TSPSC Paper Leak: రెగ్యులర్‌గా హైటెక్ మాస్ కాపీయింగ్!.. ఎంపీటీసీ కూతురు హైటెక్ కాపీయింగ్!
కోర్టు అనుమతితో సాగుతున్న రమేష్ పోలీసు కస్టడీ జూన్ 5న రెండో రోజు ముగిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా విద్యుత్ శాఖలో డీఈఈగా పని చేస్తున్న రమేష్, నగరంలోని ఓ కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేస్తున్న అలీతో ఒప్పందం కుదుర్చుకుని, అతడి నుంచి పరీక్ష పేపర్ ఎగ్జామ్ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే వాట్సాప్ ద్వారా పొందాడు. తన ముఠాతో కలిసి చాట్ జీపీటీ ద్వారా సమాధానాలు గుర్తించి అత్యాధునిక పరికరాల ద్వారా ఒప్పందం చేసుకున్న అభ్యర్థులకు చేరవేశాడు. గతంలో జరిగిన పరీక్షలతో పాటు ఈ ఏడాది జనవరిలో జరిగిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పరీక్షలకు మాత్రమే రమేష్ ఈ పంథా అనుసరించాడు.
అద్దె గదుల్లో ఉంచి..పేపర్లు చదివించి..
సైదాబాద్‌లో ఉంటున్న రమేష్‌కు అదే ప్రాంతానికి చెందిన రాయపురం విక్రమ్‌తో పరిచయం ఉంది. విక్రమ్‌కు టీఎస్‌పీఎస్సీ మాజీ ఉద్యోగి సురేష్ స్నేహితుడు కావడంతో అతని ద్వారా డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ), అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పేపర్లు అందాయి. దీంతో ఫిబ్రవరి, మార్చి లో జరిగిన ఈ పరీక్షల్లో రమేష్ హైటెక్ మాస్ కాపీయింగ్‌విధానాన్ని అవలంబించలేదు. తనతో ఒప్పందం చేసుకుని, అడ్వాన్స్‌లు చెల్లించిన అభ్యర్థులను సైదాబాద్, కొత్తపేట, వరంగల్‌ల్లో అద్దెకు తీసుకున్న గదులతోపాటు తన ఇంట్లోనూ ఉంచి, మాస్టర్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చి చదివించాడు. కాగా రమేష్ నుంచి ఈ రెండు పరీక్షల పేపర్లు పొందిన వాళ్లు 40 మంది ఉన్నట్లు సిట్ గుర్తించింది. వరంగల్, కరీంనగర్‌కు చెందిన నేతల సంతానం కూడా అడ్డదారిలో పరీక్ష రాసినట్లు గుర్తించింది.
మాజీ ఎంపీటీసీ కూతురు హైటెక్ కాపీయింగ్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ శివారు బొమ్మకల్‌కు చెందిన ఓ మాజీ ఎంపీటీసీ కుటుంబసభ్యులు కూడా రమేష్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఏఈఈ పరీక్ష రాసినట్లుగా సిట్ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఇరిగేషన్‌శాఖలో పనిచేస్తున్న తమ బంధువు ద్వారా రమేశ్‌ను కలిసిన మాజీ ఎంపీటీసీ భర్త రూ.75 లక్షలకు ఒప్పందం చేసుకుని అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సదరు మాజీ ఎంపీటీసీ కూతురు ఎలక్ట్రానిక్ డివైస్ ఉపయోగించి హైటెక్ కాపీయింగ్ ద్వారా పరీక్ష రాసినట్లు సమాచారం. కాగా రమేశ్‌ను విచారిస్తున్న క్రమంలో వారం రోజుల క్రితం పోలీసులు బొమ్మకల్‌కు రావడంతో.. అప్పటికే ఇంటికి తాళం వేసిన మాజీ ఎంపీటీసీ కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.