Skip to main content

అటవీ విస్తరణ

తెలంగాణ అడవుల్లో 2,939 రకాల వృక్ష జాతులు, 365 పక్షి జాతులు,103 రకాల క్షీరదాలు, 28 రకాల సరీసృపాలు, 21 రకాల ఉభయచరాలు, పెద్ద సంఖ్యలో అకశేరుకాలు ఉన్నాయి. అంతరించిపోయే దశలో ఉన్న పులులు, చిరుతలు, అడవి దున్నలు, నాలుగు కొమ్ముల జింకలు, కృష్ణ జింకలు, మంచినీటి మొసళ్లు రాష్ర్ట అడవుల్లో ఉన్నాయి. నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల మీదుగా ఖమ్మం జిల్లా వరకు గోదావరి నదీతీరం వెంట టేకు చెట్లు విస్తరించి ఉన్నాయి. వీటితో పాటు ఆకు రాల్చే జాతులకు చెందిన నల్లమద్ది, ఏగిస, రోజ్‌వుడ్, నారేపా, వెదురు తదితర వృక్షాలు ఉన్నాయి.
అడవులు.. మానవాళికి జీవనాధారాలు.  పర్యావరణ పరిరక్షణలో, సమీప ప్రాంతాల్లోని వారికి జీవనోపాధి కల్పించడంలో అరణ్యాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భూతాపాన్ని తగ్గించడానికి, భూసార పరిరక్షణకు, ప్రమాదంలో ఉన్న వన్యప్రాణి జాతులను కాపాడేందుకు అడవులే శరణ్యం. వర్తమాన ధరల ప్రకారం.. 2014-15లో రాష్ర్ట స్థూలోత్పత్తి(జీఎస్‌డీపీ)లో అటవీ సంపద, కలప వాటా 0.9 శాతం కాగా, వ్యవసాయ రంగ జీఎస్‌డీపీలో వీటి వాటా 5.20 శాతం.
 అటవీ విస్తీర్ణంలో తెలంగాణ 12వ స్థానంలో ఉంది. మొత్తం  29,242 చ.కి.మీ.  మేర అడవులుండగా.. ఇందులో 21,024 చ.కి.మీ. రిజ‌ర్వ‌డ్‌ అటవీ ప్రాంతం, 7,468 చ..కి.మీ. రక్షిత అడవులు. మిగతా 750 చ..కి.మీ. అవర్గీకృత భూభాగం. 2014 డిసెంబర్ నాటికి అటవీ ఉత్పత్తుల ద్వారా రాష్ట్రానికి రూ.54.16 కోట్ల ఆదాయం లభించింది. సవరించిన 2002 రాష్ర్ట అటవీ విధానం, విజన్ 2020 ప్రకారం.. అడవుల  పరిరక్షణ, అభివృద్ధి, అటవీ ఉత్పత్తులను పెంపొందించడం ద్వారా ఆదాయాన్ని సముపార్జించడానికి  రాష్ర్ట అటవీ శాఖ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోంది.
ఈ కార్యక్రమాల ఆశయాలు
ప్రజల భాగస్వామ్యంతో అటవీ నిర్వహణ, కేంద్ర ఆర్థిక సహాయంతో జాతీయ వనపోషణ కార్యక్రమం(ఎన్.ఏ.పి), ఆర్.ఐ.డి.ఎఫ్ ప్రాజెక్టులు, భూసారాన్ని, తేమను పరిరక్షించడం, సామాజిక వనపోషణ, వన్యప్రాణి నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి, అడవుల అభివృద్ధి,  పేదరికాన్ని తగ్గించడం, అడవుల్లో కొండవాలు కందకాలు, రాతి ఆనకట్టలు, ఇంకుడు గుంతల తవ్వకం లాంటి కార్యక్రమాలు చేపడతారు. వీటి ద్వారా భూగర్భ జలాలను పెంచుతారు. తద్వారా అడవులను అభివృద్ధి చేస్తారు.  అటవీ శాఖ ‘వన పరిశోధన’కు ప్రాధాన్యమిస్తోంది
 దాదాపు అన్ని కార్యక్రమాలు/ అటవీ శాఖ పథకాల్లో స్థానికులను భాగస్వాములను చేస్తున్నారు. వన సంరక్షణ సమితి (వి.ఎస్.ఎస్), పర్యావరణ అభివృద్ధి కమిటీ(ఇ.డి.సి)ల సేవల్ని రక్షిత ప్రాంతాల అభివృద్ధికి, వాటర్ షెడ్ అభివృద్ధి కమిటీలు మొదలైన వాటి సేవలను రివర్ వ్యాలీ ప్రాజెక్టులో స్వీకరిస్తున్నారు. ఒక ప్రాంతం/వన్యప్రాణి అటవీ డివిజన్ల పరిధిలో అన్ని వి.ఎస్.ఎస్.లనూ కలిపిన సమాఖ్యలే సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద అటవీ అభివృద్ధి ఏజెన్సీలు. రాష్ర్టస్థాయిలో రాష్ర్ట అటవీ అభివృద్ధి సంస్థ(ఎస్.ఎఫ్.డి.ఏ), డివిజన్ స్థాయిలో అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్.డి.ఏ), గ్రామ స్థాయిలో వన సంరక్షణ సమితి(వి.ఎస్.ఎస్) అనే మూడంచెల వ్యవస్థలో ఈ సమాఖ్యలు పనిచేస్తాయి.
తెలంగాణకు హరిత హారం
 రాష్ర్టంలో 25.16 శాతం ఉన్న అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి  పెంచాలనే లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం ‘తెలంగాణకు హరిత హారం’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పథకంలో భాగంగా అడవులను సంరక్షించడంతోపాటు,  వచ్చే మూడేళ్లలో రాష్ర్టవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను  నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో 130 కోట్ల మొక్కలను అటవీ ప్రాంతాల వెలుపల నాటనున్నారు. హెచ్.ఎం.డి.ఏ పరిధిలో 10 కోట్ల మొక్కలను నాటుతారు. అటవీ రక్షణ కార్యకలాపాల ద్వారా గుర్తించిన అటవీ ప్రాంతాల్లో 100 కోట్ల వృక్షాలను పునర్జీవింపజేసే కార్యక్రమాన్ని కూడా తలపెట్టారు.
 ‘మన ఊరు - మన ప్రణాళిక’లోని పరిశీలనల ఆధారంగా నర్సరీలు, తోట పెంపకానికి అనువైన ప్రదేశాలను గుర్తించడానికి ‘తెలంగాణకు హరిత హారం’ కార్యక్రమం కింద కసరత్తు చేశారు. మొత్తం 3,888 నర్సరీలను గుర్తించారు. 2015 సీజన్‌లో  40 కోట్ల మొక్కల్ని సిద్ధం చేయాలని నిర్ణయించారు. భారీ వృక్ష జాతులకు చెందిన మరో 40 కోట్ల మొక్కలను 2016 వనపోషణ కోసం లక్ష్యంగా పెట్టుకున్నారు.
 పరిహార వనపోషణ నిధి నిర్వహణ, ప్రణాళికా అధికార సంస్థ
 కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ కాంపెన్సేటరీ అఫోర్‌స్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కాంపా)ను నెలకొల్పింది. అటవీ భూముల్ని అటవీయేతర ప్రయోజనాలకు కేటాయిస్తే, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి వనపోషణ, వన పునర్జీవన కార్యకలాపాలను ఈ సంస్థ చేపడుతుంది. రాష్ర్టంలో 2009 నుంచి కాంపా కార్యక్రమాలు అమలవుతున్నాయి. తెలంగాణలో 2009-10 నుంచి 2013-14 వరకు వీటి కింద రూ.233.125 కోట్లు ఖర్చు చేశారు. 2014-15లో రూ.101.95 కోట్లు కేటాయించగా 2014 డిసెంబర్ వరకు రూ.45.11 కోట్లు ఖర్చుచేశారు.
తెలంగాణలో కాంపా విజయాలు
 
నికర వర్తమాన విలువ (ఎన్.పి.వి.) భాగం కింద 2,695 హెక్టార్లలో మొక్కలు నాటారు. 144 బేస్ క్యాంప్‌లు, 60 స్ట్రైక్ ఫోర్స్ దళాలు, 57 చెక్‌పోస్టులను నెలకొల్పారు. 763 కి.మీ. మేర అగ్ని ప్రమాద నిఘా మార్గాలను నిర్ణయించి, 458 మందితో నిఘా ఉంచుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగే ఆస్కారమున్న మండలాల్లో 19 ఫైర్ వాచ్ టవర్లను నిర్మించనున్నారు. అటవీ బ్లాకుల చుట్టూ 5070 సరిహద్దు స్తంభాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
తెలంగాణలో జీవవైవిధ్య పరిరక్షణ
రాష్ర్టంలో జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 12 ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా ప్రకటించింది. వీటిలో 9 వన్యప్రాణి ఆశ్రయాలు, 3 జాతీయ వన్యప్రాణి నిలయాలు. వీటి విస్తీర్ణం 5,692.48 చ.కి.మీ. ఇది రాష్ర్టంలోని మొత్తం అటవీ విస్తీర్ణంలో 19.73 శాతం.  అంతరించిపోతున్న మంచినీటి మొసళ్లకు(మార్ష్) నిలయమైన మంజీరా వన్యప్రాణి ఆశ్రయం, శివరామ్ వన్యప్రాణి ఆశ్రయాలు ఈ రక్షిత ప్రాంతాల్లో ఉన్నాయి.
టైగర్ ప్రాజెక్ట్
 రాష్ర్టంలో రెండు టైగర్ రిజర్వులున్నాయి. అమరాబాద్ టైగర్ రిజర్వ్ నల్లమల కొండల్లో మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో వ్యాపించి ఉంది. రెండోదైన కవ్వాల్ టైగర్ రిజర్వ్ మహారాష్ర్టలోని తడోబా అంథేరీ టైగర్ రిజర్వ్, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్‌‌వలతో కలిసి ఉంది. కవ్వాల్  టైగర్ రిజర్వ్ మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ డివిజన్లలో విస్తరించింది.
తెలంగాణ జీవ వైవిధ్య బోర్డు
జీవ వైవిధ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు(టి.ఎస్.బి.డి.బి.)ను ఏర్పాటు చేశారు. ఏటా మే 22న బయోడైవర్సిటీ బోర్డు అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. తెలంగాణలో 170 జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలను  ఏర్పాటు చేశారు. ఇవి 66 మండలాలు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విస్తరించాయి. ప్రతి జిల్లాలో జీవవైవిధ్య పార్కులను నెలకొల్పాలని జీవవైవిధ్య బోర్డు ప్రతిపాదించింది.
Published date : 01 Oct 2015 06:19PM

Photo Stories