Skip to main content

ఎడారులు - పవన క్రమక్షయం

పాక్షిక శుష్క, శుష్క శీతోష్ణస్థితి ఉష్ణమండల ఎడారుల్లో పవనాలు బలమైన క్రమక్షయ కారకాలు. వేగంగా వీచే పవనాలు మూడు పద్ధతుల్లో క్రమక్షయాన్ని కలుగజేస్తాయి. అవి.. పవన అనావరణం (ఎగురవేత), అపఘర్షణ, రాపిడి. పవనాలు తమ గతిశక్తి ద్వారా ఉపరితలంపై తేలికైన ఇసుక రేణువులను ఎగురేసుకుపోవడమే అనావరణం.రఅనావరణం వల్ల క్రమక్షయానికి గురైన ఇసుక రేణువులు.. కఠిన శిలా భాగాల మీద గరుకు కాగితంలా పని చేసి క్రమక్షయాన్ని కలిగించడాన్ని ‘అపఘర్షణ’ అంటారు. శిథిల శిలా పదార్థాలు ఒకదానితో మరోటి ఢీకొని, సూక్ష్మ రేణువులుగా క్రమక్షయం చెందడాన్ని రాపిడిగా పేర్కొంటారు.
అనావరణ హరివాణాలు
 పవన అనావరణం కారణంగా కొన్నిచోట్ల ఇసుక పూర్తిగా ఎగరడం వల్ల ఏర్పడే విశాల హరివాణాలను ‘అనావరణ హరివాణాలు’ అంటారు. ఈ హరివాణాల్లో కొన్నిసార్లు నీరు నిల్వ ఉండటం వల్ల ‘ఒయాసిస్’లు ఏర్పడతాయి. విస్తృత అనావరణం వల్ల తేలికైన దుమ్ము, ధూళి, ఇసుక పూర్తిగా క్రమక్షయమై.. ఉపరితలంపై గట్టి గులక రాళ్లు మాత్రమే మిగిలిన ప్రాంతాలను ‘ఎడారి పేవ్‌మెంట్స్’ అంటారు. పేవ్‌మెంట్స్ శిలలు.. ఐరన్, మాంగనీస్ ఆక్సైడ్‌లతో కూడి ఉండి ఎరుపు లేదా జేగురు వర్ణం అలికిన ప్రాంతాలుగా కనిపిస్తాయి. వీటిని ‘ఎడారి వార్నిష్’లుగా వ్యవహరిస్తారు. 
 
స్టోన్‌లాటిస్
గరుకైన ఇసుకతో కూడిన బలమైన పవనాలను శిలలు అడ్డగించినప్పుడు భేద క్రమక్షయం వల్ల వివిధ రకాల భూస్వరూపాలు ఏర్పడతాయి. భారీ బండరాళ్లలో మృదువైన శిలా పదార్థం పవనాల ద్వారా పూర్తిగా క్రమక్షయం కావడంతో ఆ శిలలు తూట్లుపడినట్లుగా తయారవుతాయి. వీటిని ‘స్టోన్ లాటిస్’ అంటారు. వీటి ద్వారా గాలి వీచినప్పుడు శిల వేణువుతో శబ్దం చేసినట్టుగా వింత ధ్వనులను కలిగిస్తుంది. ఆ శిలలను ‘ప్లూటెడ్ శిలలు’ అంటారు.
 పవనాల్లో స్థూల ఇసుక రేణువులు శిలల కింద భాగాన్ని ఎక్కువగా క్రమక్షయం చేస్తాయి. శిలల పైభాగాల్లో క్రమక్షయ రేటు తక్కువగా ఉంటుంది. ఈ విధమైన భేదక క్రమక్షయం వల్ల శిల కుక్క గొడుగు ఆకారాన్ని సంతరించుకుంటుంది. ఇలాంటి శిలలను ‘కుక్కగొడుగు శిలలు’ అంటారు.
 
యార్డాంగ్‌లు
ఒకే శిల మృదువైన, కఠిన శిలా పదార్థాలతో ఉన్నప్పుడు అది భేదక క్రమక్షయం వల్ల విచిత్రమైన ఆకారంలో ఉంటుంది. భూ దృశ్యం దువ్వెనపళ్ల ఆకృతిని పొందుతుంది. ఈ విధమైన శిలాకృతులను ‘యార్డాంగ్’లుగా వ్యవహరిస్తారు. తుర్క్‌మెనిస్తాన్ ఎడారిలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. భేదక క్రమక్షయం వల్ల వింత శబ్దాలతో భయాన్ని గొలిపే శిలలను ‘డెమియోసెల్స్’ అంటారు. తీవ్ర స్థాయిలో దీర్ఘకాలం పవన క్రమక్షయం వల్ల ఎడారిలోని కొన్ని ప్రాంతాల్లో ఇసుక పూర్తిగా తొలగి, కఠిన శిలా ప్రాంతాలు బయల్పడతాయి. ఈ విశాల కఠిన శిలా భూ దృశ్యాలనే ‘హమాడాలు’ అంటారు.
 
పవన నిక్షేపం
పవనాలు తమతో తీసుకుపోయే శిథిల శిలా పదార్థాలను అనువైన ప్రదేశాల్లో నిక్షేపం చేస్తాయి. సాధారణంగా.. శిలా భారం ఎక్కువైనప్పుడు, పవనాల వేగం మందగించినప్పుడు, పవనాల దిశ మారినప్పుడు లేదా పవనాలకు అవరోధాలు ఎదురైనప్పుడు పవన నిక్షేపం జరుగుతుంది.
 పవన నిక్షేపణ వల్ల కూడా ఎడారుల్లో వివిధ రకాల భూస్వరూపాలు ఏర్పడతాయి. పవనాలు నిక్షేపించిన ఇసుక కొన్ని సందర్భాల్లో అలల మాదిరిగా ఏర్పడుతుంది. దున్నిన పొలంలా కన్పించే ఈ భూస్వరూపాన్ని ‘రిపిల్స్’ అంటారు. పవనాలు ఒకేచోట పెద్ద మొత్తాల్లో ఇసుక నిక్షేపం చేయడం వల్ల ఎత్తయిన ఇసుక దిబ్బలు ఏర్పడతాయి. ఎడారులనగానే మనకు గుర్తుకొచ్చేవి భూస్వరూపాలు-ఇసుకదిబ్బలు. పవనాలు వీచే దిశకు ఇసుక దిబ్బ అక్షం సమాంతరంగా ఉన్నవాటిని అనుదైర్ఘ్య ఇసుక దిబ్బలు అంటారు.
థార్ ఎడారిలోని ఇసుక దిబ్బలు ఎక్కువ భాగం బార్కాన్‌ల తరగతికి చెందినవి. పొడవాటి కత్తి ఆకారంలో ఏర్పడే ఇసుక దిబ్బలను ‘సీఫ్’లు అంటారు. ఇవి అనుదైర్ఘ్య తరగతికి చెందుతాయి. అరేబియా ఎడారిలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. శీర్ష భాగాలు సమతలంగా ఉన్న విశాల ఇసుకదిబ్బలను ‘వేల్‌బ్యాక్’లు అంటారు. సహారా ఎడారిలో నక్షత్ర ఆకార ఇసుక దిబ్బలు కూడా కన్పిస్తాయి.
పవనాలు మెత్తని ఇసుక ధూళిని కొన్ని వేల మైళ్ల దూరం తీసుకెళ్లి నిక్షేపం చేయడం వల్ల ఏర్పడే సమతల మైదానాలను ‘లోయస్’ మైదానాలు అంటారు. మధ్యాసియాలోని గోబి ఎడారి నుంచి వీచే పవనాలు నిక్షేపం చేసిన ధూళి వల్ల ఉత్తర చైనాలో విశాల లోయస్ మైదానాలు ఏర్పడ్డాయి.
 ఎడారుల్లో ఇసుక దిబ్బల మధ్యలో ఇసుక ఉండని ప్రాంతాలను ‘గాస్’లు అంటారు. ఇవి ఎడారుల్లో రవాణా మార్గాలుగా ఉన్నాయి. అరేబియా ఎడారిలో ప్రాచీన కాలంలోనే ఈ ఇవి వాణిజ్య మార్గాలుగా అభివృద్ధి చెందాయి.
 
భూగర్భ జల క్రమక్షయం - కార్ట్స్ భూదృశ్యాలు
ఏడ్రియాటిక్ సముద్రతీరంలో సెర్బియాకి చెందిన ‘కార్ట్స్’ ప్రాంతంలో విశిష్టంగా ఈ రకమైన భూదృశ్యం ఏర్పడింది. అందువల్ల ప్రపంచంలో ఉన్న ఈ రకమైన వాటిని ‘కార్ట్స్’ భూస్వరూపాలుగా వ్యవహరిస్తున్నారు. ఫ్రాన్స్‌లోని కాస్, మెక్సికోలోని యుకటాన్ (కార్ల్స్‌బాడ్), యూ ఎస్‌ఏలోని కెంటకీ ప్రాంతాల్లో కూడా ఈ భూస్వరూపాలు అభివృద్ధి చెందాయి. డెహ్రాడూన్, జబల్‌పూర్, ఆంధ్రప్రదేశ్‌లోని బొర్రా గుహలు, బెలూం గుహలు ఈ కోవకు చెందినవే.
 
కార్ట్స్ భూస్వరూపాలు ఏర్పడటానికి కారణాలు
సున్నపురాయి శిలా ప్రాంతం, అధిక వర్షపాతంతో కూడిన ఆర్థ్ర శీతోష్ణస్థితి, శాశ్వతనదులు, పగుళ్లు, బీటలతో కూడిన నైసర్గిక స్వరూపం తదితర భౌగోళిక అంశాలు కార్ట్స్ భూస్వరూపాలు ఏర్పడటానికి అనుకూలిస్తాయి. ప్రధానంగా సున్నపురాయి శిలలతో భూగర్భ జలప్రవాహాలు రసాయనిక చర్య పొంది, ద్రావణీకరణ ప్రక్రియ ద్వారా రసాయనిక క్రమక్షయాన్ని కలుగజేస్తాయి. సున్నపురాయి శిలలు ద్రావణం రూపంలోకి మారడంతో భూ ఉపరితలం, భూగర్భంలో వివిధ రకాల క్రమక్షయ భూస్వరూపాలు ఏర్పడతాయి. అలాగే ద్రావణం రూపంలోని శిలా పదార్థం భూగర్భంలోని అనువైన ప్రాంతాల్లో నిక్షేపమవడం వల్ల కూడా వివిధ రకాల భూస్వరూపాలు రూపొందుతాయి. 
 
బ్యాడ్‌లాండ్స్
భూ ఉపరితలంపై సున్నపురాయి శిలా పదార్థం నదుల్లో కరిగి శిథిలమవడంతో ఆయా ప్రాంతాల్లో నిట్టనిలువు పగుళ్లు, గుంటలతో కూడిన ఎగుడు దిగుడు నైసర్గిక స్వరూపం ఏర్పడుతుంది. ఈ ప్రాంతం ‘బ్యాడ్‌లాండ్స్’గా రూపొందుతుంది. దీన్ని ఫ్రాన్స్‌లో ‘లాపీస్’ అని, జర్మనీలో ‘కారెన్’ అని, ఏడ్రియాటిక్ తీర ప్రాంతాల్లో ‘బోగాజ్’గా వ్యవహరిస్తారు.
సున్నపురాయి నీటిలో కరగడంతో భూ ఉపరితలంపై ఏర్పడిన విశాలమైన గోతులు, గుంటలను ‘పోనొర్’ అంటారు. ఫ్రాన్స్‌లో వీటిని ‘ఎరాబట్’గా వ్యవహరిస్తారు. పొనోర్స్ నిరంతర క్రమక్షయం వల్ల మరింత విశాలమైతే ‘డొలైన్స్’గా వ్యవహరిస్తారు. కొన్ని సందర్భాల్లో వీటిలోకి నీరు చేరడంతో సరస్సులుగా రూపాంతరం చెందుతాయి. వీటిని ‘కార్ట్స్ సరస్సులు’ అంటారు. సమీపంలోని డొలైన్స్.. క్రమక్షయం వల్ల విస్తరించి, ఒకదానితో మరోటి కలిసి ఏర్పడే విశాల హరివాణాలను ‘ఉవాలా’లు అంటారు. సున్నపురాయి శిలలు కరగడం వల్ల ఉపరితలంపై ఏర్పడే తిన్నని వాలులతో కూడిన లోయలను ‘బ్లైండ్ వ్యాలీ’లు లేదా ‘కిటికీ’లు అంటారు. వీటి ద్వారా ఉపరితల నదులు, ప్రవాహాలు భూగర్భంలోకి ప్రవేశించి భూగర్భ నదులుగా మారతాయి. ఈ భూగర్భ నదులు భూగర్భంలోని సున్నపురాయి శిలలను క్రమక్షయం చేయడం వల్ల విశాలమైన గుహలు ఏర్పడతాయి. ఈ గుహలను ‘కావెర్న్’ అంటారు.  ఇవి మరింత విశాలమై కూలిపోవడంతో ఉపరితలంపై ఏర్పడే గుంటలను ‘పోల్జ్’లు అంటారు.
సున్నపురాయి గుహ(కావెర్న్)ల్లో సున్నపురాయి ద్రావణపు నీరు ఆవిరై గుహ పైకప్పు, అడుగు పక్క భాగాల్లో కాల్షియం కార్బనేట్ నిక్షేపించడంతో వివిధ రకాల భూస్వరూపాలు ఏర్పడతాయి.
 
స్టాలక్టైట్-స్టాలగ్నైట్
గుహల లోపల పైకప్పుల మీద సున్నపురాయి నిక్షేపించి క్రమంగా కిందకు వేలాడుతూ విస్తరించే నిక్షేపాలను ‘స్టాలక్టైట్’ గా వ్యవహరిస్తారు. అడుగు భాగం మీద నిక్షేపించిన సున్నపు రాయి క్రమంగా పైకి పెరిగి ‘స్టాలగ్నైట్’గా రూపొందుతుంది. స్టాలక్టైటులు, స్టాలగ్నైట్లు క్రమంగా వ్యాపించి కలిసిపోయి గుహలో ‘స్తంభాలు’గా ఏర్పడతాయి. గుహల్లో వాలుగా, తెరలుగా నిక్షేపించే పదార్థాన్నే ‘డ్రేప్స్’ లేదా ‘కర్టెన్స్’ అంటారు. ఇవి కావెర్న్‌లను చిన్న చిన్న భాగాలుగా విభజిస్తాయి. గుహ పైకప్పు నుంచి వాలుగా వేలాడే సున్నపురాయి నిక్షేపాలను హెలిక్టైట్స్‌గా వ్యవహరిస్తారు. గోళాకారంలో ఉండే నిక్షేపాలను గ్లోబ్యులైట్స్ అంటారు.
Published date : 01 Dec 2015 12:56PM

Photo Stories