Skip to main content

జనాభా

భారతదేశం సంక్షేమ రాజ్యం. ఈ భావనను దృష్టిలో ఉంచుకొని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇవి సక్రమంగా అమలయ్యేందుకు, వనరుల సమర్థ వినియోగానికి జనాభా లెక్కలను సేకరించడం తప్పనిసరి. జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘డెమోగ్రఫీ’ అంటారు. దేశంలో తొలిసారిగా 1872లో జనాభా లెక్కల సేకరణ మొదలైంది. 1881 నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలను సేకరిస్తున్నారు.
భారతదేశ జనాభాలో విభిన్న శారీరక లక్షణాలు కనిపిస్తాయి. ప్రాచీన కాలం నుంచి వివిధ దేశాలకు చెందినవారు భారతదేశంలోకి ప్రవేశించి సాంఘికంగా, సాంస్కృతికంగా ఇక్కడి సమాజంలో కలిసిపోయారు. వీరు స్థానికులతో వివాహ సంబంధాలు ఏర్పర్చుకున్నారు. ఫలితంగా విభిన్న శారీరక లక్షణాలున్న సంతతి ఉద్భవించిందని ఆంత్రోపాలజిస్టుల అభిప్రాయం.
‘రిస్లే’ అనే ఆంత్రోపాలజిస్టు శారీరక లక్షణాల ఆధారంగా ప్రపంచ జనాభాను ఆరు జాతులుగా విభజించారు. ఏ దేశ జనాభాలోనైనా ఒక జాతి లేదా రెండు జాతుల లక్షణాలు ఉంటాయి. కానీ భారతదేశంలో మాత్రమే ప్రపంచంలోని ఆరు జాతుల లక్షణాలు కనిపిస్తాయి. అవి...

ఎ) నీగ్రిటోలు
దేశంలోకి మొదటిసారిగా వలస వచ్చిన జాతిగా వీరిని పేర్కొనవచ్చు. అండమాన్ నికోబార్ దీవుల్లో నివసించే షోంపైన్స్, జార్వాస్, ఓంజెస్ లాంటి తెగలలో, కేరళలోని పులియాన్స్ తెగలలో ఈ జాతి లక్షణాలు కనిపిస్తాయి.

బి) ప్రొటో ఆస్ట్రలాయిడ్స్
మధ్య భారతదేశంలో నివసించే గోండులు, ముండాలు, భిల్లులు, ఒరేన్‌లు, సంతాలులు, చెంచులు, కురుంబాలు లాంటి గిరిజన తెగలలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.

సి) మెడిటరేనియన్
వీరినే ద్రవిడులు అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో నివసించే ప్రజలను ఈ జాతి సంతతిగా పేర్కొంటారు. వీరినే సింధూ నాగరికత ప్రజల సంతతిగా పేర్కొనవచ్చు. ద్రవిడ ప్రజల జీవన విధానంలో సింధూ నాగరికత ప్రజల సాంస్కృతిక లక్షణాలు ఇప్పటికీ కనిపిస్తాయి.

డి) మంగోలాయిడ్స్
ఈశాన్య భారతదేశంలోని అసోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజల్లో, అండమాన్‌లోని ‘సెంటినీలీస్’ అనే తెగలో ఈ జాతి లక్షణాలు కనిపిస్తాయి. ఈ జాతి ప్రజల శరీరంలో ‘ఎపికాంతిక్ ఐలిడ్’ అనే ప్రత్యేక లక్షణం కనిపిస్తుంది.

ఇ) బ్రాకీ సెఫాలస్
వీరినే కాకసాయిడ్ జాతి ప్రజలుగా పేర్కొంటారు. ఈ జాతి వారిలో తల వెడల్పుగా ఉంటుంది. గుజరాత్, మహారాష్ర్టలోని మార్వాడీలు, పశ్చిమ బెంగాల్‌లోని నయనార్ క్షత్రియులు, నంబూద్రీ బ్రాహ్మణుల్లో ఈ జాతి లక్షణాలు కనిపిస్తాయి.

ఎఫ్) నార్డిక్స్
వీరినే ఆర్యన్లు అని పిలుస్తారు. భారతదేశంలోకి చివరిసారిగా వలస వచ్చిన జాతిగా వీరిని పేర్కొనవచ్చు. ఈ జాతి లక్షణాలున్న సంతతి ప్రస్తుతం పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లోని రాజపుత్రులు, జాట్‌లలో కనిపిస్తుంది.

జనాభా లెక్కల సేకరణ (2011)
ఒక నిర్దిష్ట ప్రాంతంలో తమలో తాము అంతఃప్రజననం జరుపుకునే, నిర్దిష్ట ఆవాసంలో నివసించే ప్రజా సమూహమే జనాభా. ఇంటింటి సర్వే ద్వారా శాస్త్రీయ పద్ధతిలో జనాభా, దాని అనుబంధ అంశాలను సేకరించే పద్ధతినే జనాభా లెక్కల సేకరణ అంటారు.
భారతదేశం సంక్షేమ రాజ్యం. ఈ భావనను దృష్టిలో ఉంచుకొని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇవి సక్రమంగా అమలయ్యేందుకు, వనరుల సమర్థ వినియోగానికి జనాభా లెక్కల సేకరణ తప్పనిసరి. జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘డెమోగ్రఫీ’ అని అంటారు.
  • ప్రపంచంలో మొదటిసారిగా 1841లో ఆధునిక జనాభా లెక్కల సేకరణ ఇంగ్లండ్‌లో ప్రారంభమైంది. 1872లో భారతదేశంలో జన గణన మొదలైంది. 1881 నుంచి పదేళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా మన దేశంలో జనాభా లెక్కలను సేకరిస్తున్నారు.
  • 2011 జనాభా లెక్కల సేకరణ 15వది, స్వాతంత్య్రం వచ్చాక ఏడోది. 2011 సెన్సస్ కమిషనర్ డాక్టర్ చంద్రమౌళి. ఈ జనాభా లెక్కల సేకరణ 2010 ఏప్రిల్ 1న ప్రారంభమై 2011 మార్చిలో ముగిసింది. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 17.5 శాతం. అత్యధిక జనాభా ఉన్న దేశాల జాబితాలో చైనా తొలిస్థానంలో ఉండగా, మన దేశం రెండో స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో వరసగా అమెరికా, ఇండోనేసియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి.
  • 2011 మార్చి 1 నాటికి దేశ జనాభా 1.21 బిలియన్లు దాటింది. 2001 నాటికి దేశ జనాభా 1.02 బిలియన్లు ఉండేది. అంటే పదేళ్లలో దేశ జనాభా 18.196 కోట్లు పెరిగింది.
  • 1991-2001 దశాబ్దంలో జనాభా వృద్ధిరేటు 21.54 శాతం. కాగా, 2001-11 మధ్యకాలంలో అది 17.7 శాతానికి తగ్గింది.
  • 1991-2001 దశాబ్దంలో జనాభా వార్షిక వృద్ధిరేటు 1.9 శాతం కాగా 2001-11లో 1.64 శాతానికి తగ్గింది.
  • జనసాంద్రత 2001లో చ.కి.మీ.కు 325 ఉంటే, అది 2011లో 382కు పెరిగింది.
  • అక్షరాస్యత 2001 మార్చి 1 నాటికి 64.38 శాతం కాగా, 2011 మార్చి నాటికి 74.04 శాతానికి పెరిగింది.
  • లింగనిష్పత్తి 2001 మార్చి 1 నాటికి 933 ఉంటే, 2011 మార్చి 1 నాటికి 943కి పెరిగింది. ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్యను లింగనిష్పత్తి అంటారు. దేశంలోకెల్లా అత్యుత్తమంగా కేరళలో లింగనిష్పత్తి 1084:1000గా ఉంది.
  • దేశంలో అత్యధిక జనాభా ఉన్న మొదటి ఐదు రాష్ట్రాలు... ఉత్తరప్రదేశ్, మహారాష్ర్ట, బిహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్).
  • దేశంలో తక్కువ జనాభా ఉన్న మొదటి నాలుగు రాష్ట్రాలు... సిక్కిం, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్, గోవా.
  • అత్యధిక జనసాంద్రత ఉన్న తొలి నాలుగు రాష్ట్రాలు... బిహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్.
  • అత్యల్ప జనసాంద్రత ఉన్న తొలి నాలుగు రాష్ట్రాలు... అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం, సిక్కిం, నాగాలాండ్.
  • అత్యధిక జనసాంద్రత ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు.. ఢిల్లీ, చండీగఢ్.
  • అత్యల్ప జనసాంద్రత ఉన్న తొలి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు... అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలి.
  • జనాభా దశాబ్దపు వృద్ధిరేటు ఎక్కువగా ఉన్న మొదటి నాలుగు రాష్ట్రాలు... మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, బిహార్, జమ్మూ-కశ్మీర్.
  • జనాభా దశాబ్దపు వృద్ధిరేటు తక్కువగా ఉన్న తొలి నాలుగు రాష్ట్రాలు... నాగాలాండ్, కేరళ, గోవా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.
  • దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న మొదటి రెండు రాష్ట్రాలు... కేరళ, మిజోరాం.
  • దేశంలో తక్కువ అక్షరాస్యత ఉన్న మొదటి రెండు రాష్ట్రాలు... బిహార్, అరుణాచల్‌ప్రదేశ్.
  • దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న మొదటి రెండు జిల్లాలు మిజోరాంలో ఉన్నాయి. అవి.. సెర్‌చ్చిప్, ఐజ్వాల్.
  • దేశంలో అక్షరాస్యత తక్కువ ఉన్న మొదటి రెండు జిల్లాలు... మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 10.43 కోట్ల(8.6 శాతం) మంది షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు.
  • ఎస్టీ జనాభా అధికంగా ఉన్న రాష్ర్టం మధ్యప్రదేశ్, తక్కువగా ఉన్న రాష్ర్టం సిక్కిం.
  • ఎస్టీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ర్టం మిజోరాం, తక్కువగా ఉన్న రాష్ర్టం గోవా.
  • ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు... పంజాబ్, హర్యానా.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) జనాభా శాతం 16.6. సంఖ్యాపరంగా 20.14 కోట్లు.
  • ఎస్సీ జనాభా అధికంగా ఉన్న రాష్ర్టం ఉత్తరప్రదేశ్. తక్కువగా ఉన్న రాష్ర్టం మిజోరాం.
  • ఎస్సీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ర్టం పంజాబ్, తక్కువగా ఉన్నది మిజోరాం.
  • ఎస్సీ జనాభా లేని రాష్ర్టం నాగాలాండ్

గతంలో అడిగిన ప్రశ్నలు

1. సంతాల్ జనాభా ఉన్న రాష్ట్రాలు ఏవి? (2011, A.S.O)
ఎ) మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్
బి) కర్ణాటక, పశ్చిమబెంగాల్
సి) ఉత్తరప్రదేశ్, జార్ఖండ్
డి) జార్ఖండ్, పశ్చిమ బెంగాల్

Published date : 25 Sep 2015 03:23PM

Photo Stories