Skip to main content

భారతదేశం- భూ స్వరూపాలు

తీరమైదానాలు
దక్కను పీఠభూమికి ఇరువైపులా అరేబియా సముద్రం, బంగాళాఖాతం వెంబడి తీర మైదానాలున్నాయి. అవి:
  1. పశ్చిమ తీర మైదానం
  2. తూర్పు తీర మైదానం
వీటి వెడల్పులు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి.
పశ్చిమ తీరమైదానం
ఇది దక్కను పీఠభూమికి పశ్చిమం వైపున అరేబియా సముద్రం మధ్య వ్యాపించి ఉంది. ఈ మైదానం సన్నగా, అసమానంగా అక్కడక్కడ కొండల భూ భాగంతో ఉంది. ఇది గుజరాత్ తీరంలోని రాణా ఆఫ్ కచ్ నుంచి కేరళ తీరం వరకు విస్తరించి ఉంది. ఈ తీరం చాలా తక్కువ వెడల్పు (10 - 25 కి.మీ) కలిగి ఉంది. దీన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నారు.
మహారాష్ట్ర - కొంకణ్ తీరం
గోవా - గోవా తీరం
కర్ణాటక - కెనరా తీరం
కేరళ - మలబార్ తీరం
  • ఈ తీరమైదానంలో ఎక్కువ సంఖ్యలో నదీ ముఖాలున్నాయి. వీటిలో నర్మద, తపతి ముఖ్యమైనవి. వీటికి ఉత్తరంగా సబర్మతి, మహి మొదలైన నదుల వల్ల గుజరాత్ మైదానం ఏర్పడింది.
  • కర్ణాటక మైదానం ద్వారా శరావతి నది ప్రవహిస్తోంది. ఈ నదిపై దేశంలోనే అతి ఎత్తయిన జలపాతం జోగ్ (జర్సోప్పా) ఉంది. దీని ఎత్తు 275 మీ.
  • దీంట్లో మలబారు తీరం ఉప్పు నీటి సరస్సులకు ప్రసిద్ధి. వీటినే ‘లాగూన్’లు అని కూడా అంటారు. వీటిలో ముఖ్యమైనవి అష్టముడి, వెంబనాడు సరస్సులు.
తూర్పుతీర మైదానం
ఈ మైదానం దక్కను పీఠభూమికి తూర్పున, బంగాళాఖాతానికి మధ్య విస్తరించి ఉంది. ఈ మైదానం పశ్చిమ తీరమైదానంలా కాకుండా బల్లపరుపుగా, ఎక్కువ వెడల్పుతో ఉంది. దీని సరాసరి వెడల్పు 120 కి.మీ. ఈ తీరానికి కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లు ఉన్నాయి.
పశ్చిమబెంగాల్ - వంగ తీరం
ఒడిశా - ఉత్కళ్ తీరం
ఉత్తర ఆంధ్ర - సర్కార్ తీరం
తమిళనాడు - కోరమాండల్ తీరం
ఈ తీరంలో ఉన్న ముఖ్యమైన సరస్సులు:
చిలకా సరస్సు: ఇది ఉప్పునీటి సరస్సు. ఒడిశా తీరంలో ఉంది.
కొల్లేరు సరస్సు: ఇది మంచినీటి సరస్సు. కృష్ణా, గోదావరి డెల్టాల మధ్య ఉంది.
పులికాట్ సరస్సు: ఇది ఉప్పునీటి సరస్సు. ఆంధ్రప్రదేశ్‌లో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తమిళనాడు సరిహద్దులో ఉంది.
  • పులికాట్ సరస్సులో శ్రీహరికోట అనే దీవి ఉంది. దీని నుంచి రాకెట్లను ప్రయో గిస్తారు. ఇటీవల దీన్ని సతీష్‌ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రంగా పేరు మార్చారు. ఈ సరస్సును ఆనుకొని నేలపట్టు పక్షి సంరక్షణా కేంద్రం ఉంది.
  • ఈ తీరప్రాంతం నాలుగు ప్రధాన డెల్టాలకు నిలయంగా ఉంది.
    అవి: మహానది డెల్టా - ఒడిశా, కృష్ణా, గోదావరి డెల్టాలు - ఆంధ్రప్రదేశ్, కావేరి డెల్టా - తమిళనాడు.
  • ఇది వ్యవసాయ రంగానికి చాలా అనుకూలమైందిగా ఉంది.
ఎడారులు
భారత ఉపఖండంలో అతిపెద్ద ఎడారి థార్. దీన్ని భారతదేశ గొప్ప ఎడారి అంటారు. ఇది ఆరావళి పర్వతాలకు వాయువ్యంగా ఉంది. దీని విస్తీర్ణం సుమారు 2 లక్షల చ.కి.మీ.
  • ఈ ఎడారి రాజస్థాన్‌లో అధిక భాగం, హర్యానాలో కొంతభాగం, పాకిస్థాన్‌లో అతికొద్ది భాగం విస్తరించి ఉంది.
  • ఈ ఎడారిలో వార్షిక వర్షపాతం అతి తక్కువ. ఇక్కడ వర్షపాతం 10 సెం.మీ. నుంచి 50 సెం.మీ. వరకు ఉండటం వల్ల ఎక్కువగా ముళ్లపొదలతో కూడిన ఉద్భిజ్జాలు ఉన్నాయి.
  • థార్ ఎడారి ప్రాంతంలోని జోథ్‌పూర్, బికనీర్, జైసల్మీర్ భారతదేశ జనపదాల్లో ముఖ్యమైనవిగా ప్రసిద్ధి చెందాయి.
గంగా - సింధు మైదానాలు
హిమాలయాలు, ద్వీపకల్ప పీఠభూమి మధ్యలోని లోతట్టు ప్రాంతంలో గంగా-సింధు మైదానాలు ఏర్పడ్డాయి. ప్లీస్టోసీన్ కాలం నుంచి నేటి వరకు హిమాలయ నదులు తీసుకువచ్చిన ఒండ్రుమట్టితో ఈ విశాల మైదానాలు ఏర్పడ్డాయి. వీటిలో ప్రధానంగా ప్రవహించే గంగా, సింధు నదుల పేరు మీదుగా వీటికి ఆ పేరు వచ్చింది. ఇవి సుమారు 7 లక్షల చ.కి.మీ.లలో విస్తరించి ఉన్నాయి. 150 కి.మీ. నుంచి 300 కి.మీ. వెడల్పుతో సింధు నది ముఖ ద్వారం నుంచి గంగానది ముఖ ద్వారం వరకు 3200 కి.మీ. పొడవున వ్యాపించి ఉన్నాయి. భారత్‌లో పశ్చిమాన రావి, సట్లెజ్ నదీ తీరాల నుంచి తూర్పున గంగానది డెల్టా వరకు సుమారు 2400 కి.మీ. పొడవున విస్తరించి ఉన్నాయి. దీని వెడల్పు దేశమంతా ఒకేవిధంగా లేదు. అసోంలోని రాజ్‌మహల్ కొండల వద్ద అతి తక్కువగా (90-100 కి.మీ.), ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్ వద్ద అత్యంత వెడల్పుగా (280 కి.మీ.) ఉన్నాయి. ఈ మైదాన భూ స్వరూపాల్లో నాలుగు ప్రధాన ఉపరితల వ్యత్యాసాలను గుర్తించవచ్చు. అవి..
భాబర్: శివాలిక్ కొండల పాదాల వెంట విసనకర్ర ఆకారంలో ఉండే గులకరాళ్లతో కూడిన సచ్ఛిద్ర మండలాన్ని ‘భాబర్’ అంటారు. ఇది పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని బృహత్ మైదానాల ఉత్తర సరిహద్దు వెంట 8 - 16 కి.మీ. వెడల్పుతో సన్నని మేఖలగా ఏర్పడింది.
టెరాయి: హిమాలయ నదులు భాబర్ నుంచి ఉపరితలానికి వచ్చి ఎల్లప్పుడూ వెల్లువలా ప్రవహించడం వల్ల 15 - 30 కి.మీ. వెడల్పు ఉన్న చిత్తడి ప్రదేశం ఏర్పడింది. దీన్ని ‘టెరాయి’ అంటారు. ఇది దట్టమైన అడవులతో, అనేక రకాల వన్య మృగాలకు నిలయంగా ఉంది.
భంగర్: టెరాయికి దక్షిణంగా ప్రాచీన కాలంలో ఏర్పడిన ఒండలి మైదానాన్ని ‘భంగర్’ అంటారు.
ఖాదర్: ఇటీవల ఏర్పడిన ఒండలి మైదానాన్ని ‘ఖాదర్’ అంటారు.
  • ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని శుష్క ప్రదేశాల్లో ఉన్న చవుడు, లవణీయ, స్ఫటికీయ భూభాగాలను ‘రే’ లేదా ‘కల్లార్’ అంటారు. భారతదేశ బృహత్ మైదానాల్లో పంజాబ్ - హర్యానా మైదానాలు, రాజస్థాన్ మైదానాలు, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌లోని గంగా మైదానాలు, అసోంలో బ్రహ్మపుత్ర లోయలున్నాయి.
  • పంజాబ్ - హర్యానా మైదానాల్లో రావి, బీయాస్, సట్లెజ్ నదులు ప్రవహిస్తున్నాయి. దీని విస్తీర్ణం 1.75 లక్షల చ.కి.మీ.
  • రాజస్థాన్ మైదానాల విస్తీర్ణం 1.75 లక్షల చ.కి.మీ. దీంట్లో ఇసుక దిబ్బలున్నాయి. దీంట్లో ప్రధానమైన నది ‘లూనీ’.
  • గంగా మైదానాల వైశాల్యం 3.75 లక్షల చ.కి.మీ. ఇది ఆగ్నేయంగా బంగాళాఖాతం వైపు వాలి ఉంది. దీనిలో యమున, సోన్, ఘాఘ్ర, గండక్, కోసి నదులు ప్రవహిస్తున్నాయి.
  • పశ్చిమ బెంగాల్‌లోని విశాలమైన మేఖలలో మడ అడవులున్నాయి. వీటిని ‘సుందర వనాలు’ అంటారు.
ద్వీపకల్ప పీఠభూమి
భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం ప్రాక్ కేంబ్రియన్ కాలంలో కఠిన అగ్నిశిలలు, రూపాంతర శిలలతో ఏర్పడిన ద్వీపకల్ప పీఠభూమి ‘గోండ్వానా’ భూమిలో భాగంగా ఉండేది. ఇది గంగా - సింధు మైదానాలకు దక్షిణంగా, 16 లక్షల చ.కి.మీ. వైశాల్యంతో దేశంలోనే అతి పెద్ద నైసర్గిక స్వరూపంగా ఉంది. త్రిభుజాకారంగా ఉన్న ఈ పీఠభూమికి దక్షిణ, పశ్చిమ, తూర్పుదిశల్లో సముద్రాలున్నాయి. దీని సాధారణ ఎత్తు 600 మీ. నుంచి 900 మీ. వరకు ఉంది.
సరిహద్దులు: వాయవ్యంలో ఆరావళి పర్వతాలు, ఉత్తరాన బుందేల్‌ఖండ్ ఉన్నత భూమి ఉత్తరపు అంచు, ఈశాన్యంలో రాజ్‌మహల్ కొండలు, పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు ఉన్నాయి. తూర్పు, పశ్చిమ కనుమలు కలిసే దక్షిణాగ్రాన కన్యాకుమారి ఉంది.
ఈ పీఠభూమి తూర్పుదిశగా కొద్దిగా వాలి ఉంది. దీన్ని స్థూలంగా ఉత్తరాన మాల్వా పీఠభూమిగా, దక్షిణాన దక్కను పీఠభూమిగా విభజించారు. ఈ రెండు పీఠభూములను ఉత్తర భారత్ నుంచి నర్మదా నది వేరు చేస్తోంది.
మాల్వా పీఠభూమి: నర్మదానది పగులు లోయకు ఉత్తరంగా ఉన్న పీఠభూమిని ‘మాల్వా పీఠభూమి’ అంటారు. ఇది ఎక్కువగా నదీ క్రమక్షయానికి గురవడం వల్ల ఇక్కడ ‘కందర భూములు’ (Bad Land) ఏర్పడ్డాయి. ఇవి చంబల్, బనాస్ నదులు ప్రవహించే ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ పీఠభూమి గంగా నదిలోయ వైపునకు వాలి ఉంది. ఈ పీఠభూమి తూర్పు చివరి భాగాలను దక్షిణ ఉత్తరప్రదేశ్‌లో స్థానికంగా బుందేల్‌ఖండ్, బాఘల్‌ఖండ్ ఉన్నత భూములని, జార్ఖండ్‌లో చోటా నాగ్‌పూర్ పీఠభూమి అని అంటారు. ఈ పీఠభూమికి వాయవ్యంగా ఆరావళి, దక్షిణంగా వింధ్య పర్వతాలు ఉన్నాయి.
ఆరావళి పర్వతాలు: ఇవి అతి పురాతనమైన ముడుత పర్వతాలు. ఇవి గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు సుమారు 700 కి.మీ. పొడవున వ్యాపించి ఉన్నాయి. ఈ పర్వతాల ద్వారా బనాస్, మహీ, లూనీ నదులు ప్రవహిస్తున్నాయి. ఇవి అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఆరావళి శ్రేణిలో అబూ కొండల్లోని ‘గురుశిఖర్’ (1722 మీ.) అత్యంత ఎత్తయింది. ఆరావళి శ్రేణులు జల, వాయు క్రమక్షయ చర్యలకు గురై రాజస్థాన్‌లో చిన్న చిన్న గుట్టలుగా కనిపిస్తాయి.
వింధ్య పర్వతాలు: ఇవి మాల్వా పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి. నర్మదా నదిలోయ వెంట తూర్పు పడమరలుగా నిట్రవాలుతో ఉండి, సోన్‌లోయ వెంట ఉన్న కైమూర్ శ్రేణితో కలుస్తున్నాయి.
సాత్పురా పర్వతాలు: ఇవి దక్కన్ పీఠభూమికి ఉత్తరాన ఉన్నాయి. వీటికి దక్షిణాన తపతి, ఉత్తరాన నర్మదా నది ప్రవహిస్తున్నాయి. వీటితో పాటు సోన్, వార్థా, పెన్ గంగా, బ్రహ్మణ నదులు కూడా ఇక్కడే జన్మిస్తున్నాయి. ఈ పర్వతాలు మహారాష్ర్టలో రాజ్‌పిప్ల నుంచి రేవా వరకు వ్యాపించి ఉన్నాయి. ఈ పర్వతాల పడమర భాగంలోని కొండలను రాజ్‌పిప్ల కొండలని, ఉత్తర చివరలోని కొండలను మహాదేవ్ కొండలని, దక్షిణాన గర్విల్‌గర్ కొండలని, తూర్పు భాగాన్ని మైకాల పీఠభూమి అని పిలు స్తారు. మధ్యప్రదేశ్‌లోని మహాదేవ్ కొండల్లో పచ్‌మరి సమీపంలోని ధూప్‌గర్ (1350 మీ.) ఈ పర్వతాల్లో ఎత్తయిన శిఖరం. వింధ్య - సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నర్మద, సాత్పురా - అజంతా శ్రేణుల మధ్య తపతి నది ప్రవహిస్తున్నాయి. ఇవి రెండూ తూర్పు నుంచి పశ్చిమం దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. వింధ్య - సాత్పురా ప ర్వతాలు భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విడదీస్తున్నాయి.
దక్కన్ పీఠభూమి: ఇది ద్వీపకల్ప భారతదేశంలో అధిక భాగం విస్తరించి ఉంది. దీనికి ఉత్తరాన సాత్పురా, అజంతా పర్వత శ్రేణులు, పడమర పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు సరిహద్దులుగా ఉన్నాయి. అగ్ని పర్వత ఉద్భేదనం వల్ల లావా నిక్షేపించడంతో ఈ పీఠభూమి ఏర్పడింది. ఇది ఉత్తర - దక్షిణాలుగా 1600 కి.మీ, తూర్పు - పడమరలుగా 1400 కి.మీ. వ్యాపించి ఉంది. ‘త్రిభుజాకార’ రూపంలో ఉంది. దీని ఎత్తు పశ్చిమాన 900 మీ., తూర్పున 300 మీ. తూర్పునకు వాలి ఉండటం వల్ల పశ్చిమ కనుమల్లో పుట్టిన నదులు (గోదావరి, కృష్ణా, కావేరి మొదలైనవి) తూర్పుదిశగా ప్రవహించి బంగాళాఖాతంలో క లుస్తున్నాయి. దీని ఉత్తర, వాయవ్య ప్రాంతా లను ‘మహారాష్ర్ట’ పీఠభూమిగా పిలుస్తారు. ఇది ‘బసాల్ట్’ శిలలతో ఏర్పడింది. ఆగ్నేయ భాగాన్ని ఆంధ్రా పీఠభూమిగా, దక్షిణభాగాన్ని కర్ణాటక పీఠభూమిగా పిలుస్తారు. ఇవి ఆర్కియన్, నీస్ శిలలతో ఏర్పడ్డాయి.
పశ్చిమ కనుమలు: వీటిని ‘సహ్యాద్రి శ్రేణి’ అని కూడా అంటారు. ఇవి దక్కన్ పీఠభూమికి పశ్చిమ పార్శ్వంలో ఉన్నాయి. తపతి నది లోయకు దక్షిణంగా మహారాష్ర్టలోని ఖందేష్ నుంచి ప్రారంభమై పశ్చిమ తీరానికి సమాంతరంగా 1600 కి.మీ. పొడవున దక్షిణాన కన్యాకుమారి వరకు అవిచ్ఛిన్నంగా వ్యాపించి ఉన్నాయి. వీటి వాలు సముద్రం వైపు చాలా నిటారుగానూ, పీఠభూమి వైపు తక్కువగానూ ఉంది. అఖండమైన పశ్చిమ కనుమల్లో అక్కడక్కడ ఎత్తు తక్కువ ఉన్న దారులు/ కనుమలు ఉన్నాయి. వీటి ద్వారా రోడ్డు, రైలు మార్గాలను వేశారు. పశ్చిమ కనుమల ఉత్తర భాగంలో ధాల్‌ఘాట్, బోర్‌ఘాట్ అనే కనుమలున్నాయి. దక్షిణ భాగంలో ‘పాల్‌ఘాట్’ కనుమ ఉంది. దీన్ని పురాతన నది వల్ల ఏర్పడిన లోయగా భావిస్తున్నారు. ఈ కనుమ తమిళనాడు, కేరళను కలుపుతుంది. దక్షిణాన నీలగిరి కొండలు, సహ్యాద్రి శ్రేణులు ‘గుడలూరు’ సమీపంలో కలుస్తున్నాయి. నీలగిరి కొండల్లో ఉదక మండలం (ఊటీ) సమీపంలోని ‘దొడబెట్ట’ (2,637 మీ.) అతి ఎత్తయిన శిఖరం. దక్షిణాన అన్నామలై, పళిని, కార్డమమ్ (యాలకుల) కొండలున్నాయి. కేరళలోని అన్నామలై కొండల్లోని అనైముడి శిఖరం (2,695 మీ.) ద్వీపకల్ప పీఠభూమిలో అతి ఎత్తయింది.
తూర్పు కనుమలు: ఇవి దక్కను పీఠభూమికి తూర్పు హద్దుగా ఉన్నాయి. పశ్చిమ కనుమలంత ధృడంగా లేవు. తూర్పు కనుమలు ఉత్తరాన చోటా నాగ్‌పూర్ పీఠభూమితోనూ, దక్షిణాన నీలగిరి కొండలతోనూ కలుస్తున్నాయి. వీటిలో అతి ఎత్తయిన ప్రదేశం విశాఖపట్నం జిల్లాలోనూ (1506 మీ.), రెండో ఎత్తయిన స్థలం ఒరిస్సాలోని గంజాం జిల్లాలోని మహేంద్రగిరి (1501 మీ.) లోనూ ఉన్నాయి.
వీటిని ఉత్తర భాగంలో ఉత్తర కొండలుగా, దక్షిణ భాగంలో ‘తమిళనాడు’ కొండలుగా, మధ్య భాగంలో ‘కడప’ శ్రేణులుగా విభజించవచ్చు. తమిళనాడు కొండలను కొల్లాయిమలై, పచ్‌మలై, గోడుమలై, షెవరాయ్, బిలగిరి రంగన్ పర్వతాలని వివిధ పేర్లతో పిలుస్తున్నారు. తూర్పు కనుమల ఉత్తర భాగం ప్రధానంగా ఖొండలైట్, చార్నోకైట్ వంటి శిలలతో ఏర్పడింది. వీటిలో తూర్పు భాగంలో నల్లమల కొండలు, వెలి కొండలు, పాల కొండలు ప్రముఖమైనవి. ఇవి ఆంధ్రప్రదేశ్‌లోని కడప, కర్నూలు జిల్లాల్లో ఉన్నాయి. తూర్పు కనుమల్లో లాంగుల్యా, సీలేరు, వంశధార, మాచ్‌ఖండ్ మొదలైన నదులు జన్మిస్తున్నాయి.
Published date : 15 Sep 2015 04:38PM

Photo Stories