  • తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని 2014, అక్టోబరు 2న ప్రవేశపెట్టింది.
  • ఈ పథకం కింద వివాహానికి నెల రోజుల ముందు దరఖాస్తు చేసుకునే ప్రతి మైనార్టీ బాలికకు ఒకేసారి రూ.51,000 ఆర్థిక సహాయం అందజేస్తారు.
  • ఈ మొత్తాన్ని పెండ్లికుమార్తె పేరిట అకౌంట్ పేయీ చెక్కు ద్వారా బ్యాంకు ఖాతాలో జమచేస్తారు.
రాష్ట్రంలో వన్యప్రాణి, జీవవైవిధ్య సంరక్షణ
  • తెలంగాణ రాష్ట్రంలో సుసంపన్నమైన మొక్కలు, పక్షి జాతులు, పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయి.
  • రాష్ట్రంలో 2939 జాతుల మొక్కలు, 365 పక్షి జాతులు, 103 క్షీరద జాతులు, 28 సరీసృప జాతులతో పాటు పెద్ద సంఖ్యలో అకశేరుక జాతులు ఉన్నాయి.
  • జీవవైవిధ్యాన్ని సంరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం 12 రక్షిత ప్రాంతాలను ప్రకటించింది.
  • ఇందులో తొమ్మిది వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, మూడు జాతీయ పార్కులు ఉన్నాయి.
  • అంతరించిపోయే జాబితాలో ఉన్నవి-బురద మొసళ్లు.
  • బురద మొసళ్లకు నిలయమైన సంరక్షణ కేంద్రాలు- మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం.
  • శివరాం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం.
టైగర్ ప్రాజెక్టు
  • తెలంగాణ రాష్ట్రంలో రెండు పులుల సంరక్షణ కేంద్రాలు (Tiger Reserves) ఉన్నాయి.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్: మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల మధ్య ఉన్న నల్లమల కొండ ప్రాంతంలోవిస్తరించి ఉంది.
కవ్వాల్ టైగర్ రిజర్వ్:
  • కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.
  • ఇది మహరాష్ట్రలోని తాడోబా అంధేరీ టైగర్ రిజర్వ్, చత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్‌లకు కొనసాగింపుగా ఉంది.
  • పులులు కవ్వాల్‌తో పాటు మిగిలిన రెండు సంరక్షణా కేంద్రాల మధ్య సంచరిస్తూ ఉంటాయి.
  • బెల్లంపల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్ డివిజన్ల ద్వారా మూడు టైగర్ రిజర్వ్‌లను అనుసంధానం చేసి అంతరించిపోతున్న పులుల జాతులను సంరక్షించవచ్చు.
తెలంగాణ బయో-డైవర్సిటీ బోర్డ్
  • తెలంగాణ రాష్ట్రంలో జీవవైవిధ్యాన్ని సంరక్షించడం, జీవ వనరులను అందరికీ న్యాయబద్దంగా పంపిణీ చేయటమే లక్ష్యంగా తెలంగాణ బయో డైవర్సిటీ బోర్డ్‌ను ఏర్పాటు చేశారు.
  • ప్రతి సంవత్సరం మే 22 తేదీన అంతర్జాతీయ బయో డైవర్సిటీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
  • బయో డైవర్సిటీ, దాని ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి జిల్లాకు ఒక బయో డైవర్సిటీ పార్కును ఏర్పాటు చేయాలని బయో డైవర్సిటీ బోర్డు ప్రతిపాదించింది.
  • రాష్ట్రంలో పది జిల్లాల్లోని 66 మండలాలు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 170 బయో డైవర్సిటీ మేనేజ్‌మెంట్ కమిటీలను ఏర్పాటు చేశారు.
మెరుగుపర్చిన జాతీయ వ్యవసాయబీమా పథకం (ఎంఎన్‌ఏఐఎస్)
కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2010-11 రబీలో వరంగల్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. వడగళ్ల వాన లాంటి స్థానిక విపత్తుల వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించడం, విత్తుకు వచ్చిన ఆటంకాలు, ప్రధాన పంటలన్నింటికీ బీమా, ప్రీమియంలో 40-75 శాతం సబ్సిడీ తదితర ప్రయోజనాలు కల్పించారు. వరిని ఈ పథకం కింద ఎంపిక చేశారు. గ్రామం ప్రామాణిక ప్రదేశం. 2014-15 రబీ సీజన్ నుంచి ఈ పథకాన్ని అన్ని జిల్లాలకు విస్తరించారు.
జాతీయ ఇ- పాలనా ప్రణాళిక - వ్యవసాయం:
ప్రభుత్వం నుంచి పౌరుడికి / ప్రభుత్వం నుంచి రైతుకు, ప్రభుత్వం నుంచి వ్యాపారానికి, ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి కేంద్ర వ్యవసాయ పోర్టల్స్(ఎస్‌ఏపీలు) ద్వారా సమీకృత విధానంలో వ్యవసాయ సేవలు అందించడం లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు.
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో ఇదొకటి. ఆర్‌కేవీవై పూర్తిగా కేంద్ర నిధులతో అమలవుతోంది. వ్యవసాయ రంగంలో 4 శాతానికి పైగా వృద్ధిరేటు సాధించడం దీని ఆశయం. వ్యవసాయం, ఉద్యానవనాలు, పశు గణాభివృద్ధి, మత్స్య సంపద, పాడి అభివృద్ధి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, యాగ్రోస్, సెరికల్చర్, టీఎస్ మార్క్ ఫెడ్, ఆహారోత్పత్తులు(పరిశ్రమలు).. ఇందులో భాగం. ఆర్‌కేవీవై కింద 2014-15లో తెలంగాణకు రూ. 195.27 కోట్లు కేటాయించారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ యాంత్రీకరణకు ఇతోధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ట్రాక్టర్లు, టిల్లర్లు, మల్టీక్రాప్ త్రెషర్ల వంటి ఖరీదైన యంత్రాలను అద్దెకు తెచ్చుకునే అవకాశం కల్పించే కస్టమ్ హైరింగ్ సెంటర్లు, మొక్కజొన్న షెల్లర్, రోటోవేటర్లు, సమష్టి హార్వెస్టర్లు మొదలైన వాటిని రూ.50,000ల్లోపు 50 శాతం వరకు సబ్సిడీతో అందిస్తున్నారు.
జాతీయ ఆహార భద్రతా మిషన్
దీన్ని 11వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రారంభించారు. జాతీయ ఆహార భద్రతా మిషన్ ద్వారా 12వ పంచవర్ష ప్రణాళికలో కేంద్రం కొన్ని లక్ష్యాలను నిర్దేశించింది. ఈ పథకం అమలుకు మొత్తం నిధులను కేంద్రమే సమకూరుస్తుంది. 2014-15లో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం కింద రూ. 85.43 కోట్లను కేటాయించింది.

సహకార రంగం

టీఎస్ మార్క్ ఫెడ్

2014 జూన్ 2న తెలంగాణ రాష్ర్ట సహకార మార్కెటింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ (టీఎస్ మార్క్ ఫెడ్)ను పునర్‌వ్యవస్థీకరించారు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా వ్యవసాయోత్పత్తుల సేకరించే, మూల విక్రయాలను చేపట్టే తొమ్మిది జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలు దీని పరిధిలో ఉన్నాయి. 2013-14లో ఈ సొసైటీల వ్యాపార పరిమాణం రూ. 201.48 కోట్లు. ఈ సంస్థకు కరీంనగర్‌లో ఒక దాణా మిశ్రమ విభాగం, ఆదిలాబాద్‌లో ఒక పత్తి వడికే కర్మాగారం ఉన్నాయి.
వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం
సమగ్ర ఆంధ్రప్రదేశ్(వ్యవసాయోత్పత్తుల, జీవోత్పత్తుల) విపణుల చట్టం 1996 నవంబర్ 18 నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని తెలంగాణలో ఆమోదించాల్సి ఉంది. వ్యవసాయోత్పత్తుల అమ్మకంలో రైతు ప్రయోజనాల పరిరక్షణ, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడటం, వ్యాపారుల నుంచి రైతులకు రక్షణ కల్పించడం ఈ చట్టం లక్ష్యాలు. రాష్ర్టంలో 150 వ్యవసాయ మార్కెట్ కమిటీలుండగా, వాటి కింద 306 మార్కెట్ యార్డులు నోటిఫై అయ్యాయి. వీటిలో 140 ప్రధాన యార్డులు, 101 ఉప యార్డులు. 150 వ్యవసాయ మార్కెట్ కమిటీలు కాగా, 64 ఫంక్షనల్ మార్కెట్లు, 16 సీజనల్ విపణులు, 19 పాడి పశువుల విపణులు, 264 చెక్‌పోస్టులు, 26 రైతుబజార్లు.
రైతుబంధు పథకం
ఈ పథకాన్ని 1990 నుంచి అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం దీని గరిష్ట రుణ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచింది. మొదటి 180 రోజులకు వడ్డీ ఉండదు. గతంలో రైతుబంధు కార్డుకి కాలపరిమితి మూడేళ్లు మాత్రమే ఉండేది. కొత్తగా ఈ కార్డు పునరుద్ధరణ వ్యవధిని ప్రభుత్వం ఐదేళ్లకు పెంచింది. ఈ పథకం కింద 2012-13లో 953 మంది రైతులు, 2013-14లో 1,111 మంది రైతులు లబ్ధి పొందారు.
రైతు బజార్లు
రాష్ర్టంలో ఉన్న 30 రైతు బజార్ల మధ్య అనుసంధాన యంత్రాంగం ఉంది. సగటున 3,115 మంది రైతులు ప్రతి వారం 8,000 లక్షల క్వింటాళ్ల నుంచి 10,000 లక్షల క్వింటాళ్ల వరకు కూరగాయలను ఈ రైతుబజార్ల ద్వారా నేరుగా విక్రయిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ల్లో సంచార రైతు బజార్లు విజయవంతంగా పనిచేస్తున్నాయి.
Published date : 10 Sep 2015 05:51PM

Photo Stories