TSRJC CET 2024 Notification: గురుకులాల్లో.. ఉచితంగా ఇంటర్
- టీఎస్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు
- ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ
- ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూప్‌లు
తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో బోధన, ఇతర ప్రమాణాలు ఉన్నతంగా ఉండేలా పర్యవేక్షించేందుకు.. తెలంగాణ గురుకుల విద్యాలయాల విభాగం (తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ) పేరుతో ప్రత్యేక విభాగాన్ని.. విద్యా శాఖ పరిధిలో ప్రారంభించారు. రాష్ట్రంలోని గురుకుల కళాశాలల్లో ప్రవేశాలతోపాటు అన్ని అంశాలను ఈ సొసైటీనే పర్యవేక్షిస్తుంది.
35 కళాశాలలు-2,996 సీట్లు
ప్రస్తుతం తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ పరిధిలో 35 గురుకుల కళాశాలల్లో 2,996 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బాలికల కోసం ప్రత్యేకంగా 20 కళాశాలలు ఏర్పాటు చేశారు. 33 కళాశాలల్లో.. ప్రతి కళాశాలలో ఎంపీసీ గ్రూప్‌లో 40 సీట్లు, బైపీసీ గ్రూప్‌లో 40 సీట్లు చొప్పున అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులందరికీ అవకాశం ఉండే సర్వేల్ గురుకుల కళాశాలలో ఎంపీసీలో 88, బైపీసీలో 60; ఎంఈసీలో 30 సీట్లు చొప్పున ఉన్నాయి.
అదేవిధంగా హసన్‌పర్తిలోని మహిళలల గురుకుల కళాశాలలోనూ ఎంపీసీలో 88, బైపీసీలో 60, ఎంఈసీలో 30 సీట్లు ఉన్నాయి. మిగిలిన 33 గురుకుల కళాశాలలకు సంబంధించి ప్రతి కళాశాలలకు.. పోటీ పడేందుకు జిల్లా స్థానికతను నిర్దేశించారు. అన్ని కళాశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియంలోనే బోధన ఉంటుంది.
అర్హతలు
2024 మార్చిలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాత్రమే అర్హులు. వార్షిక పరీక్షల్లో ఓసీ అభ్యర్థులు 6 జీపీఏతో, బీసీ, ఎస్‌సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు 5 జీపీఏతో ఉత్తీర్ణత సాధించాలి. అన్ని కేటగిరీల విద్యార్థులు ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో తప్పకుండా 4 జీపీఏ సాధించాలి. పదో తరగతి వరకు తప్పనిసరిగా తెలంగాణలోనే చదివి ఉండాలి.
ఉమ్మడి కౌన్సెలింగ్
మొత్తం 35 కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి.. రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్‌ఆర్‌జేసీ సెట్)ను నిర్వహించి..అందులో పొందిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించే క్రమంలో ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఒక్కో సీటుకు అయిదుగురిని చొప్పున కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. ఎంపీసీ విద్యార్థులకైతే మ్యాథ్స్‌లో వచ్చిన మార్కులు, బైపీసీ విద్యార్థులకు బయాలజీలో వచ్చిన మార్కులు, ఎంఈసీ విద్యార్థులకు సోషల్ స్టడీస్‌లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుని తుది జాబితా రూపొందించి ప్రవేశాలు ఖరారు చేస్తారు.
ఉచిత విద్య, వసతి
టీఎస్‌ఆర్‌జేసీ సెట్ ద్వారా ప్రవేశాలు ఖరారు చేసుకున్న విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా విద్యనందిస్తారు. ఎలాంటి ఫీజులు చెల్లించనక్కర్లేదు. అదే విధంగా వసతి సదుపాయం కూడా ఉచితంగానే ఉంటుంది. గురుకుల విద్యా విధానంలో బోధన సాగుతుంది. ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అకడమిక్, ఫిజికల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, గేమ్స్, ఇతర కో-కరిక్యులర్ యాక్టివిటీస్‌ను నిర్వహిస్తారు. ఫలితంగా విద్యార్థులు అకడమిక్ నైపుణ్యాలతోపాటు సామాజిక అవగాహన పొందే అవకాశం కూడా లభిస్తుంది.
150 మార్కులకు పరీక్ష
టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ను మూడు విభాగాల్లో 150 మార్కులకు నిర్వహిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న గ్రూప్ ఆధారంగా సంబంధిత విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఎంపీసీ గ్రూప్ విద్యార్థులకు ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా బైపీసీ గ్రూప్ విద్యార్థులకు ఇంగ్లిష్, బయలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఎంఈసీ గ్రూప్ విద్యార్థులకు ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి గ్రూప్‌నకు సంబంధించి ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నలు చొప్పున 150 ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు కేటాయించిన సమయం రెండున్నర గంటలు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. n దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న గ్రూప్‌ను ఎంచుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, మార్చి 16
- టీఎస్ ఆర్‌జేసీ సెట్ తేదీ: 2024, ఏప్రిల్ 21 (10 గంటల నుంచి 12:30 వరకు)
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://tsrjdc.cgg.gov.in/TSRJDCWEB20/#!/home0103prsvdf.rps
మంచి మార్కులకు ఇలా
రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఆర్‌జేసీ సెట్‌లో మంచి మార్కులు సాధించడానికి విద్యార్థులు పదో తరగతి పాఠ్య పుస్తకాలను ఆధారంగా చేసుకుని ప్రిపరేషన్ సాగించాలి.
ఇంగ్లిష్
ఈ విభాగంలో మంచి మార్కుల కోసం.. యాంటానిమ్స్, సినానిమ్స్‌పై దృష్టి సారించాలి. వీటితోపాటు.. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఫ్రేజల్ వెర్బ్స్‌పై అవగాహన పెంచుకోవాలి. చదవడంతోపాటు ప్రాక్టీస్ కూడా చేస్తే మెరుగైన మార్కులు పొందేందుకు అవకాశం లభిస్తుంది. పంక్చుయేషన్స్, ప్రిపొజిషన్స్, ఆర్టికల్స్‌పై దృష్టి పెట్టాలి. అదే విధంగా.. రీడింగ్ కాంప్రహెన్షన్ పెంచుకునేలా ప్రిపరేషన్ సాగించాలి.
మ్యాథమెటిక్స్
ప్రతి చాప్టర్‌ను చదివి వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యా వ్యవస్థ, బీజగణితం, నిరూపక రేఖాగణితం, రేఖా గణితం, క్షేత్రమితి, త్రికోణమితి, సంభావ్యత, సాంఖ్యకశాస్త్రంపై పట్టు సాధించడం ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్ రూపంలో రాసుకుంటే రివిజన్ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది. టెక్స్›్ట బుక్‌లో ప్రతి చాప్టర్ చివరన ఇచ్చే సమస్యలను తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణాల జత అధ్యాయాలలోని గ్రాఫ్ ఆధారిత సమస్యలు; సంభావ్యత; సాంఖ్యక శాస్త్రం; త్రికోణమితి; క్షేత్రమితిలోని ముఖ్యమైన సమస్యలపై పట్టు సాధించాలి.
ఫిజికల్ సైన్స్
ఈ సబ్జెక్ట్‌కు సంబంధించి.. ప్రయోగాలు-క్షేత్ర పర్యటనలు; సమాచార నైపుణ్యాలు- ప్రాజెక్ట్ పనులు; పటాలు-వాటి ద్వారా భావ ప్రసారం వంటి వాటిపైనా దృష్టిపెట్టాలి. కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్ ప్రవాహం, రసాయన బంధం, పరమాణు నిర్మాణం, కార్బన్ సమ్మేళనాలపై ఎక్కువ శ్రద్ధతో చదవాలి. అదే విధంగా.. మూలకాల ధర్మాలు-వర్గీకరణ, రసాయన సమీకరణాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
బయలాజికల్ సైన్స్
ఈ సబ్జెక్ట్‌లో మార్కుల కోసం ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని వాస్తవ పరిస్థితులతో అన్వయించే నేర్పు సొంతం చేసుకోవాలి. డయాగ్రమ్స్‌ను ప్రాక్టీస్ చేసి.. భాగాలను గుర్తించడమే కాకుండా.. వాటి ప్రాముఖ్యతను వర్ణించగలిగే విధంగా ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా పదో తరగతి చాప్టర్స్‌లోని ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై అవగాహన పొందడం ఎంతో మేలు చేస్తుంది. ఆయా అంశాలకు సంబంధించి చాప్టర్‌లో పేర్కొన్న అభ్యాసాలకు సంబంధించి విశ్లేషణ, కారణాలు, పోలికలు, బేధాలు తెలుసుకుంటూ చదవాలి.
సోషల్ స్టడీస్
సోషల్ స్టడీస్‌కు సంబంధించి సబ్జెక్ట్ అంశాలతోపాటు సమకాలీన అంశాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. జాగ్రఫీ,ఎకనామిక్స్‌లో భారతదేశం-భౌగోళిక స్వరూపం, శీతోష్ణస్థితి, భారతదేశ నీటి వనరులు, వలసలు, ఆహార భద్రత,ఉత్పత్తి-ఆదాయం, సుస్థిరాభివృద్ధి పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. హిస్టరీలో రెండు ప్రపంచ యుద్ధం సమయంలో ప్రపంచం;సమకాలీన సామాజిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి. భారత జాతీయోద్యమ చరిత్రపై ప్రత్యేక దృష్టితో చదవాలి. సివిక్స్‌కు సంబంధించి రాజ్యాంగం మూల సూత్రాలు, రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను ఏఏ దేశాల రాజ్యాంగాల నుంచి స్వీకరించారు వంటి కోణాల్లో చదవాలి.
Tags
- TSRJC CET 2024 Notification
- TSRJC CET 2024
- TSRJC CET Syllabus
- Telangana Gurukulam Junior Colleges
- free education
- Residential Junior Colleges Entrance Test
- special coaching for national level entrance exams
- entrance test
- NEET
- JEE Main
- Joint counselling
- Telangana Residential Educational Institutions Society
- latest notifications
- Competitive exam preparation
- Admissions 2024-25
- Special training for NEET and JEE Main
- SakshiEducationUpdates