Skip to main content

పర్యాటక రంగం

ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. పర్యాటక రంగ అభివృద్ధి వల్ల అధిక రాబడితో పాటు విదేశీమారక ద్రవ్య ఆర్జన పెరగటంతో ప్రభుత్వాలు ఈ రంగానికి ప్రాధాన్యమిస్తున్నాయి. పర్యాటకం ద్వారా అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, ఇంగ్లండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, టర్కీ, ఆస్ట్రియా తదితర దేశాలకు ఎక్కువ ఆదాయం లభిస్తోంది. మానవ సమాజం సాంఘికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా సాధించిన ప్రగతికి తోడ్పాటునందించిన రంగాల్లో పర్యాటకం ఒకటి.
భారత్ - పర్యాటక రంగం
 • దేశంలో పర్యాటకరంగంలో అధిక వృద్ధి నమోదవుతోంది. ప్రపంచ ట్రావెల్, టూరిజం కౌన్సిల్ ప్రకారం 2012లో భారత జీడీపీలో పర్యాటక రంగం వాటా 6.6 శాతం. ఈ రంగం 39.5 మిలియన్ల మందికి ఉపాధి కల్పించింది. దేశంలోని మొత్తం ఉపాధిలో ఈ రంగం వాటా 7.7 శాతంగా నమోదైంది.
 • 2023 వరకు పర్యాటక రంగం సగటు సాంవత్సరిక వృద్ధిరేటు 7.9 శాతంగా ఉండగలదని అంచనా.
 • వైద్య పర్యాటకంలో ఆశిస్తున్న సగటు వృద్ధిరేటు 30 శాతం. 2015 నాటికి ఇది రూ.9,500 కోట్లకు చేరుకోగలదని అంచనా.
 • 2014లో 22.57 మిలియన్ల విదేశీ పర్యాటకులు భారత్‌లోని వివిధ ప్రాంతాను సందర్శించారు. ఈ సంఖ్య 2013లో 19.95 మిలియన్లు. 2014లో తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు పర్యాటక రంగ ప్రాధాన్య ప్రాంతాలుగా నిలిచాయి.

పర్యాటక రంగం- ఉపయోగాలు
 • సాంస్కృతిక వారసత్వాన్ని భద్రపరచటం, సుసంపన్నం చేయటంలో పర్యాటక రంగం విజయవంతమైంది.
 • అంతర్జాతీయ వాణిజ్య అభివృద్ధికి పర్యాటక రంగం దోహదపడింది.
 • ఆరోగ్య సంరక్షణ పరిశ్రమల ప్రగతికి పర్యాటక రంగం ఉపయోగపడింది.
 • పర్యాటక రంగంతో ఆరోగ్య సంరక్షణ యాజమాన్యంలో వృద్ధి నమోదైంది.
 • బహుళ సాంఘిక, సాంస్కృతిక కార్యకలాపాల్లో వృద్ధి.
 • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రవాణా రంగ విస్తరణ, ఎయిర్ ట్రావెల్, షిప్పింగ్ రంగాల అభివృద్ధి.

తెలంగాణ- పర్యాటకం
తెలంగాణ రాష్ర్టంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ‘రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ’ ఏర్పాటైంది. దీన్ని 2014, జూన్ 2న ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి వేరుచేశారు. రాష్ట్రంలో పర్యటించే పర్యాటకులకు అవసరమైన మౌలికవసతులు, ఇతర సౌకర్యాలు కల్పించటం పర్యాటక అభివృద్ధి సంస్థ లక్ష్యం. దీని వద్ద వోల్వో, మెర్సిడెస్ బెంజ్ కోచ్‌లున్న 63 వాహనాలు ఉన్నాయి. ముఖ్య పర్యాటక కేంద్రాల్లో హరిత హోటళ్లను నిర్వహిస్తోంది. విభిన్న పర్యాటక ప్యాకేజీలు అందిస్తూ దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటోంది. నిజాం ప్యాలెసెస్ టూర్, హైదరాబాదీ హెరిటేజ్ ఫ్లేవర్ వీకెండ్ ప్యాకేజ్, టెంపుల్ కమ్ హిల్ స్టేషన్ టూర్, కాకతీయ హెరిటేజ్ టూర్ వంటి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ప్యాకేజీలను ఇరుగుపొరుగు రాష్ట్రాలతో అనుసంధానించేందుకు పర్యాటక సంస్థ చర్యలు తీసుకుంది. నదీ ప్రయాణాలు, జల విహారాలకు అవసరమైన పడవలను కూడా సంస్థ నిర్వహిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వ చర్యలు
 • యాదగిరి గుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లను ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 400 ఎకరాల్లో నరసింహ అభయారణ్యాన్ని అభివృద్ధిపరచటంతో పాటు మరో 1600 ఎకరాల్లో ఉద్యానవనాలు, కల్యాణమండపాలు, ధ్యానమందిరాలు, వేద పాఠశాల, కాటేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
 • నల్గొండ-రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని రాచకొండలో దాదాపు 2,000 ఎకరాల విస్తీర్ణంలో ‘మెగా సినిమా సిటీ’ అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పించింది.
 • వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తగిన ప్రణాళికలు రూపొందించింది.
 • బతుకమ్మ ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. 2014లో ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఏటా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సంకల్పించింది. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా పర్యాటక ప్యాకేజీలను టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రారంభించింది. ఈ విశిష్టమైన పూల పండగకు దేశంలోని అన్ని ప్రాంతాల పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటోంది.
 • అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే ఉత్సవం మేడారం జాతర. 2014లో జరిగిన జాతర సందర్భంగా కోటిమందికి పైగా భక్తులు మేడారాన్ని సందర్శించారు. ఈ ఉత్సవం రెండేళ్లకోసారి జరుగుతుంది. 2016లో జరిగే జాతర దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.
 • నాగార్జున సాగర్, కిన్నెరసాని, రామప్ప, కొత్తగూడెం, గజ్వేల్ ప్రాంతాల్లో పర్యాటక మౌలిక సదుపాయల అభివృద్ధికి ‘నీతి ఆయోగ్’ రూ.33 కోట్లు కేటాయించింది.
 • తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యాటక కేంద్రాల అభివృద్ధికి సమగ్ర జిల్లా ప్రణాళికల రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
 • ప్రభుత్వం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం, కొండగట్టులోని హనుమాన్ ఆలయం, ధర్మపురిలోని నరసింహ స్వామి ఆలయం, వరంగల్ జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయం, మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్‌లోని జోగులాంబ ఆలయాల వద్ద పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.
 • తెలంగాణ జిల్లాల్లో తక్కువ ప్రాచుర్యం పొందిన పర్యాటక కేంద్రాల్లో తగిన సౌకర్యాలు కల్పించటం ద్వారా ఆయా ప్రాంతాలు ఎక్కువ పర్యాటకులను ఆకర్షించేలా చేయటంపై ప్రభుత్వం దృష్టిసారించింది.
 • కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ గ్రామీణ పర్యాటకానికి సంబంధించి గుర్తించిన వాటిలో నల్గొండలోని పోచంపల్లి గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు, ఆదిలాబాద్‌లోని నిర్మల్ గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు, వరంగల్ జిల్లాలోని చేర్యాల గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు, పెంబర్తి గ్రామీణ పర్యాటక ప్రాజెక్టులున్నాయి.
 • భారత ప్రభుత్వం సహకారంతో కుతుబ్‌షాహీ సమాధుల పరిరక్షణ, ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
 • ప్రసిద్ధ సమాధుల పరిరక్షణ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వంతో అగాఖాన్ ట్రస్ట్ ఇప్పటికే చేతులు కలిపింది.

ఆర్థిక వ్యవస్థపై పర్యాటక రంగ ప్రభావం
 • అధిక ఆర్థిక వృద్ధి సాధనకు పర్యాటక రంగం ముఖ్య సాధనంగా ఉపకరిస్తోంది. మధ్యతరగతి ప్రజల ఆదాయాల పెరుగుదలతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వ చర్యల కారణంగా పర్యాటక రంగ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ధనాత్మకంగా ఉంటోంది.
 • అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న తెలంగాణలో నిర్మాణాత్మక మార్పు ద్వారా ఆధునిక ఆర్థిక వృద్ధి జరగాలంటే పర్యాటక రంగాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలి.
 • పర్యాటక రంగ అభివృద్ధి వల్ల రాష్ట్రంలో రవాణా రంగం, విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్, కుటీర పరిశ్రమలు, పాడిపరిశ్రమ, పౌల్ట్రీ రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది.
 • ఆదాయం, ఉపాధికల్పన పెరుగుదలతో పాటు పేదరిక నిర్మూలన, సుస్థిర మానవాభివృద్ధి సాధనకు పర్యాటక రంగం దోహదపడుతుంది.
 • పర్యావరణ పరిరక్షణ, అంతర సాంస్కృతిక అవగాహన పెంపునకు పర్యాటక రంగం తోడ్పడుతుంది.
 • ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో వివిధ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పర్యాటకం, పౌరవిమానయానం, ఆతిథ్య పరిశ్రమల్లో పీపీపీ నమూనాను ప్రవేశపెడితే ప్రభుత్వ వ్యయభారం తగ్గుతుంది.
 • పర్యాటక రంగం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించవచ్చు. బహుళ ప్రయోజన మౌలిక వసతుల అభివృద్ధిని పర్యాటక రంగం ప్రోత్సహిస్తుంది. అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి, ఇతర ఉత్పాదక కార్యకలాపాల అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. తద్వారా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్‌డీపీ)లో వృద్ధి అధికమవుతుంది.
 • పర్యాటక రంగం పరంగా అంతగా ప్రాచుర్యం చెందని ప్రాంతాలపై దృష్టిసారించటం ద్వారా ఆయా ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చెంది, ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది.
 • గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించటం ద్వారా పల్లెల్లో ఉపాధి పెరిగి, అక్కడి ప్రజల జీవన ప్రమణాలు మెరుగవుతాయి. ప్రకృతి దృశ్యాలు, సంస్కృతులు, ఆచారాలు కలిగిన తెలంగాణలో గ్రామీణ పర్యాటకానికి మంచి అవకాశం ఉంది.
 • రాష్ట్రంలో సంస్కృతికి వన్నె తెచ్చేందుకు, ప్రపంచ స్థాయి వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ కళా భారతి (హైదరాబాద్), కాళోజీ కళాకేంద్రం దోహదపడతాయి.
Published date : 30 Oct 2015 11:19AM

Photo Stories