AP Anganwadi Workers Salary Hike : అంగన్‌వాడీల సమస్యలపై.. సజ్జల ఏమన్నారంటే..?
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి అంగన్‌వాడీల సమస్యలపై సానుభూతితో వ్యవహరిస్తోందనీ, ఆయన ఆదేశాలతో ఇప్పటి వరకు మూడు సార్లు చర్చలు జరిపామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వారికి వీలైనంతవరకూ మేలు చేసేందుకే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు.వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి జనవరి 12వ తేదీ(శుక్రవారం) రాత్రి చర్చలు జరిపారు.
ఈ చర్చల అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అంగన్‌వాడీల కోర్కెలు అన్యాయమని అనడంలేదని, ప్రభుత్వ ఇబ్బందులను కూడా వారు గుర్తించాలని కోరామని చెప్పారు. నెల రోజులుగా సమ్మె చేస్తున్నా వారిపై ఎటువంటి ఇబ్బందికర చర్యలు చేపట్టలేదన్న విషయాన్ని గమనించాలని తెలిపారు.రాష్ట్రంలో ఏడు లక్షల మంది పిల్లలకు ఆహారం, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార పంపిణీకి నెల రోజులుగా ఇబ్బంది ఏర్పడిందనీ, వారికి సేవలు అందకపోవడంవల్ల పేద వర్గాలే ఇబ్బంది పడుతున్నాయనీ, పరిస్థితిని అర్థం చేసుకుని సమ్మెను విరమించాలని కోరుతున్నామన్నారు.
ఇప్పటి వరకు అడిగినవన్నీ..
ఇప్పటికే రిటైర్మెంట్ బెనిఫిట్ కింద అంగన్‌వాడీ వర్కర్లకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు, హెల్పర్లకు రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ నిర్ణ యం తీసుకున్నాం. దానిపై వారు మరోసారి ప్రతిపాదించడంతో వర్కర్లకు రూ.1.20లక్షలకు, హెల్పర్లకు రూ.50 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం.సర్వీసులో ఉండగా చనిపోతే గతంలో రూ.3వేలే ఇచ్చే వారు. దాన్ని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రూ.25 వేలు ఇవ్వాలని కోరగా రూ.20 వేలు ఇస్తామన్నాం.ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు, పదోన్నతుల వయో పరిమితి 40 నుంచి 50 ఏళ్లకు అంగీకరించాం. టీఏ, డీఏలు, హౌస్ రెంట్ అలవెన్స్ ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా ఇచ్చేలా ఆమోదించాం. మినీ అంగన్‌వాడీలను మెయిన్ అంగన్‌వాడీలుగా మార్చేందుకు అంగీకారం తెలిపాం. మిగిలిన డిమాండ్లు కూడా సమ్మె విరమిస్తే ప్రాధాన్యత క్రమంలో తీరుస్తాం.
పెంపుపై..
చంద్రబాబు హయాంలో అంగన్‌వాడీలకు ఇచ్చిన వేతనం ఎంత? వైఎస్ జగన్ ఇస్తున్న వేతనం ఎంత? అనేది అంగన్‌వాడీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 2014లో అంగన్‌వాడీ వర్కర్లకు రూ.4,200, హెల్పర్లకు రూ.2,200, అదే 2016లో రూ.7 వేలు, రూ.4,500 ఇచ్చారు. అధికారంలోకి రాగానే అంగన్‌వాడీల వేతనం పెంచుతామని పాదయాత్రలో జగన్ హామీ ఇవ్వడంతో ఎన్నికల ఆర్నెల్ల ముందు చంద్రబాబు వేతనాలు పెంచినా... సక్రమంగా అందించలేదు. ఇచ్చిన మాట ప్రకారం జగన్ అధికారం చేపట్టిన వెంటనే జూలైలో వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7వేలకు వేతనాలు పెంచారు. చంద్రబాబు హయాంలో వర్కర్లకు సగటున నెలకు రూ.6,100 మాత్రమే వస్తే... జగన్ పాలనలో నాలుగున్నరేళ్లుగా రూ.11,500 ఇస్తున్నారు.
వేతనాల పెంపునకు గడువు కోరాం.
ప్రభుత్వానికి ఆర్థిక పరమైన అంశాలను అంచనా వేసుకుని వచ్చే ఆర్థిక సంవత్సరం వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చాం. 2019 జూలైలో వేతనాలు పెంచాం. కనీసం ఐదేళ్లు గడువు ఇవ్వాలని చెప్పాం. వచ్చే జూలైలో ఆమోదయోగ్యమైన విధంగా వేతనాలు పెంచుతామనీ, సమ్మె విరమించాలని కోరాం. యూనియన్లు ఇప్పటికైనా ఆలోచించాలి.రాష్ట్రంలో గర్భిణీలు, బాలింతలు, పిల్లలు నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నా అంగన్‌వాడీల సమ్మె విషయంలో సంయమనం పాటించాం. ఎస్మా విషయంలో రాజకీయ పార్టీలు, అంగన్‌వాడీలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ అజెండాతో రెచ్చగొడుతున్న ప్రతిపక్షాల డైరెక్షన్‌లో అంగన్‌వాడీలు వెళితే నష్టపోక తప్పదు.
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఇందుకోసం గురువారం నుంచి నోటీసులు ఇస్తోంది. పది రోజుల గడువు ఇచ్చి కొత్త వారిని నియమించుకుంటాం. తెగే వరకు సమస్యను సాగదీయకుండా అంగన్‌వాడీలు అర్థం చేసుకుని సమ్మె విరమించాలి.
☛ Anganwadi Workers Demands : అంగన్‌వాడీలకు ఉద్యోగులు అడిగిన డిమాండ్లు అన్ని కూడా..
Tags
- ap anganwadi workers salary hike news
- AP Anganwadi Workers Salaries Hike
- Minister Botsa Satyanarayana about Anganwadi Workers Demands
- sajjala ramakrishna about Anganwadi Workers Demands
- AP Anganwadi Workers Demands Updates 2024
- duties and responsibilities of anganwadi workers
- ap anganwadi workers salary hike news telugu
- ap anganwadi workers strike
- ap anganwadi employees demands updates 2024
- ap anganwadi workers demands updates 2024
- ap anganwadi workers demands updates 2024 news