Skip to main content

TSPSC: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ రద్దుపై సర్కార్‌ అప్పీల్‌

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు చేస్తూ సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది.
TSPSC
గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ రద్దుపై సర్కార్‌ అప్పీల్‌

 అప్పీల్‌పై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. అయితే జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం ఈ అప్పీల్‌పై వాదనలను సెప్టెంబర్‌ 26కి వాయిదా వేసింది. ముగ్గురు అభ్య ర్థులు తప్ప ఎవరూ ప్రిలిమ్స్‌ రద్దు కోరలేదని, వీరికోసం లక్షలమందిని ఇబ్బంది పెట్టడం సముచితం కాదని ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ హరిందర్‌ పరిషద్‌ పేర్కొన్నారు. జూన్‌ 11న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షను సింగిల్‌జడ్జి రద్దు చేసిన విషయం తెలిసిందే.

బయోమెట్రిక్‌ తీసుకోకపోవడం, ఫొటో లేకుండానే ఓఎంఆర్‌ షీట్లు ఇవ్వడం, పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యలో పర స్పర విరుద్ధ వివరాలు వెల్లడించడాన్ని తప్పుబట్టింది. టీఎస్‌పీఎస్సీ లోపాల కారణంగా ఒక్క మెరిట్‌ అభ్యర్థి అర్హత కోల్పోయినా, అది న్యాయసమ్మతం, సమర్థనీయం కాదంటూ  గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని మళ్లీ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన విషయం విదితమే. 

చదవండి: Group II Free Coaching: గ్రూప్‌–2కు ఉచిత శిక్షణ

అప్పీల్‌ పిటిషన్‌లో ఏముందంటే...

‘ఈ కేసులో సింగిల్‌జడ్జి తీర్పు చట్టసమర్థనీయం కాదు. రిట్‌ పిటిషన్‌ అస్పష్టమైన ఆరోపణలతో దాఖలు చేశారు. వారు దాఖలు చేసిన మేరకు మెటీరియల్‌ కూడా రుజువు కాలేదు. పరీక్ష తదుపరి ప్రక్రియ నిలిపివేసే ఉద్దేశంతోనే పిటిషన్‌ వేసిన విషయాన్ని జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు. బయోమెట్రిక్‌ నిర్వహించలేదని పరీక్ష రద్దు చేయడం చట్టవిరుద్ధం. కేవలం ముగ్గురి ఆరోపణలతో 2,33,506 మంది రాసిన పరీక్షను రద్దు చేయడం వారి భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తుంది. టీఎస్‌పీఎస్సీ పారదర్శకంగా పరీక్ష నిర్వహించింది.

చదవండి: TSPSC Group 2 & 3 New Exam Dates 2023 : గ్రూప్‌-2 & 3 కొత్త ప‌రీక్ష తేదీలు ఇవే.. ఈ సారి మాత్రం..

టీఎస్‌పీఎస్సీకి పరీక్షల నిర్వహణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, అధికారం ఉంది. బయోమెట్రిక్‌ తీసుకోవడంలో ఇబ్బందులతో కమిషన్‌ దాన్ని తీసుకోలేదు. అందుకే ఇతర తనిఖీలను క్షుణ్ణంగా చేపట్టింది. నోటిఫికేషన్‌లో బయోమెట్రిక్‌ అని చెప్పి పరీక్ష సమయంలో తీసుకోలేదు అన్న ఆరోపణల సరికాదు. కొందరికి బయోమెట్రిక్‌ తీసుకొని.. మరికొందరికి తీసుకోకపోతే దానిని తప్పుబట్టడంలో అర్థం ఉంది. కానీ, ఇక్కడ అభ్యర్థులందరికీ కమిషన్‌ ఒకేలా వ్యవహరించింది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల విషయంలో చిన్నచిన్న ఆరోపణల్లో జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు గతంలోనే సూచించింది. నోటిఫికేషన్‌లో మార్పుచేర్పులకు అన్ని అధికారాలు ఉన్నాయని నోటిఫికేషన్‌ రోజునే కమిషన్‌ పేర్కొంది.

ప్రిలిమ్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ మాత్రమే. వీరంతా మెయిన్స్‌ పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించకుండా ఎవరూ ఉద్యోగం చేపట్టలేరు. ముగ్గురి కోసం మిగతా 2,33,503 మంది గొంతు నొక్కడం చట్టవిరుద్ధం. ఈ అంశాలను సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు. ద్విసభ్య ధర్మాసనం వాటిని పరిశీలించి, అప్పీల్‌ను అనుమతించాలి. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ఫలితాల విడుదల, తదుపరి ప్రక్రియకు అనుమతించాలి’. 

Published date : 26 Sep 2023 11:22AM

Photo Stories