TSPSC Group 1: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు..! దరఖాస్తులో ఈ మార్కుల గందరగోళం
గ్రూప్–1 కేటగిరీలో మరో 60 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో.. రెండేళ్ల క్రితం జారీ చేసిన ప్రకటనను రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ, గత వారం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ క్రమంలోనే ప్రిలిమినరీ పరీక్ష తేదీని ప్రకటించింది.
ప్రిలిమ్స్ రెండున్నర గంటల పాటు నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అంశాలకు సంబంధించి 150 మార్కులతో కూడిన 150 ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా మెయిన్ పరీక్షలకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
ముచ్చటగా మూడోసారి ప్రిలిమ్స్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతోంది. వాస్తవానికి 2022 ఏప్రిల్‌లో 503 గ్రూప్–1 ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసింది. అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్ కూడా నిర్వహించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి 2023 జూన్ 11వ తేదీన ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది.
పరీక్ష లోపాలపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో పరీక్ష రద్దు చేయాలంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో రెండేళ్ల క్రితం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన ప్రభుత్వం.. పోస్టుల సంఖ్యను 563కు పెంచి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ముచ్చటగా మూడోసారి ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది.
దరఖాస్తులో సబ్జెక్టు మార్కుల గందరగోళం
గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ మార్చి 14వ తేదీ సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా మళ్లీ తాజాగా దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా దరఖాస్తు పేజీలో గ్రూప్ సబ్జెక్టులో సాధించిన మార్కులను ఎంట్రీ చేయాలంటూ ఒక కాలమ్ ఉంది.
అయితే ఏయే సబ్జెక్టులకు సంబంధించిన మార్కుల మొత్తాన్ని ఎంట్రీ చేయాలనే అంశంపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. గ్రూప్ సబ్జెక్టులకు సరైన నిర్వచనం లేకపోవడంతో వారు తికమకపడుతున్నారు. దీనిపై కమిషన్ హెల్ప్‌డెస్క్‌కు ఫోన్ చేసినా స్పందన లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయకుండా స్పష్టత కోసం వేచిచూస్తున్నారు.