Skip to main content

TSPSC: పేపర్ల లీకేజీకి సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: Telangana State Public Service Commission (TSPSC) మార్చి 5వ తేదీన నిర్వహించిన అసిస్టెంట్‌ ఇంజినీర్స్‌ పరీక్ష పేపర్ల లీకేజీకి సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది.
TSPSC
పేపర్ల లీకేజీకి సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి

పరీక్ష అనంతరం ఈ కేసులో నిందితులతో పాటు మరికొందరు వనపర్తిలో దావత్‌ చేసుకున్నారని, ఆ సమయంలో ‘లీకేజీ డబ్బులు’విషయమై గొడవ జరిగిందని, ఆ గొడవతోనే పేపర్‌ లీక్‌ విషయం బయటపడిందని తెలిసింది. ఈ బాగోతంలో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఇందులో ఆరుగురు పాలమూరుకు చెందినవారేనన్న సంగతి తెలిసిందే.

చదవండి: TSPSC: పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌పై ‘లీకేజీ’ ఒత్తిడి.. ఈ పరీక్ష రద్దు

పంచాంగల్‌లో ప్రిపరేషన్‌..వనపర్తిలో దావత్‌ 

ఏ–1 నిందితుడు ప్రవీణ్‌ నుంచి పేపర్‌ తీసుకున్న తర్వాత.. పరీక్షకు ఒకట్రెండు రోజుల ముందు రేణుక, డాక్యా దంపతులు గండేడ్‌ మండలం పంచాంగల్‌ తండాలోని ఇంటికి వచ్చారు. వీరితో పాటు ఆమె పెద్ద నాన్న కొడుకు శ్రీనివాస్‌ (మేడ్చల్‌ కానిస్టేబుల్‌), ఈయన స్నేహితులు కేతావత్‌ నీలేశ్‌ నాయక్, అతడి తమ్ముడు రాజేంద్ర నాయక్, వికారాబాద్‌ జిల్లా దుగ్యాల మండలం లగచర్ల తండాకు చెందిన పత్లావత్‌ గోపాల్‌ నాయక్‌ కూడా వచి్చనట్లు సమాచారం. రేణుక తమ్ముడు రాజేశ్వర్‌ కూడా వీరితో జత కాగా.. వారిని అక్కడే చదివించి 5న సరూర్‌నగర్‌లోని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. పరీక్ష రాసిన తర్వాత రేణుక కారులో రాజేశ్వర్, శ్రీనివాస్, నీలేశ్, రాజేంద్ర నాయక్‌ వనపర్తి ఇంటికి వచ్చారని, అంతా కలిసి దావత్‌ చేసుకున్నారని సమాచారం. ఆ సమయంలో డాక్యా, గోపాల్‌నాయక్‌ వారితో ఉన్నారా? లేరా? అనేది తెలియలేదు. 

చదవండి: TSPSC Question Paper Leak Case 2023 : ఈ ఘ‌నుడు కొశ్చ‌న్ పేప‌ర్ లీక్ చేశాడిలా.. ఆపై ఈమె కథ నడిపించిందిలా..

పేరులో తప్పు సరిచేసుకునేందుకు వెళ్లి.. 

రేణుకకు హిందీ పండిట్‌ ఉద్యోగం వచ్చిన తర్వాత రికార్డుల్లో ఆమె పేరులో తప్పుదొర్లింది. దీన్ని సరిచేసుకునేందుకు వెళ్లిన క్రమంలో ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారు తరచుగా కలిసేవారని.. రేణుక టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వెళ్లేదని తెలిసింది. ఈ క్రమంలోనే కవిత, ఆమె భర్త డాక్యా, ప్రవీణ్‌తో కలిసి పేపర్‌ లీకేజీ స్కెచ్‌ వేశారు. రేణుక సొంతూరు గండేడ్‌ మండలంలోని మన్సూర్‌పల్లి కాగా అత్తగారిల్లు ఇదే మండలంలోని పంచాంగల్‌ తండా. ఇలావుండగా వికారాబాద్‌ జిల్లా పరిగికి చెందిన ఇంటెలిజెన్స్‌ అధికారులు మార్చి 15న ఈ రెండు తండాల్లో పర్యటించి వివరాలు సేకరించినట్లు తెలిసింది. 

చదవండి: TSPSC Chairman Janardhan Reddy : షెడ్యూల్‌ ప్రకారమే ఈ ప‌రీక్ష‌లు.. మరో 10 వేల ఉద్యోగాల‌కు త్వరలోనే..

ఘర్షణ, బెదిరింపుతో.. 

దావత్‌ క్రమంలో రేణుక డబ్బుల విషయం లేవనెత్తినట్లు సమాచారం. ఒక్కొక్కరు రూ.10 లక్షల చొప్పున ఇచ్చేందుకు ఒప్పందం కుదరగా.. రూ.5 లక్షలు చొప్పున ఇచ్చి మిగతా డబ్బు తర్వాత ఇస్తామని రేణుకకు చెప్పారు. అయితే ఆమె ఇప్పుడే పూర్తిగా ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నీలేశ్‌నాయక్, రేణుక మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగినట్లు సమాచారం. నీలేశ్‌ను రేణుక బెదిరించడంతో ఆయన బయటకు వచ్చి డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ఇంటికి వచ్చి అందరినీ తీసుకెళ్లారు. వారు విచారించడంతో లీకేజీ డొంక కదిలినట్లు తెలుస్తోంది. 

Published date : 16 Mar 2023 12:46PM

Photo Stories