Skip to main content

మానవ నాడీ వ్యవస్థ

మానవుడిలో మెదడు.. తలలోని దృఢమైన ఎముకల పెట్టె (కపాలం)లో, నీటి అలల మధ్య తేలుతూ పటిష్ట భద్రత మధ్య ఉంటుంది. కపాలం అధ్యయనాన్ని క్రేనియాలజీ అంటారు. శరీరంలో జరిగే అన్ని జీవక్రియలు నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటాయి. ఈ వ్యవస్థ శరీరానికి వెలుపల, లోపల జరిగే మార్పులకు ప్రతిచర్యలను కలిగిస్తుంది. నాడీవ్యవస్థ అధ్యయనాన్ని న్యూరాలజీ అంటారు. మానవ నాడీవ్యవస్థలో మూడు భాగాలు ఉంటాయి. అవి.. కేంద్ర నాడీవ్యవస్థ, పరధీయ నాడీవ్యవస్థ, స్వయం చోదిత నాడీవ్యవస్థ.
కేంద్ర నాడీ వ్యవస్థ
ఇందులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి.. మెదడు. రెండు.. వెన్నుపాము. వీటిని ఆవరించి ఉండే మూడు పొరలను మెనింజస్ అంటారు. ఆ పొరలు (వెలుపలి నుంచి లోపలి వైపునకు వరుసగా).. వరాశిక, లౌతుకళ, మృద్వి. ఈ పొరలకు బ్యాక్టీరియా (నిస్సేరా మెనింజైటిస్) సంక్రమిస్తే మెనింజైటిస్ వ్యాధి వస్తుంది. ఈ పొరల మధ్య ఉండే ద్రవ పదార్థాన్ని మస్తిష్క మేరుద్రవం(సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్) అంటారు. ఈ ద్రవం మెదడుకు, వెన్నుపాముకు రక్షణ కల్పి స్తుంది. మెదడులోని నాడీకణాలకు ఆహారాన్ని, ఆక్సీజన్‌ను సరఫరా చేస్తుంది.

మెదడు
మెదడు అధ్యయనాన్ని ‘ప్రినాలజీ’ అంటారు. అప్పుడే పుట్టిన శిశువు మెదడు 300-400 గ్రాముల బరువు ఉంటుంది. వయోజనుల మెదడు 1350-1400 గ్రాములు, పురుషుల్లో 1375 గ్రాములు, స్త్రీల్లో 1275 గ్రాముల బరువు ఉంటుంది. మెదడులో 75 శాతానికి పైగా నీరు ఉంటుంది.
జంతువుల్లో అత్యంత బరువైన మెదడు (8 కిలోలు) తిమింగలంలో ఉంటుంది. ఏనుగు మెదడు 5 కిలోలు ఉంటుంది. నాడీ కణాల సంఖ్య మాత్రం మానవుల మెదడులోనే ఎక్కు వ. ఏనుగు మెదడులో 2,300 కోట్ల నాడీ కణాలు, చింపాంజీలో 700 కోట్లు, మానవుడిలో 8,600 కోట్లు ఉంటాయి.
నాడీ వ్యవస్థ నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం నాడీకణం (న్యూరాన్). మెదడు పనితీరుకు మూలం న్యూరాన్. మెదడు కణాల్లో న్యూరాన్లు పది శాతం ఉంటాయి. మిగతా 90 శాతం గ్లియల్ కణాలు ఉంటాయి. ఈ కణాలు పోషక పదార్థాలను అందించడంతోపాటు మెదడును శుభ్రం చేస్తాయి. మెదడు బరువు ఎక్కువ ఉన్నవారు ఎక్కువ తెలివి తేటలు కలిగి ఉంటారని ఫ్రెడరిక్ టిడ్‌మాన్ పేర్కొన్నాడు.
  • మానవుడి దేహం బరువులో మెదడు బరువు రెండు శాతం మాత్రమే. కానీ శరీరంలోని మొత్తం శక్తిలో దాదాపు 20 శాతం, ఆక్సీజన్‌లో 20 శాతం, గ్లూకోజ్‌లో 25 శాతాన్ని వినియోగించుకుంటుంది.
  • చుంచెలుక శరీరం మొత్తం బరువులో మెదడు బరువు 10 శాతం ఉంటుంది. మెదడుకు 5 నుంచి 7 సెకన్ల పాటు ఆక్సీజన్ అందకుంటే బ్రెయిన్ డెడ్ అవుతుంది.
  • శరీరం లాగే మెదడుకూ విశ్రాంతి (నిద్ర) అవసరం.
  • పెద్దవారు రోజుకు ఆరు గంటలు నిద్రపోవాలి.
  • క్రీడాకారులు 9 గంటలు, 18 ఏళ్ల లోపు వారు 8 గంటలు, నవజాత శిశువులు 18 గంటలు విశ్రాంతి తీసుకోవాలి.
బ్రెయిన్ మ్యాపింగ్
అత్యాధునిక స్కానింగ్, మ్యాపింగ్ పరిశోధనల వల్ల మెదడు పనితీరుపై అవగాహన ఏర్పడింది. మెదడును వివిధ పరికరాలతో స్కానింగ్ చేసి దానిలోని మార్పులను గుర్తించి వ్యాధులను నిర్ధారించడాన్ని బ్రెయిన్ మ్యాపింగ్ అంటారు. మెదడు వ్యాధుల గుర్తింపు పరీక్షలు..
1. ఎలక్ట్రో ఎన్‌సెఫలో గ్రామ్ (ఈఈజీ)
2. మ్యాగ్నెటిక్ ఎన్‌సెఫలో గ్రామ్ (ఎంఈజీ)
3. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్‌ఐ)
4. కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సీటీ స్కాన్)
5. ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్‌ఎంఆర్‌ఐ) స్కానింగ్‌లో రేడియోధార్మిక కిరణాలను ఉపయోగిస్తారు.
  • కండరాల నొప్పులు, పక్షవాతం చికిత్సలో పరారుణ కిరణాలను వాడతారు.
నార్కో అనాలసిస్
  • మెదడులోని సమాచారాన్ని యథావిధిగా బయటకు చెప్పించే ప్రక్రియ నార్కో అనాలసిస్ టెస్ట్.
  • ఈ పరీక్షను అంతర్జాతీయ ఉగ్రవాదులు, ఆర్థిక నేరస్తులు, కుంభకోణాలకు పాల్పడిన వ్యక్తుల నుంచి నిజాలను రాబట్టడానికి ఉపయోగిస్తారు.
  • ఈ పరీక్షలో వాడే రసాయనాలు.. సోడి యం అమైటాల్, సోడియం పెంటాథాల్.
నోట్: ఈ పరీక్ష రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు, జీవించే హక్కుకు వ్యతిరేకం. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు అనుమతితో దీన్ని నిర్వహించాలి.

మెదడు - నిర్మాణం
మెదడులో మూడు భాగాలు ఉంటాయి. అవి.. ముందు మెదడు, మధ్య మెదడు, వెనక మెదడు.
ముందు మెదడు
ముందు మెదడునే సెరిబ్రమ్/మస్తిష్కం/ పెద్ద మెదడు అని అంటారు. సెరిబ్రమ్ 995 గ్రాముల బరువు ఉంటుంది. దీనిలోని ఎత్తై ప్రదేశాలను(గట్లను) గైరై అని, లోతైన ప్రదేశాలను సల్సై అని అంటారు. మస్తిష్కం 2 మస్తిష్కార్ధగోళాలు గా విభజితమవుతుంది. కుడి మస్తిష్కార్ధ గోళం ఎడమ కాళ్లు, చేతులను; ఎడమ మస్తిష్కార్ధగోళం కుడి కాళ్లు, చేతులను నియంత్రిస్తాయి.
  • కుడి మస్తిష్కార్ధ గోళానికి గాయమైతే దేహంలోని ఎడమ వైపు భాగాలకు, ఎడమ గోళానికి దెబ్బ తగిలితే కుడి వైపు భాగాలకు పక్షవాతం వస్తుంది. ఈ మస్తిష్కార్ధ గోళాలను నాడీదండం కలుపుతుం ది. మస్తిష్కానికి, మధ్య మెదడుకు మధ్యద్వారగోర్థం ఉంటుంది. ఇది రాంబాయిడల్ ఆకారంలో కనిపిస్తుంది. థలామస్, హైపోథలామస్‌గా విభజితమవుతుంది.
హైపోథలామస్ విధులు
1) భావోద్వేగాల నియంత్రణ
2) ఆకలి, దప్పిక
3) నిద్ర, మెలకువ
4) నీటి సమతుల్యత, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత క్రమత
5) లైంగిక వాంఛ
  • హైపోథలామస్.. పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది. మానవుడిలో ఈ గ్రంథి ప్రధానమైంది.
  • దృశ్య, శ్రవణ, స్పర్శ, వాసన, రుచిని తెలుసుకోవడానికి మస్తిష్కంలో ఐదు జ్ఞాన కేంద్రాలు ఉంటాయి.
  • మస్తిష్కాన్ని ఉదర తలం నుంచి చూస్తే అందులో గదాకృతి నిర్మాణాలు కనిపిస్తా యి. వాటిని ఘ్రాణ లబింకలు అంటారు.
మస్తిష్కం విధులు
1) జ్ఞాపక శక్తి
2) తెలివితేటలు
3) ఆలోచన
4) ఊహా శక్తి
5) వివేచన
6) సమస్యల పరిష్కారం
7) అభ్యాసం
8) మాట్లాడటం

మధ్య మెదడు
  • ఇది మందంగా, దృఢంగా ఉన్న చిన్న కాడ వంటి భాగం.
  • ఇది హైపోథలామస్‌కు, పాన్‌‌సవెరోలికి మధ్య ఉంటుంది. మధ్య మెదడు పృష్ట భాగంలో నాలుగు లంబికలతో ‘కార్పొరా క్వాడ్రిజమైనా’ అనే నిర్మాణం ఉంటుంది. ఇది దృశ్య, శ్రవణ జ్ఞానాలను కలిగిస్తుంది.
వెనక మెదడు
ఇది మెదడు చివరి భాగం. దీనిలో మూడు భాగాలు ఉంటాయి. అవి..
1) అనుమస్తిష్కం
2) పాన్స్ వెరోలి
3) మజ్జాముఖం

అనుమస్తిష్కం (సెరిబెల్లమ్)
  • దీన్ని లిటిల్ బ్రెయిన్ (చిన్న మెదడు) అని కూడా అంటారు.
  • ఇది తల వెనక భాగంలో (మస్తిష్కానికి దిగువన, మజ్జాముఖానికి పైన) ఉంటుంది.
విధులు
1) శరీర సమతాస్థితిని కాపాడటం
2) నియంత్రిత కండరాల చలనాలను క్రమబద్ధీకరించడం
నోట్: మత్తుమందు ఇచ్చినప్పుడు, మద్యా న్ని అధికంగా సేవించినప్పుడు ఈ భాగం సక్రమంగా పనిచేయక మనిషి అదుపు తప్పుతాడు.

పాన్స్ వెరోలి
  • ఇది మజ్జాముఖానికి వెనక, మధ్య మెదడుకు కింద ఉంటుంది. శ్వాస కండరాల కదలికలను నియంత్రించి, ఉచ్ఛ్వా సలో పీల్చే వాయువుల ఘనపరిమాణాన్ని క్రమపరుస్తుంది.
మజ్జాముఖం
ఇది మెదడు చివరి భాగం. మెదడును, వెన్నుపామును కలిపే సంధానకర్త/వారధి. ఇది అనియంత్రిత కండరాలకు సమాచారాన్ని అందిస్తుంది.
విధులు
1) శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనం, హృదయ స్పందన, పేగులు, జీర్ణాశయం, ఆహార వాహిక, మూత్రాశయం చలనాలను నియంత్రిస్తుంది.
2) వాసోమోటర్‌గా పనిచేస్తుంది(రక్తనాళాల్లో జరిగే చర్యల వల్ల వాటి వ్యాసం మారుతుంది)
3) మింగడం, దగ్గడం, తుమ్మడం, వాంతులు, వెక్కిళ్లను నియంత్రిస్తుంది.
మానవ మెదడులో మజ్జాముఖం అతి ముఖ్య భాగం. దీనికి తీవ్ర గాయమైతే (శ్వాసక్రియకు అంతరాయం కలిగి) వ్యక్తి మరణిస్తాడు.

వెన్నుపాము
మజ్జాముఖం.. వెనక వైపునకు విస్తరించి వెన్నుపాముగా మారి మొండెం చివరి వరకు ప్రయాణిస్తుంది. ఇది 42 నుంచి 45 సెం.మీ. పొడవు ఉంటుంది. వెన్నుపాము దాని అడ్డుకోతలో హెచ్ లేదా సీతాకోకచిలుక ఆకారంలో కనిపిస్తుంది. వెన్నుపాము లోపలి వైపు బూడిద రంగు పదార్థం, వెలుపలి వైపు తెలుపు పదార్థం ఉంటాయి. వెన్నుపాము మెదడుకు, శరీర భాగాలకు మధ్యవర్తిగా, సంధానకర్తగా పనిచేస్తుంది. అందువల్ల వెన్నుపామును టెలిఫోన్ ఎక్స్ఛేంజ్/రిలే సెంటర్ అని పేర్కొంటారు.
విధులు
అసంకల్పిత ప్రతీకార చర్యలను చూపడం. అంటే అనుకోకుండా వేగంగా, వెంటనే, అప్రయత్నంగా జరిగే చర్యలు. ఈ చర్యలు వెన్నుపాము ఆధీనంలో మాత్రమే ఉంటాయి. వీటికి మెదడుతో సంబంధం లేదు.
ఉదాహరణలు:
  • వేడి వస్తువులను తాకగానే చేతిని వెనక్కి లాగడం.
  • కీటకం అకస్మాత్తుగా కంటి వద్దకు రాగానే కనురెప్పలు మూయడం.
  • చీకట్లో ఒక్కసారిగా కాంతి పడగానే కళ్లు మూసుకోవడం.
Published date : 13 Nov 2015 06:26PM

Photo Stories