R.C.Reddy : Civils, Groups ప్రిపేరయ్యే అభ్యర్థులకు.. మేము చెప్పే మూడు సక్సెస్ సూత్రాలు ఇవే..| ఇవి పాటిస్తే చాలు.. విజయం మీదే..
R.C.Reddy.. పరిచయం అవసరం లేని పేరు. ఎందుకంటే కొన్ని వందల మంది సివిల్స్ సర్వీసుకు ఎంపిక కావడానికి ఈయన కారణమయ్యారు. అలాగే కొన్ని వేల మంది గ్రూప్స్-1,2 ఉద్యోగాలకు ఎంపిక కావడానికి ఈయన కీలక పాత్ర పోషించారు. అలాగే కొన్ని వేల మంది పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఈయన ఒక స్ఫూర్తిదాయకం. ఈయన సివిల్ సర్వీసుకు ఎంపిక కాలేదు. కష్టపడి మూడు పర్యాయాలూ ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ ఆ వైఫల్యం నుంచి ఆయన పాఠం నేర్చుకున్నారు. ఏ రంగంలో విఫలమయ్యారో అదే రంగంలో విజయముద్ర వేసుకున్నారు.
పల్లె నేపథ్యంలో తనలాగే వచ్చిన వారికి తర్ఫీదునిస్తే కొందరయినా సివిల్స్‌కు ఎంపికవుతారని భావించేవారు. మట్టిలో మాణిక్యాలను తవ్వి తీయాలని బలమైన సంకల్పం తీసుకున్నారు. తనకున్న అనుభవసారంతో సివిల్ సర్వీస్‌కు వెళ్లే అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వాలనుకున్నారు. 1985లో సాహసంతో ఓ ముందడుగు వేశారు. హైదరాబాద్‌లో స్వయంగా ఐఏఎస్ స్టడీ సర్కిల్ పేరుతో చిన్నగా సివిల్ సర్వీసెస్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తనతోపాటు మంచి ఫ్యాకల్టీని ఎంపిక చేసుకున్నారు. నెమ్మది నెమ్మదిగా ఆసంస్థకు పేరు వచ్చింది. ఏటా సివిల్ సర్వీస్ ఫలితాల్లో కొందరు విజేతలవడం ప్రారంభమైంది. దీంతో ఆర్‌సీ రెడ్డికి విశేష ఖ్యాతి లభించింది.
ఆయన వద్ద కోచింగ్ తీసుకుని సివిల్ సర్వీసుకు ఎంపికైన ప్రముఖుల్లో ఏకెఖాన్, తేజ్‌దీప్ ప్రతిహస్త, ద్వారకతిరుమలరావు, రాజేందర్‌రెడ్డి తోపాటు ఇప్పుడు రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్‌లుగా ఉన్న కృష్ణబాబు, ధనుంజయరెడ్డి లాంటి వారున్నారు. 2001లో ఇండియా టాపర్ సత్యప్రకాశ్(రాజంపేట) ఆర్‌సీరెడ్డి మార్గదర్శకంలోనే శిక్షణ పొందడం విశేషం. తాజా వచ్చిన సివిల్స్ ఫలితాలు-2022లోనూ R.C.Reddy IAS Study Circle నుంచి దాదాపు 27 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసుకు ఎంపికయ్యారు.
పల్లెటూళ్ల నుంచి వచ్చారని తక్కువ అంచనా వేయకూడదు. మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయి. వారిని గుర్తించి సానబడితే వజ్రాలవుతారు. ఐక్యూ గుర్తించి, సరైన మార్గంలో తర్ఫీదు ఇస్తే వారు తప్పకుండా సివిల్స్ లాంటి రంగాల్లో విజేతలుగా నిలుస్తారు. ఆరంభంలోనే మెరుగైన రీతిలో సాధన పెట్టాలి. అప్పుడే మంచి ఫలితాలు ఆవిష్కృతమవుతాయి. నేను సివిల్స్‌కు ఎంపిక కాలేకపోయినా ఇదే భావనతో సివిల్స్.. గ్రూప్‌వన్ సర్వీసులకు కొంతమందిని అందించగలుగుతున్నాను. ఇది పూర్వజన్మసుకృతంగా భావిస్తుంటాను.
R.C.Reddyతో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ అందిస్తున్న ప్రత్యేక ఇంటర్య్వూ మీకోసం..