నిల్వ సామర్థ్యం (Storage Capacity)
వ్యవసాయమే ప్రధాన జీవనోపాధిగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ‘సమ్మిళిత వృద్ధి’ సాధ్యపడాలంటే వ్యవసాయ రంగంలో సమూల ప్రగతి అవసరం. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం భారత్‌లో ఆహార ఉత్పత్తుల నిల్వ సామర్థ్యం సరిపోయినంతగా లేదు. ఈ కారణంగా ఏటా మొత్తం ఉత్పత్తిలో 12 నుంచి 16 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు వృథా అవుతున్నాయి. వీటి విలువ రూ. 50,000 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా.
1994-95 తర్వాతి కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటు వార్షిక వృద్ధి 1.20 శాతంగా నమోదైంది. 1990-91లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 176.4 మిలియన్ టన్నులు కాగా, 2013-14 నాటికి 264.4 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇటీవల రబీలో గోధుమ, బియ్యం, Cereals, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల కారణంగా ఖరీఫ్, రబీ కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సమానంగా ఉండటాన్ని గమనించవచ్చు. ఉత్పత్తిలో పెరుగుదలకు అనుగుణంగా నిల్వ సామర్థ్యాలను పటిష్టపరిస్తేనే సత్ఫలితాలుంటాయి.
నిల్వ సౌకర్యాలు - గిడ్డంగులు
వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు సంబంధించి భారత్‌లో గిడ్డంగులు (గోడౌన్లు) ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. గిడ్డంగుల నిర్మాణం శాస్త్రీయంగా ఉన్నప్పుడే వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత, పరిమాణాలను పరిరక్షించవచ్చు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లు గిడ్డంగులను నిర్వహిస్తున్నాయి. భారత్‌లో సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌ను అతిపెద్ద ప్రభుత్వ రంగ గిడ్డంగి నిర్వహణదారుగా పేర్కొనవచ్చు. ఇది సుమారుగా 120 వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులకు భద్రతతో కూడిన నిల్వ సౌకర్యాలను కల్పిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, శ్రేణీకరణ, పంపిణీ లాంటి సేవలను కూడా నిర్వహిస్తోంది. దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక గిడ్డంగి కార్పొరేషన్లను ఏర్పాటు చేశాయి. రాష్ట్ర గిడ్డంగి కార్పొరేషన్లు ఆయా రాష్ట్రాలకు సంబంధించి జిల్లా స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర గిడ్డంగి కార్పొరేషన్ ఏర్పాటుకు అవసరమైన వాటా మూలధనాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర గిడ్డంగి కార్పొరేషన్ సమానంగా సమకూరుస్తాయి. కేంద్ర, రాష్ట్ర గిడ్డంగి కార్పొరేషన్లతో పాటు భారత ఆహార సంస్థ కూడా వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలను కల్పిస్తోంది.
2010 చివరి నాటికి కేంద్ర గిడ్డంగి కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ), రాష్ట్ర గిడ్డంగి కార్పొరేషన్లు, భారత ఆహార సంస్థల మొత్తం నిల్వ సామర్థ్యం 75 మిలియన్ టన్నులకు చేరింది. రైతులు వారి ఉత్పత్తులను తక్కువ ధరకే విక్రయించకుండా నిరోధించే క్రమంలో గ్రామీణ గోడౌన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2001 మార్చి నుంచి అమలు పరుస్తోంది. ఇప్పటివరకు 67 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న గ్రామీణ గోడౌన్లను ఏర్పాటు చేసినట్లు అంచనా. ఉత్పత్తి ధోరణి, విక్రయమైన మిగులు పరిశీలించినప్పుడు భారత్‌లో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సామర్థ్యం తక్కువగా ఉన్నట్లు భావించవచ్చు. 2012 ఫిబ్రవరి 1 నాటికి భారత ఆహార సంస్థ 300.83 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం (సొంత, అద్దె గోడౌన్లు కలిపి) కలిగి ఉండగా రాష్ట్ర ఏజెన్సీలు 153.54 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. మొత్తంగా భారత్‌లో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సామర్థ్యం 91 మిలియన్ టన్నులకు పైగా పెరిగింది. ప్రభుత్వ ఏజెన్సీలకు సంబంధించి నిల్వ సామర్థ్యాన్ని ప్రజాపంపిణీ వ్యవస్థ, ఇతర ప్రభుత్వ పథకాల అమల్లో భాగంగా ఆహార ధాన్యాల నిల్వకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆహార భద్రత కల్పించే క్రమంలో ప్రభుత్వ ఏజెన్సీల ఆహార ధాన్యాల సేకరణ పెరుగుతున్న క్రమంలో లభ్యమయ్యే నిల్వ సామర్థ్యంపై అధిక ఒత్తిడి ఉంది. అధిక మద్దతు ధరల కారణంగా ఆహార ధాన్యాల సేకరణలో నిమగ్నమవుతున్న రాష్ట్ర ఏజెన్సీల నిల్వ సామర్థ్యంపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. నాబార్డ్ మంజూరు చేసిన గోడౌన్ల సగటు నిల్వ సామర్థ్యం 1261 మెట్రిక్ టన్నులు కాగా, మొత్తం గోడౌన్లలో 75 శాతం నిల్వ సామర్థ్యం వెయ్యి మెట్రిక్ టన్నుల కంటే తక్కువగా ఉంది. నాబార్‌డ సహకారంతో రైతులు ఏర్పాటు చేసుకున్న చిన్న, మధ్య తరహా గోడౌన్ల వల్ల వారి ఉత్పత్తులను తక్కువ ధర వద్ద విక్రయించే పరిస్థితి తగ్గి, గిట్టుబాటు ధర పొందగలుగుతున్నారని అనేక అనుభవ పూర్వక ఆధారాలు తెలియజేస్తున్నాయి.
నిల్వ సామర్థ్యం - ప్రాంతీయ అసమానతలు
ఉత్పత్తి కేంద్రాలుగా భారత్‌లో నిల్వ సామర్థ్యం కొన్ని ప్రాంతాల్లో అధికంగా కేంద్రీకృతమై ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం అధికంగా ఉన్న ముఖ్య రాష్ట్రాల్లో 22 శాతం నిల్వ సామర్థ్యం లభ్యమవుతోంది. అవసరాలకు అనుగుణంగా కొన్ని రాష్ట్రాలు నెలలోపు నిల్వ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నాయి. రాష్ట్రాల మధ్య ఆహార, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో తేడా; వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ నిమిత్తం మండీల ఏర్పాటులో వ్యత్యాసాలు నిల్వ సామర్థ్యానికి సంబంధించి ప్రాంతీయ అసమానతలు పెరగడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. స్థానిక ఉత్పత్తిదారులకు గ్రామీణ గిడ్డంగుల ఏర్పాటులో ప్రభుత్వ ప్రోత్సాహకాలకు సంబంధించి వారిలో అవగాహన, బ్యాంక్ అధికారుల వైఖరి లాంటివి కూడా వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో ప్రాంతాల మధ్య అసమానతలకు కారణంగా ఉన్నాయి. మొత్తం గోడౌన్లు, నిల్వ సామర్థ్యంలో ఆహార ధాన్యాలు, సంబంధిత వ్యవసాయ ఉత్పత్తులను అధికంగా పండించే కొద్దిమంది రైతులే ఎక్కువగా కలిగి ఉన్నారు. అందువల్ల ధనిక రైతులే గిట్టుబాటు ధరలు పొందుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ అసమానతలతో పాటు ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. భారత్‌లో మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని ప్రాంతాల వారీగా పరిశీలిస్తే.. ఉత్తర భారతదేశం వాటా 48 శాతం ఉండగా, దక్షిణ భారతదేశం 22%, పశ్చిమ ప్రాంతం 13%, మధ్య భారత దేశం 9%, తూర్పు ప్రాంతం 7% వాటా కలిగి ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వాటా దేశంలోని మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సామర్థ్యంలో 1% మాత్రమే. నిల్వ సామర్థ్యంలో ప్రాంతాల మధ్య అసమానతల కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు సంబంధించి ప్రభుత్వ సామర్థ్యం పరిమితంగా ఉంది. గోడౌన్లలో నిల్వ చేస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల్లో ఆహార ధాన్యాలపై గోధుమ, బియ్యం వాటా అధికంగా ఉంది. తర్వాతి స్థానాల్లో నూనె గింజలు, సుగంధ ద్రవ్యాలు, పత్తి నిలిచాయి. నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం అనేక పథకాల ద్వారా ప్రోత్సాహకం అందిస్తున్నప్పటికీ గోధుమ, బియ్యం నిల్వల్లోనే పెరుగుదల కనిపిస్తోంది.
గిడ్డంగుల నియంత్రణ విధానం: గిడ్డంగుల ఏర్పాటులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంపొందించడం, వేర్‌హౌసింగ్ పరిశ్రమ అభివృద్ధి, నియంత్రణకు సంబంధించి భారత ప్రభుత్వం సెప్టెంబర్ 2007లో ‘ది వేర్‌హౌసింగ్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్)’ చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం 2010 అక్టోబర్‌లో వేర్‌హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేశారు. వేర్‌హౌసింగ్ అభివృద్ధి, నియంత్రణ చట్టం ముఖ్య ఉద్దేశం నెగోషియబుల్ వేర్‌హౌస్ రిసిప్ట్ (NWR) మంజూరులో నియంత్రణ వాతావరణాన్ని కల్పించడం. NWR మంజూరు చేసే గిడ్డంగులకు వేర్‌హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (WDRA) గుర్తింపునిస్తుంది. ఇది 2011 మార్చి 31 నాటికి పరిశీలనకు వచ్చిన 300 దరఖాస్తుల్లో 51 అప్లికేషన్లకు అనుమతినిచ్చింది.
కోల్డ్ స్టోరేజీలు
భారత్‌లో పండ్లు, కూరగాయల సాంవత్సరిక ఉత్పత్తి 130 మిలియన్ టన్నులుగా అంచనా. వైవిధ్య వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వీటి ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది. వీటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి అనేక అవకాశాలున్నప్పటికీ ఆయా ఉత్పత్తులను నిల్వ చేయడానికి అవసరమైన శీతల గిడ్డంగులు (Cold Storages) తగినంతగా లేవు. శీతల గిడ్డంగుల సౌకర్యం అధికంగా సింగిల్ కమోడిటీస్ అయిన బంగాళాదుంప, ఆరెంజ్, ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ, పూలు లాంటి వాటికి మాత్రమే అందుబాటులో ఉంది. అంటే శీతల గిడ్డంగుల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడం లేదు. బహుళ ఉత్పత్తులను నిల్వ చేసే విధంగా శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయాలి. ఇది ఉత్పత్తిదారుల ఆర్థిక స్థోమతపై ఆధారపడి ఉంటుంది. రిఫ్రిజిరేషన్ వ్యవస్థను శీతల గిడ్డంగులు నిర్వహిస్తాయి. వస్తువులు నిల్వ చేయడానికి వీలుగా గది వాతావరణాన్ని రిఫ్రిజిరేషన్ వ్యవస్థ నియంత్రిస్తుంది. దేశంలోని 5274 శీతల గిడ్డంగుల నిల్వ సామర్థ్యం 24.31 మిలియన్ టన్నులుగా అంచనా. శీతల గిడ్డంగులు ఎక్కువగా ప్రైవేటు రంగంలో ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ, సహకార రంగంలో ఏర్పాటైన శీతల గిడ్డంగుల వాటా చాలా తక్కువ. ప్రస్తుతం దేశంలోని శీతల గిడ్డంగుల్లో పండ్లు, కూరగాయలు, పత్తి, మిరపకాయల నిల్వలు కొనసాగుతున్నాయి. అసోం, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, కేరళ, సిక్కిం, తమిళనాడు రాష్ట్రాల్లోని పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో 1% మాత్రమే శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తున్నారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారత్‌లోని మొత్తం శీతల గిడ్డంగుల సగటు నిల్వ సామర్థ్యం కంటే అధిక నిల్వ సామర్థ్యం ఉంది. మొత్తం మీద వీటి డిమాండ్ వ్యవసాయ ఉత్పత్తులకే అధికంగా ఉంది.
నిల్వ సామర్థ్యం పెంపునకు చర్యలు
- గత దశాబ్ద కాలంలో నిల్వ సామర్థ్యం సగటు సాంవత్సరిక వృద్ధి 6.7%గా నమోదైంది. నిల్వ సామర్థ్యం సరిపోయినంతగా లేనందువల్ల ఏటా మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 20 నుంచి 30 శాతం వృథా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాష్ట్ర గిడ్డంగులను ఆధునికీకరించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. రాష్ట్ర ఏజెన్సీలు నిర్వహిస్తున్న గిడ్డంగులు 20 ఏళ్ల పైబడి ఉన్నాయి. అందువల్ల ఆయా గిడ్డంగుల ఆధునికీకరణ ప్రాధాన్యం సంతరించుకుంది. వీటి ఆధునికీకరణకు 37 నుంచి 40 బిలియన్ రూపాయల వ్యయం అవుతుందని అంచనా.
- ఖరీఫ్, రబీ కాలాల్లో వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహార ధాన్యాల ఉత్పత్తిలో సమతౌల్యం సాధించాలి. వినియోగ అవసరాల దృష్ట్యా సాంవత్సరిక ఉత్పత్తిలో 70% నిల్వ చేసే విధంగా నిల్వ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. దీని కోసం గ్రామీణ గోడౌన్ల ఏర్పాటు పథకాన్ని ప్రభుత్వం తిరిగి ప్రారంభించాలి. ప్రస్తుతం సగటు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో సుమారుగా 30% ఉత్పత్తి అవుతున్నట్లుగా భావించి, మొత్తం 70 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వ నిమిత్తం నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. వృథా అవుతున్న ఆహార ధాన్యాల ఉత్పత్తిని 70 మిలియన్ టన్నులుగా భావిస్తే వాటి మొత్తం విలువ 70 నుంచి 100 బిలియన్ రూపాయల వరకు ఉంటుంది.
- ప్రభుత్వ ఏజెన్సీల నిల్వ సామర్థ్యానికి సంబంధించి గోధుమ, బియ్యం అధిక మొత్తంలో ఆక్రమించినందువల్ల ఇతర ఆహార ధాన్యాలు, వ్యవసాయ వస్తువుల నిల్వకు అవరోధం ఏర్పడుతోంది. జొన్నలు, సజ్జలు, కార్‌న, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పత్తి, సుగర్ కేన్ లాంటి వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం ప్రభుత్వ ఏజెన్సీల నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. నిర్వహణలో ఉన్న గిడ్డంగుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి వేర్‌హౌస్ పర్‌ఫార్మెన్‌స ఇండికేటర్లను ప్రవేశ పెట్టాలి.
- ప్రైవేటు రంగంలో నిల్వ సామర్థ్యం పెంపునకు ప్రోత్సాహకాలు అవసరం. నాబార్డ్, నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ల ద్వారా గిడ్డంగి పరిశ్రమ అభివృద్ధిలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలి. 2010 మార్చి నాటికి మొత్తం నిల్వ సామర్థ్యం 91 మిలియన్ మెట్రిక్ టన్నుల్లో నాబార్డ్ పథకం కింద లబ్ధి పొందిన గిడ్డంగుల సామర్థ్యం 24 శాతం కాగా, నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కింద లబ్ధి పొందిన గిడ్డంగుల నిల్వ సామర్థ్యం 17 శాతం. గిడ్డంగుల ఏర్పాటులో ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి.
- పంట చేతికి వచ్చే సమయంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉంటున్నాయి. రుణగ్రస్థత కారణంగా చిన్న, సన్నకారు రైతులు గిట్టుబాటు ధర లభించే వరకు వేచి చూడకుండా ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. అందువల్ల వ్యవసాయ ఆదాయాలు తగ్గి వ్యవసాయ రంగంపై పెట్టుబడులు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించడానికి రైతులు తమ ఉత్పత్తులను గిడ్డంగుల్లో నిల్వ చేసుకునేవిధంగా ప్రోత్సహించాలి. గుర్తింపు ఉన్న గిడ్డంగుల్లో నిల్వ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు నెగోషియబుల్ వేర్‌హౌస్ రిసిప్ట్‌ను అందిస్తే బ్యాంకుల నుంచి రైతులు స్వల్పకాల రుణాన్ని పొందగలుగుతారు. తద్వారా గిట్టుబాటు ధర లభించే వరకు వారి ఉత్పత్తులను విక్రయించకుండా వేచి చూస్తారు. ఈ స్థితి వ్యవసాయ ఆదాయాలు, వ్యవసాయ రంగంలో పెట్టుబడుల పెంపునకు దారితీస్తుంది. NWR మంజూరు గ్రామీణ ప్రాంతాల్లో పరపతి ప్రవాహం పెంపునకు, కాస్ట్ ఆఫ్ క్రెడిట్ (పరపతి వ్యయం) తగ్గింపునకు తోడ్పడుతుంది. ప్రామాణీకరణ, శ్రేణీకరణ, ప్యాకేజింగ్, బీమా సేవలు లాంటి ఇతర కార్యకలాపాలు గ్రామీణ ప్రాంతాల్లో మెరుగవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో అగ్రి - బిజినెస్‌లోని లాజిస్టిక్ చైన్‌లో ఉన్న తారతమ్యాన్ని ఇది పూరిస్తుంది.
- గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల పెంపుతో పాటు మూలధన సబ్సిడీ లాంటివి కల్పించడం ద్వారా రైతులను సహకార సంఘాల ఏర్పాటు దిశగా ప్రోత్సహించాలి. సహకార సంఘాల ద్వారా అదనపు నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.