TSPSC: ‘ఏఈఈ’ కాపీయింగ్ కేసులో ఏడుగురి గుర్తింపు.. ఈ శాఖ మాజీ ఏఈదే కీలక పాత్ర
నీటిపారుదల శాఖ మాజీ ఏఈ పూల రమేష్ ద్వారా వీరంతా ఈ పరీక్షలు రాయడం తెలిసిందే. ఈ ఏడుగురిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని తేలింది. ఇద్దరు రాజకీయ నాయకుల సంతానం కూడా ఉన్న ఈ ఏడుగురు అభ్యర్థులతో పాటు సహకరించిన వారి తల్లిదండ్రులను కూడా సిట్ అధికారులు నిందితులుగానే పరిగణిస్తూ గాలిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన పూల రమేష్ 2011లో నీటిపారుదల శాఖలో ఏఈగా చేరాడు. అతని భార్య కూడా వరంగల్‌లో వాటర్ వర్క్స్‌లో పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని బి.కొత్తకోట పోలీసుస్టేషన్‌లో 2015లో నమోదైన మహిళ హత్య కేసులో రమేష్ అరెస్టు అయ్యాడు. దాదాపు 45 రోజులు జైల్లో ఉండటంతో ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. 2017లో తిరిగి ఉద్యోగంలో చేరిన రమేష్ ఎనిమిది నెలల పాటే విధులు నిర్వర్తించాడు.
చదవండి: TSPSC Group 1 hall ticket released: గుర్తింపుకార్డు తప్పనిసరి... 15 నిమిషాల ముందే గేట్ల మూసివేత
తొలుత సెలవులో ఉండి, ఆపై ఉద్యోగం మానేసి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం మొదలెట్టాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం హైటెక్ మాస్ కాపీయింగ్‌కు శ్రీకారం చుట్టాడు. జనవరిలో టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరీక్షల్లోనూ రమేష్ కాపీయింగ్ చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత జరిగిన ఏఈఈ పరీక్ష సందర్భంలో టోలిచౌక్‌లోని ఓ కళాశాలలో ఏర్పాటైన పరీక్ష కేంద్రం ప్రిన్సిపల్ పాషాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆయన ద్వారా బయటకు వచ్చిన పేపర్ సాయంతోనే ఈ ఏడుగురితోనూ పరీక్ష రాయించాడు. రమేష్ వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు తేల్చిన సిట్ వారి కోసం గాలిస్తోంది. మూడోరోజు కస్టడీ సందర్భంగా జూన్ 6న రమేష్‌ను విచారించిన సిట్.. మాస్ కాపీయింగ్‌లో అతనికి సహకరించిన మరికొందరి వివరాలు సేకరించింది.
చదవండి: TSPSC Paper Leak: రెగ్యులర్‌గా హైటెక్ మాస్ కాపీయింగ్!.. ఎంపీటీసీ కూతురు హైటెక్ కాపీయింగ్!