Skip to main content

TSPSC: గ్రూప్‌–1పై అప్పీలుకు వెళ్లేదెప్పుడు?

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షపై సందిగ్ధం వీడటం లేదు. నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి వహించినందుకు ఈ పరీక్షను రద్దు చేయాలంటూ వేర్వేరు సందర్భాల్లో హైకోర్టు రెండుసార్లు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వచ్చి నెలరోజులు కావస్తున్నా... తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఇప్పటివరకు ఏ నిర్ణయాన్ని ప్రక టించలేదు.
TSPSC
గ్రూప్‌–1పై అప్పీలుకు వెళ్లేదెప్పుడు?

పరీక్ష రద్దు విషయంలో స్పష్టతని వ్వని టీఎస్‌పీఎస్సీ హైకోర్టు తీర్పుపై అప్పీలు కోసం సుప్రీంకోర్టుకు సైతం వెళ్లలేదు. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. కొత్తగా పరీక్ష నిర్వహిస్తారా? లేదా? అందుకు మళ్లీ సన్నద్ధం కావాలా? లేక మెయిన్‌ పరీక్షలకు సిద్ధమవ్వా లా? తేల్చుకోలేక అభ్యర్థులు గందరగోళంలో ఉన్నారు. 

పరీక్షలు రద్దు మీద రద్దు 

గ్రూప్‌–1 కేటగిరీలో 503 ఉద్యోగ ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గతేడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు మొత్తంగా 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్‌ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ ఫలితాలు ప్రకటిస్తూ... 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి జాబితాను విడుదల చేసింది. దీంతో ఆయా అభ్యర్థులంతా మెయిన్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో టీఎస్‌పీఎస్సీలో పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూసింది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

గ్రూప్‌–1 పరీక్ష పేపర్‌ లీకు కావడంతో ఆఘమేఘాల మీద అక్టోబర్‌ 16న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను కమిషన్‌ రద్దు చేసింది. ఆ తర్వాత జూన్‌ 11న మరోమారు పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతో అభ్యర్థులు మళ్లీ సన్నద్ధమయ్యారు. రెండో దఫా పరీక్షకు 3,09,323 మంది అభ్యర్థులు హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోగా... 2,33,248 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.

రెండో దఫా పరీక్ష నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ పకడ్భందీగా నిర్వహించలేదని అభ్యర్థులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రధానంగా అభ్యర్థుల వేలిముద్రలు తీసుకోకుండా ఇష్టానుసారంగా నిర్వహించారని, పరీక్ష హాజరు శాతంలో గణాంకాలు మారిపోయాయంటూ ఆరోపించారు. కేసును విచారించిన హైకోర్టు రెండు సార్లు పరీక్ష రద్దు చేయాలని తీర్పునిచ్చింది.  

ఇప్పుడు ఏ పరీక్షకు సిద్ధం కావాలో? 

సాధారంగా కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆ తీర్పును అమలు చేయడం లేదా పై కోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. కానీ టీఎస్‌పీఎస్సీ ఇప్పటివరకు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు. దాదాపు ఏడాదిన్నరగా పరీక్షలకు సన్నద్ధమైన అభ్యర్థులకు తక్షణ కర్తవ్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమినరీ పరీక్షలకు సన్నద్ధం కాగా... ఇప్పుడు ఏ పరీక్షకు సిద్ధం కావాలో పాలుపోవడం లేదంటూ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ఆ ప్రక్రియ కొనసాగుతోందట! 

కాగా, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని టీఎస్‌పీఎస్సీని వివరణ కోరగా... సుప్రీంకోర్టుకు వెళ్తామని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందని కమిషన్‌ అధికారులు చెబుతున్నారు.   

Published date : 19 Oct 2023 01:15PM

Photo Stories