Skip to main content

కీలకమైన ఆ నాలుగు విభాగాల పోస్టులన్నీ ఓపెన్ కేటగిరీలోకి!

సాక్షి, హైదరాబాద్: కొత్త జోనల్ వ్యవస్థకు గత నెలలో రాష్ట్రపతి ఆమోదం తెలిపిన నేపథ్యంలో కీలకమైన నాలుగు విభాగాల్లో పోస్టుల భర్తీ విధానంపై మళ్లీ చర్చ మొదలైంది.
సచివాలయం, విభాగాధిపతి, స్పెషల్ ఆఫీస్, రాష్ట్రస్థాయి కార్యాలయాల్లోని పోస్టుల భర్తీ ఎలా అన్న దానిపై నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన 33 జిల్లాల కొత్త జోనల్ వ్యవస్థలో పోస్టుల భర్తీ విధానం పేర్కొనకపోయినా, గతంలో 31 జిల్లాలతో కూడిన జోన్లకు 2018లో ఆమోదం తెలిపినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోన్ల అమలుకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు (జీవో 124) జారీ చేసింది. అయితే ఇప్పుడు 33 జిల్లాలతో జోనల్ వ్యవస్థకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ నాలుగు కేటగిరీల పోస్టుల భర్తీ విధానాన్ని ఎలా పేర్కొంటుందని చర్చనీయాంశంగా మారింది. గత ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లే ఇప్పుడూ ఆ పోస్టులను ఓపెన్ కేటగిరీగానే ఉంచే అవకాశం ఉంది. దీంతో ఆయా పోస్టులకు ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు పోటీపడి, ఉద్యోగాలు పొందే పరిస్థితి ఉంటుందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గతంలో టీఎస్పీఎస్సీ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసినప్పుడు ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, చత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు వచ్చారు. వారి పేర్లు మెరిట్ జాబితాలో టాప్లో ఉండటంతో వారిని నిలువరించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కీలకమైన ఆయా పోస్టులను 100 శాతం రాష్ట్ర అభ్యర్థులకే దక్కేలా నిబంధన చేర్చాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

త్వరలో విడుదలకానున్న టీఎస్పీఎస్సీ– 2021 గ్రూప్ 1,2,3,4 ఉద్యోగాలకు సంబంధించిన స్టడీ మెటీరియల్, వీడియో కోచింగ్ క్లాసులు, బిట్ బ్యాంక్స్, కరెంట్ అఫైర్స్, ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్, ప్రిపరేషన్ టిప్స్... ఇతర తాజా అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.

అన్యాయం జరగొద్దనే..
ఉమ్మడి ఏపీలో తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల్లో, తెలంగాణ ఉద్యోగులకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతుందనే ఆందోళనతోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ముఖ్యంగా సచివాలయం, విభాగాధిపతి కార్యాలయాల్లో స్థానికేతరుల పెత్తనం పెరిగిందన్న ఆందోళన రాష్ట్ర ఉద్యోగులు ఉద్యమం లేవనెత్తారు. అందుకే నీళ్లు.. నిధులు.. నియామకాలు నినాదంతో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంతోనే రాష్ట్ర సాధన సాకారమైంది. అయితే రాష్ట్ర నిరుద్యోగులకు మాత్రమే దక్కాల్సిన కీలకమైన విభాగాల్లోని పోస్టుల్లోకి ఇతర రాష్ట్రాల అభ్యర్థులు వచ్చే పరిస్ధితి నెలకొంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలన్నీ తెలంగాణకే దక్కాలన్న ఆలోచనతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే పోస్టుల్లో 95 శాతం స్థానికులకు ఇవ్వాలని, 5 శాతం ఓపెన్ కోటాగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో జారీ చేసిన జీవో 124లోనూ పొందుపరిచింది. అయితే కొద్దిమంది అధికారులు సచివాలయం, విభాగాధిపతి, స్పెషల్ ఆఫీస్, రాష్ట్రస్థాయి కార్యాలయాల్లోని పోస్టులను మొత్తం సేవింగ్ కేటగిరీలో పెట్టారు. దీంతో వాటికి ఎవరైనా పోటీ పడవచ్చు.

సమాన ప్రాతినిధ్యం కల్పించాలి..
వాస్తవానికి సచివాలయం, విభాగాధిపతి కార్యాలయం, ప్రత్యేక కార్యాలయం (కొత్త విభాగం ఏర్పాటు చేసినా), రాష్ట్రస్థాయి కార్యాలయాల్లోని అన్ని కేటగిరీల పోస్టుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారికి సమాన ప్రాతినిధ్యం ఉండేలా నిబంధనలు రూపొందించాలని ఉద్యోగ సంఘాలు అప్పట్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశాయి. రాష్ట్రంలోని జిల్లాల వారీగా జనాభా ప్రాతిపదికన ఆయా జిల్లాల వారికి ఆ నాలుగు కేటగిరీల విభాగాల్లోని పోస్టుల్లో సమాన అవకాశాలు కల్పించేలా రాష్ట్రపతికి పంపించే ఉత్తర్వుల్లో పొందుపరచాలని ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. అయితే ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. వాటిని సేవింగ్ కేటగిరీ పేరుతో మొత్తం ఓపెన్ కేటగిరీగానే పేర్కొన్నారు. దీంతో ఆయా పోస్టుల్లో ఇతర రాష్ట్రాల వారు పోటీ పడే అవకాశం ఏర్పడింది.

అన్ని జిల్లాల వారికీ పోస్టులు దక్కేలా..
ఇటీవల 33 జిల్లాలతో కూడిన కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. దీంతో వాటి అమలుకు జారీ చేయబోయే ఉత్తర్వుల్లో ఇతర రాష్ట్రాల వారికి అవకాశం లేకుండా చూడాలని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలోని నిరుద్యోగులకు జిల్లాల వారీ సమాన ప్రాతినిధ్యంతో ఆ పోస్టులు దక్కేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. లేదంటే ఆ విభాగాల్లోని పోస్టులకు నోటిఫికేషన్ వస్తే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో స్థానికేతరులు, హైదరాబాద్ వంటి జిల్లాలకు చెందిన అభ్యర్థులతో ఆదిలాబాద్, కుమ్రంభీం, వనపర్తి, భద్రాద్రి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అభ్యర్థులు సమానంగా పోటీపడే అవకాశం ఉండదు. సామాజిక అంతరాలు, సామర్థ్యాల్లో తేడాల కారణంగా వారికి ఆయా పోస్టులు దక్కే అవకాశాలు తక్కువేనని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల వారికి అవకాశం లేకుండా చూడటంతో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లాల వారికి సమాన ప్రాతినిధ్యం దక్కేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Published date : 29 May 2021 12:57PM

Photo Stories