గత ఆరేళ్లలో 35,724 ఉద్యోగాలు భర్తీ చేశాం: టీఎస్‌పీఎస్సీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఏర్పాటైన ఆరేళ్ల కాలంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 35,724 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడించారు.
దీనికి సంబంధించి 2019-20 వార్షిక నివేదికను గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలసి అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కమిషన్ వార్షిక నివేదికను ఏటా గవర్నర్‌కు అందిస్తామని, అందులో భాగంగానే 2019-20 వార్షిక నివేదిక అందజేసినట్లు తెలిపారు. కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఈ ఆరేళ్ల కాలంలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 39,952 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీకి అనుమతులు వచ్చాయని, ఇందులో 36,758 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 35,724 ఉద్యోగాలు భర్తీ చేయగా.. మరో 919 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతోందని వివరించారు. వీటిలో 115 ఉద్యోగాల ప్రాసెస్ దాదాపు పూర్తికావొచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండెంట్ల ఆధారంగా దాదాపు అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు భర్తీ చేసిన వాటిలో సగానికిపైగా ఉపాధ్యాయ ఉద్యోగాలేనని, గురుకుల సొసైటీ, విద్యాశాఖలకు సంబంధించి దాదాపు 20 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. 2011 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ కూడా పూర్తి చేశామని, గ్రూప్-2, గ్రూప్-4 ఉద్యోగాలూ పూర్తిచేసినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే అనుమతుల ఆధారంగా నియామకాల ప్రక్రియ చేస్తామని ఆయన వెల్లడించారు.
Published date : 11 Dec 2020 03:14PM