Skip to main content

భక్తి, సూఫీ ఉద్యమాలు

భక్తి అంటే ఇష్టదైవంపై గాఢమైన అనురాగం. భక్తి ఉద్యమకారులు మూఢాచారాలు, కర్మలను ప్రతిఘటించారు. హిందువుల్లో ఈ భక్తి సిద్ధాంతం అతి ప్రాచీనమైంది. దీన్ని ఉపనిషత్తులు, భగవద్గీతలో గమనించవచ్చు. భక్తి ఉద్యమం 15, 16 శతాబ్దాల్లో ఉత్తర భారతదేశంలో శక్తివంతంగా మారింది. ఇస్లాం మత ప్రభావంతో అనేక మంది మతాచార్యులు దేవుడి ఏకత్వం, మానవ సౌభ్రాతృత్వాన్ని ప్రచారం చేయడానికి ముందుకు వచ్చారు. ఇదే సమయంలో హిందూమతంలో అనేక దురాచారాలు చోటు చేసుకున్నాయి. విగ్రహారాధన, అస్పృశ్యత, వర్ణభేదాలు, దురాచారాలు అధికమయ్యాయి. దీంతో చాలా మంది హిందూమత సంస్కారాన్ని కోరుకున్నారు.
భక్తి ఉద్యమ గురువులు దేశ భాషల్లో సామాన్య జనానికి అర్థమయ్యేవిధంగా దృష్టాంతాలతో కథలు బోధించారు. నిమ్న జాతుల ఉద్ధరణ కోసం వీరు వర్ణభేదాలను ఖండించారు.

శంకరాచార్యులు: ఈయన కేరళలోని ‘కాలిడి’ గ్రామంలో జన్మించారు. అద్వైత మత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. జీవాత్మ, పరమాత్మలో ఐక్యం కావడమే మోక్షం, ఈ జ్ఞానం సాధించినవాడే జీవన్ముఖుడు అని చెప్పారు. యాంత్రికమైన ఆచారాలు, కర్మకాండలను తీవ్రంగా నిరసించారు. భారతదేశంలో అద్వైత వేదాంత మత సిద్ధాంతాలను ప్రచారం చేశారు. భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాంత సూత్రాలకు భాష్యాలు రాసి అద్వైత సూత్రాన్ని ప్రబోధించారు. భక్తి, జ్ఞానం, కర్మ, వైరాగ్య మార్గాల ద్వారా మోక్షాన్ని పొందొచ్చని చెప్పారు. ఆయన దేశ నలుమూలలా తన సిద్ధాంతాలను ప్రచారం చేశారు. దీని కోసం శృంగేరి (మైసూర్ దక్షిణ ప్రాంతం), ద్వారకా (గుజరాత్ పశ్చిమ ప్రాంతం), పూరీ (ఒడిశా తూర్పు ప్రాంతం), బదరీ (ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రాంతం)లో మఠాలను స్థాపించారు. శంకరాచార్యుడి విధానాన్ని ‘ఉత్తర మీమాంస’గా పేర్కొంటారు.

రామానుజాచార్యులు: ఈయన మద్రాసు సమీపంలోని పెరంబుదూర్ గ్రామంలో జన్మించారు. విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేశారు. జీవాత్మ పరమాత్మ సామీప్యం పొందడమే మోక్షమని, మోక్షానికి విష్ణుభక్తే మార్గమని రామానుజుడు బోధించారు. ఈయన కులతత్వాన్ని ఖండించారు.

మధ్వాచార్యులు: ఈయన కర్ణాటకలోని ఉడిపి పట్టణ సమీపం వేలి గ్రామంలో 1199లో జన్మించారు. మధ్వాచార్యులు ‘ద్వైత’ మత ప్రతిష్టాపకులు. ఇందులో మూడు సత్య పదార్థాలను పేర్కొన్నారు. అవి.. ఆదిబ్రహ్మ, జీవుడు, ప్రపంచం. ఈయన వైష్ణవభక్తి మార్గాన్ని ప్రచారం చేశారు.

రామానందుడు: వైష్ణవ మత ప్రచారానికి సంబంధించిన అగ్రగణ్యుల్లో రామానందుడు ఒకరు. మధ్యయుగంలో భక్తి ఉద్యమం ప్రధానంగా ఈయనతోనే ప్రారంభమైంది. ఈయన ఇష్టదైవాలు రాముడు, సీత. రాజపుత్ర వనిత మీరాబాయి ఈయన శిష్యురాలు.

వల్లభాచార్యుడు: ఈయన 1449లో బెనారస్ నగరంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు కాశీలో స్థిరపడ్డ తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. వల్లభాచార్యుల ఇష్టదైవం కృష్ణుడు. ఈయన కృష్ణతత్వాన్ని ప్రచారం చేశారు. ‘శుద్ధ అద్వైత’ మతాన్ని ప్రబోధించారు.

చైతన్యుడు (1485-1533): బెంగాల్‌లోని నవద్వీపంలో 1486లో ఈయన జన్మించారు. చైతన్యుడు భక్తిభావంతో రాధాకృష్ణుల ప్రేమతత్వాన్ని ప్రబోధించడానికి జీవితం అంకితం చేశారు. ఈయన వల్లభాచార్యుల సమకాలీకులు.

కబీరు: ఈయన రామానందుడి శిష్యుల్లో గొప్పవారు. వర్ణభేదాలు, విగ్రహారాధనను నిరసించాడు. ‘అల్లా’ ఒక్కడేనని, ఈశ్వరుడు సర్వవ్యాప్తి అని ఈయన ప్రబోధించారు. భజనను ముక్తికి మార్గంగా ప్రచారం చేశారు. కబీరు శిష్యవర్గంలో హిందువులు, ముస్లింలు ఉన్నారు.

గురునానక్: ఈయన సిక్కు మత స్థాపకుడు. లాహోర్ సమీపంలోని తల్వండి గ్రామంలో 1469లో క్షత్రియ కుటుంబంలో జన్మించారు. ఏకేశ్వరోపాసన, ప్రేమ, భక్తి మార్గం ఈయన ముఖ్య సిద్ధాంతాలు. వర్ణభేదాలు, విగ్రహారాధనను నిరసించారు. దేవుడు సత్య స్వరూపుడని, ఆరాధించడానికి గురువు అవసరమని ఈయన పేర్కొన్నారు. గురునానక్ 1538లో మరణించారు.

తుకారం: ఈయన మరాఠా కబీర్‌గా గుర్తింపు పొందారు. పరిశుద్ధ హృదయం, నైతిక ఔన్నత్యం భక్తి సాధనాలని చెప్పారు. విగ్రహారాధనను నిరసించారు. ఈయన పద్యాలు శివాజీని ఎంతగానో ఆకర్షించాయి.

నామదేవుడు: ఈయన 15వ శతాబ్దంలో మహారాష్ట్రలో జన్మించారు. దుస్తులకు అద్దకం వేసే వృత్తి చేసేవారు. భక్తి మార్గం ముక్తికి ముఖ్య సాధనంగా బోధించారు. ఏకేశ్వరోపాసనాన్ని బలపర్చారు. ఈయన విగ్రహారాధన, కర్మకాండలను ఖండించారు.

తులసీదాసు: 1532లో జన్మించారు. ‘రామచరిత మానస్’ రచించారు. తులసీదాసు అద్వైతాన్ని అనుసరించారు. ఈయన అక్బర్ సమకాలీకులు.

వేమన: ఈయన ఆంధ్రదేశంలోని నీతి బోధకుల్లో గొప్పవారు. ప్రజాకవి. ఈయన రాసిన నీతి శతకాలు ప్రజల్లో బాగా వ్యాప్తి చెందాయి. వేమన అర్థంలేని సాంప్రదాయాలు, వర్ణభేదాలు, విగ్రహారాధనను ఖండించారు.

సూఫీ మతం

భక్తి ఉద్యమం మాదిరిగా సూఫీ మతం కూడా సాంఘిక, మత రంగాల్లో ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసింది. భారత్‌లో తురుష్కుల పాలన నెలకొన్న తర్వాత సూఫీలు మనదేశానికి వచ్చారు. ‘మానవుడు ప్రేమతో భగవంతుడిలో లీనం కాగలడు’ అనేది సూఫీ మత ముఖ్య సిద్ధాంతం. సూఫీలు ప్రేమకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇతర మతస్థుల పట్ల సహనంతో వ్యవహరించేవారు.

సూఫీ ప్రవక్తల్లో కొంత మంది హిందూ మతం వల్ల ప్రభావితమయ్యారు. భగవంతుడిని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయని సూఫీలు విశ్వసించారు. వీరు సంఘానికి దూరంగా, ప్రత్యేక స్థలాల్లో నివసించేవారు. కర్మకాండలకు వ్యతిరేకంగా భక్తి ఉద్యమం ప్రారంభమైన విధంగా మహమ్మదీయ మతంలోని కొన్ని సాంప్రదాయాలకు వ్యతిరేకంగా సూఫీ మతం ప్రారంభమైంది.

సూఫీలు ఉపవాసాలు, ధ్యానం లాంటి హిందూ ఆచారాలను పాటించారు. భారత్‌లో ముఖ్యంగా మూడు సూఫీ శాఖలున్నాయి. వీటిలో ముఖ్యమైంది ‘చిస్తి’. ఈ శాఖాధిపతి అజ్మీర్‌కు చెందిన మొయినుద్దీన్ చిస్తీ. ఈయన 13వ శతాబ్దానికి చెందినవారు. భక్తి సంగీతంతో భగవంతుడి సాన్నిధ్యం పొందవచ్చని చిస్తీ విశ్వసించారు. సుప్రసిద్ధ కవి అమీర్ ఖుస్రూ సహా అనేక మంది ఈయన అనుచరులు. చిస్తి అనుచరులు ఎక్కువగా ఢిల్లీ ప్రాంతంలో ఉన్నారు.

సూఫీల్లో రెండో శాఖ నాయకుడు షేక్ షహాబుద్దీన్ సుహ్రావర్ధి. ఈయన శిష్యులు ఎక్కువగా సింధ్ ప్రాంతంలో ఉన్నారు. మూడో సూఫీశాఖ గురువు ఫిరదౌసి అనుచరులు ఎక్కువగా బిహార్ ప్రాంతంలో ఉన్నారు. నిజాముద్దీన్ అవులియా కూడా సూఫీ మతగురువుల్లో ముఖ్యులు. సూఫీ నాయకులు సమానత్వాన్ని ప్రవచించారు. బడుగు వర్గాలకు చెందిన రైతులు, కార్మికులు, కూలీలను ఆకర్షించారు.
Published date : 28 Oct 2015 12:40PM

Photo Stories