భారతదేశ అటవీ సంపద
సతత హరిత అరణ్యాలు
అత్యధిక వర్షపాతాన్ని మలబార్ తీరం, కేరళ, కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లోని పశ్చిమ వాలులు, అండమాన్-నికోబార్, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లోని ఆయనరేఖా ప్రాంతాల్లో సతతహరితారణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఈ అరణ్యాల్లో మహాగని, ఎబోని, రోజ్‌వుడ్ ముఖ్య వృక్షజాతులు. ప్రవేశసౌలభ్యత లేకపోవటంతో ఈ అరణ్యాల్లో వాణిజ్య కలపను ఉత్పత్తి చేయటం కష్టం. ఈ అరణ్యాలు విస్తారమైన జీవవైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ కోవకు చెందిన కేరళలోని సెలైంట్వ్యాలీ ప్రాంతంలో సింహపుతోక లాంటి అందమైన కోతుల జాతి నివసిస్తోంది. పశ్చిమ కనుమల్లోని ఈ అరణ్య ప్రాంతాన్ని ప్రపంచంలోని 14 జీవ వైవిధ్య మండలాల్లో ఒకటిగా గుర్తించారు. అధిక వర్షపాతాన్ని పొందే తెరాయి ప్రాంతం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఈశాన్య భారతంలోని కొండ ప్రాంతాల్లో ఆర్ధ్ర ఆకురాల్చే అడవులు విస్తరించి ఉన్నాయి. వీటిని ‘రుతుపవన అరణ్యాలు’గా పిలుస్తారు. టేకు, సాల్, గుర్జన్, మహుబా ముఖ్యమైన వృక్షజాతులు. వెదురు, సబారుు, సలాయి గడ్డిజాతులు కూడా ఈ అరణ్యాల్లో పెరుగుతాయి. దేశంలో వాణిజ్య కలపను ఉత్పత్తి చేసే ముఖ్యమైన అరణ్యాలు ఇవి.
60-100 సెం.మీ. మధ్యస్థ వర్షపాతాన్ని పొందే ప్రాంతాల్లో అనార్ధ్ర ఆకురాల్చే అరణ్యాలు పెరుగుతున్నాయి. ఈ అరణ్యాల్లో టేకు, మద్ది, అడవిచింత, అడవి వేప ముఖ్య వృక్షజాతులు ఇక్కడ పెరుగుతాయి. వెదురు కూడా విస్తారంగా లభిస్తుంది. ఇవి పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని నల్లమలై, ఎర్రమలై కొండ ప్రాంతాల్లో విస్తరించాయి. వ్యవసాయం విస్తరించడంతో ఈ అరణ్యాలు ఎక్కువగా కుచించుకపోతున్నాయి. ఈ అరణ్యాల్లో వాణిజ్య కలప ఉత్పాదకత తక్కువ.
చిట్టడవులు
చిట్టడవులు 40-60 సెం.మీ. అల్ప వర్షపాతాన్ని పొందే సహ్యాద్రి కొండల వర్షచ్ఛాయా ప్రాంతం, వాయవ్య భారతదేశంలో పెరుగుతాయి. పశ్చిమ తెలంగాణ, రాయలసీమ, ఉత్తర కర్ణాటక, మరఠ్వాడా, పంజాబ్, హర్యానా, ఉత్తర రాజస్థాన్ ప్రాంతాల్లో ఈ అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ముళ్లతో కూడిన తుమ్మ లాంటి అకేషియా జాతికి చెందిన తక్కువ ఎత్తు వృక్షజాతులు మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఈ అరణ్యాల్లో వంటచెరకు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. వాణిజ్య కలప లభించదు.
అత్యల్ప వర్షపాతాన్ని పొందే ఉత్తర గుజరాత్(కచ్), పశ్చిమ రాజస్థాన్(థార్ ఎడారి) ప్రాంతాల్లో వృక్షాలు పెరగటానికి కావలసిన తేమ లభించదు. శుష్క, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగే మెగాధర్మ్, జెరోఫైట్ తరానికి చెందిన కాక్టస్‌లాంటి పొదలు, తుప్పలు మాత్రమే పెరుగుతాయి. ద్వీపకల్ప భారతదేశంలోని పర్వత శిఖర భాగాల్లో ఉప ఆయనరేఖ అనార్ధ్ర సతతహరిత అరణ్యాలు పెరుగుతాయి. మధ్యప్రదేశ్‌లోని మహదేవ కొండలు, అమర్‌కాంత్ ప్రాంతం, కేరళలోని పళని కొండలు, తమిళనాడులోని నీలగిరి, అన్నామలై కొండలు, కర్ణాటకలోని కూర్ల్ ప్రాంతాల్లోని అరణ్యాలు ఈ కోవకు చెందుతాయి. దక్షిణ భారతదేశంలో వీటిని ‘షోలా’ అరణ్యాలు అని పిలుస్తారు. ఇందులో యూకలిప్టస్, ఓక్, చెస్ట్నట్, మాపుల్ ముఖ్య వృక్షజాతులు.
ఎత్తును బట్టి వృక్ష జాతులు
హిమాలయ పర్వతాల్లో 2000 మీ. ఎత్తులో సమశీతోష్ణ మండల జాతులైన ఓక్, చెస్ట్నట్, వాల్నట్, మాపుల్, బీచ్ లాంటి వృక్షాలు ఉంటాయి. సుమారు 3000-3500 మీటర్ల ఎత్తులో కోనిఫెరస్ జాతికి చెందిన ఫైన్, ఫర్, స్పూస్, సెడార్లాంటి వృక్షాలతో కూడిన టైగా అరణ్యాలు పెరుగుతాయి. 4500 మీటర్ల ఎత్తులో విల్లో జాతి వృక్షాలు, రోడోడెండ్రాన్ జాతికి చెందిన పుష్పజాతులు, పచ్చిక బయళ్లు విస్తారంగా పెరుగుతాయి. ఈ ప్రాంతం సహజసిద్ధ ఉద్యానవనంగా కనిపిస్తుంది.
మడ అడవులు
తీర ప్రాంతాల్లోని నదీ ముఖద్వారాలు, డెల్టాలు, ఉప్పునీటి కయ్యల వద్ద ప్రత్యేక రకమైన అరణ్యాలు పెరుగుతాయి. వీటిని ‘మడ అడవులు’ లేదా ‘మాన్గ్రూవ్ అరణ్యాలు’గా పిలుస్తారు. లవణీయతను తట్టుకొని నీటిలో తేలియాడే వృక్షజాతులు ఇక్కడ పెరుగుతాయి. సుందరి, రైజోఫెరా, సూల్పాకేన్ మొదలైనవి ముఖ్య వృక్షజాతులు. ఈ మడ అడవులు సముద్ర ఉప్పునీరు తీరమైదానాల్లోని వ్యవసాయ భూముల్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. ఎత్తయిన వేలా తరంగాలు, సునామీ తరంగాలు, చక్రవాతాలు తీరాన్ని దాటేటప్పుడు తీర ప్రాంతాల్లో ఎక్కువ నష్టం జరగకుండా ఈ అరణ్యాలు అడ్డుకుంటాయి. ఇవి జీవ వైవిధ్యానికి కూడా ప్రసిద్ధి. ఇటీవలి కాలంలో పర్యాటక కేంద్రాలు (రిసార్టులు, హోటల్స్) ఏర్పరచటానికి, వ్యవసాయాన్ని విస్తరించటానికి మడ అడవులను విచక్షణారహితంగా నరికివేస్తున్నారు. అందువల్ల భారత ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన మాన్గ్రూ ప్రాంతాలను రక్షిత మండలాలుగా ప్రకటించింది. అందులో ముఖ్యమైనవి సుందరవనాలు (పశ్చిమ బెంగాల్), భిత్తర్ కనికా (ఒడిశా), కొరింగ(ఆంధ్రప్రదేశ్), పిచ్చవరం, పారుయిట్ కాలిమోర్(తమిళనాడు), వెంబనాడు(కేరళ), కొండాపూర్ (కర్ణాటక), అచ్చా (మహారాష్ట్ర). భారతదేశంలో సగటున 23 శాతం భౌగోళిక ప్రాంతంలో మాత్రమే అరణ్యాలు విస్తరించి ఉన్నాయి.
ఇందులో 16 శాతం మాత్రమే దట్టమైన అరణ్యాల కోవకు చెందుతాయి. భౌగోళిక ప్రాంతంలో కనీసం 33 శాతం అరణ్యాలు ఉండాలని జాతీయ అటవీ విధానం నిర్దేశిస్తోంది. కొండలు ఎత్తయిన పీఠభూముల్లో కనీసం 60 శాతం, మైదాన ప్రాంతాల్లో కనీసం 20 శాతం అరణ్యాలు ఉండాలని కూడా జాతీయ అటవీ విధానం సూచిస్తోంది. కేవలం ఈశాన్య భారతదేశం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, అండమాన్-నికోబార్ అరణ్య ప్రాంతాలు మాత్రమే జాతీయ అటవీ విధాన లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరభారత మైదాన ప్రాంతాల్లో అరణ్యాల శాతం 10 కంటే తక్కువగా ఉంది.
పర్యావరణాన్ని పరిరక్షించటానికి భారత ప్రభుత్వం కొన్ని అరణ్య ప్రాంతాలను జాతీయ ఉద్యానవనాలు, అభయారణ్యాలు, జీవావరణ మండలాలుగా ప్రకటించింది. దండేలి, భద్ర(కర్ణాటక) పెంచ్(మహారాష్ట్ర) బోరి, సాత్పుర (మధ్యప్రదేశ్), పాకీబామేరా (అరుణాచల్ ప్రదేశ్) అరణ్య ప్రాంతాలను ‘పులుల అభయారణ్యాలు’గా భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 1973లో ప్రారంభించిన ప్రాజెక్టు టైగర్ పథకం కింద స్థాపించిన పులుల అభయారణ్యాల సంఖ్య 29కి చేరింది. ‘మ్యాన్ అండ్ బయోస్పియర్’ పథకం కింద ఇప్పటి వరకు 14 రక్షిత జీవావరణ మండలాలను ఏర్పరిచారు. అవి..
రక్షిత జీవావరణ మండలం | రాష్ట్రం (ఉనికి) |
1. అచనాకర్ - అమర్‌కాంతక్ | మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ |
2. అగస్త్యమలై | కేరళ |
3. దేహాంగ్-దిబాంగ్ | అరుణాచల్ ప్రదేశ్ |
4. దిబ్రూ-సాయికోవా | అసోం |
5. గ్రేట్ నికోబార్ | అండమాన్ - నికోబార్ |
6. మన్నార్ సింధు శాఖ | తమిళనాడు |
7. కాంచనజంగ | సిక్కిం |
8. మానస్ | అసోం |
9. నందాదేవి | ఉత్తరాంచల్ |
10. నీలగిరి | కేరళ, తమిళనాడు, కర్ణాటక |
11. నాక్రిక్ | మేఘాలయ |
12. పచ్మాడి | మధ్యప్రదేశ్ |
13. సిమ్లిపాల్ | ఒడిశా |
14. సుందరవనాలు | పశ్చిమ బెంగాల్ |
మాదిరి ప్రశ్నలు
1. ఈశాన్య భారతదేశంలో అత్యధిక శాతం అరణ్య ప్రాంతం ఉన్న రాష్ర్టం ఏది?1) మేఘాలయ
2) మిజోరాం
3) నాగాలాండ్
4) మణిపూర్
- View Answer
- సమాధానం: 2
2. ఈశాన్య భారతదేశంలో అత్యల్ప శాతం అరణ్య ప్రాంతం ఉన్న రాష్ర్టం ఏది?
1) అసోం
2) త్రిపుర
3) సిక్కిం
4) అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
3. దక్షిణ భారతదేశంలో అత్యధిక శాతం అరణ్య ప్రాంతం ఉన్న రాష్ర్టం ఏది?
1) తమిళనాడు
2) కర్ణాటక
3) కేరళ
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
4. దక్షిణ భారతదేశంలో అత్యల్ప శాతం అరణ్య ప్రాంతం ఉన్న రాష్ర్టం ఏది?
1) తమిళనాడు
2) కర్నాటక
3) కేరళ
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
5. భారతదేశంలో అరణ్య ప్రాంతం శూన్యంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు?
ఎ) లక్షదీవులు
బి) డామన్-డయ్యు
సి) పాండిచ్చేరి
డి) ఛండీగఢ్
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, డి
4) ఎ, సి
- View Answer
- సమాధానం: 4
6. భారతదేశంలో సుమారుగా ఎంత శాతం అరణ్య ప్రాంతాన్ని ‘రిజర్వ ప్రాంతం’గా గుర్తించారు?
1) 30
2) 40
3) 50
4) 60
- View Answer
- సమాధానం: 3
7. భారతదేశంలో అరణ్య ప్రాంతం ప్రధానంగా కింది నైసర్గిక విభాగంలో కేంద్రీకృతమై ఉంది?
1) హిమాలయాలు
2) ద్వీపకల్ప కొండలు - పీఠభూములు
3) పశ్చిమ కనుమలు - పశ్చిమ తీర మైదానాలు
4) తూర్పు కనుమలు - తూర్పు తీర మైదానాలు
- View Answer
- సమాధానం: 2
8. శృంగాకార అరణ్యాలు మొత్తం భారతదేశ అరణ్య ప్రాంతంలో ఎంత శాతం వాటాను కలిసి ఉన్నాయి?
1) 6
2) 15
3) 25
4) 35
- View Answer
- సమాధానం: 1
9. శృంగాకార అరణ్యాలు భారతదేశంలో ఏ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి?
1) సహ్యద్రి కొండలు
2) జార్ఖండ్
3) ఈశాన్య భారతదేశం
4) హిమాలయ పర్వతాలు
- View Answer
- సమాధానం: 4
10. సబాయి, సలాయి గడ్డి ఏ ప్రాంత అరణ్యాల్లో పెరుగుతున్నది?
1) ఛోటా నాగపూర్
2) పూర్వాంచల్ కొండలు
3) తెరాయి ప్రాంతం
4) మల్వా పీఠభూమి
- View Answer
- సమాధానం: 3